సారంగధర చిత్రం కథలో చిత్రాంగి (భానుమతి) సారంగధరుని (ఎన్.టి.ఆర్) ప్రేమిస్తుంది. కాని సారంగధరుడు వేరొకరిని ప్రేమించడం వలన చిత్రాంగిని చేసుకోవడానికి తిరస్కరిస్తాడు. అయితే రాజకీయ కారణాల వలన దేశ ప్రజల రక్షణకోసం చిత్రాంగిని సారంగధరుని తండ్రి (ఎస్.వి.ఆర్) మోసంతో వివాహమాడతాడు. సారంగధరుడు చిత్రాంగిని తల్లిగానే భావిస్తాడు. కాని మోహం తగ్గని చిత్రాంగి సారంగధరుని
బుట్టలో వేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఒకసారి ఆమె సారంగధరుని ఏకాంతంగా
కలసి అతనిని కవ్వించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె మేనకా
విశ్వామిత్రుల చిత్ర పటాన్ని సారంగధరునికి చూపించి "గాధి రాజసుతుడైన
విశ్వామిత్రుడు ప్రేమతో మేనకను ముద్దుచేయడానికి మోహము తో కౌగలించడం చూశావా రాకుమారా" అని
అంటుంది. అయితే సారంగధరుడు ఒక మాతాశిశువుల చిత్రాన్ని చూపించి అదే
పద్యాన్ని భిన్నంగా పలుకుతాడు. అతను "అల్ల నగాధిరాజు" అని ప్రారంభించి అదే
పద్యాన్ని పూర్తి చేస్తాడు. దానికి అర్థం - అల్ల (అదిగో) నగాధిరాజ (నగము = పర్వతం; నగాధిరాజు = పర్వత రాజు అంటే
హిమవంతుడు); నగాధిరాజ సుతుడు = మైనాకుడు (అంటే మైనాదేవి కుమారుడు, ఈయనే
హనుమంతుడికి సాగర లంఘనమప్పుడు సహాయం చేసేడు) అర్మిలి = అపేక్ష; మేనక (హిమవంతుడి భార్య పేరు మైనాదేవి, అవిడనే మేనకాదేవి అని కూడా
అంటారు). మిగిలినదంతా పైన అన్వయించినట్లే. ఆ విధంగా చిత్రాంగి, సారంగధరుడు వేర్వేరు అభిప్రాయాలను ఒకే పద్యం ద్వారా స్వల్ప సంధి భేదం ద్వారా ప్రకటిస్తారు. అయితే సారంగధరుని బుట్టలో వేయడానికి చిత్రాంగి మరొక
చిత్ర పటాన్ని చూపించి "ఆశ్చర్యం చూడు, శ్రీ కృష్ణుడు గోపికల కట్టు బట్టలు మాయజేసి కొమ్మ మీద ఎక్కి,
ఇక్కడున్నాయి మీ బట్టలు వచ్చి తీసుకోండి అంటున్నాడు" అని అంటుంది.
అందుకు కూడ సారంగధరుడు తన నిగ్రహాన్ని ప్రదర్శిస్తూ అవును నిజమే కృష్ణలీలల
విశేషమదే చూడు తల్లీ అని మాట మారుస్తాడు. ఈ పద్యాలు రచించినది సముద్రాల సీనియర్, సంగీతం ఘంటసాల, గానం ఘంటసాల, భానుమతి.
Thanks to idreamworks for posting the video clips to You Tube.
చిత్రం: | సారంగధర (1957) | |
రచన: | సముద్రాల రాఘవాచార్య | |
గానం: | ఘంటసాల, భానుమతి | |
సంగీతం: | ఘంటసాల | |
భానుమతి: | అల్లన గాధిరాజ సుతుడర్మిలి మేనక ముద్దొనర్ప జా | |
గిల్లి కవుంగలింప దమకించుట గంటివే రాకుమారా! ఆ.. | ||
ఘంటసాల: | ఔ! అల్ల నగాధిరాజ సుతుడర్మిలి మేనక ముద్దొనర్ప రా | |
గిల్లి కవుంగలింప దమకించుట బాల్యము కాదె మాతరో..ఓ.. | ||
భానుమతి: | అక్కజమీ పటమ్ము గనుమా మురళీధరుడోలలాడు | |
అమ్మక్కల కట్టు పుట్టముల మాయగ జేకొని కొమ్మ | ||
నెక్కి రండు ఇక్కడనున్న వందుకొనుడీ యను రీతి ఆ..ఆ.. | ||
ఘంటసాల: | నిజమ్ము కంటికిన్ జిక్కని కృష్ణలీలల విశేషమదే కనవమ్మ సూటిగా..ఆ.. |
పద్యాలలోని కొన్ని పదాల అర్థములు: అల్లన = మెల్లగా; గాధిరాజ సుతుడు = విశ్వామిత్రుడు; అర్మిలి = ప్రేమమున; తమకించు = మోహించు; అక్కజము = ఆశ్చర్యము; పుట్టము = వస్త్రము; కట్టు పుట్టములు = కట్టు బట్టలు; ఓలలాడు = స్నానము చేయు; అమ్మక్కలు = ఆడవాళ్ళు; జాగిల్లు = మోహించు; రాగిల్లి = రంజిల్లు/ ప్రేమించు (ఇది బాల్యములో బిడ్డకు తల్లిపై గల ప్రేమ. తన తండ్రిని చిత్రాంగి పెండ్లాడటం వలన ఆమె సారంగధరునికి సవతి తల్లి అయింది. అందువలన తల్లిని ప్రేమతో కౌగలించుకోవడం బాల్యం కాదా అని అతని అర్థం.)
కృతజ్ఞతలు: పద్యలులలోని అర్థ భేదాలను తెలుసుకొని అందించిన శ్రీయుతులు రామ ప్రసాద్ గోనెళ్ళ గారికి మనఃపూర్వక ధన్యవాదములు.