తెనాలి రామకృష్ణుడు చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన వికటకవి. విజయనగర
సామ్రాజ్యపు కవన, సాహిత్య వేదికయైన భువనవిజయంలోని అష్టదిగ్గజాలలో ఒకడైన ఆతనికి ఒక ప్రత్యేకమైన
స్థానం వుంది. ఒక సందర్భంలో శ్రీ కృష్ణదేవరాయలను శ్లాఘిస్తూ ఒక పద్యం
చెబుతాడు. ఈ పద్యంలో తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయల కీర్తిని
స్వచ్ఛతకు ప్రతీకయైన శ్వేత వర్ణం (తెలుపు రంగు) తో పరోక్షంగా వ్యక్తి,
వస్తు, వాహన విశేషాల ఉపమానాలుపయోగించి ఆరు అంశాలతో పోలుస్తూ వర్ణిస్తాడు.
అదెలాగంటే, నరసింహ కృష్ణరాయల - నరసింహ రాయల కుమారుడైన కృష్ణ దేవరాయల
(తండ్రి పేరును తనయుని పేరుకు జతచేసి చెప్పడం దక్షిణాదిన ఒక ఆనవాయితీ
కదా!) అపూర్వమైన కీర్తి ఎలా
ఒప్పిందంటే - "కరిభిద్గిరిభిత్కరి కరిభిద్గిరి గిరిభిత్కరి భిద్గిరిభిత్తురంగ కమనీయంబౌ" అని. ఇందులోని తెలుపు రంగును గలిగిన ఆరు అంశాలు పదచ్ఛేదనం చేస్తే - కరిభిత్
(1) + గిరిభిత్-కరి (2) + కరిభిత్-గిరి (3) + గిరిభిత్ (4) + కరిభిత్
గిరిభిత్ తురంగ అంటే కరిభిత్ తురంగ (5) మరియు గిరిభిత్ తురంగ (6). వీటి
అర్ధం - 1. కరిభిత్ = శివుడు (కరి = ఏనుగు; భిత్ = తునక లేక ముక్క)
గజాసురుడు అనే కరి రూపుగల రాక్షసుడ్ని ముక్కలు చేసినవాడు అయిన శివుడు
తెల్లగా వుంటాడు; 2. గిరిభిత్ కరి - గిరుల రెక్కలు త్రుంచిన ఇంద్రుని యొక్క ఏనుగు -
ఐరావతం తెల్లనిది; 3. కరిభిత్ గిరి - కరిభిత్ అంటే శివుడు, కరిభిత్ గిరి
అంటే శివుని కొండ లేక ధవళగిరి తెల్లనిది; 4. గిరిభిత్ - తెల్లనైన తళుకుమనే
వజ్రాయుధం; 5. కరిభిత్ తురంగము అంటే శివుని వాహనము అయిన నంది తెల్లనిది (తురంగము అంటే గుఱ్ఱమైనప్పటికీ వాహనము అన్న అర్ధంలో కూడ తీసుకోవచ్చును. అందువలన శివునికి వాహనము అని అనుకోవచ్చును); 6.
గిరిభిత్ తురంగము అంటే గిరుల రెక్కలను ఖండించిన ఇంద్రుని వాహనమైన
ఉచ్ఛైశ్రవము కూడ తెల్లనిది; . ఆవిధంగా - శివుడు (కరిభిత్), ఐరావతం (గిరిభిత్ కరి),
వెండి కొండ (కరిభిత్ గిరి), వజ్రాయుధం (గిరిభిత్), నందీశ్వరుడు
(కరిభిత్తురంగము) మరియు ఉచ్ఛైశ్రవము (గిరిభిత్తురంగము) అన్నీ తెల్లనివే.
తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకు, చైతన్యానికి ప్రతీక. ఆవిధంగా శ్రీ
కృష్ణదేవరాయల అపూర్వమైన కీర్తి స్వచ్ఛతకు చిహ్నమై తెల్లగా వున్నదని తెనాలి
రామకృష్ణ కవి భావము.
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956) పద్యం: తెనాలి రామకృష్ణ సంగీతం: విశ్వనాథన్-రామ్మూర్తి గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు
నరసింహ కృష్ణ రాయల
కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్గిరిభి
త్కరి కరిభిద్గిరి గిరిభి
త్కరిభిత్గిరిభిత్తురంగ కమనీయంబై!
కృతజ్ఞతలు: ఈ విశేషాలను 'తురుపుముక్క' బ్లాగు కవితాభిషేకం-4 నుండి
సేకరించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ విశేషాలు చదువుతుంటే మనసుకు ఎంతో
ఆనందం కలిగింది. అది మీతో ఇక్కడ పంచుకుంటున్నాను. దృశ్యఖండికను యూ టూబ్ లో సమకూర్చిన అన్వితా రాం కు ధన్యవాదములు.
వికట కవిత్వానికి పెట్టింది పేరు అయినఒకానొకకవి దిగ్గజం యొక్కచరిత్రను మధురమైన పద్యాలు, పాటలతో తెనాలి రామకృష్ణ (1956) పేరున తెరకెక్కించారు బి.ఎస్.రంగా దర్శకత్వంలో విక్రమ్ ప్రొడక్షన్‌స్ సంస్థ వారు. చారిత్రాత్మకమైన సంఘటనలతో, సన్నివేశాలతోకూడిన ఈ చిత్రం ద్వారా తెలుగు తనమాతృభాషకానప్పటికీ, తనకు గలమక్కువను "దేశభాషలందు తెలుగు లెస్స" అని నొక్కి వక్కాణించినశ్రీ కృష్ణదేవరాయల వంటి కవి-సార్వభౌముని గురించి, వారి ఆస్థానకవి కూటమియైన"భువనవిజయం"లోని కవిదిగ్గజాలలో రామకృష్ణుని వంటి అసాధారణమైనమరియు దేవీ వరప్రసాదియైనకవి గురించి మనకు తెలుస్తుంది.విజయనగరసామ్రాజ్యానికి సందర్శకులు గా వచ్చిననరసరాజు వంటి ఎందరో ప్రముఖకవి సత్తములను తనసమయస్ఫూర్తి తో, ప్రతిభతో భంగపరచిన వికటకవి రామకృష్ణుడు. ముఖ్యంగా ఈ చిత్రంలోని పద్యాలకు జీవం పోసినప్రతిభాశాలి, వరవడి దిద్దిన సంగీతనిఘంటువు ఘంటసాలమాస్టారి గానంఈ చరిత్రమనకళ్ళముందే జరుగుతున్నఅనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రంలో కృష్ణదేవరాయలు గా ఎన్.టి.ఆర్., వికటకవిగా ఎ.ఎన్.ఆర్. అద్భుతంగా నటించారు.ఒకరసారి ఒకపండితుడు రాయలవారు కొలువుచేసి యుండగా వచ్చి తాను కొండవీటి సీమనుండి వచ్చానని, అనవేమారెడ్డిని ప్రశంసిస్తూ తానుచెప్పిన "రాజనందనరాజరాజాత్మజులు సాటి తలపనన్నయ వేమ ధరణి పతికి, భావ భవ భోగ సత్కళాభావములను” పద్యానికి అర్ధం వివరించగలవారున్నారాయని ప్రశ్నించగా, అందుకు బదులుగా రామకృష్ణుడు తన యుక్తిని ఉపయోగించి ఆ కవిని ఓడిస్తాడు. అదీ ఈ సంఘటన.
శ్రీ కృష్ణదేవ రాయల ఆస్థానంలో గల సాహిత్య పీఠాన్ని భువనవిజయం అంటారు. రాయలు తెలుగు భాషకు ఎనలేని సేవ చేసాడు. తను రచించిన ఆముక్త మాల్యద (గోదాదేవి చరిత్ర) లో "దేశ భాషలందు తెలుగు లెస్స" అని పలికాడు. రాయల భువనవిజయంలో గల ఎనిమిది మంది కవులను "అష్ట దిగ్గజాలు" అంటారు. వారిలో ధూర్జటి కవి ఒకరు. ఇతనినే పెద ధూర్జటి అంటారు. శ్రీ కృష్ణదేవరాయల వారికి ఇతడంటే చాల అభిమానం. తన మాటలలో, కవిత్వంలో శ్లేష వాడటం ఈయనకు అలవాటు. శ్రీకాళహస్తికి చెందిన ఈ కవివరేణ్యుడు శివుని పై శ్రీకాళహస్తి మహత్మ్యం, కాళహస్తి శతకము, పలు చాటువులు రచించాడు. ధూర్జటి గురించి మరికొన్ని వివరాలు. రాయల పరిపాలన, కవితా వైభవం, శత్రు శక్తులతో పోరాటాన్ని ఘంటసాల మాస్టారి పద్యాలతో, పాటలతో అద్భుతంగా మలచిన దృశ్య కావ్యం 1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ చిత్రం. సంగీతం విశ్వనాథన్-రామ్మూర్తి.
Thanks to "tenaliramakrishnudu" for uploading the You Tube video.
ఒకపరి భువన విజయము అనే తన కవితా దర్బారులో శ్రీ కృష్ణదేవరాయలు అష్ట దిగ్గజాలతో కొలువై ఉంటాడు. రాయలు ఒకానొక దిగ్గజమైన ధూర్జటి ని స్తుతిస్తూ ఒక పద్యం అందుకుంటాడు.
స్తుతమతియైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో అతులిత మాధురీ మహిమ?
అయితే దొరికినదే సందని ధూర్జటి చీకటింటి భాగోతాన్ని బయట పెట్టాలని వికటకవి రామకృష్ణుడు వెంటనే లేచి ఈ విధంగా చమత్కారమైన సమాధానంతో పూరిస్తాడు.
ఆ.. తెలిసెన్ భువనైక మోహనో
ద్దత సుకుమార వారవనితా జనతా ఘనతాపహారి సం
తత మధురాధరోదిత సుధారస ధారల గ్రోలుటంజుమీ !
అని పూరించి దూర్జటితో "అంతేనా తాతయ్యా?" అని ప్రశ్నిస్తాడు. దానికి ధూర్జటి తేలుకుట్టిన దొంగలా "ఔనేమో మనవడా!" అని సమాధానం యిచ్చేసరికి సభ అంతా పగలబడి నవ్వుతారు. ఎందుకంటే, "వనిత" అంటే స్త్రీ, కాని "వారవనిత" అంటే వేశ్య. ఆవిధంగా వికటకవితో గిల్లి కజ్జా పెట్టుకుని గెలిచిన వారు లేరు రాయల సభలో. అందుకే అతనంటే రాయల వారికి అంత యిష్టం. ఇలాంటి సాహిత్య ప్రక్రియలు, చెణుకులు, విసుర్లు వింటుంటే మనసుకు ఎంతో ఆనందంగా వుంటుంది.
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956) సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు రచన: తెనాలి రామకృష్ణకవి వికటకవియైన తెనాలి రామకృష్ణుడు ఆంధ్రభోజుడని వాసిగాంచిన శ్రీకృష్ణదేవరాయల వారికి తన ఆశుకవిత్వంతో, సమయస్ఫూర్తి తో రోజురోజుకు దగ్గర అవడం కొందరు సాటి దిగ్గజాలకు, రాయలవారి గురువైన శ్రీ తాతాచార్యుల వారికి అసూయగా వుండేది. రామకృష్ణుడిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని తాతాచార్యుల వారు ప్రేరేపించగా అష్టదిగ్గజాలలో ఒకరైన భట్టుమూర్తి (ఇతనికే 'రామరాజభూషణుడు' అని మరొక పేరు), గోవిందయ్య అనే ద్వారపాలకుడిని పిలిచి "రామకృష్ణుడు సభలోకి వస్తున్నాడు, నువ్వు అడిగినట్లే, కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" అనే సమస్యను పూరించమని అడిగిస్తాడు. అందుకు వికటకవి కోపంతో అసలు అడిగిన వారిని ఉద్దేశిస్తూ గోవిందయ్యతో ఇలా అంటాడు..
గంజాయి తాగి తురకల
సంజాతము చేత కల్లు చవిగొన్నావా?
లంజల కొడకా! ఎక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !!
అని సమస్యను పూరించడంతో తేలుకుట్టిన దొంగల్లా తాతాచార్యులు, భట్టుమూర్తి కిక్కురు మనకుండా ఊరుకుంటారు. అయితే ఎలాగైనా రామకృష్ణుడికి బుద్ధి చెప్పాలని రాయల వారికి ఫిర్యాదు చేస్తారు. రాయల వారు వికటకవిని పిలిచి అదే సమస్యను ఇచ్చి పూరించమంటాడు. అపుడు రామకృష్ణుడు తెలివిగా ఈ క్రింది పద్యం చెబుతాడు..
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు కొల్వు పాలైరకటా!
సంజయా! విధి నేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !
అది విని రాయలవారు "శభాష్! రామకృష్ణా! నీ బుద్ధి బలానికి రెండు ప్రక్కల పదునే" అని మెచ్చుకుంటాడు.
గమనిక: పిల్లలకు చెప్పడానికి సులువుగా వుండే తెనాలి రామకృష్ణ కథలకు (ఆంగ్లంలో) ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ కార్తీక మాసంలో పరమ శివుని పై ఘంటసాల మాస్టారు పాడిన కొన్ని పద్యాలు, శ్లోకాలు, పాటలు ముందు పోస్టులలో పొందు పరచాను. అయితే కార్తీక మాసము పూర్తి అయ్యే లోగా ఏదైనా చిన్న శ్లోకమో, పద్యమో ప్రస్తుతిద్దా మనుకునేసరికి అనుకోకుండా తెనాలి రామకృష్ణ (1956) చిత్రంలోని ఒక సన్నివేశంలోని శ్లోకం శివునికి సంబంధించినదని అంతర్జాలంలో కొంచెం శోధించాక తెలిసింది. బహుశ ఇది చాలమందికి తెలుసనుకుంటాను. నాకు ఇపుడే తెలిసింది. ఇక ఉండబట్టలేక ఈ పోస్టు వ్రాస్తున్నాను. దేవి వరప్రసాదం వలన రామకృష్ణుడు వికటకవియై, శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో చేరి, తన చతురతతో, సమయస్ఫూర్తితో, అందరినీ ఆనందింపజేసేవాడు. తెనాలి రామకృష్ణునితో కలసి మొత్తం ఎనిమిది మంది కవులు (అష్ట దిగ్గజములు) గల సభను భువనవిజయము అని కూడ అంటారు. ఒక రోజు భువన విజయానికి 'సహస్ర ఘంటకవి' అని బిరుదుగల ప్రెగడ నరసరాజు కవి వచ్చి, తాను "పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తానని, పరుల కవిత్వలో తప్పులు పడతానని", తన ప్రతిభను గౌరవించి జయపత్రిక ఇవ్వమని రాయలవారిని అడుగుతాడు.
రాయల అనుమతి మీదట ముందుగా అల్లసాని పెద్దన అందుకుని
మరుద్వృధా తటస్థ
శత్రు మండలీ గళాంతర
క్షరన్న వాస్యగాపగాభిసారికాదృతాంబుధీ
మరుత్పతిస్వరుక్షతిక్రమత్రుటత్కుభృద్వర
స్ఫురద్వని
ప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటీ
అనే పద్యం చెబుతాడు. ఈ పద్యానికి నేను సేకరించిన విశ్లేషణ, వివరణ ఈ విధంగా వున్నాయిః
ప్రతిపదార్థము - మరుద్వృధా
= కావేరీ నది యొక్క (మరుత్ = గాలుల చేత, వృధా = వృద్ధి గలది); తటస్థ = తీరమునందున్న;
శత్రు మండలీ = శత్రు సమూహముల యొక్క; గళాంతర = గొంతుకల మధ్య నుండి; క్షరత్ = జారుచున్న;
నవాస్యగాపగా(?) = క్రొన్నెత్తురు పేరులనెడు; అభిసారికా = అభిసారికయనగా ప్రియుని గూర్చి
చనునట్లు నుండెడి స్త్రీ; అదృత = సంతోషపరుపబడిన; అంబుధీ = సముద్రము;
తాత్పర్యము - అనగా కృష్ణరాయలు
కావేరీ తీర ప్రాంతములందలి శత్రు రాజులను జంపి వారి నెత్తురును ఏరులుగా ప్రవహింపజేసి
సముద్రము వరకు పారునట్లు చేసెననియు, అవి చూడ నా నెత్తురుటేరులు అభిసారికలవలె సముద్రము
వరకు బోవుట అని భావము.
ప్రతిపదార్థము - మరుత్పతి =
ఇంద్రుని యొక్క; స్వరు = వజ్రాయుధము యొక్క; క్షతిక్రమ = వేటుల వరుస చేత; త్రుటత్ =
పగిలిన; కుభృద్వర(?) = పర్వత శ్రేష్ఠముల వలె; స్ఫురత్ = అధికమగు; ధ్వని = శబ్దముల చేత;
ప్రవృద్ధ = అతిశయించుచున్న; యుద్ధ = యుద్ధమునందలి; పుంఖిత = గుంపులగు; ఆనక = భేరుల
యొక్క; ఆర్బటీ = మ్రోత గల వాడా.
తాత్పర్యము - అనగా కృష్ణరాయలు
యుద్ధము నందు తీసికొని పోవు భేరుల మ్రోతలు దేవేంద్రుని వజ్రాయుధ హతిచే కూలు; పర్వత
ధ్వనుల వలె నొప్పెనాని భావము.
(సేకరణ - తిమ్మనార్య
కృత పారిజాతాపహారణ కావ్యమునకు శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్య గారి వ్యాఖ్యానము నుండి.)
దీనిని సమీకరించి
స్పందన రూపంలో నాకు ఒసంగిన శ్రీ సూర్య (బెంగళూరు) వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ పద్యం వ్రాసానని నరసరాజు చెప్పడంతో, ఎలాగైనా ఈ కవి గర్వం అణచాలని నిశ్చయించుకుని తెనాలి రామకృష్ణుడు ఈ దిగువ గల పద్యం వ్రాయమంటాడు -
శివుని వర్ణన
త్పృవ్వటబాబా తలపై
పువ్వట జాబిల్లి, వల్వ బూదట, చేదే
బువ్వట, చూడగను ళుళు
క్కవ్వట, నరయంగ నట్టి హరునకు జేజే !!
ఈ పద్యం ఎలా ప్రారంభించాలో మొదట్లోనే ఇబ్బంది పడిన నరసరాజు ఘంటం ఆగిపోతుంది. అపుడు రామకృష్ణుడు మందలింపుగా ఇలా తిడతాడు.
తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్
పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వా
రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా! విరసా! తుసా! భుసా!
అపుడు రాయల వారు రామకృష్ణుని శాంతించమని నరసరాజ కవికి కావలసినంత ధనం ఇప్పించి పంపించేస్తాడు. తరువాత అదే పద్యాన్ని రాయల వారు తన భార్య తిరుమల దేవికి చెప్పగా, ఆమె చిత్ర రూపంలో ఆ పద్యాన్ని వ్రాసి చూపించి రాయల వారి కానుక గ్రహిస్తుంది.
ఈ శ్లోకంలో "అట" అనే శబ్దం పలుమార్లు వస్తుంది. త్పృవ్వ* = ఎద్దు (పశువుల కాపరులు ఆవులు కాస్తూ పెదవులతో చేసే ధ్వని ఇది. అలాగే తువ్వాయి కి అర్ధం "దూడ" అని; బాబా = వాహనము (ఇది బహుశా ఆవుగాని ఎద్దుగాని అంబా..అంబా. అని అరుస్తాయి. అందులోనుంచి పుట్టిన ధ్వని కావచ్చు; *నా చిరకాల మిత్రులు శ్రీ అహోబిల మురళి గారు హ్యుస్తను,టెక్సాస్ నుండి ఫోనుచేసి సూచించారు. త్ప్రువ్వత అనే పదం రాయల సీమలో వాడుకలో ఉండే పదం. దానికి అర్ధం నీరు అని. త్ప్రువ్ = నీరు; బాబా = శివుడు; తలపై నీరు (గంగ) కలవాడు = గంగాధరుడు లేదా శివుడు. వల్వ = వస్త్రము; బూది = విభూది లేక విభూతి లేక బూడిద; చేదే = చేదుగా ఉండెడిది (విషం); బువ్వ = ఆహారము; ళుళుక్కవ్వ = ఉండకపోవటం; (ఉదా.హుళక్కి); అరయంగనట్టి = అటుల వెలుగొందు; హరుడు = శివుడు; జేజే = విజయము.
తాత్పర్యం: తలపై గంగ ధరించిన వాడట. తల మీద చంద్రుడు పువ్వువలె ఉన్నాడట. విభూతే వస్త్రమట. చేదైనది (విషం) భోజనమట. దిక్కులేని వాడట. అట్టి పరమశివునికి జేజేలు.
గమనిక: ఈ వివరణ నా స్వంతం కాదు. ఆసక్తితో అంతర్జాలంలో శోధించగా ఒక బ్లాగులో దొరికింది నాకు. దానికి నా ఊహను జోడించి పైన వివరించాను. ఈ శ్లోకం యొక్క అర్ధం వివరించబడిన బ్లాగు లింకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అయితే మన తెలుగు మనం మరచి పోతున్న ఈ రోజులలో ఇలాంటి వివరణలు లభిస్తే పద్యాలను ఇంకెంతో ఆస్వాదించ వచ్చును. ఔత్సాహికులయిన తెలుగు ఆచార్యులు ఈ పనికి పూనుకుంటే చాల బాగుంటుంది.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com