తెలుగు చలన చిత్రసీమలో అలనాటి మేటి గాయకులు మాధవపెద్ది సత్యం. మాధవపెద్దిగా అందరికీ పరిచయం. మాధవపెద్ది అనగానే వివాహ భోజనంబు (మాయాబజార్), సరదా సరదా సిగరెట్టు (రాముడు-భీముడు), భలే ఛాంసు లే (కులగోత్రాలు) పాటలు గుర్తురానివారుండరు. 'బంగారు పాప' చిత్రం కోసం ఆయన పాడిన 'తాధిమి తకధిమి తోలు బొమ్మా' ఒక విలక్షణమైన గీతం. మాధవపెద్ది ఎందరో హాస్య నటులకు ఎక్కువగా కొసరాజు వ్రాసిన పాటలు పాడారు. అయితే వైవిధ్యమైన పాత్రలు ధరించినట్టి నటయశస్వి యస్వి రంగారావుకు మాయా బజార్ చిత్రం లో ఘటోద్గచుని పాత్రకు ఆయన పాడిన వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనే పింగళి నాగేంద్ర రావు రచించిన పాట తలమానీకమైనది అనడం లో అతిశయోక్తిలేదు. పింగళి తన రచనలో షడ్రసోపేతమైన పెళ్ళి వంట ఎలా వుంటుందో బూరెలు, గారెలు, అప్పళాలు, దప్పళాలు, పాయసాలు, లడ్లు, జిలేబీలు, అరిసెలు ఒకటేమిటి సమస్తం వడ్డించాడు మనకి ఎప్పటికీ మరచి పోకుండా. అంతే కాకుండా పద ప్రయోగం చూస్తే మూడు చరణాలలో చక్కని ప్రాస కనపడుతుంది. ఎలా అంటే - గారెలల్ల, బూరెలిల్ల, అరిసెలుల్ల, నాకె చెల్ల; లందు, ఇందు, ముందు, విందు; అప్పళాలు, దప్పళాలు, పాయసాలు, చాలు. బలేగా వుంది గదా తెలుగు సొగసు. ఈ చిత్రానికి రంగులు అద్దితే పిండివంటల గురించి ఇంకా చెప్పాలా! ఈ సన్నివేశానికి యస్వీఆర్ అద్భుత నటన, మార్కస్ బార్ట్‌లీ ట్రిక్ ఫోటోగ్రఫీ అపూర్వం. పాత్రకు తగిన నవ్వును పాటలో జోడించి మాధవపెద్ది ఈ పాటను అజరామరం చేశారు. ఇది కలం-గళం-స్వరం సమ్మిళితం చేసి నట, దర్శక, ఛాయా చిత్ర ముద్రణకు విజయ సంతకం గా నిలిచింది.
ఆడియో మూలం: వీడియో నుండి
చిత్రం:
మాయాబజార్ (1957)
రచన:
పింగళి నాగేంద్ర రావు
సంగీతం:
ఘంటసాల వేంకటేశ్వర రావు
గానం:
మాధవపెద్ది సత్యం
హహ్హహహ్హహహ్హహా..
వివాహభోజనంబు అహ్హహ ఆ.
పల్లవి:
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హోహ్హొ నాకె ముందు
| వివాహ |
అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహ
చరణం:
ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల
| ఔరౌర |
ఓహ్హోరె అరెసెలుల్ల హహహ్హహహ్హహా
ఇయెల్ల నాకె చెల్ల
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహోహ్హొ నాకె ముందు
అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహ
చరణం:
భళీరె లడ్డులందు పప్పేణి పోణి ఇందు
| భళీరె |
భలే జిలేబి ముందు హహహ్హహహ్హహా
ఇయెల్ల నాకె విందు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహోహ్హొ నాకె ముందు
అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహ
చరణం:
మఝారె అప్పళాలు పులిహోర దప్పళాలు
| మఝారె |
వహ్వారే పాయసాలు హహహ్హహహ్హహా
ఇవెల్ల నాకె చాలు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహోహ్హొ నాకె ముందు
అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహ
అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహ
కృతజ్ఞతలు: వీడియో భాగములను పొందుపరచిన యూ ట్యూబ్ వారికి, పోస్ట్ చేసిన షాలిమార్ సాంగ్స్ మరియు షాలిమార్ సినిమా వారికి, సమాచారమును పొందుపరచిన వికి పీడియా వారరికి ధన్యవాదములు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com