ఘంటసాల అనగానే గుండెల అంచుల్లో కంచుఘంట మ్రోగే సంగీతకాంత శక్తి అని ఆయన గొంతు కనీసం ఒక్కసారి విన్నవారెవరైనా తప్పక చెబుతారు. అందరూ అభిమానంతో పిలుచుకునే పిలుపు ’మాస్టారు’. మన మాస్టారి పాట విననిదే నాకు పొద్దు గడవదు. ఊహ తెలిసినప్పటినుండి ఆ మంగళ శ్రీకంఠ శ్రీఖండ ప్రసాదసేవనతో ప్రతిదినం ఆయన గానం వింటూ పెరిగాను. ఖంగుమనే ఆ గొంతు వింటే కలిగే స్పందన, గుండెలోతుల భావాలని స్పందిస్తూ అనుక్షణం విలక్షణంగా వినిపిస్తూనే వుంటుంది. నేనే కాదు భారతీయ భావసంగీతంలో మాస్టారి పాటలు వినని వారుండరు. భౌతికంగా ఆయన మనముందు లేనప్పటికీ, ఈనాడు కూడ 80 ఏళ్ళ వృద్ధులయితేనేమి, 8 సంవత్సరాల కుర్రవాళ్ళయితేనేమి ఆయన పాడినపాటలను పాడుకోవడం వింటుంటాం. గాత్రం సంకుచితంకాక, స్వరగాంభీర్యాన్ని, త్రిస్థాయిలో పలికించగల జగన్మంగళగళుడాయన. తన వాచకంతో, గాయన శైలితో సాహిత్యానికి, భావానికి అనుగుణంగా పాటలో రసోత్పత్తిని పండించడంలో ఆయనకు ఆయనే సాటి. వాణిని వినిపించడమేకాదు, తను కట్టిన బాణిలో మనకు కనిపిస్తాడు ఆ మహామహుడు. పాటలను పాడటంలో తన పాటవం చూపిన ఈ గానగంధర్వుడు అంతవరకు నాటకరంగానికి పరిమితమైన పద్యాలను జనం మెచ్చిన రీతిలో, కర్ణపేయంగా చలనచిత్రాలకు అనుగుణంగా వివిధ పౌరాణిక, సాంఘిక, జానపద పాత్రలకు అన్వయింపజేసి, నలుగురూ ఆస్వాదించగల పద్ధతిలో ఆలపించి, తనదంటూ ఒక ప్రత్యేక శైలిని సృజియించి, పద్యవాచనమంటె ఇలా ఉండాలన్న కొంగ్రొత్త ఒరవడిని నెలకొల్పిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఘంటసాల మాస్టారు. ఆయన గానం చేసిన పాటలు, పద్యాల యొక్క సాహిత్యం పూర్తిగా అందరికీ అందుబాటులో లేదు. అవన్నీ ఎలాగయినా ఒక వేదికపైకి తీసుకువస్తే బాగుండునని అనిపించింది నాకు. అయితే నాకున్న పరిజ్ఞానం తక్కువ. "నేను చేయగలనా?" అన్న సందేహం వచ్చింది. అయితే ప్రారంభిస్తే ఏదోవిధంగా సహాయం దొరకకపోదని అనిపించింది. ఆ సంకల్పానికి లభించిన మనస్ఫూర్తికి ఫలమే సరిగ్గా ఒక సంవత్సరం ముందు ఈ 'ఘంటసాల' బ్లాగుకు నాందీ ప్రస్తావన జరగటం. ఈ బ్లాగు అభివృద్ధికి ముఖ్యంగా ప్రాజెక్టు ఘంటసాల బ్లాగునందు పలువురు ఘంటసాల అభిమానులు సేకరించిన సమాచారము మరియు శ్రవణ సముదాయము, శ్రీయుతులు కొల్లూరు భాస్కరరావు గారి ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి బ్లాగు, శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వరరావు గారు, ప్రణీత్ గారు, తదితరుల వీడియోలు ఒక ఎత్తయితే, మిత్రులు, మన ఘంటసాల-రాగశాల నిర్వాహకులు, సహృదయులు శ్రీ చంద్రమౌళి గారి సాంగత్యము, వారి సహాయ, సహకార, సౌభ్రాతృత్వాలు ఈ బ్లాగు వర్ధనానికి మరింత దోహదం చేశాయి. వీరందరికి సర్వదా కృతజ్ఞుడ్ని. తత్ఫలితంగా ఒక ఏడాదిలో సుమారు 150 ప్రచురణలు చేయడం సాధ్యమయింది. ఇందులో పాటలు, పద్యాలు, వ్యాసాలు, అవధానాలు, పరిచయాలు, ముఖాముఖి చర్చలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పలువురు ఘంటసాల అభిమానులు తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను, సద్విమర్శలను పొందుపరచారు. మీ అందరి సమిష్టి సహకారంతో మాస్టారికి సంబంధించిన మరిన్ని విషయాలు, విశేషాలు మన ఘంటసాల బ్లాగులో ప్రచురించి మాస్టారి అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించాలని ఆశిస్తూ..
- ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు.