అహంభావం అంబారినుండి నేలదిగి, తన స్వార్థపరమైన దర్బారును
వీడి, సర్వాధికారికూడా సర్వసహకారిగా మారాలంటే అంబ కరుణ కావాలి.
అ శక్తే పెద్దమ్మ, ఆ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ. మాతృత్వ మహాశక్తి యొక్క సంకేతమే దసరా పండుగ కదా. ఘంటసాల ఎన్నో దేవీస్తుతులను పాడారు. లలితాశివజ్యోతి సంస్థ నిర్మించిన
'లవకుశ', 'రహస్యం' మరియు 'సతీసావిత్రి' ఈ మూడు చిత్రాలకూ ఆయన స్వరబరచి
పాడి, పాడించిన పాటలు, పద్యాలు శాశ్వతంగా
నిలిచాయి. వాటికి దేవిస్తుతే ఆధారశ్రుతి. అరవైయ్యేళ్ళ
క్రితం 'చంద్రహారం' చిత్రంకోసం(1954) ఘంటసాల
స్వరసంయోజనముజేసి సహగాయకులతో పాడిన "విజ్ఞాన దీపమును వెలిగించ రారయ్య" అచ్చంగా
సారంగ రాగనిబద్దం. ఆ రోజుల్లో తనకు ప్రావీణ్యతగల శాస్త్రీయ సంగీతాన్ని వృత్తిగా జేపట్టక
లలిత సంగీతాన్ని ఎన్నుకొన్నా, ఈ పాటయొక్క బాణీలో మనకు శుద్ధశాస్త్రీయ
సంగీతమే వినిపిస్తుంది. దేవియనగ జ్ఞానజ్యోతి.
దాన్ని మనలో వెలిగింపజేసీ ఈ సారంగ అభంగ తరంగాలను వినండి.
సారంగ రాగంలో ఎన్నో పాటలనూ పద్యాలనూ మాస్టారు పాడారు. దసరా శుభాకాంక్షల పేరుతో
సంక్షిప్తంగా దేవిస్తుతిపరమైన సారంగ రాగ గానాన్నిమీకు
వినిపించాలని - అంతస్తులు చిత్రంకోసం సారంగరాగంలో మాస్టారు పాడిన శార్దూలవిక్రీడిత బంధంలోని పద్యం.
దేవీనీ కరుణాకటాక్షమునకై దీనాతిదీనుండనై
నీవేతప్ప మరేదినేనెరుగకన్ నిత్యంబు నర్చించెదన్
ఈవా నాకభయమ్ము నీ దర్శనంబీవా వరంబియ్యవా
భావాతీతము నీదుపోకడికనా భాగ్యమ్ము నీచిత్తమే
గౌరిమహాత్మం చిత్రంకోసం (1956) సారంగరాగంలో పాడిన దండక ఖండిక.
సారంగ రాగానికి ఆరోహణం: S R2 G3 M2 P D2 N3 S : అవరోహణం: S N3 D2 P M2 R2 G3 M1 R2 S. శుద్ధ మరియు ప్రతిమధ్యమములున్న ఈ మధుర రాగం, భక్తిభావానికి
వీరరసావిష్కారానికి పేరుగాంచింది.
కల్యాణి జన్యమైన సారంగ రాగానికి దగ్గరగానున్న హిందూస్థానిరాగాలు: కేదార్ మరియు
శుద్ధసారంగ్. సంగీతం తెలియనివారూ ఈ రాగాన్ని వినినంతనే ఆనందించగలరు. త్యాగరాజకృత నౌకాచరిత్రలోని
"ఓడనుజరిపే ముచ్చటవినరే" మరియు "నీవాడా నెగాన" "ఎంత భాగ్యము"
ప్రసిద్ధమైన కీర్తనలు.
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.