ప్రముఖ నటులు ఎన్.టి.ఆర్. 1952 లో బొంబాయిలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని వెళ్ళినపుడు అక్కడ ప్రదర్సించబడిన కొన్ని చిత్రాలు ఆయన మనసుపై చెరగని ముద్ర వేసాయి. కొన్ని నెలల తరువాత ఆయన "ఆంధ్రప్రభ-రాయలసీమ కరువు సహాయ నిధి" కోసం తెలుగు చిత్రసీమ కళాకారులు చేసిన యాత్రలో పర్యటిస్తూ ఎందరో బాధితులను కలసి వారి ఆర్తికి కలత చెందారు. తమవద్ద పెద్దగా డబ్బులేకపోయినా ఉన్నదాంట్లో కొంత సొమ్ము విరాళంగా ఇస్తున్న ఎందరో సహృదయులను చూసి వారి కన్నులు చెమ్మగిల్లాయి. ఆయనకు ఎంతో ఆనందం కలిగింది, ఆ స్ఫూర్తితో తన సోదరుడు త్రివిక్రమ రావు ప్రారంభించిన ఎన్.ఏ.టి. (నేషనల్ ఆర్ట్ థియేటర్) సంస్థకు తొలి చిత్రంగా అప్పటికే వెండితెరపై ప్రముఖ హీరో అయివుండి కూడ అరమర లెరుగని సహృదయుడైన అమాయకుని పాత్రను 1953 లో "పిచ్చి పుల్లయ్య" పేరున నిర్మించి, తన హీరో ఇమేజ్ ను ప్రక్కన పెట్టి టైటిల్ పాత్రను తనే పోషించారు. ఇది చాల ధైర్యమైన ప్రయోగం. అయితే దీనిగురించి ఆయన అన్నదేమంటే "ఒక నటుడు తన గడ్డు రోజుల్లో ఏ పాత్రనైనా చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే తాను నటుడుగా చలనచిత్ర రంగంలో స్థిరపడ్డాక కూడా తన కళాధర్మాన్ని విస్మరించకూడదు. వచ్చిన అవకాశాలలో సరైన పాత్రలను ఎన్నుకొని తన కళాధర్మాన్ని నిర్వహించాలి" అని. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించబడిన ఈ చిత్రం కోసం టి.వి.రాజు (తోటకూర వెంకటరాజు) సంగీతం అందించారు. భావుకత ఉట్టిపడే ఆహ్లాదకరమైన అనిసెట్టి సుబ్బారావు పాటకు ఘంటసాల మాస్టారు సుమనోహరంగా ఆలపించిన "ఆలపించనా అనురాగముతో" పాట ఆలసించక ఇక్కడ ఆలకించండి.
Courtesy: V9 Videos for uploading the video to You Tube
చిత్రం: | పిచ్చి పుల్లయ్య (1953) | ||
రచన: | అనిసెట్టి సుబ్బారావు | ||
సంగీతం: | టి.వి.రాజు | ||
గానం: | ఘంటసాల | ||
సాకీ: | ఆలపించనా.. అనురాగముతో... | ||
పల్లవి: | ఆలపించనా… | ||
ఆలపించనా అనురాగముతో… | |||
ఆనందామృతమావరించగా | |||
అవనీ గగనం ఆలకించగా | |||
ఆలపించనా…ఆ..ఆ..ఆ ఆలపించనా.. | |||
చరణం: | చక్కని పూవులు విరిసి ఆడగా | ||
చల్లని గాలులు కలిసి పాడగా | |||
పున్నమి వెన్నెల పులకరించగా | |||
పుడమిని సుఖాలు పొంగులెగయగా | |||
ఆలపించనా.. | |||
చరణం: | చిలిపి గుండెలో వలపు నిండగా | ||
చిరునవ్వులలో సిగ్గు చిందగా | | చిలిపి | | ||
అరమరలెరుగని అమాయకునిలో…ఓ.ఓ.. | | అరమర | | ||
ఆశయాలెవో అవతరించగా | | ఆశయాలెవో | | ||
ఆలపించనా.. | |||
చరణం: | తరుణ హృదయమే తాజ్ మహల్ గా | ||
అనంత ప్రేమకు ఆశ చెందగా | | తరుణ | | ||
నిర్మల ప్రేమకు నివాళులిచ్చే… | | నిర్మల | | ||
కాంతిరేఖలే కౌగలించగా | | కాంతి | | ||
ఆలపించనా..ఆ..ఆ..ఆ. | |||
ఆలపించనా అనురాగముతో | |||
ఆనందామృతమావరించగా | |||
అవనీ గగనం ఆలకించగా | |||
ఆలపించనా.. |