రాగావిష్కరణకు మరియు రసావిష్కరణకు ఘంటసాల పెట్టింది పేరు. మాస్టారు ఇటు కర్నాటక సంగీతంలోను అటు హిందుస్తానీ సంగీతంలోను కూడ బాణీలు కట్టారు మరియు తన అద్భుత గాన ప్రతిభతో పలు సినీ కవుల, ప్రబంధ కవుల సాహిత్యానికి ప్రాణం పోసారు. ఇదివరలో కొన్ని ప్రసిద్ధ రాగాలైన మలయమారుతం, ఆరభి, సామ, శుద్ధ సావేరి, చారుకేశి, దేశ్, నాటకప్రియ, పటదీప్, పంతువరాళి, హిందోళం మొదటి భాగం మరియు హిందోళం రెండవ భాగం, ఫరజు, విజయానంద చంద్రిక, సింహేంద్ర మధ్యమం మొదలయిన రాగాల గుఱించి మిత్రులు చంద్రమౌళి గారు చక్కని వ్యాసాలు అందించారు. ఈ సారి మరొక జనరంజకమైన రాగం షణ్ముఖప్రియ గురించి, ఆ రాగంలో మాస్టారు ఆలపించిన పాటలు పద్యాల గురించి తెలుసుకుందాం. మరి రాగశాలలోకి అడుగు పెడదామా?
మానవుడు జీవిత సంఘర్షణలో నలిగేవేళ, ఏంచెయ్యాలొ తెలియని సంధిగ్ధతలో ఉన్నప్పుడు కర్తవ్యమేమిటి? జీవితం సమరం గాక,
సార్థ సోపానముగా మలచుకొనట ఎలా? అందుకు మన శాస్త్ర్రాలు మూడుమార్గాలను చూపుతాయి. జ్ఞానపరమైన
నిత్యానిత్య వివేకము, కర్తవ్య నిర్వహణ మరియు దైవభక్తి. అయితే దైవభక్తికి గుడి, ఫల, పుష్ప, గంధ, కర్పూర, దీప,
ధూప, నైవేద్యాలు కావాలి. ఆ ప్రకియలో దేహము, మనస్సు, బుద్ధి మూడూ చేరినప్పుడే భక్తిపారవశ్యం కలుగుతుంది.
ఇవన్నీ లేకుండా రెప్పపాటులోనే భక్తి కలగాలంటే, మనస్సునొక చోట నిలుపగలగాలి. అదే కదా భక్తి.
"హే కృష్ణా ! ముకుందా...." అని తారాస్థాయిలో ఘంటసాల గళం వినగానే మనస్సు అక్కడే హత్తుకుపోయి
నిలబడునుగదా! గాయకునికి అంతటి తీవ్రభావము లేకపోతే ఆ పరిణామం సమకూరేనా! పద్యశ్లోకాలాపనము, వచనప్రవచనము, శాస్త్రీయగానము, ఏకగళ భావగీతమధురిమలు, రసగుళికలు కూర్చిన యుగళగీతములు,
భక్తిపాటలు మొదలగు ఈ ఆరువిధముల గాన ప్రక్రియలను పలికించగల షణ్ముఖమైన గళమంగళుడు ఘంటసాల. 'కోరికలతీర్చేటి కొంగుబంగారమైన'
తిరువేంకటాధీశుని, 'కరుణనేలగరావె కమలేశా’ అంటూ షణ్ముఖప్రియరాగంలో ఆలపించి, పిలిచినంతనె ఆ గాయక శిఖామణిని తన ఆస్థానవిద్వాంసుడుగానే రమ్మన్నాడు ఆ శేషాద్రివాసుడు. 'స్థాన బలిమి నీది, నీ ఆస్థానబలిమినాది, దేవస్థానమాయె
హృది’ అన్న మంగళంపల్లి బాలమురళికృష్ణ వాగ్గేయం, అచ్చంగా ఘంటసాలకు అన్వయిస్తుంది.
"ఆయన చాలబాగా క్లాసికల్ పాడేవారు. ఆకాశవాణిలో ఒకరోజు తోడిరాగాన్ని ఆలాపనజేసి
'అంబా నాపై' కీర్తన పాడారు. 'ఎవరో ఆంధ్రా అబ్బాయట! ఎంత బాగ క్లాసికల్ పాడుతున్నాడు' అంటూ
ఆకాశవాణి ఆఫీసులో మేమందరూ మేచ్చుకున్నాం, 'నేను విన్నాను' అంటారు ఏ. పి. కోమల".
"అప్పట్లో నేరు ప్రసారమే తప్ప, టేపులూ అవీ లేవు, స్టుడియోకి వచ్చి,
పాడి, తిరిగి కారులోవెళ్ళిపొవటమే". "ఎందుకో ఆయన
అంతబాగ పాడుతున్న క్లాసికల్ వదిలేసారు" అంటు కోమలగారు చెబుతుంటే, మనకు లభ్యంలేని
ఆ వినికిడి, గాలిలో కలిసిపోయిన ఆనాటి ఘంటసాల శాస్త్రీయగానం నిరాశగానే మిగులుతుంది. శాస్త్రీయ సంగీతంపై అంతటి అవగాహన, ప్రావీణ్యత ఆయన
గానపద్ధతిలో, బాణీకట్టడంలో, ఏ గొంతులో ఏసంగతులు పలుకుతాయో తెలిసి పాడించటంలో 'లవకుశ’
లాంటి సినిమా మనకు కనబడే ఒక చక్కని ఉదాహరణ.
ఘంటసాలకు ప్రియమైన రాగాలలో షణ్ముఖప్రియ ఒక ప్రముఖరాగం. తన భగవద్గీతాగానంలో ఆలపించిన
రెండు శ్లోకాలు "త్రివిధం నరకస్యేదం" (16-21) "యః శాస్త్రవిధిముత్సృజ్య"
(16-23) షణ్ముఖప్రియరాగనిబద్ధము. స్వీయ సంగీత
దర్శకత్వంలో "సతి అనసూయ (1957)" చిత్రానికై పాడిన " ఉదయించునోయి నీ జీవితాన" చిన్నపాటైనా షణ్ముఖరాగరసపాకం.
ఎన్నో చిత్రగీతాలకు మూలమైనది నఠభైరవిరాగం. ఆ రాగంగురించి రాస్తే ఒక చిన్న పుస్తకమే
ఔతుంది. రాగశాలలో ఏదో ఒక రోజు అది కనిపించవచ్చు. ఆ నఠభైరవిరాగం యొక్క ప్రతిమధ్యమ రూపమే
షణ్ముఖప్రియ. షణ్ముఖప్రియ రసవంతమైన 56వ మేళకర్త రాగం. ప్రతిమధ్యమ రాగాలలో ప్రసిద్ధమైనవి
కళ్యాణి, కామవర్ధిని, పూర్వికళ్యాణి, సింహేంద్రమధ్యమం మరియు షణ్ముఖప్రియ. కళ్యాణి,
కామవర్ధినుల తరువాతి స్థానం షణ్ముఖప్రియరాగానిదే అనవచ్చు. భావరస ప్రకటన ప్రస్ఫుటంగా
విలసిల్లే వ్యక్తిత్వమున్నరాగమిది. స్వరస్థానాలు, 'స-ప'లు గాక, చతుశ్రుతిరిషభము, సాధారణగాంధారము,
ప్రతిమధ్యమము, శుద్ధ ధైవతము, కైశికి నిషాదము ఉంటాయీ రాగంలో. కరుణ, భక్తి, శాంత రసాలను రంజింపజేయు రాగమిది.
రాగం-తానం-పల్లవి, రాగమాలికలు, శ్లోకాలాపనలకు తగినరాగం షణ్ముఖప్రియ. ఉత్తరాంగ ప్రధానమైన ఈ రాగంలోని గాంధార స్వరంలో గ్రహభేదం చేస్తే శూలిని, పంచమంలో ధేనుక, దైవతంలో చిత్రాంబరి రాగాలు వస్తాయి.
వేంకటముఖి సంప్రదాయంలో ఈ రాగం పేరు "చామరం". దీక్షితుల "మహాసురం",
పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్ కృత "మరివేరె దిక్కెవరయ్య రామ", ముత్తయ్య భాగవతార్
వారి "వల్లీ నాయకనే" ప్రసిద్ధమైన కృతులు. త్యాగరాజస్వామి ఈ రాగంలో కృతులను
రచించకపోవడం గమనార్హం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ
ఈ రాగంలో రచించిన "ఓంకార ప్రణవ"
వర్ణం, "సదా తవపాద సన్నిధిం కురు" అను కీర్తన మనోహరమధురంగా చాలా ప్రసిద్ధిగాంచినవి.
షణ్ముఖప్రియ మనోబుద్ధులను సంక్రమించి వెలిగి గాయకుని కల్పనలకు పదునుపెట్టే రాగం.
భక్తి, శృంగార, కరుణ, అద్భుత, హాస్య భావాలను వెదజల్లే ప్రముఖ రాగం. మనోధర్మ సంగీతానికి
మధురమైనదిది. ఆలాపనలకు ఆణిముత్యం. రాగం తానం పల్లవికి రారాజు. ఇందులోని అన్నిస్వరాలూ
జీవస్వరాలే. పదనీస ప్రయోగంలో- నిషాద దీర్ఘంతో వీనులవిందు కలిగిస్తుంది. రి, ప, ని న్యాసస్వరాలై 'సగరిగమప, మపదనిదస, దపదస,
సమపనిస, మపగగరిస’ వంటి విశేష ప్రయోగాలతో త్రిస్థాయిలోనూ రంజిల్లే రాగమైనా 'ఘన'రాగ కీర్తికి
ఎందూకో నోచుకోలేదు. షణ్ముఖుడు, అనగా సుభ్రహ్మణ్యస్వామికి ప్రియమైన రాగం. అతడే ప్రియపుత్రుడైన
అమ్మవారికీ ఈ రాగమంటె మక్కువ.
ఘంటసాల స్వరకల్పనజేసి పాడిన ఉదయించునోయి (సతి అనసూయ- 1957) కరుణరసాన్ని కురిపించే
పాట. ఉత్తరాంగ ప్రధామైన స్వరాలలో తారకంలోనె ప్రారంభమై, దుఃఖితులకు, ముందున్న మంచిదినాల
ఆశ్వాసను కలిగించే 'ఉదయించునో...యి' ఆ ..నో...యి" పలుకుల గమకప్రయోగం గమనీయము.
ఈ భావంలోనే, స్వీయదర్శకత్వంలో ఆలపించన పాట పుణ్యవతీ ఓ త్యాగవతి (సతీసుకన్య
1959)
ఘంటసాల గళంలో ఇంతకుముందే సుసర్ల దర్శకత్వంలో వెలుబడిన దేవి శ్రీదేవి (సంతానం
- 1955), షణ్ముఖప్రియరాగంలో ఆయన ఆలపించిన మొదటిపాట అనవచ్చునేమో.
'తిరువేంకటాధీశ జగదీశ' (ప్రైవేట్ ఆల్బం): బహుప్రజాదరణపొందిన భక్తిరసభావఖండిక