రాగాల సరాగాలు మనసును పరవశింపచేస్తూ ఎదను ఆనంద డోలికలలో
ఊపుతుంటే, ఊయలలూగీ ఆ హృదయం తీయని పాట పాడుతుంది. ఆ రాగశాలను ప్రతి యింట
వినిపించే గాత్రం ఘంటసాల. పటువు గల బాణీలకు తన వాణిని జోడించి సుమధురంగా గాయనము చేసే ఆయన చలనచిత్ర నేపథ్యగానపు సంగీత నిఘంటువు. బడే గులాం ఆలీ ఖాన్ సాంగత్యంతో హిందుస్తానీ సంగీతపు పోకడలను, పకడ్ లను అవగాహన చేసుకుని ఆ రాగాలను పకడ్బందీగా తన సంగీతంలో నింపిన మహా మేధావి. ఇదివరలో మన రాగశాల లో హిందోళం, ఆరభి, సామ, శుద్ధ సావేరి, సింహేంద్ర మధ్యమం, నాటక ప్రియ, మలయ మారుతం, షణ్ముఖప్రియ, హంసానంది, ఫరజు, దేశ్, పటదీప్, బేహాగ్ వంటి రాగాల గురించి తెలుసుకున్నాము. ఈ రోజు హిందుస్తానీ రాగాలలో రాణియనదగ్గ రాగం రాగేశ్రీ (రాగేశ్వరి) గురించి మిత్రులు చంద్ర మౌళి గారి వ్యాసంలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం దేనికి? అడుగిడదామా రాగశాల లోనికి.
రాగేశ్రీ రాగాధారితమైన మరికొన్ని పాటలు
యెనధారియర్ వనితామణి (తమిళం)
మాటలలోని శబ్దాలు
అర్థాన్ని సూచిస్తే, ఆ పదాలు పలుకబడే ధ్వనిస్థాయి, ఆ స్వనము, భావాన్ని, ఉద్దేశిత అర్థాన్ని వెల్లడిస్తుంది. మాటల వెనుకటి భావనను తెలిపేది, ఆ మాటలను పలికే తీరు.
అలాగే సినిమా సాహిత్యం అందించాలనుకొన్న భావానికి ప్రాణంపోసేది సంగీతం. అది జీవించేది
అభినయంలో. పాటయొక్క పల్లవి "ఇది నా చెలి ఇది నా సఖి" అనే పదాలకు నేపథ్యగాయకుడు ప్రాణాన్నిపోస్తే నటుడు
దాన్ని జీవించి చూపినప్పుడే ఆ పాటకు సార్థకత కలుగుతుంది. తుదకు ప్రేక్షకుల పెదవులపైన నిలిచేది
ఆ పాటల పదాల నాదరూపమే. ఎలా ట్యూన్ చేస్తే, ఏ ధాటిలో పాడితే అది జనరంజకమై నాలుగు కాలాలపాటు నిలుస్తుంది
అనేదే అప్పటి సంగీతదర్శకుల తపన. ప్రజారంజనమే ప్రముఖమై, వీనుల విందుగా, క్రొత్తగా ఉండుటకు రాగస్వరూపం వ్యాకోచింపబడి, అన్యస్వరాలను
చేర్చటమూ, రాగాలను కలిపి ఏదో నవీనంగా ఒక పాట వరసను కూర్చడం ఇలాంటివి ఒక
పాటకు బాణీకట్టే ప్రక్రియలో జరుగేవి. అన్యస్వరాల
మిశ్రణమునకు కర్ణాటక సంగీతంకన్నా హిందూస్థాని సంప్రదాయంలో అవకాశం ఎక్కువ. అందులోనూ
లలిత సంగీతానికి ఉత్తరాది పద్ధతి సానుకూలమైనది. బహుశ ఘంటసాలకు 1948లో కలిగిన బడేగులాం ఆలీఖాన్ సాహచర్యం, ఎన్నో హిందూస్థానీ
రాగాలను ఆకళింపు చేసుకుని కొత్త బాణీల సృష్టిక్రియకు తొడ్పడియుండవచ్చు. "రాగేశ్రీ"
రాగాన్ని ఆయన ప్రత్యేకించి ఉపయోగించడం వెనుక
బడేగులాం ఆలీఖాన్ తో కలిగిన సాంగత్యం కారణమని అంటారు. బడేగులాం ఆలీఖాన్ మద్రాసుకి
వచ్చి ఎన్నో సభలలో చేసిన కఛేరీలు వినిన ఘంటసాల, ఆయనకు వీరాభిమానియయ్యారు. తన ఇంట్లో బృందంతో బడేగులాం ఆలీఖాన్
కొన్నిరోజులు ఉండగా ఆ నివాసం ఒక సంగీత క్షేత్రంగా మారిన విశేషాలను ఘంటసాల భార్య శ్రీమతి
సావిత్రమ్మగారు అక్షరబద్ధంచేశారు.
గాత్రసంగీతంలో ధ్వని ప్రధానమైనది. మాధుర్యము, శ్రావ్యత, పటుత్వం, స్థిరత్వం, త్రిస్థాయి సంచార శక్తి ఇవన్నీ ఒకే కంఠలో ఉంటే వినడానికి హాయి. ఆ స్వరాల సుస్పష్టత
మీ కంఠంలో ఎలా వచ్చింది మాస్టారూ అని అడిగితే ఆయన "అది భగవంతుని కృప బాబు"
అనేవారట. మధురమైన గాత్రము, బుద్ధి-హృదయాలను కలిపి ఒక అలౌకిక అనుభవాన్ని కలిగిస్తుంది.
నాదబ్రహ్మమనగా ఆ అనుభవమే. ఘంటసాల సంగీతసాధన చేసేరోజుల్లో తన గురువు బోధించిన
"సాంబసదాశివ - సాంబసదాశివ" మంత్రాన్ని నాదోపాసన చేసేవారని ఒక సందర్శనంలో
ఆయనే వెల్లడించారు. ఆయన కంఠమాధుర్యానికి దైవానుగ్రహంతో పాటు సాధనకూడా చేరి అనితరసాధ్యమైన
ఆ గాత్రసంస్కరణ ఏర్పడిందేమో!
అప్పటికే కర్ణాటక శాస్త్రీయ
సంగీతాన్ని అభ్యసించి అందులోని లోతులను అవగాహన చేసుకొన్న ఘంటసాలకు హిందూస్థాని సంగీతపు
అంతర్గత మర్మాలను ఆ ప్రఖ్యాత విద్వాంసుని ద్వారా సన్నిహింతంగా తెలుసుకొనే అవకాశంతో
సరికొత్త పద్ధతులూ రాగరహ్యసాలూ ఆయనకు తన నాదలోకంలో స్ఫురించియుండవచ్చు. సంగీత దర్శకునిగా తను చేసే ప్రయోగాల తీరుని మార్చి, లాలిత్యానికి, మాధుర్యానికి
కొత్త రాగాలతో బాణీలను కట్టడం సంభవమై, ఈనాడు ఆ పాటలకు చిరంజీవత్వం వాటిల్లింది. యమన్, జయజవంతి, మార్వా, భీమ్ పలాస్, పహాడి, పీలు, భూప్, మాల్కోంస్, మారుబేహాగ్ లాంటి హిందూస్థాని రాగాలు సమకాలీనులైన రత్నత్రయంలొ
(సాలూరి, పెండ్యాల మరియు ఘంటసాల) వాడుకలోనున్ననూ, రాగేశ్రీ రాగం
సంగతి వేరు. రాగేశ్రీ రాగాన్ని పునరావిష్కరించి సరికొత్తరూపాలతో ప్రయోగించిన ఖ్యాతి
ఘంటసాలకే చెల్లు. వాణిజ్య వ్యవహార ప్రధానమైన సినీక్షేత్రంలో సంగీతం పట్ల ఇంతటి అంకితభావం, స్వోపజ్ఞత, సతత నూతన నాద
మాధుర్యాన్వేషణ, ఘంటసాలలాంటి గాన గంధర్వునికే సాధ్యం. "భావ తీవ్రత, ఆర్ద్రత లేని హృదయంనుండి ఉత్తమమైన కళ వ్యక్తమయ్యే అవకాశం లేదు. అందుచేత కళాకారుడు కళాసాధనతో తుల్యంగా జీవిత అనుభావాలనుండి ఉన్నతమైన హృదయ సంస్కారాన్ని కలిగించుకోవలసి ఉంది" ఈ మాట చెప్పింది వేరెవరో కాదు. స్వయంగా
ఘంటసాల వెలుబరచిన అభిప్రాయం.
రాగేశ్రీ ఆరోహణంలో 'n-S-G-m-D-n-S' మరియు అవరోహణంలో S'-n-D-m-G-R-S స్వరాలమీద నడుస్తుంది. హిందూస్థాని సంగీత పద్ధతిలో ఖమాజ్ థాట్
దీని పుట్టినిల్లు. థాట్ అనగా ఈ జనకరాగంలోని ముఖ్య జన్యరాగాలన్నిటిని ఘంటసాల గళం పలికింది (రాగేశ్రీ, జంజూటి, దేశ్, తిలక్ కామోద్, జైజవంతి). ఖమాజ్
థాట్ మేళం, కర్ణాటక మేళమైన హరికాంభోజికి సమానము. రాగేశ్రీ రాగముయొక్క మూర్ఛన, హిందూస్థాని పద్ధతిలో ఇలా ఉంటుంది.: "స-గా3-మ1-దా2-నీ2-సా"
"స-నీ2-దా2-మ2-గా3-మ1-గ3-రి2-స-ని2-దా2-ని2-స". కొంతవరకు నాటకురంజి రాగానికి రాగేశ్రీ
దగ్గరగా ఉంటుంది. ఈ ఔడవ షాడవ రాగంలో గాంధార -నిషాదాలు వాది-సంవాది స్వరాలు (మధ్యమ
- షడ్జ స్వరాలు అనియూ వాదన కలదు). పకడ్ (అంటే స్వరసంచార విన్యాసం): రిసా, నిదనిసమగా, మదనిదా, గమదనిసా - సానిదామగారీస; మరి కొన్ని రాగేశ్రీ
వరసలు: స, దా నీ సగ, గమ, మగరి, స, గమదనిద, నిదగమ, సానిద, మ, గమగరిస, గమదనిస, దనిసాగా, గా మా(గ)రి, స. ఈ స్వరాల యోజన, రాగేశ్వరిని
(రాగ - ఈశ్వరి) రాగాలకు రాణినిజేసి ప్రణయగీతాలకు ప్రణవనాదత్వం సిద్ధించింది. కోమల గాంధారస్వర
ప్రయోగంతో(G2 సాధారణ) రాగేశ్రీ రాగం బాగేశ్రీగా మారిపోతుంది. అన్యస్వరస్పర్శతోనే అపురూపమైన బాణీలను సృష్టించే
సినిమా సంగీతంలో "ఈ పాట ఖఛ్ఛితంగా ఇలాంటి రాగనిబద్ధమని" ఎప్పుడూ అనలేము.
ఘంటసాల ఎన్నో చోట్ల రాగేశ్రీలో లేని పంచమాన్ని ప్రయోగించి సరిక్రొత్త బాణీలను కట్టారు.
ప్రథమంగా రాగేశ్రీ రాగాన్ని తెలుగు సినిమాలలో వినిపించినది
ఘంటసాల అనవచ్చు. స్వీయ సంగీత దర్శకత్వంవహించిన చిత్రాలలొ రాగేశ్రీ విహారం వినిపిస్తుంది.
ఈ రాగం ఆయనకు చాలా ప్రియమైనదిగా మనకు తెలుస్తుంది. ఆయన గాయన ప్రతిభ అత్యున్నత స్థాయిలో
వెలిగిన రెండు దశాబ్దాలలో (1950-1970) ఘంటసాల రాగేశ్రీ రాగాధారితమైన ఎన్నో బాణీలను
కట్టారు. "పాతాళ భైరవి" నుండి "రహస్యం" వరకు ఆయన సంగీత దర్శకత్వం
వహించిన ఎన్నో చిత్రాలలో రాగేశ్రీరాగం చోటుచేసుకొంది. ఘంటసాల సంగీత దర్శకత్వం నిర్వహించిన చిత్రాలలో వినబడే రాగేశ్రీ వైఖరిని గమనిస్తే, ఈ రాగం ఆధారంగా చేసుకొని ఆయన ఎన్నో ప్రయోగాలను చేసినట్టు తెలుస్తుంది. "ఎంతఘాటు ప్రేమయో" (1951 - పాతాళభైరవి), "ఇది నాచెలి" (1953 - చంద్రహారం), "అన్నానా భామిని" (1957 - సారంగధర), "చమకు చమకు తార" (1959 - పెళ్ళిసందడి), "ఊయలలూగీ నా హృదయం" (1960 - అభిమానం), "ఈ మరపేల ఈ వెరపేల" (1960- భక్త రఘునాథ్) "రాగాలా సరాగాల" (1960 - శాంతినివాసం), "మగరాయా" (1967 - రహస్యం).
రాగేశ్రీ రాగాధారితమై ఆయన ప్రథమంగా బాణీ కట్టిన పాట
"ఎంత ఘాటు ప్రేమయో". ఎంతఘాటు (దనిసగగగ)
ప్రేమయో (గమపామగా) అన్నపుడు, ఈ జాబిలి (పమగమమమ) మరికొన్నిచోట్ల రాగేశ్రీ రాగంలోలేని
పంచమాన్ని ప్రయోగించారు. ఈ అన్యస్వర ప్రయోగమే పాటకు ఒక క్రొత్తదనాన్ని ప్రసాదించి
ప్రఖ్యాతిని తెచ్చింది. ఒక భావం మనసులో ఎగసి నిలువడానికై ఇలాంటి అన్యస్వర ప్రవేశ ప్రక్రియను
ఘంటసాల ఎన్నో సందర్భాల్లో చేశారు. ఉదాహరణకు, లవకుశలోని "సందేహించకు మమ్మా" పాటలో
"రఘుకులేశుడే ధర్మము వీడి" అనునపుడు మమమమామమ గగమమగరిస" అంటూ స్వరకల్పనచేసి
హిందోళంలో లేని రిషభ స్వరాన్ని తెచ్చి, "ధర్మము వీడి" అంటే
ధర్మాన్ని వర్జించుటగాని జరిగితే, అనే అసంభావ్యాన్ని అన్యస్వరప్రయోగంతో చేసి చూపించే
ప్రతిభ ఆయనకే చెల్లు. ఇక వినండి రాగేశ్రీ స్వరవిహారంలో
మాస్టారి గేయ గాయన విలాసం.
ఎంతఘాటు ప్రేమయో - పాతాళ భైరవి
పమగరిసనీ..
దనిసగగ గమపామగ గమపనిప గమపామ గమపమగరి నిరిసనిదా.
ఈ జాబిలి..
పమగమమమ పదమపపప గమపదదా నిసదనిపదా
గగమపసస పదదపమమ గగమగరిసా రిగరిసనిదా..
మూర్చన: దనిసగమదనిస సనిదపమగరిస
రెండేళ్ళ తరవాత ఈరాగంలోనే బాణీ కట్టినా, "ఇదినాచెలి" పాట "ఎంతఘాటు ప్రేమయో"లా
వినిపించదు. ఇక్కడ "దనిసగగగ గమపామగా" స్వరాలలో "దనిస" మంద్రలోఉంటే, ఇది నా చెలి (గమదనిసానిద) గాంధారాదిగా పై షడ్జం తాకి ధైవతంలో నిలుస్తుంది. రెండు
పాటలను విభిన్న సందర్భములకు అన్వయించేలా, ఒకటి మంద్రలోనూ మరొకటి మధ్యమస్థాయిలోనూ మొదలయ్యే విధంగా స్వరాలు అమర్చబడ్డాయి. "ఇదినా చెలి" పాటలో అన్యస్వరాలు అంతగా వినిపించవు.
ఇదినాచెలి ఇదినాచెలి
గమదానిసా సరినినాదనీ నిసదనిమదా నీసానిదమా గాపాగరిసా
దనిసగమపా (వాద్యం)
గమదనిసానిద
గమరిగమారిస సరిసదానిగా...గమదమగ రిగమరిస.
మనసులోని మమతలన్ని కనులముందు నిలచినటుల
దదదనిద మమదగగమ సగమదాద
దససససస
వన్నెలతో
దనిసగమగస నీసనిదా గమదసనిద గమాగారిస
సనిసా రిగరిసనీ దనిసా నిపమా గమపాగరిస
ఇది నా చెలి - చంద్రహారం
ఇది నా చెలి - చంద్రహారం
అన్నానా భామిని
సాగరిమమగగా సారీనిదా దపదసా...అనంతరం రాగశ్రీ
"అన్నానా భామిని" లో సరికొత్త రూపం దాల్చింది. దాటువరస, జంటవరసల క్రమంలో మొదలై మంద్ర ధైవత గమకంతో పల్లవి కూర్చబడింది.
అన్నానా భామిని - సారంగధర
అన్నానా భామిని - సారంగధర
రాగాలా సరాగాల
1960 లో శాంతినివాసం చిత్రానికై ఘంటసాల బాణికట్టిన
"రాగాలా సరాగాలా", సాంఘికానికి సహజంగా, స్వరాలకు లాలిత్యం తోడై యుగళగీతాలకు అగత్యమైన లఘునృత్యపు అడుగుల లయానికి దీటుగా
తయారయ్యింది. "సవాల్ జవాబ్" రూపంలో స్వరఖండికలను పటలాలుగా
మలిచి మొదలైయ్యే ఈ పాట జనాదరణీయమయింది.
మాదాసా దసానిపమా | గాపానీ పనీపమగా | సాగామాపగమా దనిసానిదమా
రాగాలా సరాగాల - శాంతినివాసం
మగరాయా
మగరాయా
"రహస్యం" చిత్రంలో ని " మగరాయా"
పాటకు రాగేశ్రీని సుశాస్త్రీయంగా ఉపయోగీంచారు ఘంటాసాల. రాగేశ్రీ రాగసిద్ధి, పరిణత, ప్రతిభాలక్షణాలన్నీ అభివ్యక్తమయ్యే అంశాన్ని ఈ పాటలో
మనం గమనించవచ్చు. పాట మధ్యన అకారాలూ, గమకాలూ, స్వరప్రస్తారాలు, నేపథ్యంలోని వాయిద్యవరసల సంయోజనము ఇవన్నిటిని ఘంటసాల ఎంతో దీక్షతో సరిదిద్ది, మరెప్పుడూ వినని సరికొత్త బాణీని సృష్టించారు.
మగరాయా, వలరాయా ఈ వయ్యారి నీ సొమ్మురా....
దనిరిససా, దనిగరిరీ గమ సనిసనిద మారినిసా రినిరిసనిదా
వాద్యం interlude :
నిసనిదమగరిసనీని | దనిదమగరిసనిదాద |
దదపమ రీరి నినిదమ గాగ రిరిసనిదా
గమదనిస దనిసాసానిదమా| గమదనిస దనిసాసానిదమా |గమదనిసా దనిసాసా గమదనిసా (అకారం: ఘంటసాల)
చిక్కని వెన్నెల చిందే వేళ (సనిసనిదదద దనిపమ పమమ)
అందని అందాలు అందేవేళా (గమరిస నిసనిదని రిససా పమమా
నిదదా నిసనిదా)
మనసే మల్లెల్ల పానుపు వేయ (దనిసగ రిసనిని నిసనిస
నిదమమ నిదనిద)
ఆ. సా..నిదమ నిదనీ దమగా ససగగమమదద సా నిసమగసనిదా...
సగమదనిస మరిసనిదనిసా గమదనిసా గమదనిసా (ఘం)
మగరాయా - రహస్యం
మగరాయా - రహస్యం
తాళలేరా మదనా
రాగమాలికలకు ఎన్నో నిదర్శనాలున్నా, పాండవవనవాసము చిత్రంలోని" ఓ వన్నెకాడ" నృత్యగీతం యొక్క చరణం
"తాళలేరా" రాగేశ్రీ నిబద్ధము.
తాళలేరా మదనా ...
దనిసానిదమగరి నిససనిదా, దనిసాగా, గమదానీ, దససాగా..సనిదని
తాళలేరా మదనా - పాండవ వనవాసము (జానకి)
తాళలేరా మదనా - పాండవ వనవాసము (జానకి)
రాగేశ్రీ రాగాధారితమైన మరికొన్ని పాటలు
ఈ మరపేల
చిత్రం: భక్తరఘునాథ్, పాట: ఈ మరపేల రచన: సముద్రాల
బాగేశ్రీ ఛాయలతో పి.లీల రాగాలాపన సాగుతూ మొదలయ్యె
పాటలో అక్కడక్కడ రాగశ్రీ రాగం మెరుపులను కనవచ్చు.
ఈ మరపేల - భక్త రఘునాథ్ (పి.లీల)
ఈ మరపేల - భక్త రఘునాథ్ (పి.లీల)
ఊయలలూగీ
చిత్రం: అభిమానం పాట: ఊయలలూగీ, రచన: శ్రీ శ్రీ
అచ్చంగా రంగళించుకొన్న రాగేశ్రీ రాగమే వినబడుతుంది.
సస మగ గమపమరిస నిసదనిసా...
ఊయలలూగీ - అభిమానం
ఊయలలూగీ - అభిమానం
ఇవిగాక, రాగేశ్రీ రాగం నేపథ్యసంగీతంలోనూ, రాగమాలికలలోనూ ఘంటసాలచే ఎన్నో చిత్రాలలో ప్రయోగించబడింది.
ఘంటసాల స్వరసంయోజించిన / పాడిన ఇంకా ఎన్నో పాటలు నేను గమనించకో, లేక నా స్మరణలో లేకనో పేర్కొనలేక ఉండవచ్చు. సహృదయులు తెలిపితే ఉత్తరోత్తరంగా ఈ
వ్యాసంలో ఆ వివరాలను ఈ బ్లాగు అధినేత, శ్రీ సూర్యంగారు ఎప్పటికప్పుడు
సరిజేర్చగలరు. సమకాలీనులైన సంగీతదర్శకులు సైతమూ ఈ రాగ ఛాయను అందుకొని బాణీలను కట్టారు.
ఉదాహరణకు: "నీ నీడలోన" (సువర్ణ సుందరి), "ఆడేపాడే పసివాడ"
(పెళ్ళికానుక), సిగలోకి విరులిచ్చి (సుమంగళి), "కన్నుల్లో నీ
బొమ్మ చూడు" పాటలో 'పున్నమ వన్నెలలో" అనే చరణం (విమల), మరియు "మందర మాటలు విని మౌడ్యమ్మున కైకేయి"
(కలసివుంటే కలదు సుఖం).
చమక్ చమక్ తార - పెళ్ళి సందడి
మనవిసేయవే - రేచుక్క- పగటిచుక్క
చమక్ చమక్ తార - పెళ్ళి సందడి
మనవిసేయవే - రేచుక్క- పగటిచుక్క
యెనధారియర్ వనితామణి (తమిళం)
బడేగులాం సాహిబ్ మరియు తదితర గాయకులు ఆలపించిన రాగేశ్రీ
రాగనిబద్ధమైన పాటలను ఇక్కడ వినగలరు.
లతా మంగేష్కర్ - "మానేనా", సంగీతం:మదన్ మోహన్, చిత్రం: జాగిర్
(1959)
బడే గులాం ఆలీ ఖాం సాహిబ్
మాధుర్యంతో గాంభీర్యాన్ని పెనవేసి, సాహిత్య భావ క్షీరాన్ని స్వరమధువులో కలిపితే అదే
ఘంటసాల ముద్ర. కవిభావానికి దీటైన శ్రుతి - వీనుల విందుగా పొదిగిన స్వరగతి - ఆయన గొంతులో
సరసాలాడే నియతిని నెమరు వేసుకొంటూ మరొక్క రాగంతో మళ్ళీ కలుద్దాము.
అందరికి మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు.