1960 లో జానపద బ్రహ్మ విఠలాచార్య తన స్వంత నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షంసు పతాకం పై నిర్మించిన చిత్రం కనకదుర్గ పూజా మహిమ. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చినది నాటి నుండి ఇటీవల వరకు తెలుగు చలనచిత్రాలకు మధురమైన బాణీలు కూర్చిన సోదరద్వయం రాజన్-నాగేంద్ర. ఈ చిత్రానికి ఘంటసాల ఒక యుగళ గీతాన్ని, ఒక పద్యాన్ని పాడారు. ఇదివరకు మాస్టారు, శూలమంగళం రాజ్యలక్ష్మి తో పాడిన జీవనమే పావనం పాటను అందించాను. మాస్టారు పాడిన నాతిన్ గానను అనే పద్యాన్ని ఇక్కడ సాహిత్యంతో సహా అందిస్తున్నాను. దురదృష్టవశాత్తు దృశ్య ఖండం లభ్యం కాలేదు. శ్రవణ ఖండం భద్రపరచి అందించిన సఖియా.కాం వారికి ఎనలేని కృతజ్ఞతాంజలులు.
వాల్మీకి రామాయణంలో గుహునిది చక్కని పాత్ర. ఈతడు నిషాధ రాజు. వేటాడడం ఈతని వృత్తి. గుహునికి ఇక్షాకు వంశ ప్రభువైన శ్రీరాముడంటే పంచ ప్రాణాలు. అరణ్య వాసం చేస్తున్న శ్రీరామచంద్రుడు తన రాజ్యం గుండా వెళ్ళబోతున్నాడని విని గుహుడు పరమానంద భరితుడయ్యాడు. రాముని రాకకై వేయి కళ్ళతో ఎదురు చూసాడు. తీరా శ్రీరాముని చూసాక ఏం మాట్లాడాలో తోచలేదు.ఈ సన్నివేశానికి చక్కని పాటను కొసరాజు వ్రాశారు. సందేశాన్ని, సున్నితమైన హాస్యాన్ని పలికించడంలో కొసరాజు ఘనులు. అందరిని - అద్దరిని, దాటలేక - దయజూడగ వంటి చక్కని పదాల ఎన్నిక తో పాటు, రామపాద ధూళి తో రాతి నాతిగా మారింది కదా! మరి నా వావను తాకితే ఏమవుతుందో, అందరిని నావతో దాటించి బ్రతుకుతున్న తనకు అది కాస్త గల్లంతైతే ఏం చేయాలో, అందుకే ముందు నీ కాళ్ళు కడగనియ్యి తండ్రీ అని గుహుని పరంగా అతిశయోక్తిని కొసరాజు సునిశితంగా పాటలో ఇమిడించారు.హనుమంతుని పాత్రను పోషించడంలో దిట్టయైన అర్జా జనార్ధన రావు గుహునిగా నటించాడు. రామునిగా శోభన్ బాబు, సీతగా చంద్రకళ నటించిన 'సంపూర్ణ రామాయణం' చిత్రం బాపు రూపకల్పన లో అపురూపంగా నిలిచింది. మామ మహదేవన్ కూర్చిన "రామయ తండ్రి" పాటను పాటను ఘంటసాల మధురంగా ఆలపించారు.
శ్రీరామనవమి శుభాకాంక్షలు!
Thanks to IDreamNetWorks for posting the video to You Tube
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com