ఘంటసాల
తన సంగీతదర్శకత్వంలో చిత్ర కథా సన్నివేశాలకు, పాత్ర స్వభావాలకు అనుగుణంగా రాగాలను ఉచితరీతిగా
సంయోజించినా, తనకు ప్రియమైన రాగాలు ఎలాగో ఒక విధంగా, నేపథ్యంలో, గీతాలలో, పద్య రూపాలలో
వెలువరించే తీరు గమనీయం.
లవకుశ చిత్రసంగీతంలో మాస్టారు చేసిన హిందోళరాగ ప్రయోగాలను ఈ వ్యాసం మొదటిభాగంలో గమనించాము. ఘంటసాల సంగీతదర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలోనూ అలాంటి ప్రయోగాలు మనకి కనిపిస్తాయి.
లవకుశ చిత్రసంగీతంలో మాస్టారు చేసిన హిందోళరాగ ప్రయోగాలను ఈ వ్యాసం మొదటిభాగంలో గమనించాము. ఘంటసాల సంగీతదర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలోనూ అలాంటి ప్రయోగాలు మనకి కనిపిస్తాయి.
ఘంటసాల హిందోళ రాగాలాపన సంకలనం
"పరమానందయ్య శిష్యుల కథ" లో హిందోళ
రాగం
లవకుశ
చిత్రం లాగే, పరమానందయ్య శిష్యుల కథ
చిత్రంలో రెండు పాటలు, ఒక శ్లోకం మాస్టారు హిందోళరాగంలో స్వరపరిచారు. అవి నాయిక
పాడే శివకీర్తన "ఓ మహదేవ నీపదసేవ" మరియు నర్తకి-నాయిక పోటీపడి నర్తిస్తూ
పాడిన "వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణ" మరియు కథానాయకుడు ఆలపించే
శివస్తుతి "వందే శంభుముమాపతిం". "ఓ మహదేవ నీపదసేవ" పాటలో
రాగభావం, స్వరసంచార సౌమ్యధార, ఇష్టదేవతా భావవిలీన స్థితిని ప్రతిబింబించే భక్తిరస
ప్రతిపాదనకు తోడ్పడే విధంగా బాణీ కట్టారు ఘంటసాల మాస్టారు. ఈ పాటలో హిందోళరాగానికి
ముందుగా మాస్టారు, తమకు ప్రియమైన మరొక ఔడవరాగం ఉదయరవిచంద్రికను జతచేశారు.
"వనిత
తనంతట తానే వలచిన ఇంత నిరాదరణ" ఎల్.విజయలక్ష్మి అభినయంచిన ఒక స్పర్ధాత్మకమైన
నృత్యసందర్భ గీతానికి మాస్టారు చేసిన స్వరకల్పన వారి శాస్త్రీయంత్య
సంగీత వైదుష్యానికి, స్వరలయవిన్యాస వైవిధ్యతా నిర్మాణ సామర్థ్యానికి తార్కాణం. ఈ
పాటలో పి.లీల మరియు ఎ.పి.కోమలతో పలికించిన హిందోళరాగ స్వరాలు, ఎడుప్పుల బిగింపుతో,
గమక వైవిధ్యముతో, కథాసన్నివేశంలో నందివర్ధన మహారాజు అంతఃపురంలో వుండాలా లేక బయటకు
వచ్చి ప్రజలను ఆదుకోవాలా అన్న సంఘర్షణను అత్యద్భుతంగా ప్రతిబింబించారు.
ముక్తాయంలోని త్రిశ్ర, పంచమ, మిశ్ర, చతురస్ర గతుల చిన్న కొలతల తాళవిన్యాస
నిర్మాణంలో ఘంటసాల మాస్టారు చూపిన లయవిజ్ఞత మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. హిందోళ
రాగంలో నాయకీభావప్రధాన శృంగార రసాన్ని, నిదురించిన పరిజ్ఞానాన్ని మేలుకొలుపే వీర,
కరుణ రసాలను పండించిన తీరు ప్రశంసనీయం. నర్తకి విజయలక్ష్మి రెండున్నర నిమిషాల
విరహ, శృంగార మనోహర భరతనృత్యభంగిమ వైవిధ్యాలొలికిస్తుండగా, మధ్యన ప్రవేశించి నాయకుని
చిత్తాన్ని వెలిద్రిప్పే పోటీయేర్పడగా, దానిని నిరోధించి సంఘర్షణకు సంసిద్ధురాలైన
రాజనర్తకి యొక్క వికర్షణ భావాన్ని, ఘంటసాల ఒక అద్బుతమైన తాళప్రక్రియలో ఇమిడిన ఈ
హిందోళ స్వరబంధాన్ని కూర్చారు. "గసానీ దానిసా- దానీసా; నినీదా మాదనీ మాదానీ;
సా,దా, నీ, మా, దా,గా- సనిదమగసా;
దనిస-దనిస-దనిస" మంచి బిగితోసాగే ఈ స్వరప్రస్తారము, దనిసా అనే పకడ్
పునరావర్తనంతో. "నీవు నాకు సాటికాదుపో" అనే విధంగా హస్తమును బయటకు
మూడుసార్లు తిప్పే విధానము హిందోళరాగంలో విరహభావమూ దాన్ని వెనుకకు మళ్ళించే
మేలుకొలుపులు ఘాతరూపంలో అప్పళించే వీరమూ, ఆ ప్రతిబంధాన్ని ఎదురించే క్రోధభావాన్ని
దనిస-దనిస-దనిస స్వరావర్తనతో కోమలస్వరాలలోనూ కోపాలభావాలను చూపడం ఆయన ప్రతిభకే
చెల్లు.
హిందోళరాగప్రియమైన నారద సంగీతం
దీపావళి,
సతిఅనసూయ చిత్రాలలో నారదపాత్రలకు బాణీకట్టి పాడిన పాటలకు అతి సున్నితమైన, సరళమైన
స్వరాలనే సమకూర్చడం సమంజసమే. దీపావళి చిత్రంలో ఆయనే స్వరబరచి పాడిన
"కరుణాచూడవయా" భక్తిరసాన్ని వెల్లడిస్తే, అదే బాణీలో పాడిన "అలుకా
మానవయా" భయమూ, హాస్యమూ సమ్మిశ్రమై ఆ పాటలలో రసవత్తరమైన హిందోళరాగం మనకు
వినిపిస్తుంది. "మమసా గామమమ (కరుణాచూడవయా) అంటూ ప్రారంభమై. నరకుని కోపాన్ని తగ్గించడానికి
వినోదభరితంగా స్వరాల్ని జల్లించడం ఒక త్రిశ్రగతి నర్తనానికి తోడుగా ఉంటుంది. దదని-మమద-గగమ-గమగ-సా అలుకా మానవయా అన్నప్పుడు ఈ స్వరాలు త్రిశ్ర
గతిలో మధ్యమకాలంలో ఉన్నాయి. సానిద నీదమగా, నీదమ దా మగసా, సా సానీదామాగా సా - అలుకా
మానవయా అన్న త్రిశ్రగతి స్వరప్రస్తారం మూడవకాలంలో నడుస్తుంది. తరువాత తీవ్రగతి
స్వరాలలో, గమదనిసా నిదనీదమగా, సగమదనీ దమదామగసా, ఇక్కడ గమదనిసా, సగమదనీ స్వరాలు
నాలుగవకాలంలో అంటే ఒక దెబ్బకు ఆరు అక్షరకాల ప్రమాణంలో ఉంటాయి. సంగీతవైదుష్యంతో పాటు హాస్య, నాట్య, లయ
వైవిధ్యాలు ఇందులో మిళితమైనాయి. దీపావళి చిత్రంలోనె "సరియా నాతో సమరాన
నిలువగలడా"అంటూ సత్యభామ పాడే పాటను పి.లీల గళంలో హిందోళరాగంలోనే పండించారు
మాస్టారు. దనిసమగా (సరియా) సగమనిదా (నాతో) దనిసగమగసాస (సమరాన) అన్న గమకప్రయోగాలకు
సంభ్రమభావాన్ని ముడివేసి, దాటు-అవరోహణ వరసలను కలిపి కల్పించడంతో ఆ పాటలో సమరోత్సాహ
భావాలు కలిగింది.
కరుణా చూడవయా: ఆడియో
"కృష్ణప్రేమ"
చిత్రంలోని నారదగానం "మోహనరూపా గోపాల, ఊహాతీతము నీలీల" మరొక అద్బుతమైన
కృతి. "అవనిభారము అమితము కాగా" అన్న భాగంలోని ఆలాపన వినితీరవలసిన
రసఖండిక. అలాగే "మంచితరుణమురా! నారద
మించిన దొరకదురా!" (శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం) అనే నారదగానం హిందోళమేయైననూ
విభిన్నమైనదే. కలహబీజాప్తమైన ఉత్సాహనికి సరియైన భావాలొలికించే బాణీలో పాట
సాగుతుంది.
"రహస్యం" చిత్రంలో హిందోళరాగం
రహస్యం
చిత్రం, ఘంటసాల స్వరపరచిన మహోన్నత సంగీతకావ్యం. తనకు ప్రియమైన హిందోళరాగంలో ఆ
చిత్రంలోని మొదటి శ్లోకాన్ని ఆలపించారు. ఈ చిత్రంలో ఒకపాట -'ఇదియే దేవరహస్యం' మరియు
మూడు పద్యాలకు -'శ్రీవిద్యాం జగతాం ధాత్ర్రీం', "ఏనొక రాజచంద్రుడ', 'ముక్తావిద్రుమ' -
హిందోళరాగం కూర్చారు. సుశీల, లీల పాడిన ఇదియే దేవరహస్యం ఎక్కువగా వినిపించే
పంచమంతో ఇది హిందోళరాగమా అనుకొన్నా, అతి విభిన్నశైలిలో మలచిన ఈ పాట హిందోళ
రాగాధారితమైనదే. ససదా నీదగ దమమా (ఇదియే దేవరహ్యసం) అనే సంకీర్ణగమక విన్యాసంలోని
అపురూపమైన "నీదగ" ప్రయోగంతో పాట
విలక్షణంగా వినిపిస్తుంది.
హిందోళరాగంలో
శృంగార గీతాలు
"మంచిమనసులు"
చిత్రానికి కె.విమహాదేవన్ స్వరబరచగా సుశీలతో మాస్టారు పాడిన పాట "నన్ను వదలినీవు పోలేవులే" అతిమనోహరమైన స్వరసంయోజనలతో హిందోళ రాగాన్ని ఒక యుగళగీతానికి
ఎలావాడుకొన్నారో తెలుస్తుంది. పెండ్యాల స్వరపరచి పాడిన ప్రమీలార్జునీయం చిత్రంలోని
"అతి ధీరవేగాని అపురూప రమణివే జాగ్రతా జాగ్రతా" హిందోళ సుమధురగీతమై
నిలబడింది. "కలనైనా నీ తలపే" (లీల: శాంతినివాసం), "నేనె
రాధనోయి" (భానుమతి: అంతామనమంచికే), "పగలే వెన్నెలా" (జానకి: పూజాఫలం),
"పిలువకురా" (సుశీల: సువర్ణసుందరి), "రాజశేఖరా నీపై" (ఘంటసాల-జిక్కీ: అనార్కలి), "మనసేవికసించెరా" (సుశీల: అమరశిల్పి జక్కన్న),
"నీలేతగులాబి పెదవులతో" (ఘంటసాల: మాయింటిదేవత), "జీవనమే ఈ
నవజీవనమే హాయిలే" (ఘంటసాల-భానుమతి: నలదమయంతి) మొదలైనవి మరువలేని మధురగీతాలే.
హిందోళరాగంలో పద్యాలు
ఇక
పద్యగానంలో మాస్టారు ఎన్నో శ్లోకాలను, పద్యాలను హిందోళరాగంలో సందర్భయుక్తంగా
రసవత్తరంగా ఆలపించారు. తన స్వంత చిత్రం "సొంతవూరు" లో ఆయనే బాణీకట్టి
పాడిన అతిమనోహర ప్రకృతి వర్ణన భావాలొలికించే "స్వాగతంబోయి" సీసపద్యంలో
హిందోళరాగ స్వరమధురిమ గంగాతరంగ నాట్యానందభావాన్ని స్ఫురిస్తుంది. అలాగే "పాదుకాపట్టాభిషేకము" చిత్రంలోని
ప్రారంభిక వాల్మీకి స్తుతియించిన కందపద్యం "రామయను దివ్యనామము" నిండుభక్తితో
ఎదలో మెదలే హిందోళానుసంధానం. "శ్రీకృష్ణాంజనేయ యుద్ధం" చిత్రంలోని "ఏదేవిసౌందర్య", "శాంతినివాసం"లోని "లావొక్కింతయులేదు".
"జయసింహ" చిత్రంలోని స్వాప్నిక దృశ్యమైన సుభద్రార్జున ఇతివృత్తంలో
"కృతక యతికి పరిచర్యకు", "దేవాంతకుడు" చిత్రంలోని
"ఇటుప్రక్క సూర్యుడే అటుప్రక్క ఉదయించి" మరియు "భూభువర్లోకాలపురమునందున నిన్ను".
"కంచుకోట" చిత్రంలో మత్తులో ఆలపించె "ఎచటనోగల
స్వర్గమ్మునిచట ద్రించి".
"రాజకోట రహస్యం" చిత్రంలోని పద్యం "కామాంధకార కీకారణ్యమున
జిక్కి". "భీష్మ" చిత్రంలోని "ఆదిపన్నగ శయనా",
"శ్రీకృష్ణావతారం" చిత్రంలోని ఉద్యోగపర్వ సందర్భాన పాడిన చంపకమాల
"అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాతశత్రుడే అలిగిననాడు".
"శ్రీకృష్ణపాండవీయం" చిత్రంలోని రుక్మిణీకల్యాణ ఘట్టంలో ఆలపించిన
బమ్మెఱపోతన ప్రణీత, భాగవతాంతర్గత మత్తేభ వీక్రీడితం, "కనియెన్ రుక్మిణిచంద్రమండలముఖున్" అనేది శ్రీకృష్ణ రూపాతిశయముల అంగోపాంగ వర్ణనాత్మక
దృశ్యానికి శాంతమధుర స్వరవ్యాఖ్యానం.
అలాగే
స్వరబ్రహ్మ సుసర్ల స్వరపరచిన
"నర్తనశాల" చిత్రంలో ఊర్వశీప్రలోభనకు లొంగక, తన సౌశీల్యాన్ని ప్రకటించిన
అర్జునుడు, ఏకారణంగా ద్రౌపదికి ఐదుగురు భర్తలు కలిగెరో వివరించే "ఆడితప్పనిమాయమ్మ అభిమతాన", గోగ్రహణ సందర్భంలో దుర్యోధనుని మందలించి పాడిన
ఆంధ్రమహాభారతాంతర్గత సీసపద్యరత్నం "ఏనుంగునెక్కి పెక్కేనుంగుల"
హిందోళరాగంలో పద్యాలాపనచేసే విధానానికి మరికొన్ని దృష్టాంతాలు.
ఇంచుమించుగా
మాస్టారు స్వర సారధ్యం చేపట్టిన అన్ని
చిత్రాల్లోను హిందోళరాగ ఏదో ఒక రూపంలో గోచరిస్తుంది.
"పాదుకాపట్టాభిషేకం" లోని ప్రథమ శ్లోకం "రామయను దివ్యనామము",
"శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం" లోని "జయజయ శ్రీమన్నారాయణా" అన్న
రాగమాలికాభాగం "దానమడిగి మూడగులనేల బలిదానవునణచిన వామనావతార", అలాగే, "వాల్మీకి"
చిత్రంలోని "శ్రీరామాయణ కావ్యకథా" (రావణరాఘవ సమరములోన చావడు
రావణుడెంతటికైన), "రహస్యం" చిత్రంలోని గిరిజాకల్యాణం రాగమాలికలలో "సామజసాగమ సాకార", "పాండవనవాసము" చిత్రంలో భీమాంజనేయులు కలసిన సన్నివేశంలో
భీముడు ఆంజనేయుని హృదయుమున శ్రీరాముని గాంచినంత పాడిన శ్లోకం "శ్రీరామచంద్రం
శ్రితపారిజాతం" ఇవన్నీ హిందోళ సందోహమే.
నాట్య సన్నివేశాలలో హిందోళరాగం
"గుండమ్మ
కథ" చిత్రంలో ఎల్.విజయలక్ష్మి నృత్యానికి మాస్టారు సృజించిన వాద్యసంగీతంలో
మాల్కోన్స్ ఛాయ చక్కగా వినిపిస్తుంది. అంతేకాక గుండమ్మ కథ చిత్రం ఆరంభంలో పేర్లు (టైటిల్స్) పడేటపుడు నేపథ్యంలో వినిపించిన వాయిద్య సంగీతం హిందోళమే.
గుండమ్మ కథ టైటిల్ మ్యూజిక్
ఇలా ఎన్ని పాటలను ఉదహరించినా అది వొక పట్టిక ఔతుందే తప్ప, ఆ రసపట్టు పట్టడానికి పాటలను వినితీరాల్సిందే. లభ్యమైన కొన్ని హిందోళ మధురిమలను ఇక్కడ మీరు వినగలరు. మరొక ఘంటసాల ప్రియరాగ స్వరసంస్మరణంతో మళ్ళీ కలుద్దాం.
హిందోళం లో శ్లోకం: లక్ష్మీపతే నిగమ
చిత్రం: శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం
లక్ష్మీపతే నిగమ లక్ష్య నిజస్వరూప కామాది దోష పరిహారిత బోధదాయిన్
దైత్యారి మదన జనార్ధన వాసుదేవ శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్
ఓం నమో వేంకటేశాయ!
(ఈ వ్యాసరచనకు మూలస్ఫూర్తి మరియు ప్రేరణ శతావధాని
డా. ఆర్. గణేశ్ గారు. ఆయన తమ కావ్యశాస్త్ర, అవధాన, యక్షగాన, నాట్య, సాహిత్య, శిల్పాది
వివిధ క్షేత్రాలలో కర్ణాటకదేశంలో సుప్రసిద్ధులు. ఘంటసాల గళమన్నా, సంగీతమన్నా ఆయనకి
తీవ్రమైన ప్రేమానుభూతి. ఘంటసాల గురించి ఆయన తమ "రాగానురాగ" అనే సంగీత-సాహిత్య
సమన్వయ కార్యక్రమంలో ముచ్చటిస్తూ ఉంటారు. ఆయన కోరిక మేరకు ఈ సుదీర్ఘ వ్యాసలేఖనం సమకూర్చడమైనదిగాన
ఇది వారికి మా స్నేహాంజలి).
(వ్యాసములో అంతర్గతంగా లభ్యమైన పద్యాలు, పాటల ఖండికలకు లింకులు ఏర్పరచాము. గమనించగలరు.)