అమ్మాయి, అబ్బాయి పెళ్లి అనే బంధంతో భార్య, భర్త అనే కొత్త పాత్రలలో అడుగు పెట్టి సంసారం అనే కొత్త జీవితాన్ని కలసి ప్రారంభిస్తారు. అప్పటి వరకు బలాదూర్ గా తిరిగిన వారిరువురు బరువు బాధ్యతలను పంచుకోవడం మొదలు పెట్టి సంసారమనే సాగరాన్నిఈదే పనిలో పడతారు. అయితే అందరికీ ఈ ప్రయాణం సుగమం కాక పోవచ్చును. ఒడిదుడుకులు, ఆటుపోటులు, అపోహలు-అలకలు, అపార్ధాలు-అలజడులు, అలరింపులు-ఆదరింపులు, సాన్నిహిత్యం-సామరస్యం, సహజీవనం-సమ భావనం ఇవన్నీ కలబోసిన సంసారం అందులోని మాధుర్యం అందరం చవిచూస్తాం. 1950 లో ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్., లక్ష్మీ రాజ్యం, పుష్పలత నటించిన సాంఘిక చిత్రం సంసారం. ఈ చిత్రంలో సావిత్రి ఒక చిన్న పాత్ర పోషించింది. ఎల్.వి.ప్రసాద్ దర్శకులు. సంసారపు లక్షణాలను, విలువలను చక్కగా వివరించారు సదాశివ బ్రహ్మం గారు ఈ చిత్రంలోని సంసారం సంసారం గీతంలో. సంగీతం సుసర్ల వారు. ఇది ఘంటసాల మాస్టారి మధురమైన, మరపురాని పాట. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ఒరిజినల్ వీడియో లభ్యం కానందున ఈ పాటను సంసారం హిందీ వెర్షన్ లోని ఇదే పాత సన్నివేశం పై తెలుగు వాయిస్ డబ్ చేసి పొందుపరచిన శ్రీ రాజశేఖర్ రాజు గారికి ధన్యవాదాలు.
Video Courtesy: Sri Rajasekhar Raju
పల్లవి:
సంసారం
సంసారం సంసారం, ప్రేమ సుధా పూరం
నవ జీవనసారం
సంసారం సంసారం, ప్రేమ సుధా పూరం
నవ జీవనసారం సంసారం
చరణం:
ఇల్లాలొనర్ప సేవ, యజమాని ఇల్లు బ్రోవ ఆ..ఆ..
ఇల్లాలొనర్ప సేవ, యజమాని ఇల్లు బ్రోవ
కలకలలాడే పసి పాపలు చెలువారే సంసారం
సంసారం సంసారం, ప్రేమ సుధా పూరం
నవ జీవనసారం సంసారం
చరణం:
తన వారెవరైనా దరిజేర ప్రేమమీర
తన వారెవరైనా దరిజేర ప్రేమమీర
ఆదరించు వారి అనురాగపు సంసారమే సంసారం
సంసారం సంసారం, ప్రేమ సుధా పూరం
నవ జీవనసారం సంసారం
చరణం:
సంసార సాగరాన కష్టాలనంతమైనా ఆ..ఆ..
సంసార సాగరాన కష్టాలనంతమైనా
వెఱువనివారే సుఖజీవనులెపుడైనా
సంసారం సంసారం, ప్రేమ సుధా పూరం
నవ జీవనసారం సంసారం
సంసారం సంసా..రం
Sincere thanks to Sri Rajasekhar Raju garu for providing the You Tube video.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com