తిన్నడు (కన్నప్ప) మహా శివభక్తుడు. తనను బంధ విముక్తి చేయమని తనకు శివునిపై గల భక్తిని, గుండెలోని ఆర్తిని గొంతులోకి తెచ్చుకుని ఆలపించే సన్నివేశం ఎలా వుంటుందో తెలియాలంటే కాళహస్తి మహాత్మ్యం లో మాస్టారి పద్యాలు వింటే తెలుస్తుంది. పద్యాలు పాడితే ఘంటసాల గారే పాడాలి. పద్యాలు, శ్లోకాలు పాడటంలో ఒక క్రొత్త వరవడిని సృష్టించి తనకు తానే సాటి అని నిరూపించుకున్న అమర గాయకుడు ఘంటసాల మాస్టారు. ఇక్కడ కాళహస్తి మహాత్మ్యం నుండి మరికొన్ని పద్యాల వీడియో, ఆడియో, మరియు సాహిత్యం యిక్కడ పొందుపరుస్తున్నాను.
వీడియో & ఆడియో మూలం: ప్రాజెక్టు ఘంటసాల
చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)
రచన: తోలేటి
గానం: ఘంటసాల
సంగీతం: ఆర్. గోవర్ధనం, ఆర్. సుదర్శనం
స్వామీ! చంచలమైన చిత్తమిదె నీ జ్ఞానాంజనా రేఖచే
నీమంబున్ గొనె నిశ్చలత్వ మొదవెన్ నిండారు నీ భక్తిచే
కామ క్రోధ విరోధ వర్గములు చీకాకై నశించెన్, భవ
ద్ధామంబౌ రజితాద్రిచేర్చ దయరాదా కాళహస్తీశ్వరా
కాళహస్తీశ్వరా...
శ్రీకాళహస్తీశ్వరా...
ఆ..ఆ...ఆ..ఆ..ఆ
చండహుతాసు కీలికలు చయ్యన గ్రక్కుచు దండధారి మా
ర్కండునిపై మహోగ్రగతి గ్రక్కునవైచిన కాలపాశమే..
గ్రక్కునవైచిన కాలపాశమే
తుండెములై, పఠాలుమని తూలిపడెన్, నిను నమ్మువారికీ
దండనలేమి లెక్క, రజితాచలవాస మహేశా! ఈశ్వరా!...ఆ..ఆ
ధన్యుడనైతిని దేవదేవా (2)
ఎన్నడైన మరువనయ్య పాద సేవా
ఎన్నడైన మరువనయ్య నీ పాద సేవా
పాహీ శంకరా! మాం పాహీ శంకరా!
మాం పాహీ శంకరా!
పాహిమాం పాహీ శంకరా!
కృతజ్ఞతలు: సాహిత్యం యొక్క ప్రతులు అడగకుండానే అందించిన శ్రీ కొల్లూరి భాస్కర్ (ఘంటసాల సంగీత కళాశాల సంచాలకులు, హైదరాబాద్) గారికి.
కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం. ఘంటసాల మాస్టారు పరమ శివునిపై చాల పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడారు. ప్రతి వొక్క పాట, పద్యం రుద్రునికి సమర్పించే మాలలో రుద్రాక్షల వంటివి. కన్నడ రాజ్ కుమార్ కన్నప్ప (తిన్నడు) గా నటించిన "బేదర కన్నప్ప" ఆయన నటజీవితాన్ని మలుపు తిప్పింది. అదే చిత్రాన్ని తెలుగులో కాళహస్తి మహత్యం (1954) గా డబ్ చేసారు. ఇందులో మాస్టారు పాడినవన్నీ ఆణిముత్యాలే. ముందుగా ఈ దండకం "జయ జయ మహాదేవ శంభో" యొక్క సాహిత్యం యిక్కడ పొందు పరుస్తున్నాను. ముందు ముందు మరికొన్ని. ఇందులో చాల మట్టుకు పద్యాలు. అయితే ఈ పద్య రూప నిర్మాణంలో సూచనలుంటే తెలుపగలరు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com