మరాళ మందగమనముతో సడిచేస్తూ, గజ్జెలు ఘల్లుమని, ఉల్లము ఝల్లుమని, హృద్యమైన వీణియపై తేనియలోలికే స్వరాళికి అనుగుణంగా జతులాడే ముదితకు నృత్య శైలిలో ఉధృతి పెరిగి కపోలములు కందుతూ, కుంతలములు గగన తలమున ఎగయుచూ చేసే పద విన్యాసానికి భావుకత జోడించి అనురాగ రాగాన్ని పలికిస్తే ఆ గీతం కుంతలవరాళిలో రూపు దిద్దుకుంటుంది. 1960 లో తన స్వంత నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షంస్ పతాకం పై జానపద బ్రహ్మ విఠలాచార్య నిర్మించిన కనకదుర్గ పూజా మహిమ చిత్రం కోసం జి.కృష్ణమూర్తి వ్రాసిన ఈ గీతాన్ని అలనాటి దర్శకులు రాజన్-నాగేంద్రలు కుంతల వరాళి రాగం లో బాణీ కడితే దానిని సుశాస్త్రీయంగా, సుమనోహరం గా ఘంటసాల, శూలమంగళం రాజ్యలక్ష్మి ఆలపించారు. రాజ్యలక్ష్మి కర్ణాటక సంగీతజ్ఞురాలు. ఆమె తన సోదరి జయలక్ష్మి తో 'శూలమంగళం సిస్టర్సు' (జయలక్ష్మి-రాజ్యలక్షిం) పేర చాల సంగీత కచేరీలు చేశారు. రాజ్యలక్ష్మి ఘంటసాల తో రెండే రెండు పాటలు పాడారు. అందులో బాగా హిట్ అయిన పాట "జీవనమే పావనం". రాజన్-నాగేంద్ర సోదరులు ఎక్కువ విఠలాచార్య చిత్రాలకు సంగీతాన్ని అందింఛారు. కొంత వ్యవధి తరువాత పూజ చిత్రం నుండి మరొక ప్రస్థానాన్ని ప్రారంభించారు.ఈ సన్నివేశంలో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరియు ఆదోని లక్ష్మి వీణావాదనం చేస్తూ అభినయించారు. మిక్కిలినేని మంచి నటుడే కాక రచయిత కూడ. ఆయన పలువురు రంగస్థల నటీనటుల గురించి 'నటరత్నాలు' అనే పుస్తకం వ్రాసారు.
రాజన్-నాగేంద్ర రాజ్యలక్ష్మి ఘంటసాల
చిత్రం :
కనకదుర్గ పూజా మహిమ
(1960)
రచన :
జి.కృష్ణమూర్తి
సంగీతం :
రాజన్-నాగేంద్ర
గానం :
ఘంటసాల, శూలమంగళం రాజ్యలక్ష్మి
రాజ్యలక్ష్మి:
జీవనమే పావనం
మానవ జీవనమే పావనం
ఈ భువి సంతత సంతోష సంధాయిని గాన
జీవనమే పావనం
జీవనమే పావనం
ఈ భువి సంతత సంతోష సంధాయిని గాన
జీవనమే పావనం
ఘంటసాల:
ప్రణయము మనలోన .. ఆ..ఆ..
ప్రణయము మనలోన ప్రణవము కాగా...
| ప్రణయము |
మన రాగములోన అనురాగమె మ్రోగ
జీవనమే పావనం మా..నవ జీవనమే పావనం
రాజ్యలక్ష్మి:
పతి పదముల సేవ సతులకు సరిత్రోవా..ఆ..
| పతి పదముల |
ఇహపర లోకాల నావా..
ఘంటసాల:
కూరిమి అలరార కోరికలింపార
| కూరిమి |
చేరువగా జంట చేరా..
రాజ్యలక్ష్మి:
మాటలు భావాలు…ఆ..ఆ..
మాటలు భావాలు పూవులు తావి
| మాటలు |
ఘంటసాల:
మెలసిన ఆ రీతి కలసిన ఆనాడె
జీవనమే పావనం మా..నవ జీవనమే పావనం
ఇద్దరు:
ఈ భువి సంతత సంతోష సంధాయిని గాన
జీవనమే పావనం
రాజ్యలక్ష్మి:
మదమమప .. జీవనమే పావనం
నిద దప పమ సమ్మప్ప జీవనమే పావనం
సనిదప మదద్ద నిదనిపప్ప
దపదమమ్మ పమపమాపమస
ఘంటసాల:
ససా మదనిద నినీ సనిదప దదా నిదపమ సదమమప
ఇద్దరు:
జీవనమే పావనం
ఈ భువి సంతత సంతోష సంధాయిని గాన
జీవనమే పావనం
కృతజ్ఞలు: సినిమా పోస్టరును పొందుపరచిన aptalkies.com కు, వీడియోను అందించిన వోల్గా వీడియోకు, యూ ట్యూబ్ వారికి, సమాచారమును పొందుపరచిన ఘంటసాల గళామృతము మరియు వికిపీడియా బ్లాగులకు ధన్యవాదములు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com