సంఘం లో గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతూ, ఎన్నో అరాచకాలను చేస్తున్న ప్రముఖుల నిజ స్వరూపాన్నిబయట పెట్టే ప్రయత్నంగా ఒక చక్కని సందేశాన్ని జోడించి తీసిన చిత్రం "పెద్ద మనుషులు". దీనికి మూలం "హెన్రిక్ ఇబ్సన్" రచించిన "ది పిల్లర్స్ అఫ్ సొసైటీ" అనే ఆంగ్ల నాటకం. ఈ చిత్రంలో మునిసిపాలిటీ చైర్మన్ గా ప్రతినాయకపాత్రలో నటించినది శ్రీ జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు కాగా అతని జట్టులో ఇంకో ముగ్గురు చెడ్డ వ్యక్తులు, వెరసి దుష్ట చతుష్టయం ఇందులోని ప్రతినాయకులు. అయితే చైర్మన్ గారి తమ్మునిగా "తిక్క శంకరయ్య" పాత్రలో నటించిన రేలంగి గారికి ఈ పాత్ర ఎంతో పేరు తెచ్చింది. ఈ చిత్రం యొక్క టైటిల్ సాంగ్ లో చక్కని సందేశాన్ని కొసరాజు గారు వ్రాసారు. ఈ పాట పోతులూరి వీరబ్రహ్మం గారి సూక్తులలాగ భవిష్యత్తును సూచిస్తుంది. ఆనాటి ఈ పాట ఈనాటి రాజకీయాలకు కుడా వర్తిస్తుంది. అందుకే ఇది ఎవర్ గ్రీన్ అయింది. పెద్దమనుషులు చిత్రం తొలి రజత కమలం పొందిన ఉత్తమ చిత్రం. టైటిల్స్ మొత్తం నడిచే ఎనిమిది చరణాల పాట "నందామయా గురుడ నందామయా". పాట పెద్దదయినా ప్రతి చరణంలోని భావం అక్షర సత్యం. పాట చివర కొంత హాస్య సంభాషణ కూడా వుంది వీడియోలో. ఇందులో మరొక ఆణిముత్యం "శివ శివ మూర్తివి గణ నాథా". ఈ రెండు పాటలు ఘంటసాల మాస్టారు రేలంగి పాత్రకు పాడారు. ఈ చిత్రం సినిమా సమీక్ష కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Thanks to Priyanshu Doneparthy for up loading the song to You Tube
కాళహస్తి మహాత్మ్యం చిత్రంలోని ప్రతి ఒక్క పాట, ప్రతి ఒక్క పద్యం, ఒక రస గుళిక. ఎంతో అద్భుతంగా గానం చేసి పది కాలాలు నిలిచిపోయేలా చేసారు ఘంటసాల మాస్టారు. ఈ చిత్రం లోని ఇంకొక చక్కని పాట, తోలేటి వెంకట రెడ్డి గారు రచించిన "మధురము శివ మంత్రం". ఇందులో ఘంటసాల గారు ఎన్ని గమకాలు వాడారో చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఈ పాట పల్లవిలో "ఇహ పర సాధనమే" అన్న పంక్తిని అయిదు విధాలుగా ఒక్కోసారి ఒక్కోలా ఆలపిస్తారు. ఈ చిత్రం తెలుగులో తీసిన చిత్రం కాదు. కన్నడ మూలమైన "బేదర కన్నప్ప" ను తెలుగులోకి డబ్ చేశారు. అయినా మాస్టారి పాటలతో ఇది ఎంతో మనోరంజకంగా భాసించింది. విజయవంతమైంది.
చిత్రం: కాళహస్తి మహాత్మ్యం (1954) రచన: తోలేటి వెంకట రెడ్డి సంగీతం: ఆర్. సుదర్శనం, ఆర్.గోవర్ధనం గానం: ఘంటసాల
జానపద బ్రహ్మ శ్రీ బి. విఠలాచార్య దర్శకత్వంలో కృష్ణ కుమారి గారు, రామారావు గారు నాయకీ నాయకులుగా నటించిన చిత్రం "బందిపోటు". ఈ చిత్రానికి మాస్టారు సంగీత దర్శకత్వం వహించారు. శ్రీ ఆరుద్ర గారి గీతాన్ని భావాన్నెరిగి రాగం నిర్ణయించడంలో తనకు తానే సాటియైన ఘంటసాల మాస్టారు, ఈ పాటకు గాను ఎన్నుకున్న రాగం "రసిక ప్రియ". రాగం పేరు వింటేనే ఎంత రసికతగా ఉంటుందో ఊహించగలము. అంతేకాక పాట నేపథ్యంలో "చిటికెల" చప్పుడు వంటి వాయిద్యాన్ని వాడటం ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. శ్రీమతి పి.సుశీల గారితో ఘంటసాలగారు పాడిన ఈ పాట ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇదే పాటను మాస్టారి రెండవ కుమారుడైన రత్నకుమార్ గారు, రోజా కలసి మణిశర్మ గారి సంగీతంలో రీ-మిక్సింగ్ చేసి కోతిమూక (2010) అనే చిత్రంలో పాడారు. గాన కోకిల, పద్మ భూషణ్, శ్రీమతి పి.సుశీల గారికి జన్మదిన శుభాకాంక్షలతోఈ పాటను సాహిత్యం, ఆడియో మరియు వీడియో తో ఇక్కడ పొందు పరుస్తున్నాను. ఆడియో లో పాట ముందు వచ్చే హమ్మింగ్ తో కలసి సంపూర్ణంగా వుంది.
Thanks to Deva7997 for up loading the video to You Tube
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com