1952 లో విడుదలైన "ప్రియురాలు" చిత్రం విశేషం ఏమిటంటే, అంతవరకూ తెలుగు శ్రోతలకు తన కంచు కంఠంతో రేడియోలో వార్తలు వినిపించి, "కళా వాచస్పతి" యని వాసికెక్కిన శ్రీ కొంగర జగ్గయ్య గారి తొలి చిత్రం యిది. ఆర్ధికంగా ఈ చిత్రం అంత విజయం సాధించలేదనుకోండి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీ దోనేపూడి కృష్ణమూర్తి గారు. ఆయన ఒకప్పుడు "సంసారం" చిత్రానికి సావిత్రి గారిని సూచించారట. కాని అందులో మరీ చిన్నవేషం అవడం వలన సావిత్రి గారు నటించలేదు. అయితే తన స్వతంత చిత్రంలో ఆమెకు ప్రధాన పాత్ర ఇస్తానని వాగ్దానం చేసి, తరువాత తన తొలి చిత్రమైన "ప్రియురాలు" లో సావిత్రికి ముఖ్యమైన భూమికను ఇచ్చారట. ఈ చిత్రానికి కథ, మాటలు, దర్సకత్వం వహించినది ప్రముఖ హేతువాది, జర్నలిస్టు శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు. శ్రీ గోపీచంద్ గారు కథా, నవలా రచయితా, సాహితీవేత్త, స్క్రీన్ ప్లే రచయిత. వీరి రచన "పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా" కు జాతీయ సాహిత్య అవార్డు లభించినది. అంతే కాక వీరి శతజయంతి సందర్భంగా ఆయన చేసిన గణనీయమైన సాహిత్యసేవకు గుర్తుగా వారి పేరు మీద భారత తంతి తపాలా శాఖ వారు తపాలాముద్ర (postage stamp) ను విడుదల చేసారు. హీరోయిన్ గా సావిత్రి, సహాయ పాత్రలో కృష్ణకుమారి నటించిన ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు ఐదు పాటలు పాడారు. కాని అందులో రెండే లభ్యమవుతున్నాయి. వీటిలో ఆశా-నిరాశల నేపథ్యంలో అనిసెట్టి గారు రచించిన "ఆనందం మన జీవన రాగం" అనే గీతాన్ని శ్రీమతి జిక్కీ, లలిత సంగీత సామ్రాజ్ఞి శ్రీమతి రావు బాలసరస్వతి గార్లతో మాస్టారు గానం చేసారు. ప్రధానంగా సంగీత దర్శకులు సాలూరు వారైనప్పటికీ ఆరోజులలో సహాయ దర్శకులకు కూడా సమాన హోదా కలిగించే ఉదారత మనకు కనిపిస్తుంది. ఈ పాట యొక్క శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
రచన: అనిసెట్టి సుబ్బారావు
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు,
గానం: ఘంటసాల, రావు బాలసరస్వతి, జిక్కి
జిక్కి: ఆ..ఆ..ఓ..ఓ..లలలలలా లలలా
ఘంటసాల: లలలలలా లలలా
జిక్కి: లలలలలా లలలా
ఇద్దరు: ఆనందం మన జీవన రాగం,
జీవన రాగం, మన జీవన రాగం | ఆనందం |
జిక్కి: ఆశలు నింపే సుమసుందరినై అందను నీకోయి | ఆశలు |
ఘంటసాల: సూర్య కాంతినై, సుధామూర్తినై
సోకెద నీ పైన, సుఖమే మనదైనా | సూర్య |
ఇద్దరు: ఆనందం మన జీవనరాగం, జీవనరాగం
మన జీవనరాగం
బాలసరస్వతి: కటిక చీకటి కలలే గుండెకు కాంతి రేఖ దిగి రాదా
కాంతి రేఖ దిగి రాదా
పసిపాపే యే పాపమెరుగదే పలుకరించు దయలేదా
జిక్కి: మెరుపు చూపుల, కురియు వలపుల మేఘం నేనైతే... | మెరుపు |
నేనే పరిగెడితే
ఘంటసాల: నీ సొగసంతా కొల్లగొందునే...ఏ..ఏ.. | నీ సొగసంతా |
చల్ల గాలి నేనే, సాగివత్తు నేనే | చల్ల గాలి |
బాలసరస్వతి: కబురైనా వినరాదా, చల్లనీ గాలికైనా దయరాదా
ప్రాణమిచ్చీ పూజించే ప్రేమా ధూళి కలసి పోయేనా | ధూళి |