ఈ రోజే మాస్టారి వర్ధంతి. ఆయనకు శ్రీ వేంకటేశ్వరుడే ఆరాధ్య దైవం. ఆ ఏడుకొండల వాని సన్నిధిలో పాడే అదృష్టం చాల అరుదుగా లభిస్తుంది. ఎంతో పుణ్యం చేసుకొని వుండాలి అటువంటి అవకాశం లభించడానికి. ఆ అదృష్టవంతుడు, పుణ్య మూర్తి, గంధర్వ గాయకుడు శ్రీ ఘంటసాల మాస్టారు. అందులో ఆయన ప్రత్యక్షంగా మన కళ్ళకెదురుగా స్వామి సమక్షంలో ఆసీనుడై, గొంతు విప్పి భావ గంభీరంగా పాడిన దృశ్యం ఇది. ఆయన పాడిన పాటలో తాదాత్మ్యం, తన్మయత్వం ద్యోతకమవుతుంది. కోటి సూర్యుల తేజస్సు, భక్తి భావం ఆ ముఖంలో ప్రస్ఫుటమవుతుంది. తన ఇష్ట దైవమే ఆవహించిన వేంకటేశ్వరుడు, అమర గాయకుడు ఘంటసాల మాస్టారు. ఆ వేంకటేశ్వరుని సన్నిధిలో పాడటం నిజంగా ఆ వెంకటేశ్వర మహాత్మ్యం. ఆ చిత్రంలో మాస్టారు పాడిన ఈ భక్తి పాట విని పులకించని తెలుగు వారుండరు. తిరుమలలో స్వామి వారి కుంభాభిషేకం, బ్రహ్మోత్సవం తదితర సేవలతో పాటు, మాస్టారి పాటను ఈ అరుదైన వీడియోలో చూడవచ్చును. వినండి మరొక్క సారి మాస్టారి మంగళ గళంలో. కనండి ఆ మహనీయుని ప్రత్యక్షంగా స్వామి సన్నిధిలో. అనండి మరొక్కసారి గోవిందాయని ఏక గళంతో.
రథ సారధులు
ఆత్రేయ ఘంటసాల పెండ్యాల |
చిత్రం: శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (1960)
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
ప. శేషశైలావాస శ్రీ వేంకటేశా!
శేషశైలావాస శ్రీ వేంకటేశా!
చ. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకు | శ్రీదేవి వంకకు |
ముద్దు సతులిద్దరిని ఇరువైపులా జేర్చి | ముద్దు సతు |
మురిపించి లాలించి ముచ్చటల తేల్చి
శేషశైలావాస శ్రీ వేంకటేశా!
చ. పట్టు పానుపు పైన పవ్వళించర స్వామి | పట్టు పానుపు |
భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడ
చిరునగవు లొలుకుచూ నిదురించు నీ మోము | చిరునగవు |
కరువుతీరా కాంచి తరియింతుము మేము
శేషశైలావాస శ్రీ వేంకటేశా!
శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా!
శేషశైలావాస శ్రీ వేంకటేశా!
ఈ రోజు మాస్టారి వర్ధంతి.
ఏ అమర లోకాలలోనో తన గాంధర్వ గానాన్ని వినిపిస్తుంటారాయన.
ఆ మహానుభావుడు మనందరి మనసులలో చిరస్థాయిగా వున్నాడు. ఆయనను మనం ప్రతి రోజూ, ప్రతి సంవత్సరం వెరసి ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే వున్నాం. ఇక్కడ కొన్ని నేటి జ్ఞాపకాలు , మాస్టారి అమర 'పాట' శాల వ్యాసం ఉన్నాయి. చదవండి.
ఏడు కొండల వాడా! వెంకట రమణా గోవిందా! గోవింద!