"సలలిత రాగ సుధారస స్ఫూర్తి", తెలుగు చిత్ర సీమలో సజీవమూర్తి, "స్వర బ్రహ్మ" శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు క్రొత్త గాయనీ గాయకులను ప్రోత్సహించి, పాడించేవారు, వారి మాతృ భాష తెలుగు కాకపోయినా సరే. సుసర్ల వారి మరొక మరపురాని బాణీ 1955 లో విడుదలైన సంతానం చిత్రంలో హిందీ చిత్ర రంగానికి చెందిన ప్రముఖ గాయని, భారతరత్న శ్రీమతి లతా మంగేష్కర్ పాడిన నిదురపోరా తమ్ముడా పాట. లత గారు ఒక ఆంగ్ల చిత్రానికి పాడటానికి వచ్చినపుడు, సంతానం చిత్ర నిర్మాత, దర్సకులైన రంగనాథ దాసు గారు ఆమెతో తెలుగు పాట పాడించమని కోరగా తాను "నిదురపోరా తమ్ముడా" పాటను పాడించినట్లు శ్రీ సుసర్లగారు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. ఈ పాటను శ్రీమతి లత గారు సోలోగా పాడారు. ఇది లతగారి మొదటి తెలుగు చిత్ర గీతం. అయితే చిత్రీకరణలో చిత్రం రెండవ సగంలో ఘంటసాల గారి చరణంతో కలసి యుగళ గీతంగా వినిపిస్తుంది. కొన్ని పరిస్థితుల కారణంగా చిన్నప్పుడు విడిపోయిన తోబుట్టువులు ఒకరికొకరు దూరమై, తిరిగి చిన్ననాటి పాటతో గుర్తు పట్టి కలుస్తారు. సంతానం చిత్రంలో మాస్టారు కొన్ని పద్యాలు (పోకన్ మానదు, బావా ఎప్పుడు వచ్చితీవు మొదలయినవి), నాలుగు పాటలు పాడారు.
ఘంటసాల లతా మంగేష్కర్ |
చిత్రం: సంతానం (1955)
రచన: అనిసెట్టి-పినిసెట్టి
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
లతా: ఊ... ఊ... ఊ...
నిదురపో... నిదురపో... నిదురపో (2)
నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా
నిదురలోన గతమునంతా నిముషమైనా మరచిపోరా | నిదుర |
కరుణలేని ఈ జగాన కలత నిదురే మేలురా
నిదురపోరా తమ్ముడా
ఘంటశాల : ఆ..ఆ..
కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే.. ఆ.. | కలలు |
లేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే
నిదురపోరా తమ్ముడా ఆ.. ఆ..
జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే.. | జాలి |
చితికిపోయిన జీవితమంతా చింతలో చితియాయె
నీడచూపే నెలవు మనకు నిదురయేరా తమ్ముడా
నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా