|
జగదేకవీరుని కథ (1961) |
అలనాటి తొలి తెలుగు సినీ కవులలో పింగళి నాగేంద్ర రావు పౌరాణిక, జానపద చిత్రాలలో కొంగ్రొత్త మాటలు సృష్టించారు. ఉదాహరణకు పాతాళ భైరవి లో 'ధైర్యం శాయరా', మాయా బజార్ లో 'అలమలం' (హలో), 'తసమదీయులు', 'గిల్పం', జగదేక వీరుని కథలో 'ఓ హల' (ఇదికూడ హలో లాంటిది) మొదలయినవి. అయితే పద్య సముచ్ఛయములలో కూడ వారి పదభూయిష్టత ప్రస్ఫుటిస్తుంది. 1961 లో విడులైన విజయా వారి జానపదచిత్రం 'జగదేకవీరుని కథ' లో - కథానాయకుడు ఇంద్రుని కొలువులో ప్రేమ పరీక్షలో చెప్పిన పద్యాల రచన చెప్పుకోదగినది. పింగళి వారు చక్కని పదాలను ఎన్నుకున్నారీ రచనలో. నలుగురు దిక్పాలకుల కుమార్తెలను సూచిస్తూ తనయ, కుమారి, సుత, సుపుత్రి అనే పదాలు వాడారు. అలాగే కుటుంబ భాగస్వామియైన పెనిమిటిని పతి, భర్త, ఆత్మేశుడు, జీవితేశుడు అని సూచించారు. పరకాంతను కూడ గౌరవంగా మానిని (మానవతి) అని సంబోధించారు. అలాగే భర్తను విడచి ఉండగలదా లేదా మనగలదా అనే భావాన్ని తనరు, వరలు, అలరు, చెలగు అనే పర్యాయ పదాలు వాడి వర్ణించారు. ఈ పదాలకు అర్థం ప్రకాశించు లేదా శోభిల్లు అని వస్తుంది. ఆనాటి పద్యాలు వింటూంటే వీనులకు విందుగా వుంటుంది. ఆయా పదాలను వాటి భావానికి తగినట్టుగా ఉచ్చరించే ఘంటసాల మాస్టారి స్వరసానుభూతి మనకు ఎన్నో మధురమైన అనుభూతులను, జ్ఞాపికలను మిగిల్చింది. 'తెలుగు అంటే ఇలా వుండాలి' అనిపిస్తుంది. తెలుగు చదువరులకు, శ్రోతలకు ఈ పద్యాలు అమృతతుల్యం. అలాంటి పద్యాలు చలన చిత్ర మాధ్యమంలో మళ్ళా వింటామా అనిపిస్తుంది. ఈ చిత్రం కె.వి.రెడ్డి అద్భుత సృష్టి. సంగీతం పెండ్యాల వారిది. ఇదివరలో దేశ్ రాగంలో ఘంటసాల ఈ చిత్రానికి ఆలపించిన 'ఓ! దివ్యరమణులారా' మా బ్లాగులో ప్రచురించాము. ఇపుడు చక్కని పద్యాలను ఆలకించి ఆనందించండి.
వీడియో సౌజన్యంః శ్రీ నూకల ప్రభాకర్ గారు (ఘంటసాల గానచరిత)
|
చిత్రం: |
జగదేకవీరుని కథ (1961) |
|
రచన: |
పింగళి నాగేంద్ర రావు |
|
సంగీతం: |
పెండ్యాల నాగేశ్వర రావు |
|
గానం: |
ఘంటసాల వేంకటేశ్వర రావు |
|
ఉ.మా. |
ప్రాణ సమానలై వరలు
భార్యలు నల్వురె నాకు, వేరె యే |
|
|
మానిని నిల్చెనో యిచట, మాతకదా పరకాంత మాయవే |
|
|
యైననిదే జగజ్జనని యాన బయల్ పడి రాగదమ్మ యీ |
|
|
దీనుని పుత్రవత్సలత దీవన సేయగదమ్మ తల్లివై! |
|
సీ. |
సకల ధర్మానుశాసకుడైన
దేవేంద్రు |
|
|
తనయ
పతిన్ బాసి తనరగలదే…! |
|
|
పాపరాశి దహించు వహ్నిదేవ కుమారి |
|
|
ఆత్మేశు
నెడబాసి అలరగలదే…! |
|
|
పరమ పావనుడైన వరుణదేవుని సుత |
|
|
భర్తను
విడనాడి వరలగలదె! |
|
|
నాగస్వరానంద నాగరాజ సుపుత్రి |
|
|
జీవితేశుని వీడి చెలగగలదే..ఏ..! |
|
|
|
|
తే.గీ. |
పార్వతీదేవి కృపను నా భార్యలైన |
|
|
అమరకాంతలు పతివ్రతలగుదురేని |
|
|
ఇపుడు వారల గప్పిన యింద్రజాల మహిమ |
|
|
తృటిలోన మటుమాయమగునుగాక! ఆ..ఆ.. |