"కొండగాలి తిరిగిందీ..గుండె ఊసులాడింది", ఇది 1965 లో అనుపమ చిత్ర పతాకంపై విడుదలైన "ఉయ్యాల-జంపాల" చిత్రం కోసం ఆరుద్ర గారు వ్రాయగా, దీనిని చక్కని మలయ మారుతం అనే రాగంలో బాణీ కట్టారు శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారు. మలయం అంటే కొండ, మారుతం అంటే గాలి, ఆవిధంగా మలయమారుతం అంటే కొండగాలి. ఆ స్ఫురణతోనే పెండ్యాల గారు ఈ పాటను మలయమారుత రాగం లో కట్టారా? వాగ్గేయకారులు శ్రీ అన్నమయ్య కూడ ఉయ్యాలకు, మలయమారుతానికి జత కలిపి "లాలనుచు నూచేరు లలనలిరు గడలా" అన్న కీర్తనలో "మలయమారుత గతులు మాటికి చెలంగ" అన్నారు. ఇక "కొండగాలి తిరిగింది" పాటకొస్తే, దానిని అద్భుతంగా గానం చేశారు ఘంటసాల మాస్టారు, శ్రీమతి పి. సుశీల గారు. శ్రీ కె.బి.తిలక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హిందీ మాతృక "ఝూలా". ప్రముఖ సినీనటి జయప్రదను భూమికోసం చిత్రం ద్వారా పరిచయం చేసినది తిలక్ గారే. "ఉయ్యాల జంపాల" చిత్రంలో అన్ని పాటలు ఆరుద్ర గారు వ్రాసారు. "కొండగాలి తిరిగింది" ఎవర్ గ్రీన్ పాట. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని వుంటుంది. ఈ పాటను శ్రీ జగ్గయ్య, శ్రీమతి కృష్ణకుమారి లపై చిత్రీకరించారు. ఈ చిత్రంలోనే మాస్టారు పాడిన ఏకగళ గీతం "ఓ! పోయేపోయే చినదానా" మరియు సుశీలతో పాడిన "దాచిన దాగదు వలపు" కూడ చిరపరిచితాలే. శ్రీరాముని పైన సుశీల గారు, బృందం పాడిన "అందాలా రాముడూ ఇందీవర శ్యాముడూ" చాల ప్రసిద్ధి పొందిన పాట. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారొక పాట పాడారీ చిత్రానికి. ఇక రాగానికొస్తే..
ఘంటసాల గారు ప్రైవేటు గీతాలలో సుమనోహరంగా ఆలపించిన “రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్ (ప్రభాతి)” అనే ఉత్పలమాలలో సౌకుమార్య శృంగార రసాన్ని వెల్లడించి, “లేవయ్య శ్రీహరి గోవింద లెమ్ము నిదుర” అనే వేంకటేశ్వర సుప్రభాత ప్రార్థనలో సాత్విక-దైవీక భావాలనొలికించి, "రహస్యం" చిత్రంలో గుమ్మడి గారికి ప్రాతః పూజాలాపనగా పాడిన శ్లోకం “షడాననం చందన లిప్తగాత్రం” నందు రాజస భక్తిభావాన్ని వెదజల్లి, భగవద్గీత యందు ఆత్మసంయమ యోగాన్ని గానంచేస్తూ "సర్వభూతస్థమాత్మానం" (6-26), "అసంశయం మహాబాహో" (6-35), "యోగినామపి సర్వేషాం" (6-47) అని స్వాంత మెరిగినవాడు, అభ్యాస వైరాగ్యములచేత మనోనిశ్చలతను సాధించే బోధనాన్నిచ్చి, ఈ రాగాన్ని పద్య గాన పద్ధతిలో రస వైవిధ్యంతో చిరస్మరణీయం చేశారు. ఒక్క మలయమారుత రాగంలో ఇన్నివిభిన్న భావాలా! ఇదొక అద్భుతం. ఏరాగమందైన నవ రససృష్టి చేయగల ప్రతిభ ఆ స్వరబ్రహ్మకే సాధ్యం. “పాండవవనవాసం” లో ధర్మరాజు చేసే సూర్యస్తోత్రం భాగం “అరుణాయ శరణ్యాయ” ఇదే రాగంలో ఘంటసాల గారు స్వరపరచగా శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శ్రవణానందకర గానం వెనుక, మాస్టారి పద్యగాన విధానముద్ర ఒక అపూర్వ సృష్టి. అంతేకాక, సాలూరివారు స్వరసారధ్యం వహించిన “భక్త ప్రహ్లాద” లోని "జీవము నీవే కదా!" పాటలో “భవజలధినిబడి” అను చరణాన్ని ఈ రాగంలోనే స్వరపరిచారు. ఈ శీర్షికలో మలయమారుత రాగంలో ఘంటసాల గారు ఆలపించిన, పైన పేర్కొన్న పద్యశ్లోకాలను, అభిమాన రాగరసికులు మరియు సంగీతాభ్యాసులు ప్రత్యేకంగా వినగలరు. రాగస్వరూపాన్ని సాంకేతికంగా సూచించే ఈ పద్యమాలకు “వీరాభిమన్యు” చిత్రంలోని "యదాయదాహి ధర్మస్య" (4-7) చరమ శ్లోకంతో ముగింపు. ఈ రాగమూలమైన ఇక్కడ పేర్కొనని ఎన్నో పాటలు, పద్యాలు ఉన్నవి.
మలయమారుతం ఆడియో సంకలనం: శ్రీ ఎం.ఆర్.చంద్రమౌళి
సత్వగుణ, శాంత మరియు కరుణరస భావాలకు ప్రాణంపోసి ఎన్నో పాటలను మనకు అందించిన ఘంటసాలగారు, మలయమారుత – చక్రవాక - వలజి రాగాల్ని, స్వీయ సంగీత దర్శకత్వంలో వివిధ సంధర్భాల నేపథ్యంలో కూర్చి రసపోషణ చేశారు. శాస్త్రీయ సంగీత కృతులలో త్యాగరాజస్వామి వారి “మనసా ఎటులోర్తునె” మలయమారుత రాగ లక్షణానికి ఒక ప్రఖ్యాత నిదర్శనమైతె, లలిత సంగీతంలో బహు జనాదరణ పొందిన పాట “కొండగాలి తిరిగింది” ఈ రాగాలాపనకు ఒక మణిదర్పణం. సినిమా పాటల వెనుక సంగీత స్వారస్యాన్ని పంచుకోవడమే మా ధ్యేయం గాని, రాగలక్షణాలను అభ్యాసంచేయడానికి శాస్త్రీయమార్గమే శరణ్యమని విజ్ఞులకు మనవిచేయనక్కరలేదు.
“కొండగాలి తిరిగింది” ఈ పాట విన్నంతనే మనకు తెల్లవారివేళల ఆహ్లాదం, ఉషోదయకాలపు కొత్తభావాల తుషార బిందువులు, ప్రకృతిమాత దర్శన ధన్యతను ప్రతిబింబించే రమణీయ ఉల్లాసభావాలు స్ఫురిస్తాయి. కొండవాగులూ, నదీతరంగాలూ, అటునిటు సాగే నావలూ మన మనః పటలంలో వచ్చిపోతుంటాయి. పాట ప్రారంభంలోనే ఇంపుగా వినిపించే జానపద తంత్రీ వాయిద్యం జారుగమకాలతో.. (సా సా సా స స) షడ్జమంలో ఈత కొట్టినట్టు గ్రామీణపాటల చిరుఛాయతో, మధుర సరాగాలశాలను పెండ్యాలగారీ మలయమారుతంలో అందించారు. వాయిద్యాల ఎంపిక, వాడిన ధాటి పాట మొత్తం జానపదీయమైతే, ఘంటసాలగారి కంఠం, జానపద-లలిత-శాస్త్రీయ రీతులన్నీ మేళవించి, క్రమంగా గోదావరి వరద పొంగులై, పాలపిట్టను పాడించి, కన్నెలేడిని ఆడించి, ప్రాప్తమున్న భావనా తీరానికి మమ్మల్ని చేరుస్తుంది.
పంచమంతో ప్రారంభించి, ..పా ద నీ స స సా స స…. సనిని (కొండగాలి తిరిగింది) అని పై షడ్జమం తాకి, ని స స స నీ దా నిద ప (గుండె ఊసులాడింది) అంటూ పంచమంలో ఊగిసలాడి, సా స స స నిదప పాగ దనిద పదప గపగరిస (గోదావరి వరదలాగ కోరిక చలరేగింది) అంటూ ఎగిసిపడే "దనిద-పదప-గపగ" – దాటు ప్రయోగాల అలలు లేచి అణగే నదీ తరంగాలవంటి కోరికలను ఘంటసాలగారి ప్రకంపిత గమకాలు సంకేతించడం గమనీయం. పా..గరి సరి సా.. సరి రిగ పా గరి గరి సా (ఆ… పంచమంలో నిలిచే స్థాయీభావం ముదావహం). హృదయభావస్పందనా కెరటాలపై తేలి, పల్లవి మళ్ళీ షడ్జమంలో లయిస్తుంది. పంచమంతో చరణాల నుడికారం చుట్టి, ప ద ని ద నిసససాస సరిగరి గపగరిసా… (పుట్టమీద పాలపిట్ట పొంగిపోయికులికింది..), నిససస నిదప దపగ పదప దపగ పగ గరి స (గట్టుమీద కన్నలేడి గంతులేసి ఆడింది)… అంటూ మాస్టారితో సహగాయిని శ్రీమతి పి.సుశీల గారి గళంలో ధ్వనించిన అకారాల ఆలాపనతో స్పందించడం సువర్ణపుష్పానికి పరిమళం తోడయినట్టే. ఇలా సాగే పాటను వినాలే తప్ప వివరిచడం సాధ్యమా!
_________________________________________________________________
*అనగా ఆరుస్వరములు (Hexatonic) గలిగి, జనకరాగము (చక్రవాకం) లో గల స్వరాలు తప్ప అన్య వికృతి స్వరాలు లేని రాగం. సర్వకాల గానార్హమైన చక్రవాక రాగంలో ’మ’ తొలగిస్తే ఉదయరాగమైన ’మలయమారుతం’ వస్తుంది. చక్రవాక రాగానికి ప్రతిమధ్యమరాగంగా నిలిచే రామప్రియ రాగంలో ’మ’ తీస్తే వచ్చేదికూడ మలయమారుతమే. మలయమారుతంలో ’రి’ తొలగించినచో వచ్చే రాగం వలజి. (హిందుస్తానిపద్ధతిలో ఇది రాత్రి రాగమైన కళావతి - చక్రవాకానికి సమీపమైనది ఆహిర్ భైరవ్ రాగ జన్యం ).
రచన: ఆరుద్ర
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
గానం: ఘంటసాల, పి.సుశీల
ఆడియో మూలం: ఓల్డ్ తెలుగు సాంగ్స్.కాం
పల్లవి: | ఘంటసాల: | కొండగాలి తిరిగిందీ.. |
కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది.. | ||
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది.. | ||
ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ | ||
చరణం: | ఘంటసాల: | పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ.. |
సుశీల: | ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ | |
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది.. | ||
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది.. | ||
సుశీల: | ఆ..అఆ..అఆఆ అఆ | |
చరణం: | ఘంటసాల: | పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది.. |
సుశీల: | ఆఆ.. ఓ..ఓ.. అఆ..అఆఆ.. | |
ఘంటసాల: | పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది.. | |
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది.. | ||
సుశీల: | కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది.. | |
ఘంటసాల: | ఆ..ఆ..ఆ..ఆ.. | |
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది.. | ||
ఇద్దరు: | ఆ..అఆ..అఆఆ అఆ | |
ఘంటసాల: | మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయిందీ..ఈ..ఈ.. | |
ఘంటసాల: | మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది.. | |
నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది.. | ||
సుశీల: | ఆ..ఆ..ఆ. ఆ..ఆ..అఆ ఆఆఆఆ.. | |
ఘంటసాల: | పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చిందీ..ఈ.. | |
సుశీల: | ఆ..ఆ..ఆ. ఆ..ఆ..అఆ ఆఆఆఆ.. | |
ఘంటసాల: | పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది.. | |
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది.. | ||
ఘంటసాల: | కొండగాలి తిరిగింది .. గుండె ఊసులాడింది | |
సుశీల: | ఆ..ఆ..ఆ..ఆ.. | |
ఘంటసాల: | గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది.. | |
ఇద్దరు: | ఆ..అఆ..అఆఆ అఆ |
కృతజ్ఞతలు: ఆడియో ఫైలు సమకూర్చిన ఓల్డ్ తెలుగు సాంగ్స్.కాం బ్లాగుకు, సాంకేతిక వివరాలు అందించిన ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగులకు, చిత్ర విశేషాలు సమకూర్చిన వికిపీడియా (తెలుగు) వారికి, యూ ట్యూబ్ వీడియో సమకూర్చిన trinidad526, ఘంటసాల రాగశాల నిర్వాహకులు, ప్రియ మిత్రులు శ్రీ చంద్రమౌళి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.