పిల్లలు, పెద్దలు అందరూ మెచ్చే దృశ్య కావ్యం విజయా వారి మాయాబజార్. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు ఈ చిత్రాన్ని. ఈ చిత్రంలో "నీవేనా నను తలచినది" పాటతో కలసి నాలుగు పాటలకు శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు బాణీలు కట్టి కారణాంతరాల వలన తప్పుకుంటే ఘంటసాల మాస్టారు మిగిలిన బాణీలను, సంగీతాన్ని సమకూర్చారట. ఎ.ఎన్.ఆర్. కు మాస్టారు పాడేటప్పుడు మృదువుగా వుంటుంది ఉచ్చారణ. మాస్టారితో కలసి విలక్షణమైన గాయని శ్రీమతి పి.లీల గారు ఎన్నో చక్కని పాటలు పాడారు. అందులో చెప్పుకోదగినది ఈ యుగళ గీతం. ఈ చిత్రాన్ని ఈ మధ్యనే రంగులు అద్ది మళ్ళీ విడుదల చేసారు. అయితే చాల పాటలలోని ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ ని మార్చారు. అది బాధాకరమైన విషయం. అయితే ఇది డిజిటలు యుగం. కాదేదీ ధ్వని ముద్రణకు అనర్హం. ఈ పాటను తన నైపుణ్యంతో అసలైన శబ్దగ్రహణంతో అందించారు Bank of Sri Ghantasala, Machilipatnam కు చెందిన శ్రీ కే.వి.ఆర్. హరీష్ గారు. నలుపు-తెలుపు లో చిత్రించి, రంగులు అద్దిన ఈ పాటను విని, కని, ఆనందించండి.
ఇది సు(వర్ణ) చిత్రం
ఇది మూలం: నలుపు-తెలుపులో
శ్రీమతి పి.లీల గారు కచేరీలలో పాడిన వీడియోలు అరుదుగా దొరుకుతాయి. 1999 సంవత్సరం జూన్ నెలలో యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వారు కింగ్స్ హాల్, Stoke on Trent, UK లో నిర్వహించిన ద్వైసాంవత్సరిక సదస్సులో శ్రీమతి పి.లీల గారు మరియు మాస్టారి ప్రియ అభిమాని శ్రీ డా. అప్పారావు నాగభైరు పాడిన ఇదే పాటను యూట్యూబ్ వీడియోలో ఇక్కడ చూడవచ్చును. (కారణాంతరాల వలన ఈ వీడియో లోడ్ అవలేదు. అందువలన లింకును పొందుపరుస్తున్నాను. క్షంతవ్యుడ్ని).
రథ సారధులు
రచన: పింగళి నాగేంద్రరావు
ఘంటసాల: నీవేనా...
నీవేనా నను తలచినది, నీవేనా నను పిలచినది
నీవేనా నా మదిలో నిలచి, హృదయము కలవర పరచినది
నీవేనా..
లీల: నీవేలే నను తలచినది, నీవేలే నను పిలచినది
నీవేలే నా మదిలో నిలచి, హృదయము కలవర పరచినది
నీవేలే..
ఘంటసాల: కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా | కలలోనే |
కలయో, నిజమో, వైష్ణవ మాయో, తెలిసీ తెలియని అయోమయములో
నీవేనా నను తలచినది, నీవేనా నను పిలచినది
నీవేనా నా మదిలో నిలచి, హృదయము కలవర పరచినది
నీవేనా..
లీల: కన్నుల వెన్నెల కాయించి, నా మనసున మల్లెలు పూయించీ | కన్నుల |
కనులను మనసును కరగించీ, మైమరపించీ, నన్నలరించీ
నీవేలే నను తలచినది, నీవేలే నను పిలచినది
నీవేలే నా మదిలో నిలచి, హృదయము కలవర పరచినది
నీవేలే..
ఘంటసాల: నీవేలే..