తెలుగువారి గుండెలను తన గాన మాధుర్యమనే ఆనందార్ణవాన్ని నింపిన రసరాగ
సింధువు మరియు స్వరరాగ నిఘంటువు మన ఘంటసాల. ఈ సర్వమంగళ గుణసంపన్న గాన గంధర్వుడు మనం ప్రతి క్షణం తలచే గళవేల్పు. అజరామరమైన బాణీలను తన వాణిలో
పూరించి, మాణిక్యవీణను పలికించి, రసరాజులను మెప్పించి 'రసికరాజ తగువారము
కామా' అని జయభేరి మ్రోగించిన అమరగాయకుడు మన ఘంటసాల మాస్టారు. ఆయన తన
పాటల్లో మనకు కర్ణపేయమైన కర్ణాటక సంగీతంతో పాటు బందోబస్తుగ ముస్తాబైన
హిందుస్తానీ పోకడలను కూడ రుచిచూపించాడు. తన విలక్షణమైన సంగీతజ్ఞతతో ఎన్నో
అద్భుతాలు చేసాడాయన. అన్యస్వరాలనుపయోగించినా పాట మాధుర్యాన్ని పెంచాడే
తప్ప తగ్గించలేదు. తెలుగు చలనచిత్ర సంగీతత్రయములో సాలూరు, పెండ్యాల,
ఘంటసాల తిరుగులేని సంగీత సామ్రాజ్య రసరాజులు. అయితే ఘంటసాల గళమివ్వడము,
స్వరపరచడము మాత్రమే కాక స్వయంగా రచనలు చేయడం గొప్ప విషయం. అటువంటి
రాగ-భావ-తాళ-మేళాలను సంఘటిటపరచిన మన ఘంటసాల జన్మదినం ఈరోజు. మన ఘంటసాల రాగశాలలో మాస్టారు పాడిన ఎన్నో రాగాల గుఱించి ఇదివరకు మిత్రులు చంద్రమౌళి గారు ముచ్చటించారు. మరి ఈ రోజు మరొక రాగం గుఱించి తెలుసుకుందామా? అయితే అడుగుపెట్టండి రాగశాల లోనికి.
సంగీత ప్రపంచపు వేలకొలది విద్వాంసులలో ఎందరో శాస్త్రవేత్తలు, మరెందరో గాయకులు, వారిలో కొందరే ఖ్యాతనాములు. ఆ కొందరిలో వ్రేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత మాత్రమే స్వరసాహిత్యసవ్యసాచులు. ఆ కొద్దిమందిలో సంగీత మాధురినీ, సాహిత్య సంపదను తమ స్పష్టోచ్చారణతో, ఎదను కరిగించి, కదిలించే భావరసగానవర్షణాసమర్థ యుగపురుషులు ఎందరు? త్యాగరాజస్వామి వారి భాషలో చెప్పాలంటే, 'సామ నిగమజ సుధామయ గానవిచక్షణ' మైనది ఘంటసాల మోహన గళం. త్రిస్థాయిలో గమక సంపదల మెరుపులతో రక్తికట్టించే గళమది. అది ఇత్తడిని పుత్తడిచేసే స్పర్శమణి. ఏపాటైనా ఏపద్యమైనా ఘంటసాల గళం నుండి వెలువడితే అది రసికుల ఎదలో మెదలి పెదవులపైన పలుకుతుంది. చిరస్మరణీయంగా నిలబడిన అలాంటి రత్నాలెన్నో!
సంగీత ప్రపంచపు వేలకొలది విద్వాంసులలో ఎందరో శాస్త్రవేత్తలు, మరెందరో గాయకులు, వారిలో కొందరే ఖ్యాతనాములు. ఆ కొందరిలో వ్రేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత మాత్రమే స్వరసాహిత్యసవ్యసాచులు. ఆ కొద్దిమందిలో సంగీత మాధురినీ, సాహిత్య సంపదను తమ స్పష్టోచ్చారణతో, ఎదను కరిగించి, కదిలించే భావరసగానవర్షణాసమర్థ యుగపురుషులు ఎందరు? త్యాగరాజస్వామి వారి భాషలో చెప్పాలంటే, 'సామ నిగమజ సుధామయ గానవిచక్షణ' మైనది ఘంటసాల మోహన గళం. త్రిస్థాయిలో గమక సంపదల మెరుపులతో రక్తికట్టించే గళమది. అది ఇత్తడిని పుత్తడిచేసే స్పర్శమణి. ఏపాటైనా ఏపద్యమైనా ఘంటసాల గళం నుండి వెలువడితే అది రసికుల ఎదలో మెదలి పెదవులపైన పలుకుతుంది. చిరస్మరణీయంగా నిలబడిన అలాంటి రత్నాలెన్నో!
తనకు తెలిసిన శాస్త్రీయ సంగీత రహస్యాలను వ్యాసాలలో, భాషణాలలో వ్యాఖ్యానించక,
ఇది శాస్త్రీయ సంగీతం, ఇది ఇలాంటి రాగాన్ని ఆధారింపబడినది
అని ఎక్కడా చెప్పక, తన స్వరకల్పనలో, ఆలాపనలో,
పాటలలో మరియు పద్యాలలో అపురూపమైన శాస్త్రీయరాగాలని ప్రవేశబెట్టిన మహితాత్ముడు మన ఘంటసాల మాస్టారు. ఆయన ఎన్నో రాగాలకు తన గళంతో ప్రాణం పోశారు. అల్పప్రసిద్ధములైన రాగాలకి సైతం రసపుష్టిని సమకూర్చి అసాధారణంగా ఆలపించారు. తన జీవనసంధ్యాసమయంలో అధ్యాత్మికానుభూతితో
భగవద్గీతలోని సారభూతమైన అష్టోత్తరశతశ్లోకగాయనమునకు ఆయన వాడిన రాగాలు దాదాపు నలభైయైదు ఉన్నాయి. ఆ రాగాలలో ఆయనే ప్రసిద్ధపరచిన రాగాలు గాక, ఎన్నో కొత్తప్రయోగాలూ, పోకడలు మనకు వినిపిస్తాయి. త్యాగరాయ కృతులనూ, రామదాస
– అన్నమయ్య కీర్తనలనూ ఆ మార్గంలోనే పాడాలన్న ఆయన అభిలాష పూర్తిగా నెరవేరక అవన్నీ గంధర్వ సదస్సులో
వినిపించడానికే మాస్టారు నిర్ణయించుకున్నారా అనిపిస్తుంది.
గాయకజీవనారంభదశలో,
ఆయన శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తూ, ఆ వృత్తి
ఆర్థికంగా విఫలమైన ఘటన శాస్త్రీయసంగీతానికి అపారనష్టాన్ని కలిగించింది. కాని వెండితెరకు నేపథ్యగానమాధుర్యాన్ని,
తెలుగుపద్య పఠనావిధానాన్ని సమకూర్చి నిరవధికమైన కీర్తిని, లాభాన్ని చేకూర్చింది. ఘంటసాల శాస్త్రీయ సంగీతంలోనే రాణించి నిలిచి ఉంటే, కర్ణాటక
శాస్త్రీయసంగీత దేవతకు, రెండు కళ్ళుగా ఇద్దరు గాయకసార్వభౌములుండేవారు. వారు మధురమైన గళమూ, శాస్త్రీయ సంగీతవైదుష్యమూ కావ్యనాటకాది సాహిత్యప్రతిభాలబ్ధ వాగ్గేయకారత్వ సవ్యసాచిత్వమూ
సమ్మిళితమైన ఘంటసాల మరియు మంగళంపల్లి గార్లు. ఆవిధంగా శాస్త్రీయగానానికి
లభ్యంకాని ఘంటసాల స్వరనిధి, సినిమా సంగీతానికి అక్షయమైన పెన్నిధిగా నిలవడం నిజంగా విధివిలాసమే.
సప్తస్వర సంపూర్ణములైన 72
మేళకర్తరాగాలలో కొన్నివేల జన్యరాగాలు
జన్మనెత్తాయి. స్వరోత్పత్తి తంత్రాంశాన్ని ప్రత్యేకించి గమనించిన
శ్రుతులలో దీప్త, ఆయత, కరుణ, మృదు, మధ్యమములని ఐదు జాతులున్నవి. షడ్జమమునకు నాలుగు, రిషభమునకు మూడు, గాంధారమునకు రెండు, మధ్యమమునకు నాలుగు,
పంచమమునకు నాలుగు, దైవతమునకు మూడు,
నిషాదమునకు రెండు శ్రుతులుగా సప్తస్వరాలకు 22 శ్రుతులు గలవు.
ఇందులో స-మ-ప స్వరాలకు మాత్రమే
4 శ్రుతులుగనుక ఇవే ప్రధానస్వరాలు. స అను షడ్జమస్వరమే మిగిలిన
ఆరు స్వరములకు ఆధారం. వనస్పతి, మానవతి,
సేనావతి, హాటకాంబరి, వరుణప్రియ,
యాగప్రియ, నవనీతము, గవాంబోధి….ఈ పేర్లు మనం సంగీత కచేరీలలో వింటున్నామా? అవి రాగాల
పేర్లేనా? అనే అనుమానం వస్తుందేమో గాని ఈ మేళకర్తరాగాల స్వరస్వరూపం కల్యాణి, చక్రవాకం,శంకరాభరణ రాగాల్లా సామాన్య సంగీతరసికులకు
బోధపడదు. పాటలకు బాణీ కట్టే సందర్భాలలో (రాగసంయోజనావిధానం) “ప్రజలు పాడుకోవడానికి వీలుగ ఉండాలని నా తపన" అంటూ ఘంటసాలగారే ఒక సందర్భంలో
అన్నారు. సప్తస్వరాలూగల
జనకరాగాల విస్తృతవిన్యాసం ఒక వైభవమైతే, ఐదుస్వరములుగల ఔడవ-ఔడవరాగాల (ఆరోహణావరోహణంలో ఐదు స్వరాలున్న రాగాలు) ఆకర్షణ బహుజనరంజకం. ఔడవరాగాలలో రెండుస్వరాల నడుమ ఉన్న
శ్రుతుల అంతరం ఎక్కువ. అందువలన స్వరస్థానాలు నిర్దిష్టముగా పలుకడానికి
అనుకూలంగా వుంటుంది. నిర్దిష్టముగా పలికే పంచస్వరసంయోజితరాగాలు జనరంజకాలు. ఉదాహరణకు వేదమంత్ర పఠనానికి ఆధారం మూడు స్వరాలే. అవి ని-స-రి.
ఘంటసాల ఈ రహస్యాన్ని గుర్తించి చేసిన రాగప్రయోగాలు ఎన్నో పాటలలో మనకు కనిపిస్తాయి.
ఒక్కక్షణంలోనె ఉద్దేశిత రసావిష్కరణమును
చేయగల శక్తి ఆయన గాత్రానిదైతే, దానికి ఔడవరాగప్రయోగాలు అనుకూలంగా
పొసగినవి. అందులోనూ హిందోళం,
భూపాలం, శుద్ధధన్యాసి, శుద్ధసావేరి,
హంసధ్వని, రేగుప్తి, మోహన, వలజి, శివరంజని, అమృతవర్షిణి,
ఆభోగి, విజయనాగరి వంటి ఔడవ రాగాలను ఆయన ఎక్కువగా ఎన్నుకొన్నారు.
ఇవన్నీ ప్రఖ్యాతమైన రాగములే. అయితే అంతగా ఖ్యాతిగాంచని ఒక రాగం "గంభీర
నాట". ఇది ముప్పైయారవ మేళకర్త చలనాటరాగజన్యం. 'చల' అన్నపూర్వపదం 'కటపయాది' సూత్రనియమితమైన సంఖ్యాసూచక పద్ధతి. చలనాటకు ఆరోహణ S R3 G3
M1 P D3 N3 S, అవరోహణ S N3 D3 P M1 G3 R3 S. దీని నుండి వచ్చిన
ప్రముఖ జన్యరాగాలు రెండు. అవి నాట రాగం (ఆ: S R3 G3 M1 P D3 N3 S | అవ: S
N3 P M1 G3 M1 R3 S) మరియు గంభీర నాట రాగం (ఆ: S G3 M1 P N3 S | అవ: S
N3 P M1 G3 S ). గంభీర నాట (నాట్టై – తమిళం,
శుద్ధ నాట్టై) ఔడవ-ఔడవరాగం. గంభీర నాటకు
తిల్లంగ్ రాగానికి (ఆ: S G3 M1 P N3 S
| అ: S N2 P M1 G3 S ) చాల దగ్గరపోలికలున్నాయి. ఆరోహణంలో రెండురాగాలకూ
అవే స్వరాలుంటాయి. అయితే తిల్లాంగ్ అవరోహణంలో గంభీరనాటలోని
కాకలి నిషాదానికి (తీవ్ర్ నిషాద్, N3, B-sharp ఫ్రీక్వెన్సీ
15/8) మారుగా కైశిక నిషాదం (కోమల్ నిషాద్ N2, B-flat ఫ్రీక్వెన్సీ
9/5) వస్తుంది. గంభీరనాట మూర్ఛనలో గాంధారంపై గ్రహబేధం చేయగా భూపాలరాగం
సృజింపబడుతుంది. ఇంకొక విశేషమేమంటే గంభీరనాటలోని శుద్ధమధ్యమాన్ని ప్రతిమధ్యమంజేస్తె అరుదెంచే రాగం
అమృతవర్షిణి. అలాగే మధ్యమాన్ని తీసి చతుశ్రుతి రిషభం వేస్తే హంసధ్వని ధ్వనిస్తుంది. ఇవన్నీ ప్రఖ్యాతమైన రాగాలే.
గంభీరనాట త్యాగరాజుల కాలంలో ప్ర్రచురణలో ఉన్నట్టు
మనకు తెలియదుగాని, ఇది ప్రముఖంగా తమిళ ప్రాంతంలో ఎక్కువ ప్రసిద్ధమైన రాగం.
దేవస్థానోత్సవ సంబంధిత మంగళ
సన్నివేశాలలో నాదస్వర వాదనం అనాదిగానున్న ఆచారం. నాదస్వర వాదన ప్రస్తుతిలో మల్లారి, పంచనడై, ఘనరాగపంచకం, రాగం-తానం-పల్లవి మొదలైన సాంప్రదాయిక అంశములున్నవి. శాస్త్రీయ సంగీతంలో "మల్లారి"
అనబడే అంశం నాగస్వరానికే సంబంధించిన గంభీరనాట రాగంలో ప్రస్తుతించబడుతుంది. తమిళంలో బహుప్రఖ్యాతమైన "తేవారములు"
ఈరాగంలో పాడబడతాయి. ఈ రాగంలో సంగీతత్రిమూర్తుల రచనలు మనకు కనిపించకున్నా, ఊతుక్కాడు వెంకటకవి రచన 'శ్రీ విఘ్నరాజం భజే', జయచామరాజేంద్ర
ఒడెయర్ కృతి 'శ్రీ జాలంధరమాశ్రయామి' మరియు మంగళంపల్లి మాధుర్యములొలికించు వర్ణం "అమ్మా
ఆనందదాయిని" ప్రసిద్ధిగాంచిన గంభీరనాట రచనలు. ఈ రాగంలోని మరికొన్ని రచనలు శరణెంబె వాణి (పురందరదాసు),
జయ దేవకీకిశోర (స్వాతి తిరునాళ్), గిరిజారమణ (మైసూరు వాసుదేవాచార్) మొదలయినవి. గంభీరముగా సాగే ఈ రాగంలో స్వరాలు:
షడ్జమం, అంతరగాంధారం, శుద్ధమధ్యమం, పంచమం, కాకలి నిషాదం.
ఒక గాంధారద్వయి వైవిధ్యం తప్ప, హిందూస్థాని పద్ధతిలో
“జోగ్” రాగం మన గంభీరనాట కోవకు చెందుతుంది.
ఇండోనీషియన్ సంగీతములోనూ గంభీరనాట ఛాయలు కనిపిస్తాయి. తిల్లాంగ్ రాగానికున్న అవరోహణలోని కైశికి నిషాదం గమనించకున్నచో ముందు చెప్పినట్లు
గంబీరనాట-తిల్లాంగ్ ఒకేలా వినిపిస్తాయి.
గంభీర
నాటరాగంలో ఎన్నోకీర్తనలు, మాస్టారే పాడిన పాటలూ ఉన్నా,
ఈ రాగంయొక్క పరాకాష్ఠతను మాస్టారు "శ్రీ సత్యనారాయణ మహాత్మ్యము" లో
శాశ్వతీకరించారు. తనకు సహజమైన ఒకటవ శృతికి అరశృతి ఎక్కువ స్ఠాయిలో అంటె C# స్తరంలో మొదలిడి తారపంచమాన్ని అధిగమించి
పైస్థాయిలోనే సాగే పాట భక్తుని మొరలను వైకుంఠపు సరిహద్దులు దాటే విధమైన సన్నివేశశుద్ధి గలది. ఈ పదాలు పాటను పరిచయంచేయవచ్చును లేక వర్ణించవచ్చునేమో కాని అనుభవమును ఇచ్చునా? గంభీరమైన ఈరాగంలో, హింసకు గురియైన భక్తుని శోకార్తవాణికి,
మాస్టారు ఎలా స్వరాలను సమకూర్చారా అన్నదే విస్మయం. గంభీరనాట మూర్ఛనలో పంచమం నుండి పై-పంచమందాక (స-గ-మ-ప-ని-స
గ-మ-ప) వచ్చుస్వరాలలోనే బాణికట్టి, భావానికి కట్టులు
విప్పి కరుణరసావిష్కరణ గావించారు.
1. శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం
హే మాధవా.... మధుసూదనా... కనజాలవా...
హే మాధవా.... మధుసూదనా... కనజాలవా...
పనిసగా
గామాగా.. నిసగామగా. నిసగమపామపా..
పమగా..గసనీ.. పమగా..నిసనిగరిస... (గ-మ-ప స్వరాలన్ని తారస్థాయిస్వరాలు)
జగన్నాయక
అభయదాయకా జాలము సేయగ రావా
|
||
మపాపాపపమ
గమామామమా గామపగాసస ససగమపా
|
||
హేమురారి
కరుణాకర శౌరి నామొరలే వి నలేవా
|
||
గామపాస
నినినీనిని సనినీ నీసానీపప మపనినిసా
|
||
నమ్మిసేవించు
నన్నుశోధింప న్యాయమా నీకు దేవా..
|
||
పానిసాగగ
గామమాగాస సాసనీ పామ సానిపమగా
|
||
సాకారా
నిరాకారా ఆశ్రిత కామిత మందార -2
|
||
గామాపా
నిపామాగా గామపగాసని నిసగమపా
|
||
పాలముంచిన
నీటముంచినా భారము నీదే దేవా
|
||
మపాపాపపమ
గమామామమా గామపగాసస ససగమపా
|
||
శ్రీనివాస
వైకుంఠనివాస దేవానాగతి నీవే
|
||
గామపాస
నినినీనిని సనినీ నీసానీపప మపనినిసా
|
||
జగము
తరియింప కరుణ కురిపించి కావుమా దేవ దేవా..
|
||
పానిసాగగ
గామమాగాస సాసనీ పామ సానిపమగా
|
||
సాకారా
నిరాకారా ఆశ్రిత కామిత మందార -2
|
||
గామాపా
నిపామాగా గామపగాసని నిసగమపా
|
||
కామిత
మందార
|
||
హే
మాధవా కరుణించవా |హే మాధవా కరుణించవా|హే మాధవా కరుణించవా
|
||
పా
నీనిసా. పపనీనిసా.. పా నీనిసా.
పపనీనిసా.. పా నీసగా. పపనీసగా..
|
||
హే
మాధవా..... మధుసూదన
..... కనజాలవా
|
||
పనిసగా
గామగా..... నిసగమగమా .... మపనిసగామపా
|
హే! మాధవా : శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం
పాట చివరలో ఎలుగెత్తి పిలచి హే! మాధవా, (పై గాంధారం) మధుసూధనా... (పై మధ్యమం) కనజాలవా.. అంటూ తారపంచమ స్వరారోహణంతో పరమాద్భుతమైన భావం సృష్టించి ఆ సన్నివేశానికి సెట్టింగులతో సాగని వన్నెల వెన్నలనే ఆవిష్కరించారు మాస్టారు.
2. లవకుశ
లవకుశ
చిత్రంలో కథాప్రారంభమున వశిష్ఠ మహర్షి, శ్రీరాముని
తన వంశకర్తయైన సూర్యభగవానునికి నమస్కరించమనగ, రాముడు గంభీర గమనంతో
నడుస్తున్నట్టె, నేపథ్యంలో మనకు గంభీరనాటరాగం వినిపిస్తుంది.
(గగస, మమగ, పపమ, నినిప, సనిపమగా అను స్వరవరుసలను ఇక్కడ వినగలరు). ఈ దృశ్యఖండిక
కన్నడభాషలో విడుదలైన "లవకుశ" చిత్రానిది.
పా
మా గా సని | సా... సగమపని| పామాగా సనిసా
|
||
గమపస
నీ పామా గస పా మగసా
|
||
గగస
మమగ పపని నినిప ససని గగస నిపమగ పామాగాసని సా....
|
ఇలా
సాగే మధుర వీణానిస్వన స్వరపుష్పాలు కురియుచుండగా సీతాసమైతుడై శ్రీరాముడు పూర్ణాహుతిగావించి,
గురువు నిర్దేశించగా భాస్కరనమస్కారమునకు నయ గంభీర లయముతో నడచుచున్న సన్నివేశాన్ని
గంభీరనాటరాగంతో మాస్టారు ఎలా అలంకరించి, దైవీభావ ప్రభావ వైభవాన్ని
కలిగించారో గమనించి చూసి వినండి:
సప్తాశ్వ
రథమారూఢం (పాపాప పపపాపాప) ప్రచండం
కశ్యపాత్మజం (మామామ మామ గమపా మగా)
శ్వేతపద్మధరం దేవం ( గామపాని నినీ నీసా) తం
(సా) సూర్యం (సగమాగసా)
ప్రణమామ్యహం (నిసనీ పపా)
తం
(పా) సూర్యం (పనిసాసనినిపపామగా) ప్రణమామ్యహం (గమగాసస)
సప్తాశ్వ రథమారూఢం (లవకుశ-కన్నడ)
తమిళంలోని పాట సాహిత్యం
"తిరువళర్ నాయగన్ శ్రీరామనె,
రవికుల సోమనుం జయరామనే" దీనియొక్క, అర్థమూ, చతుర్మాత్రాగతి, ఆదితాళనిబద్ధత
అన్నిటికి ఆధారం అచ్చంగా మూలపు ’జగదభి రాముడు శ్రీరాముడే’ . ఘంటసాల సంయోజించిన కానడరాగానికి
బదులుగా మహాదేవన్ గంభీరనాటరాగం మేళవించారు.
జయజయరామ్ (మ ప గ మ పా
నీ) జయరఘురామ్ (సరి*సనిసా)
వీణాధ్వని: గమపనిపామాగ
పాపమాగ పాగమాగస..
తిరువళర్ నాయగన్ శ్రీరామనె రవికుల సోమనుం జయరామనే
ససగమ పాపప మపమపామగా గగమప పమగస ససనీనిస
తిరువళర్ నాయగన్ శ్రీరామనె
రవికులసోమనుం జయరామనే
ససగమ పాపప మపమపామగా..
తందెయిన్- ఆణెయై- తలెమీల్-
తాంగి తన్నుయిర్-అన్నయయ్-అరసయ్ - నీంగి
మపపమ- పాపప- మపపమ- నిమప గమపని-
నీసస- నిసనిప- నినిస
సతియుడ వనంసేంద్ర ధర్మావతారన్
||తిరువళర్
పనిసగ సరి*నీని పానిసనీప
మమపమగగస...
తిరువళర్ నాయగన్ శ్రీరామనె: (లవకుశ - తమిళం)
ఘంటసాల
గంభీరనాటరాగంలో పాడారా, ఆ రాగన్ని వాడారా అన్న విషయం చదివిగాని వినిగాని ఎరుగను. ఘంటసాలగారు తమిళ భాషలో లవకుశ చిత్రానికి ఆలపించిన ఒక్కపాటను,
ఘంటసాల అభిమాని, సహృదయ సంగీతరసికులైన శ్రీ ఎం.ఆర్.శ్రీనివాసమూర్తిగారు నాకు పంపగా ఆ పాట స్వర-రాగం
గురించి మనసులో చిన్న అన్వేషణ ఉండిపోయింది. ఈ వ్యాసరచనకు అది మూలం. ఆయనకు నా కృతజ్ఞాతాపూర్వక
శుభాశిస్సులు.
వాల్మీకి చిత్రానికై స్వరపరచి ఘంటసాల
గానంచేసిన "శ్రీరామాయణ కావ్యకథా" రాగమాలికలోని చరణం "జానకి జాడను తెలియుదు
నేను" గంభీరనాట రాగమే. ఈ దృశ్య భాగాన్ని ఇక్కడ చూడగలరు.
చిత్రం: వాల్మీకి; పాట: శ్రీ రామాయణ కావ్య కథా
జానకి జాడలు - శ్రీ రామాయణ కావ్య కథ: (వాల్మీకి)
గమనిక :
శుద్ధ
శాస్త్రీయ కృతులను వినకపోవడం వలన, ఈ రాగస్వరూపం మనకు పూర్తిగా అర్థంకాదు.
గంభీరనాటరాగనిబద్ధమైన ఈ మూడుకృతులనూ వినండి.
"అమ్మా
ఆనంద దాయిని అకార ఉకార మకార రూపిణి" - బాలమురళికృష్ణగారి వర్ణం సర్వాంగసుందరమైన
సుమధుర స్వరపదసమాహారం.
రాగం: గంభీరనాట; ఆలాపన/గానం: శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
(వర్ణం: అమ్మా! ఆనందదాయిని)
రాగం: గంభీరనాట; గానం: ప్రియా సిస్టర్స్; రచన: ఊత్తుకాడు వెంకటసుబ్బయ్యర్
(శ్రీ విఘ్నరాజం భజే )
శ్రీ జయచామరాజేంద్ర
ఒడెయర్ గంభీరనాటరాగంలో రచించిన అద్భుత కృతి, శ్రీ జాలంధర మాశ్రయామ్యహం:
వీణా మరియు కీబోర్డ్ లో వినిపించినది శ్రీ ఎన్.ఎమ్.కె: (శ్రీ
జాలంధర మాశ్రయామ్యహం)
ఏ పాటైనా ఏ
రాగమైనా ’ఆహా’ అనిపించే గమకాలను, సంగతులను సృష్టించి తన గానాన్ని
శాశ్వతీకరించారు మాస్టారు. తను పుట్టింది తొంభై రెండేళ్ళ క్రితమేయైనా, ఈనాటి
తొమ్మిదేళ్ళ పిల్లలు సైతం ఘంటసాల గానాన్ని మెచ్చుకొని, నేర్చుకొని,
పాడుతున్నారంటే, ఘంటసాల కంఠశ్రీ ఈ శతాబ్దపు లలిత-భావ సంగితయాత్రకు ఘంటాపథం.
రాగశాలలో,
మాస్టారి పాటల-పద్యాల వెనుకనున్న శాస్త్ర్రీయ అంశములను, ఘంటసాల గానాన్ని,
రాగాల వరసన నెమరువెసుకొనే నా అదృష్టానికి ముఖ్యకారకులు ఇద్దరు. ఒకరు
కర్ణాటక సుప్రసిద్ధ విద్వాంసులు శతావధాని డా|| ఆర్.గణేశ్ గారు. ఆయన ప్రతి
వ్యాసాన్ని చదివి, తమ అభిప్రాయాన్ని అందిస్తూ, ప్రోత్సాహిస్తూ, నేను
జాప్యంచేసి రాయకున్న, ఇప్పుడు ఏ రాగం గురించి రాస్తున్నారు అని అడుగుతూ
ఉత్తేజపరుస్తూ ఉంటారు. శ్రీ గణేశ్ గారు అభిమానించే ఘంటసాల జయంతి, ఈరోజు,
ఆయన పుట్టిన రోజూ కావడం ఒక విశేషం. ఇక రెండవ వ్యక్తి రాగశాలకు ఆశ్రయదాత,
ఆసక్తికరంగా, అవిరామంగా ఈ బ్లాగును నడుపుతూ, నా కర్ణాటభాష-తెలుగువేషాన్ని
సహిస్తూ, నాచేత వ్రాయిస్తున్న మిత్రులు సూర్యం గారు. వీరిద్దరికీ నా
నమస్సులు. మరో రాగాశ్రయంతో మళ్ళి కలుద్దాం.

