అష్టవసువులు ఒకసారి వారిలో ద్యు అనే వాడి ప్రోద్బలంతో వశిష్ట ముని ఆశ్రమములోని కామధేనువును అపహరిస్తారు. ఆ ముని ఉగ్రుడై ఆ ఎనమండుగురిని భూలోకంలో జన్మించమని శపిస్తాడు.ద్యు తప్ప మిగిలిన వారు ముని కాళ్ళపై పడి క్షమాపణకోరి శాపం ఉపసంహరించమని ప్రార్థిస్తారు. అయితే సహాయంచేసిన ఏడుగురు వసువులు భూమిపై స్వల్పకాలం జీవిస్తారని, ఎనిమిదవ వసువు మాత్రం చిరకాలం భూమిపై జీవిస్తాడని మహర్షి చెబుతాడు. అదే సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మ సృష్టించిన గంగను నిండుసభలో మహాభిషుడనే రాజు చూస్తాడు. పరస్పరం మోహంలో పడి సభామర్యాదను మరచిపోతారు. అందుకు బ్రహ్మ కోపంతో వారిద్దరినీ భూలోకంలో జన్మించమని శాపం ఇస్తాడు. గంగ భూలోకం వస్తుండగా అష్టవసువులు ఎదురై వారికి శాపవిమోచనం కలిగించమని గంగను వేడుకుంటారు. మహాభిషుడు శంతనుడిగా పుట్టి గంగను వివాహం చేసుకుంటాడు. అయితే తను చేసే ఏ పనికైనా అభ్యంతరం చెబితే శంతనుని విడిచి వెళ్ళిపోతానని గంగ శంతనుతో వాగ్దానం చేయిస్తుంది. వారికి పుట్టిన ఏడుగురు మగపిల్లలను గంగ నదిలో ముంచి చంపి వారికి శాపవిముక్తి కలిగిస్తుంది. అయితే ఎనిమిదవ పుత్రుడ్ని కూడ నదిలో పడవేయబోతుండగా శంతనుడు అడ్డు పడతాడు. అపుడు గంగ శంతనుని విడిచి పుత్రునితో వెళ్ళిపోతుంది. అతనిని పెంచి విద్యలు నేర్పి శంతనుని వద్దకు చేరుస్తుంది. అతడే గాంగేయుడు. తన తండ్రి శంతనుడు దాసరాజు కూతురు మత్స్యగంధిని పెళ్ళిచేసుకోవడానికి అనుకూలంగా తాను ఆజన్మ బ్రహ్మచారిగా వుంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయాడు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి