లోకపాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క గణనీయమైన దశావతారములలో నరమృగ శరీరుడైన నరసింహావతారం నాలుగవది. 'ప్రహ్లాద చరిత్ర'నూ మరియు చెంచుజాతికి చెందిన శిఖనాయకుడు విష్ణువును ప్రార్థించి లక్ష్మీదేవిని కూతురుగా పొందిన 'చెంచులక్ష్మి' కథను 1943 లో తొలిసారి, 1958 లో మలిసారి చెంచులక్ష్మి చిత్రంగా తీసారు. వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు స్వామి దర్సనానికి వచ్చిన సనకసనందనాదులను అడ్డగించగా ఆ మునులు కోపించి విష్ణు సాన్నిధ్యానికి దూరమౌదురని శపిస్తారు. తరువాత విష్ణు విరోధంతో మూడు జన్మలు మాత్రమె దూరంగా ఉండుటకు జయవిజయులు అంగీకరిస్తారు. తొలిజన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు గా జన్మిస్తారు. మహావిష్ణువు వరాహావతారమెత్తి హిరణ్యాక్షుడ్ని సంహరిస్తాడు. తరువాత నరసింహావతారం ఎత్తి శ్రీహరి హిరణ్యకశిపుని అంతమొందించి, తన భక్తుడైన ప్రహ్లాదుని బ్రోచి, పిదప చెంచులక్ష్మిని వివాహమాడతాడు. అదీ కథ. అయితే, 1943 లో తీసిన చిత్రంలో సి.హెచ్.నారాయణరావు, ఋష్యేంద్రమణి, చిత్తూరు నాగయ్య నటించారు. 1958 లో నిర్మించిన చిత్రంలో నరహరి (విష్ణువు) గా నాగేశ్వరరావు, ఆదిలక్ష్మి గా, చెంచులక్ష్మి గా అంజలీదేవి, హిరణ్యకశిపునిగా ఎస్.వి.ఆర్., నారదునిగా రేలంగి నటించారు. ఆరుద్ర గీతాన్ని నారదునికి మాస్టారు పాడిన "నీల గగన ఘనశ్యామా"ను బేహాగ్ రాగంలో బాణీ కట్టారు సంగీత దర్శకులు ర'సాలూరు రాజేశ్వరరావు. ఇక రాగశాల లో అడుగుపెట్టండి.
అలాగే పాత్రధారిగా, గాత్రధారిగా శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, సాలూరివారు స్వరసారథులుకాగా, భక్తప్రహ్లాద చిత్రంలో గానంచేసిన 'వరమొసగే వనమాలి' బేహాగ్ రాగానికే వన్నెతెచ్చిన బంగారం. ఆయనే పాడిన అన్నమయ్య కీర్తన 'నారాయణతే నమోనమో' బహుశ్రుతమే.
హిందుస్తానీ పద్ధతి |
జి.ఎన్.బాలసుబ్రమణ్యం, అమృతవర్షిణి మరియు బేహాగ్ మిశ్రమంతో, అమృతబేహాగ్ అనే కొత్త రాగాన్ని సృష్టించి, 'కమల చరణే' అన్న సుశ్రావ్యమైన కృతిని ప్రసిద్ధపరచారు. కాపీ, బేహాగ్, నళినకాంతి రాగాల్లో తరచుగా వచ్చే - సుదీర్ఘమైన 'కరవై'లను గమనించి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఇవి తమకు ప్రియమైన రాగములనేవారట.
సినిమా సంగీతంలో చాలా అరుదుగా ప్రయోగింపబడిన రాగమైనప్పటికీ, ఘంటసాలగారు బేహాగ్ రాగాన్ని ఎన్నివిధాలుగా ఆలపించారో, ఎన్నివిధాలైన రసానుభూతిని ఈ రాగంలో పండించారో రసజ్ఞులు చవిచూడటానికి ఇక్కడ ప్రత్యేకముగ సంకలించిన “బేహాగ్ రాగం” ధ్వని ఖండికను సమకూర్చాము. ఇందులో, ‘యమునాతీరమున’, ‘మత్తఃపరతరంనాన్యత్’ (శ్లోకం), ‘యావకవియ శృంగారకల్పనెయో’ (చంద్రహాస చిత్రంకోసం మాస్టారు కన్నడంలో పాడిన పాట – తెలుగులో ‘ఇలకుదిగిన అందాల తారవో’), కన్నుల బెళుకే కలువలురా (విమల) మరియు ‘నీల గగన ఘనశ్యామ’ దృష్టాంతాలుగా పొందుపరచాము. ఆ భావభగీరథుని బేహాగ్ రాగధారను ఉమ్మడిగా వింటే ఈ రాగాన్ని మాస్టారు వివిధరీతుల ప్రయోగించి జానపద, శృంగార, భక్తి గీతాలను, గంభీర శ్లోకాలను, వివిధ సన్నివేశాలకు రక్తి కట్టించే విధంగా ఎంత భావగర్భితంగా పాడారో తెలుస్తుంది. అందుకే “కరుణశ్రీ” జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మాస్టారి గురించి ఇలా అన్నారు:
“అతడు ప్రసన్న మధుర భావార్ద్రమూర్తి
సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి
లలిత గాంధర్వ దేవత కొలువుదీరు
కలికి ముత్యాలశాల మా “ఘంటసాల”
ఆడియో సంకలనం: శ్రీ ఎం.ఆర్.చంద్రమౌళి
ప. నీలగగన ఘనశ్యామా....
ఘనశ్యామా...దేవా
నీలగగన ఘనశ్యామా | నీలగగన |
చ. హాని కలిగితే అవతారాలను | హాని |
పూని బ్రోచునది నీవే కావా
నీలగగన ఘనశ్యామా | నీలగగన |
చ. చదువులు హరించి అసురుండేగిన
జలచరమైతివి ఆగమరూప | చదువులు |
వేదనిధులనే విధాత కొసగిన
ఆదిదేవుడవు నీవే కావా
నీలగగన ఘనశ్యామా | నీలగగన |
చ. కడలి మధించగ కదిలే నగమును
వెడలి కూర్మమై వీపున మోసి
అతివ రూపమున అమృతముగాచిన
ఆదిదేవుడవు నీవే కావా
నీలగగన ఘనశ్యామా | నీలగగన |
చ. సుజనుల కోసము ఎపుడే వేషము
ధరియించెదవో తెలియగనేరము | సుజనుల |
పెండ్లికొడుకువై వెడలినాడవు
ఎందులకొఱకో హే! జగదీశా!
నీలగగన ఘనశ్యామా | నీలగగన |
Thanks to Wikipedia for the information and Sri Chandra Mowly garu for the audio/video clip as well as RaagaShaala information. This blog is maintained for entertainment purpose only
Thanks to Wikipedia for the information and Sri Chandra Mowly garu for the audio/video clip as well as RaagaShaala information. This blog is maintained for entertainment purpose only