1963 లో జూపిటర్ సంస్థ శ్రీ సి.ఎస్.రావు దర్శకత్వం లో నిర్మించిన చిత్రం "వాల్మీకి". ఇందులో శ్రీ ఎన్.టి.ఆర్. టైటిల్ పాత్ర పోషించారు. ఇతర నటులు కె.రఘురామయ్య, రాజసులోచన, రాజనాల గార్లు. ఘంటసాల మాస్టారు వాల్మీకి చిత్రానికి చాల పాటలు, శ్లోకాలు గానం చేశారు. ఈ చిత్రంలో ఎక్కువగా విన్న పాట "అనురాగమిలా కొనసాగవలే" ఘంటసాల, సుశీల పాడిన యుగళగీతం. ఈ చిత్రం కోసం మొత్తం రామాయణాన్ని చక్కని పాటగా వ్రాసిన వారు శ్రీ సముద్రాల రాఘవాచార్యులు గారు. ఈ చిత్రం కన్న ముందు వచ్చిన భూకైలాస్ (1958) లోని "రాముని అవతారం రవికుల సోముని అవతారం" కూడ శ్రీ సముద్రాల గారే వ్రాసారు. అయితే ఈ చిత్రంలో మరికొన్ని అదనపు చరణాలతో, వివరాలతో వ్రాసారు. సంగీతం ఘంటసాల గారేనని వింటే తెలిసిపోతుంది. ఈ చిత్రానికి దర్శకులు సి.ఎస్.రావు, నిర్మాత హబీబుల్లా.
చిత్రం: వాల్మీకి (1963)కలం: సముద్రాల రాఘవాచార్య
స్వరం: ఘంటసాల
గానం: ఘంటసాల
పల్లవి: | శ్రీ రామాయణ కావ్య కథ, జీవన తారక మంత్ర సుధా.. | |
శ్రీ రామాయణ కావ్య కథ | ||
చరణం: | తపసూ, ధర్మము వీడని వాడు తనయులులేని దశరథుడు | |
తనయుల కోరి చేసెను యాగము, దైవమొసంగెను పాయసము | ||
శ్రీ రామాయణ కావ్య కథ | ||
చరణం: | కౌసల్య, కైకేయి, సుమిత్ర యాగఫలముగ బడసిరి కొమరుల | |
రామ, భరత, లక్ష్మణ, శతృఘ్నుల (2), రఘుకుల తిలకుల వీరులా | ||
శ్రీ రామాయణ కావ్య కథ | ||
చరణం: | యాగము కావగ రాము బంపుమని దశరథునడిగెను కౌశికుడు | |
తండ్రి సెలవుగొని, తమ్ముని తోగొని రాఘవుడాతని వెంట జనే | ||
శ్రీ రామాయణ కావ్య కథ | ||
చరణం: | నారినెదురుకొను తాటక ద్రుంచి, మారీచ-సుబాహుల మదమడచి | |
చతుర్ధాటి శ్రీ రఘురాముడు ముని రాజుల దీవనలందుకుని | ||
శ్రీ రామాయణ కావ్య కథ | ||
చరణం: | రాతి బొమ్మయై రామరామయని వగచు అహల్యకు శాపము బాపి | |
మిథిలకేగి హరు చాపము విఱచి (2), జానకినేలెను రఘునాయకుడు | ||
శ్రీ రామాయణ కావ్య కథ | ||
చరణం: | సీతాపతి ధరణీపతి జేయగ జతనము జేసెను మహరాజు | |
రాముని వనులకు పంపి భరతుని ప్రభుని చేయుమనె కైకేయి | ||
సీతా, లక్ష్మణయుతుడై రాముడు విడచినాడు సాకేత పురి | ||
పుత్ర శోకమును సైపని భూపతి మూర్ఛిలి జేరెను అమరపురి | ||
రాముని దేవుని వలె పూజించి గుహుడు గంగను దాటించె | ||
చిత్రకూటమున పర్ణశాలలో చెలువతో రాముడు నివసించె | ||
భరతుడు రాముని పదముల వ్రాలి పురికి రమ్మని ప్రార్థించె | ||
ఆడితప్పనని తనకు బదులుగా పాదుకలొసగి పంపించే.. | ||
శ్రీ రామాయణ కావ్య కథ జీవన తారక మంత్రసుధ | ||
శ్రీ రామాయణ కావ్య కథ | ||
చరణం: | రఘురామునిగని శూర్పణఖ బిగి కౌగిలినిమ్మని డాసె | |
కత్తి దూసి లక్ష్మణుడా రక్కసి ముక్కూ, చెవులను గోసే | ||
హుంకరించి లంకాపతి పంపెను మారీచుని బంగారు లేడిగా | ||
దాశరథీ వెన్నాడెను లేడిని ధరణిజ తెమ్మని వేడగా | ||
హా! లక్ష్మణా! హా లక్ష్మణయను అన్న పిలుపువిని | ||
అరిగెను తోడుగ లక్ష్మణుడు | ||
బిచ్చమడిగి ముని ముచ్చు విధాన మృచ్ఛిలే సీతను రావణుడు | ||
అడ్డగించి ఎదురించి జటాయువు రెక్కలూడి భువి పడిపోయే | ||
లంకాపురిలో అశోకవనిలో సీతమ్మకు తీరని చెఱలాయే.. | ||
శ్రీ రామాయణ కావ్య కథ జీవన తారక మంత్రసుధ | ||
శ్రీ రామాయణ కావ్య కథ | ||
చరణం: | జానకి జాడలు తీయుదు నేను, వాలి జంపుమనె రవిసుతుడు | |
కిష్కింధకు నిను రాజుసేతునని బాసలు చేసెను రవికులుడు | ||
సమబలులై సుగ్రీవుడు, వాలియు సమరము జేసిరి కవ్వించి | ||
తరువు చాటున నిలచి రాముడు సరగున వాలిని వధియించె | ||
రఘుకుల తిలకుడు వానర సీమకు రవిసుతు రాజును జేసే | ||
జానకి ఉనికిని కనుగొని రమ్మని హనుమను పయనము జేసే | ||
సంబరమేసి అంబరవీధి..ఈ.. ఆ..ఆ.. | ||
సంబరమేసి అంబరవీధి అంబుధి దాటెను హనుమా.. | ||
శ్రీ రామాయణ కావ్య కథ జీవన తారక మంత్రసుధ | ||
శ్రీ రామాయణ కావ్య కథ | ||
చరణం: | తారక మంత్రము మనసున మరువని భూమిజ కాంచెను పావని | |
రాముని ముద్రిక అమ్మకు నొసగి చూడామణి తన చేతగొని | ||
పావని ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రమునకు తలవంచె, బంధించి తండ్రి ముందుంచె | ||
నీతి మాలిన రాజు దూత వాలమును కాల్పించె | ||
లంకనే కాలిచి ఎగిరి, రామచంద్రుని ముందు వ్రాలెను హనుమ | ||
కదనానికి కపులగోరి కదలినాడు దాశరథి | ||
కడలి వడకి ఎడమునీయ కట్టించెను వారధి | ||
అన్నా! యిక సీత విడువుమన్నాడు విభీషణుడు | ||
కన్నులురిమి అతని తలను తన్నినాడు రావణుడు | ||
రామచంద్రు చరణములే శరణమనె విభీషణుడు | ||
చేరదీసి లంకాపురి విభుని చేసె రఘువరుడు | ||
శ్రీ రామాయణ కావ్య కథ జీవన తారక మంత్రసుధ | ||
శ్రీ రామాయణ కావ్య కథ | ||
చరణం: | రావణ రాఘవ సమరములోన చావడు రావణుడెంతటికైనా | |
జీవ రహస్యము నెరిగిన రాముడు శరమును వదలెను రోషాన | ||
కడుపులో సుధా కలశము పగిలి పడియెను రావణుడిలపైన | ||
అతి పునీత యీ అవనీజాత అని దీవించెను హుతవరుడు | ||
సురలును, నరులును, సన్నుతిసేయ పురమును జేరే రఘూద్వహుడు | ||
సతీ సహోదరయుతుడై చల్లగ రాజ్యము చేసెను రఘువరుడు | ||
శ్రీ రామాయణ కావ్య కథ జీవన తారక మంత్రసుధ | ||
శ్రీ రామాయణ కావ్య కథ |
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో పొందు పరచిన బొల్లాప్రగడ సోమేశ్వరరావు గారికి, చిత్రం సాంకేతిక వివరాలు అందించిన ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగు కొల్లూరి భాస్కర్ గారికి, వికిపీడియా వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
*You can download this page as PDF file by clicking on the "Print Friendly" button below.