ప్రతిభా పిక్చర్సు అధినేత ఘంటసాల బలరామయ్య ఎ.ఎన్. ఆర్. తో నిర్మించిన జానపద చిత్రం ముగ్గురు మరాఠీలు విజయయవంతం కావడంతో తదుపరి ప్రయత్నంగా 1948 లో అక్కినేని, ఎస్.వరలక్ష్మి, అంజలీదేవి ప్రధాన భూమికలుగా నిర్మించిన చిత్రం బాలరాజు. అంతవరకు తన పాత్రలకు తనే పాడిన నాగేశ్వరరావు ఈ చిత్రం నుండీ ఘంటసాలనే తనకు నేపథ్యగాయకునిగా పాడమనటం జరిగింది. ఘంటసాల ఆయనకు పాడిన తొలిపాట "చెలియా కనరావా". తొలినాట ఎస్.వరలక్ష్మి నటిగానే కాక, నేపథ్యగాయనిగా ఉండేవారు. ఈ చిత్రంలో ఎక్కువభాగం పాటలు ఆవిడవే. అయితే, ఈ చిత్రం లో ఒకే ఒక పాట, అది ఘంటసాలతో "నవోదయం నవోదయం" అనే యుగళగీతం పాడిన మరొక నేపథ్యగాయని వక్కలంక సరళ. ఈమె ఘంటసాలతో కలసి పాడిన మరొక యుగళగీతం "కీలుగుర్రం" చిత్రం లోని ప్రఖ్యాతిగన్న "కాదు సుమా కల కాదు సుమా". బాలరాజు చిత్రానికి గాలి పెంచల నరసింహారావు గారు సంగీత దర్శకులైన ఆయనకు సహాయకులుగా ఘంటసాల, సి.ఆర్.సుబ్బరామన్ లు పనిచేసారు. మాస్టారు "నవోదయం" పాట కాక మరి కొన్ని పాటలను స్వరపరచారు. సముద్రాల రాఘవాచార్యులు సాహిత్యాన్ని అందించారు. కథాపరంగా చక్కని పదాలను ఎన్నుకొన్నారు సముద్రాల. కథ యితివృత్తం "మనసూ మనసూ కలవాలే గాని మహేంద్రుడెదురొడ్డినా మమత మార్చి, మటుమాయం చేయలేడు", అనే ఇతివృతం మీద జరుగుతుంది. దేవలోకం లో ప్రేమించుకున్న ఒక యక్షుల జంట ప్రతికూల పరిస్థితుల వలన కుబేరుడు,ఇంద్రుడు కారణంగా శాపగ్రస్తులై భూమ్మీద పుడతారు. అందుకే నవోదయం పాటలో సముద్రాల వారు ధనేశుడు (కుబేరుడు), సురపతి (ఇంద్రుడు) అనే పదాలు వాడారు. అంతే కాక ఆయన వాడిన పదాలు "పాటి", "నియతి" వంటి పదాలు ఈరోజుల్లో సాధారణంగా వినము. అరవైరెండేళ్ళనాటి మధుర యుగళగీతం " నవోదయం నవోదయం" మాస్టారి అభిమానులకోసం ఇక్కడ సాహిత్యంతో పొందుపరుస్తున్నాను.
నిర్మాణం:
ప్రతిభా సంస్థ
చిత్రం:
బాలరాజు (1948)
సంగీతం:
ఘంటసాల
రచన:
సముద్రాల సీనియర్
గానం:
ఘంటసాల, వక్కలంక సరళ, బృందం
పల్లవి:
బృందం:
నవోదయం నవోదయం
నవోదయం శుభోదయం
నవయుగశోభా మహోదయం
నవోదయం శుభోదయం
నవయుగశోభా మహోదయం
చరణం:
బృందం:
ఆడునదిగో అరుణ పతాకం, అరుణ పతాకం
ఆడునదిగో అరుణ పతాకం
సరళ:
ఆ..ఆ..ఆ..
ఆడునదిగో నవయువ లోకం
స్వతంత్ర జీవన ప్రభాత గీతం
స్వతంత్ర జీవన ప్రబోధగీతం ప్రబోధగీతం,
చరణం:
సరళ:
ఆ..ఆ..ఆ..
ఘంటసాల:
జవరాలి మేలి చెంగావి మోవి నవరాగ రేఖలవిగో -2
సరళ:
నవనవోల్లాస యువజనాళిలో అనురాగ శోభలివిగో -2
చరణం:
ఘంటసాల:
మాటవినము ధనేశుడైన
సరళ:
పాటిగొనమిక సురపతినైన
ఘంటసాల:
మాటవినము ధనేశుడైన
సరళ:
పాటిగొనమిక సురపతినైన
ఘంటసాల:
సమాన పథమె
సరళ:
నవీన నియతి
ఇద్దరు:
మాటవినము ధనేశుడైన, పాటిగొనమిక సురపతినైన
సమాన పథమె, నవీన నియతి
బృందం:
నవోదయం శుభోదయం
నవయుగశోభా మహోదయం
నవోదయం శుభోదయం
నవయుగశోభా మహోదయం
నవోదయం నవోదయం
Thanks to Sri Bollapragada Someswararao garu (somupadma) for the balaraju poster; Thanks to Wikipedia for providing the information on Balaraju movie. Also, thanks to You Tube and for providing the video clip and thanks to VolgaVideoMusic for uploading the song.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com