1951 లో విజయా వారి పతాకం పై విడుదలైన "పాతాళ భైరవి" చిత్రం ఒక చక్కని మధురమైన జానపద చిత్రం. అలనాటి తెలుగు చిత్రాలలో తలమానీకం యీ చిత్రం. ఘంటసాల మాస్టారి అద్భుతమైన బాణీలు, పింగళి వారి పాటలు మరియు "సాహసం శాయరా డింభకా", "ధైర్యం శాయరా" వంటి ఎన్నో సరళమైన తెలుగులో వాడిన ప్రయోగాలు ప్రతి ఒక్కరిని అలరిస్తాయి. తాహతుకు మించిన కోరికలున్నా, ధైర్యం వుంటే ఏదైనా సాధించవచ్చనే ఇతివృత్తం తో రాజకుమారి, తోటరాముడు మధ్య జరిగే ప్రేమ కథకు ప్రతి రూపం పాతాళ భైరవి. ధనసంపాదనకోసం మాయావియైన మాంత్రికుని (ఎస్.వి.ఆర్.) నమ్ముకుని, తనను నమ్ముకున్న రాజకుమారిని (మాలతి) ఎడబాసి సాగే తోట రాముడిని (ఎన్.టి.ఆర్.) రక్షించమని వేయిమార్లు (వేమరు) ప్రార్థించే తల్లి (సురభి కమలాబాయి) నేపథ్యంలో ఈ నలుగురి పై చిత్రీకరించిన పాట ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు. ఉత్తరోత్తరా ఈ పాట గుడ్డిగా ప్రేమించుకునే ప్రేమికుల గురించి అందరి నోటా నానే సామెతలా మారిందంటే ఆ క్రెడిట్ పింగళిదే. అలనాటి ప్రముఖ రంగస్థల నటి సురభి కమలాబాయి 1931 లో హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో విడుదలైన తొలి తెలుగు చిత్రం భక్త ప్రహ్లాద లో లీలావతి పాత్ర పోషించింది. ఆ విధంగా ఆవిడ తొలి తెలుగు చలన చిత్ర కథానాయిక అని చెప్పవచ్చు. మాలతి నటించిన మరొక చక్కని చిత్రం, బహుశా కథానాయికగా ఆఖరి చిత్రం కాళహస్తి మహాత్యం.
నా చిన్నతనంలో మా నాన్న గారు ఈ పాటను సరదాగా ఈలతో పాడేవారు. ఈ పాట విన్నపుడల్లా మా నాన్న నా కళ్ళ ముందు కనిపించేవారు. గత నెల ఏప్రిల్ 25 న మా తండ్రిగారు స్వర్గస్థులైనారు. అయితే ఆయన జ్ఞాపకాలు మాతోనే వదిలారు. అవి గుండెలో అలాగే భద్రం చేశాను. మా నాన్నకు నచ్చిన ఈ పాటను వి.జె.వర్మ మరియు మాస్టారు (ఆలాపన) పాడారు. సింధు భైరవి రాగం లో సాగే ఈ పాటకు రచన పింగళి నాగేంద్ర రావు. ఈ చిత్రానికి దర్శకత్వం కె.వి.రెడ్డి.
మా తండ్రి గారు
శ్రీ వులిమిరి భవానీకుమార రామలింగస్వామి
(1932-2013)
Thanks to Shalimar Telugu & Hindi Movies for providing the video clip in You Tube.
పల్లవి: | వి.జె.వర్మ: | ప్రేమ కోసమై వలలో పడెనో పాపం పసివాడు... | |
అయ్యో పాపం పసివాడు | | ప్రేమ కోసమై | | ||
చరణం: | వి.జె.వర్మ: | వేమరు దేవుల వేడుకుని తన కొమరుని క్షేమం కోరుకుని | |
ఘంటసాల: | ఓ..ఓ.ఓ.ఓ.. ఓ.ఓ.ఓ.. ఓ..ఓ..ఓ.. | ||
వి.జె.వర్మ: | వేమరు దేవుల వేడుకుని తన కొమరుని క్షేమం కోరుకుని | ||
ఏమైనాడో, ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ | | ప్రేమ కోసమై | | ||
చరణం: | వి.జె.వర్మ: | ప్రేమకన్ననూ పెన్నిధియేమని యేమి ధనాలిక తెత్తుననీ | | ప్రేమ కన్ననూ | |
భ్రమసి చూచు ఆ రాజకుమారిని నిముసమె యుగముగ గడుపుమనీ | | ప్రేమ కోసమై | | ||
చరణం: | వి.జె.వర్మ: | ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకుని | | ప్రేమలు దక్కని | |
ఏమివ్రాసెనో... అటు కానిమ్మని బ్రహ్మదేవునిదే భారమనీ | | ప్రేమ కోసమై | | ||
ప్రేమ కోసమై వలలో పడెనో పాపం పసివాడు... | |||
అయ్యో పాపం పసివాడు | | అయ్యో | |