1951 లో విడుదలైన నిర్దోషి చిత్రంలో కాంతారావు, ముక్కామల, అంజలీదేవి నటించారు. ఈ చిత్రంలో మాస్టారితో యుగళగీతం పాడినది శ్రీమతి సుందరమ్మ గారు. ఈమె ప్రముఖ గాయని మరియు రంగస్థల నటి. వారిది కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలోని చిన్న గ్రామమైన మాలవల్లి. అదే ఆమె ఇంటిపేరు కూడ. కర్ణాటక నాటకరంగానికి ఆమె ఎనలేని కృషి చేసారు. ఆమె పేరు సువర్ణాక్షరాలలో వ్రాయవచ్చును. ఎందుకంటే స్త్రీలు నాటకాలలో వేయడం రివాజు కాని, హీనంగా చూడబడే ఆ రోజులలో కన్నడ రంగస్థలంలో అడుగుపెట్టిన తొలి మహిళారత్నం శ్రీమతి సుందరమ్మ గారు. శీమతి సుందరమ్మ గారు మైసూరు సంగీత నాటక అకాడమీ అవార్డును అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నిజలింగప్ప గారి చేతుల మీదుగా అందుకొన్నారు. సుందరమ్మ గారు మాస్టారితో కలసి ఒకే ఒక యుగళగీతం, కొన్ని బృందగీతాలు పాడారు. నిర్దోషి చిత్రం లో సగటు సంసారంలో ప్రతి నిత్యం జరిగే సన్నివేశాలపై ఒక చక్కని యుగళగీతాన్ని శ్రీశ్రీ మరియు శ్రీ కొండముది గోపాలరాయ శర్మగారు వ్రాసారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల మరియు హోస్పేట రామశేష పద్మనాభ శాస్త్రిగారు. ఒక ముఖ్యవిషయం ఏమిటంటే శ్రీ పద్మనాభ శాస్త్రిగారు తొలి తెలుగు చలన చిత్ర సంగీత దర్శకులు. తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద(1931) కు స్వరకల్పన చేసినది వీరే. నిర్దోషి లోని "స్వాగతం స్వాగతం" అనే పాట సాహిత్యాన్ని, ఆడియోను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
రచన: శ్రీశ్రీ, కొండముది గోపాలరాయ శర్మ
గానం: ఘంటసాల, సుందరమ్మ
సంగీతం: ఘంటసాల, హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
ఘంటసాల: స్వాగతం స్వాగతం సతి సామ్రాజ్యమె సంసారం | స్వాగతం |
సుందరమ్మ: రాణిని నేనే సామ్రాజ్యానికి ప్రాణం మీరే రాజా సాబ్ | రాణిని నేనే |
స్వాగతం స్వాగతం పతి సామ్రాజ్యమె సంసారం
ఘంటసాల: ఉదయం ఇడ్లీ, ఉప్మా కాఫీ
మధ్యాన్నానికి విందు భోజనం,
సాయంత్రానికి తీపీ, కారం | మధ్యాన్నానికి |
సాయంత్రానికి తీపీ, కారం | మధ్యాన్నానికి |
కమ్మని టీ.ని ఇమ్మని మనవి
స్వాగతం స్వాగతం సతి సామ్రాజ్యమె సంసారం
సుందరమ్మ: దస్తావేజుల శ్రద్ధగ చూచి, జడ్జీ కోర్టు హడలేలాగ | దస్తావేజుల |
పిట్టలాగనే కొట్టుకు రండి, ఫీజు మందుగా గుంజెయ్యండి | పిట్టలాగనే |
ఘంటసాల: పైలా పచ్చీస్, బీచ్ మే షైర్, | పైలా పచ్చీస్ |
మోటర్ కారులొ జోర్ హుషార్ | మోటర్ కారులొ |
ఇంటికి రీటైర్ అంతట సర్కార్
సంసారంలో స్వర్గం ప్యార్, ప్యార్ ప్యా..ర్