22, ఆగస్టు 2014, శుక్రవారం

ఘంటసాల ఆలాపనలో ఆరభిరాగం, సామగానం


ఘంటసాల మాస్టారు తన స్వీయ దర్శకత్వంలోను మరియు అన్య సంగీత దర్శకుల నేతృత్వంలోను పలురాగాలలో అద్భుతమైన గానసంపదను మనకందించారు. ఇదివరకు ఘంటసాల-రాగశాలలో హిందోళం, మలయమారుతం, దేశ్, ఫరజు, పటదీప్, చారుకేశి, పంతువరాళి, నాటకప్రియ,విజయానంద చంద్రిక, సింహేంద్రమధ్యమం గురించి, రహస్యం చిత్రం కోసం మాస్టారు కూర్చిన గిరిజాకల్యాణం రాగమాలికల గురించి మిత్రులు చంద్రమౌళిగారు విపులంగా వివరించారు. ఈసారి స్వరబాంధవ్యం గల మూడు రాగాలు - ఆరభి, సామ, మరియు శుద్ధ సావేరిల గురించి తెలుసుకుందాం. ఆరభి రాగంలో పాటలు, పద్యాలు కోకొల్లలు. అయితే ముఖ్యమైన మరొక వర్గం దండకాలు. ఇవి ఆరభితోనే ఆరంభమైనవి. ముందుగా ఆరభిలోని శాస్త్రీయ పోకడలను తలచుకుని, ఆరభిలో మాస్టారి ప్రముఖ బాణీలను గుర్తుచేసుకుని, పిదప స్వరబంధువుల సామ్యాలను-వ్యత్యాసాలను తెలుసుకుని, ఆపై ఆరభి పాటలు, పద్యాలు, దండకాల విశేషాలను, స్వల్పసంఖ్యలోనున్నా చక్కనైన సామ మరియు శుద్ధ సావేరి పాటలను తలచుకున్దాం. ఇంక చంద్రమౌళిగారి రాగశాలలో అడుగిడదామా! 
ఆరభి  శాస్త్రియ సంగీతాన్ని గాక సినిమా సంగీతాన్నీ అలరించిన రాగం. ప్రముఖ సంగీత నిర్దేశకులందరూ సుశ్రావ్యమైన రాగాన్నిఆనందించి అందించినవారే. మచ్చుకుగా పేర్కొనాలన్న, పెండ్యాల స్వరపాకంలో పండినవి: తపము ఫలించిన శుభవేళ (శ్రీకృష్ణార్జున యుద్ధము) తథాస్తుస్వాములకొలవండి (మహామంత్రితిమ్మరసు); సాలూరివారి స్వరాలూరి సంపన్నమైనవి:  సుందరాంగులను చూచినవేళల (అప్పుచేసి పప్పుకూడు), నమోనారసింహా (భక్తప్రహ్లద); టి.వి.రాజు రాగవిహారంలో రాణించినవి: అమ్మా తమ్ముడు మన్నుతినంగ, శ్రీకామినీకామితాకార (పాండురంగ మాహాత్మ్యం) మరియు, మన గళవేల్పు ఘంటసాల సంగీత దర్శకత్వ స్పర్షమణి రంజితమైనవి :హరియేవెలయునుగా (వాల్మీకి), జన్మసరిపోదుగురుడా (రహస్యం), భక్తమందార రఘురామ (దండకం), పద్యాల్లో " పద్మనాభ పురుషోత్తమపాపనాశ", "మంగళంకోసలేంద్రాయ" (శ్రీ వేంకటేశ్వర సుప్రభాతప్రార్థన) ఇంకా ఎన్నో.
ఆరభి


ఆరభి శంకరాభరణజన్యమైన ఔడవ సంపూర్ణరాగం. ప్రాచీన రాగం. "ఆరభిః సర్వదా గేయమారోహే -ని వర్జితః, క్వచిదారోహ సంయుక్తా నిషాదో నిగ్రహో భవేత్" (చతుర్దండి ప్రకాశిక) స్వరస్థానాలు: షడ్జమ పంచమాలు గాక, చతుశృతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం, కాకలి నిషాదం  (ఆరొహణ: S R2 M1 P D2 S, అవరోహణ  S N3 D2 P M1 G3 R2 S). ఆరోహణలో -ని వర్జితమైన ఉపాంగరాగం. రి-- జీవస్వరాలు. మూర్చనకారకస్వరాలు: రి - అభేరి, - మోహనకల్యణి, మరియు - కేదారగౌళ.  గమకావలంబనలేక శుద్ధస్వరాలనుపట్టి వికసించే స్తోమతగల రాగమిది. ఏకంగా పలుకే రిషభస్వరమే ఆరభి రాగాన్ని ఎత్తిచూపుతుంది.రిపమగరీ, సనిదపమగరీ అంటూ రిషభమే ఆరభికి ఆశ్రయం.  గాంధార నిషాదాల మీద నిలబడటానికి అవకాశంలేదు. - లకు  - లే ఆధారం. నిషాదస్వరానికి అవకాశం తక్కువ. "సాధించనే " కృతిలో "ససదప మగరిస" ( సారాసారుడు) అను చరణాన్ని నిషాదస్వరం లేకనే, త్యాగరాజులు నిర్దేశించి చూపేట్టారు. తన జనకరాగమైన శంకరాభరణానికి గాంధారం జీవస్వరమైనా ఆరభిలో గాంధారాన్ని పట్టిచూపడం నిశిద్ధం. అలా గాంధారాన్ని ఈడ్చి పలుకితే సామరాగమయ్యే అవకాశముంది. విద్వాంసులు ఎస్. రామనాథన్ , సామరాగానికి, ఆరభికి ఇంచుమించు ఒకే మూర్చన ఉన్న, న్యాసస్వరం(దింపుడు స్థలం) గాంధారమైన, అది సామరాగముకాగలదనే సంగతిని ఒక ప్రాత్యక్షికలో వివరించారు. మధ్యమకాల సంచారం, జంటస్వర ప్రయోగాలూ (రిరి, మమ, దద పపమగరిస..) ఆరభికి వన్నెతెచ్చే అలంకరణాలు.  ద్విస్థాయి గానానికి (మంద్ర పంచమంనుండి తార పంచమం వరకు) అనుకూలమై, రాగాలాపనకు మంచి అవకాశమున్న రాగం.  ఆరభి, "దేవగాంధారి"కి సగోత్రజ్ఞాతి. దేవగాంధారి రాగంలో R2 కంపితం, గాంధార నిషాదాలకు ప్రాముఖ్యత కలదు. ఆరభి మధ్యలయవిరాజమానమైతె దేవగాంధారి విళంబలయ రాజ్ఞి. పద్య-శ్లోకగాయనానికి, వచనాలను రాగయుక్తంగా పాడుటకు, ముఖ్యంగా తెలుగులో ప్రసిద్ధమైన దండకబంధ రచనప్రస్తుతికి ఆరభి ఆలాపనే ఆహ్లాదకరం. కృతులలో త్యాగరజ పంచరత్నకీర్తన "సాధించనే" రాగానికి రాజముద్రిక. (ఆరభిలొ పదునాలుగుకు పైనే  త్యాగరాజు కీర్తనలున్నవి). దీక్షితార్ రచన "శ్రీసరస్వతి" ఖ్యాతమైన కృతి.


ఆరభి, ఘనరాగం. ఘనరాగమనే వర్గికరణ ప్రాచీనంలో కనబడవు.  తన చతుర్దండి ప్రకాశికలో ముద్దు వేంకటముఖి ఘన, నయ మరియు దేశ్యమనబడే మూడు విధాల రాగాలను పేర్కొన్నాడు.  జాబితా ఉందిగాని త్రివిధ రాగవర్గాల లక్షణాలు 17 శతాబ్ధపు గ్రంథంలో లేవు. ప్రథమంగా ఘనరాగలక్షణాలను అందించినది సుబ్బరామదీక్షితులే అనుకుంటాను. ఘనరాగములు తానసౌలభ్యంతో గూడిన శక్తియుతమైన రాగాలు.

విస్తరించి పాడుటకు ఘనమైనరాగాలు. ఘనరాగపంచకమని నాడు ప్రసిద్ధిగాంచిన రాగాలు (వరుసగా) నాట, గౌళ, ఆరభి, వరాళి, మరియు శ్రీరాగం. వేంకటముఖ మరికొన్ని రాగాలతో ఘనాష్టకాలను పేర్కొన్నాడు. మంగళంపల్లి గారన్నట్లు ఘనగాం పాడగల శక్తి గాయకునికుండాలిగాని రాగాల్లో ఘనత్వము అల్పత్వమూ ఉన్నాయా? ఐనను వర్గీకరణ, రంజకమైన రాగాలనూ, అన్యదేశ్యములైన రాగాలనూ ప్రత్యేకించడానికై పుట్టియుండవచ్చును. నయ రాగమన్న, వినినంతనే విన్నవారి మనస్సును ఆకట్టుకుపోయే రంజకత్వమున్న రాగం.  దేశ్యరాగమన్న అన్య దేశములనుండి వచ్చి ఇంపైనది అంటారు సుబ్బరామ దీక్షితులు. రాగరాజుడైన త్యాగరాజు కాలంలో వర్గాలు ఉండెవి. "ప్రణవ నాదసుధారసంబు ఇలను నరాకృతియాయె" అను కృతిలో (అదియూ ఆరభిరాగమే) త్రివిధ వర్గాలనూ పరోక్షంగా పేర్కొన్నారు. తనకు రాముడే సంగీతం. రాముడనగా నాదసుధారసమే నరాకృతిదాల్చినవాడు. రాగమే కోదండము, సప్తస్వరాలు ఘంటలు,గతులే శరములు వాక్కులే సంగతులు.  దుర,నయ,దేశ్య పద్ధతులే త్రిగుణములు. ఇక్కడ దుర అనగా ఘనమని అర్థం. దుర అనగా వేగము, యుద్ధము,ఆడంబరము, సంభ్రమము. అవి ఘనరాగ లక్షణాలు.

ఆరభి రాగంతో సంగీత కఛేరిప్రారంభించడం ఒక సంప్రదాయం. అందుకేనేమో, పౌరాణిక చిత్రాల్లోని దండకాలు రాగమాలికలతో అలంకరింపబడినా ఆరభి రాగంతోనో మొదలౌతాయి. ఉదా: హే! పార్వతీనాథ (సీతారామకళ్యాణం), శ్రీ కామినీ కామితాకార (పాండురంగ మాహాత్న్మం), జయజయ మహాదేవ శంభోహరా శంకరా (కాళహస్తి మాహాత్మ్యం), శ్రీమన్మమహాలొక (లక్ష్మీకటాక్షం). ఘంటసాల కంఠరూపముదాల్చిన దండకాలన్నీ రాగమాలికలేయైనను మొదటిరాగం ఆరభి. తమిళంలో ఆరభిని పళంటక్క రాగమంటారు. వీర, రౌద్ర, కరుణ రసాల సంవహనముకు ఆరభి ప్రశస్తమైనరాగం. భక్తిభావ ప్రకటన, దైవస్తుతి, మంగళప్రద సన్నివేష నిఘోషభూషణమైన రాగం. ఆరేడు వందల సంవత్సారాలునుండి తన ప్రాచీనరూపాన్ని రక్షించుకొనియున్న ఆరభి, హితశైత్యోల్లాసకారియగు శిశిరఋతుసాంబంధికమంటారు.  ఇంక రాగోపన్యాసాన్ని ఆపి, ఆలస్యంజేయక ఆరభిని ఆరంభించడమే సుసంగతం

ఆరభిరాగంలో పాటలు

ఆరభిరాగంలో ఘంటసాల, "వాల్మీకి" చిత్రానికై  ఆలపింన "హరియే వెలయునుగా" పరిశుద్ధ శాస్త్రీయపద్ధతిలో ఆరభిరాగము ఊవిళ్ళూరించే ఆదితాళనిబద్ధమైన కృతి. అదే బాణీలో ఆయన కన్నడభాషలోనూ చిత్రానికై పాడారు.

సాసా దసదపమా మపదద సా    ససస
హరియే..        వెలయునుగా   భువిని | హరియే
దస సరీరీరి  సరిమగరీరీ సరిసాస సదరీసదపమా
పరిపాలింప సాధుల    పరిమార్ప దనుజుల | హరియే (దరిసరిదపమా)
పా మగరిసరీ సరిసనిదా సరిమగరీ మపదపదా రిపమగరీ సాసదాదపాప  మగరిస రిమపా  (వాయిద్య నేపథ్యం)
పాప పాపపప        మపదప  పాపమరిసరీ  మరిమ పదదదద   దససరీ దదప
యజ్ఞకుండములు     ఆరక    వెలుగు         హోమధూమములు మింటను చెలగు
దాస సారి సరి సరిరిరి సరిమగరి....సారిరిసారిరిసా ససదపమగరిసరిమపదసా
వేదగీతి వనభూముల మ్రోగు..... 
ఆలాపన....................................................

ఇక్కడ వినబడే వేదఘోష: "ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహీ తన్నో విష్ణుప్రచోదయాత్" భాగాన్ని అత్యాశ్చకరంగా తాళబద్ధంచేసి, ..నీనీసరీరీ నీసరీ/ సాస నీసారి సాససా/ సరీ సాస నిసాసారీసా.. అనే త్రైస్వర్యాలను జేర్చి ఒక పవిత్రభావాన్నే సృష్టించబడింది. ఇది సంగీత సంప్రదాయజ్ఞుని ప్రజ్ఞాపాటవానికి గీటురాయి. హరియే వెలయునుగా


భగవాన్ అవతరిపా


 సంగీత నిర్దేశకత్వంలో తనకు స్వేచ్ఛయుండిన, అందరూ సులువుగా పాడుకొనేలా, మనసులను ఆకట్టుకొనేలా, పాటలకు స్వరకల్పన చేయుట ఘంటసాల పెట్టుకొన్న నియమం. అది సంపూర్ణంగా ఫలమిచ్చిన చిత్రాలు లవకుశ మరియు రహస్యం. తనకు ఆత్మీయమైన రాగాలలో ఒకటైన ఆరభి రాగాన్ని ఘంటసాల తన స్వరసంయోజనలొ ఎన్నో చిత్రాలలో, పాటలకు, పద్యాలకు, దండకాలకు మరియు నేపథ్యస్వరాలుకూ వినియోగించారు. చలనచిత్రేతరంగా పాడిన  తను స్వరబరచి ఆలపించిన ఆరభిరాగ నిబద్ధమైన పాటలూ గలవు. వాటిలో భక్తిరసభరితమై శ్రీ వేంకటేశ్వరుని కథావర్ణనే ప్రధానమైన పాటలో ఘంటసాల ఆరభివిహరి, ఆహ్లాదకారి, భక్తిరసధారి.
(నేపథ్య వాయిద్య స్వరాలు)
సారిమాప దస దా, పమగసరి | రీమపాదమగరీ, సదదసరి| ససరిసదమప ససరిసదమప| ససాసదపమగరిసా సరిమపద||
తబలా: నాదిన్ దిన్నా నాదిన్ దిన్నా నాదిన్ దిన్నా నాదిన్ దిన్నా.

సదసరి మగరీ  సదాససాసా |ససరిరి మమపా మపదప మగరీ |
జయ జయ జయ శ్రీ వేంకటేశ |జయ జయ జయ ఓమ్ శ్రితజనపోష|
పపపా మగరిరి సాసససాస |రీమపాపప పదరిస దా,పా |
సనకాది ఋషులు సన్నుతి సేయ| లక్ష్మిదేవినీ పాదములొత్త|
పమపద సాసస దససససాస | సదరిస దదపా పమదప మరిసా|
భృగుకోపమునా వైకుంఠమిడి | భూలోకమునే జేరితివయ్యా || జయ ||

నీ కల్యాణం మహోత్సవంబుగ జరిగిందయ్య.. ఇక్కడ ఆనందమానంద మాయెనే అను సాహిత్యానికి సాధారణ గాంధారాన్ని జెర్చి ఆరభిరాగం పరివర్తనపొంది  "సీతమ్మ పెళ్ళికూతురాయనె" జానపద స్వరకట్టును ఎంతో జాణతనంగా పొదిగించారు ఘంటసాల. అలాగే పాట కొనసాగుతూ తుదకు మధ్యమావతి రాగానికి క్రమించి, అంటే ఆరభి రాగం అవరోహణస్వరాలనే ఉంచి ఒక్కకాకలినిషధం చేర్చి, మంగళానుశాసన సంప్రదాయపుసిద్ధిని పాటించడం గమనీయం.

జయజయజయ శ్రీ వేంకటేశ.

"తపము ఫలించిన శుభవేళ"  పెండ్యాల దర్శకత్వలో "శ్రీకృష్ణార్జునయుద్ధము" చిత్రానికై ఘంటసాల ఆలపించిన ప్రేమోత్సాహగీతి.  ఆద్యంతంగా ఆరభీరాగమని అనలేముగాని, ఆరభిరాగాధారితమైనదే. పంచమంలో నిలకడవల్ల గలిగె ఆరభిరాగపు సొగసును పెండ్యాల అద్భుతంగా పాటలో సాధించారు. బెదరగనెలా ప్రియురాలా( ప్రియురా..ససరిసా  లా.. సదపా)  స్వరక్రమంలో '’ నుండి కు జారుతూ పైకివెళ్ళి పలికిన ఘంటసాలగళంలోని కోమలభావం మాంత్రికమైనది.

దససస   సా.సస   దదరీసా దానిదపామా    మపదప  మాగా రిగసా  ససరిస పా
తపము  ఫలించిన శుభవే..ళా...                         బెదరగ    నే లా            ప్రియురాలా          
పదదద పదమప దససస సా సనిదా దసరిమ గామగ రీస  సాసా రిగరిగ సరిసరి మాప
ఎదుటని లువమని మంత్రము వేసీ   బెదరగ  నే..లా..       జవ  రా... ....

ఇలాసాగుతూ, "హరియే వెలయునుగా" కృతిలా శుద్ధమైన ఆరభిరాగ సంయోజనావ్రతమేమి లేక, అన్యస్వరాలు, ఆరభిరాగంలో లేని కొన్ని ప్రయాగాలనూ చేశారు పేండ్యాల. ఏది ఏమైన పాట బహుజనాదరణీయమై నిలిచింది. "చలిమబ్బులలో జాబిలివలెనె మేలిముసుగులో దాగెదెవేల?" ఇక్కడ జాబిలివలేనే రెండవ సంగతిలో "గామగరీమమ" ప్రయోగం ఆరభిలొ శాస్త్రీయంగాలెని, నవసృష్టి. అలాగె  మేలిముసుగులో అనునప్పుడు "పదదద దదనిద" స్వరాలలో కాకలి నిషాధం ఆరభిరాగంలో లేనిది. రంజనకోసం అన్యస్వరాల చేరిక సినిమాసంగీతంలో సామన్యమే.

తపము  ఫలించిన


దండకాలు

దండకము విశిష్టమైన మాలావృత్తము. సంస్కృతభాషలోప్రయోగాలున్నా తెలుగులోనే అతిశయ ప్రచురణ. భక్తియొక్క ఆవేశపూర్ణ అభివ్యక్తి, దైవశక్తియొక్క సుదీర్ఘ స్తుతి, పరాకు ఇవే దండకప్రయోగాలలో ఇమిడియున్న భావాలు. దీర్ఘ-సంయుక్తాక్షర-పరుష వర్ణప్రవాహమైన భక్తివాహిని. 26 అక్షరాలకు ఎక్కువై 999 అక్షరాలవరకూ దీన నడక శాస్త్రబద్ధం. " ఏకోన సహస్రాక్షర వృద్ధిర్భవతి దండకం వృత్తం (వృత్తరత్నాకర)".

దండకం "తానాన తానాన" అను "తగణ"ముల మాల.  ఒక్కగుర్వక్షరం మరియు రెండు లఘ్వక్షరాలు ఏకప్రకారంగా నిలకడలేక సాగి, నమస్తే నమస్తే నమః  అంటూ ఒక గుర్వక్షరంతో సామాన్యంగా ముక్తాయం వాటిల్లుతుంది.    ఉదాహరణకు  "పాండురంగమాహాత్మం" చిత్రంలో మాస్టారు ఆరభిలో ఆలపించిన దండకముయొక్క గణవిభాగం ఇలా ఉంటుది:
శ్రీకామి|నీ కామి|తాకార|సాకార|కారుణ్య|ధారా |వాంకూర|సంసార|సంతాప|నిర్వాఫ|ణా...
దాపాప పాపాప మాపాప మాపాప మాపాప ....మాపాప మగరీ....అంటూ దండక పాత్రంలో ఆరభీస్వరవాహిని సాగుతుంది.

భక్తమందార రఘురామ (ప్రైవేట్ ఆల్బం)

ధన్యోస్మి ధన్యోస్మి (లక్ష్మీ కటాక్షం)

హే! పార్వతీనాథ (సీతారామ కళ్యాణం)

జయజయ మహాదేవశంభో (కాళహస్తి మహాత్మ్యం)

హే! కామినీ కామితాకార (పాండురంగ మహాత్మ్యం)

ఏకతారిని మీటుతూ " సా గపమ గమగారి ససస సా; పద దా దాద దాదదా దాసదప పమగరిస" అంటూ సాగే నాదం, తత్త్త్వపద - భజన విధానం. మార్గంలో ఆరభి స్వరాలు శాస్త్రీయ పీతాంబరాన్ని వదలి, కాషాయాన్నితోడిగి ఎలా అందరూ పాడుకొనేలా సరళసుందరంగా ఉంటుందో వినండి. ఘంటసాల బాణిలో వాణిలో "రహస్యం" చిత్రంలో తత్త్వపదం.

జన్మసరిపోదు గురుడా

పద్యాలు
ఇప్పటికి తెలుగులో  పద్యమనగా అది ఘంటసాల నైవేద్యమే. ఎవరుపాడినా, ఎక్కడపాడినా, ఎలాపాడినా అయన జాడు, ముద్ర, బాణి ఉండితీరుతుంది. సాహిత్యాన్ని తన ఉచ్చారణాశుద్ధితో పండించి, భావాన్ని తన రసపరిపుష్ట కంఠశ్రీ సించనతో వడబోసి, ఆయన పాడిన పద్యాలు ఎన్నడూ వాడని రసగుళికలు. ఆదినుండి అంత్యంవరకు (భగవద్గీత: "ఏషాభ్రాహ్మీస్థితిః పార్థా) మాస్టారు ఆరభిరాగంలో ఆలపించిన పద్యాలు ఎన్నొ. పరిమితంగా ప్రధానమైన కొన్ని పద్యాలను ఇక్కడ వినగలరు.

పరిత్రాణాయ సాధూనాం (దేవాంతకుడు)


సారధి ఎంత (శ్రీకృష్ణరాయబారం)


వందే సురాణాం (సత్య హరిశ్చంద్ర)సామ
సామరాగం నిషాదవర్జితం. (ఆరోహణ: S R2 M1 P D2 S, అవరోహణ: S  D2 P M1 G3 R2 S).  సామరాగంలో రిషభానికి గమకమూ, గాంధారానికి ప్రాధాన్యత ఉన్నది. వివరాల అగత్యమేలేక అందరి నాలుకలపై నిలచిన పాట "జయజయ శ్రీరామా రఘువరా", ఆ కాలంలో గృహిణీమణులు వారివారి ఇండ్లలో పూజల వేళలో, రామునికి హారతిస్తూ పాడే భజనల జాబితాలో చేరిపోయిన పాట ఇది. ఈ ఖ్యాతికి టి.వి.రాజు స్వరకల్పన, 'జయసింహ' చిత్రంలో గుమ్మడి నటన, ఘంటసాల గానం అన్నీ కారణాలే. రాగమూ, స్వరజ్ఞానమూ ఏవీ తెలియక పోయినా, సుశ్రావ్యంగా ఎవరైనా పాడుకునేలా ముద్రవేసి పెట్టారు, మాస్టారు. 'రహస్యం' చిత్రంలోని గిరిజాకల్యాణ ఘట్టాన వినబడే "అంబాయని అసమశరుడు" సామరాగనిబద్ధమే. త్యాగరాజ కృతి "మానస సంచరరే", "శాంతము లేక సౌఖ్యము లేదు", దీక్షితుల వారి "అన్నపూర్ణే విశాలాక్షి" ఈ రాగంలోని ప్రసిద్ధ కృతులు.
పదదప మరిసరిసా ధసరిమా  పదదప మరిసరిసా  మపప పప మప మపదాప పామగరిసరి
జయజయ శ్రీరామ రఘువరా శుభకర శ్రీరామ        త్రిభువన జన నయనాభిరామ...
పపపప పాపా మాపా మపదాప మగ సరి  రిమపదదా దాపాపా పదసదపమరిసదసరిమ
రా.మా  ర.వి  కు.ల   జలనిధి   సోమా..  భూమిసుతా కామా  ఆ.................................
దామప  దసస దసరిమమగరి దససస దదపమ మపదాప మగసరి
కామిత దాయక కరుణాధామ  కోమల  నీ. ల స  రో...జ శ్యామా...

జయ జయ శ్రీరామ (జయసింహ)

ఆరోజుల్లో యావద్దక్షిణభారతంలోనే ఏ కార్యక్రమమైనాసరే మైకుల్లో మొదట వినిపించే పాట "నమో వేంకటేశా" సామరాగాధారంగా స్వరాలను విభిన్నరీతిలో ప్రయోగించి మాస్టారు స్వరబరచి పాడిన ఈ పాట ఈనాటికీ జనప్రియమే. కొన్నిచోట్ల ఆరభిలా వినిపించినా నిషాదస్వరం లేదు గనుక సామరాగమనే అనాలి.  ఆరభి మరియు సామరాగాలలో లేని కొన్ని వరుసలు (మహానందమాయే ఓ మహాదేవదేవా..) అలా వినిపించడానికి కారణం, ఆయా స్థానాల్లో గాంధారం మచ్చుకైనా లేదు. "సరిమపదస - సనిదపమగరిస" ఆరభి మూర్చనలో 'ని' ని వదలితే, సామరాగం. 'ని' తో పాటు 'గ' నూ తొలగిస్తే, అనగా నిషాద, గాంధారవర్జితమైతే అపుడు ఆరభి శుద్ధసావేరి గా మారుతుంది. "బృందావనమిది అందరిది" - ఇచట నిషాదగాంధారాలు లేవుగనుక ఇది శుద్ధసావేరి రాగాధారితమే. "నమో వేంకటాశా" లొ "గాంధార" ప్రయోగం లేమి వలన కొన్నిచోట్ల శుద్ధసావేరి ఛాయ వినిపించే అవకాశముంది. అయితే 'నమో (పామ) నమో (పదప) తిరుమ(మగరి)లేశ (రిసస)" అన్నఫ్ఫుడు మరియు గమకాలలో ఘంటసాల గాంధారాన్ని వాడారు.
పదససాస రిదసా దపమా పదపమరిగ రిససా    
నమోవేంక టేశా.......       నమో తిరుమలేశా
సదాదాద పమపా మపదసాసాస రిదసా
మహానందమాయే...ఓ మహాదేవదేవా...
(సాద పామ పద సదపమగరిస - నేపధ్య వాద్య స్వరాలు)
పదదద పాపమపా పమదాససరీసదసా
ముడుపులు నీకొసగే మా మొక్కులు తీర్చవయా
దాససారి సారీ సరిమామమగారిసమో  దదసారిరి గమరిస రిసా
ముక్తికోరివచ్చే నీ భక్తుల బ్రోవుమయా 
నమో! వేంకటేశా! 
 
నా నోఅభిఙ్ఞాన శాకుంతలము (మహాకవి కాళిదాసు)

                                                             నవమాసములు (పద్యం)


"గుండమ్మకథ" చిత్రంలోని పాట "కోలుకోలోయన్న"సామరాగస్వరాలనే ధరించినా కొన్నిచోట్ల కాకలి నిషాదం వినబడుతుంది. పల్లవిలో మొదట (కోలుకోలో) షడ్జాన్ని ఆధారంజేసి (అంటే సావిత్రి పాత్రకు సౌమ్యంగా పొందికయైనట్టు) దానికి సంవాదిగా (బేలబేలోయన్న- జమున పాత్ర గడుసుతనానికి తగినట్లు) ధైవతాన్ని ఆధారంచేసి కట్టిన బాణీని గమనిస్తే  కథాసన్నివేశాలకు ఉచితంగా స్వరమేళాలను నిర్మించే కుశలతను గమనించగలరు. ఇద్దరమ్మాయిలనూ పోల్చిజెప్పే విధానానికి ఈ షడ్జ-దైవత స్వరవ్యత్యాసాలను వాడిన తీరు పాట మొత్తం వినిపిస్తుంది.
దసస దససా సాస రీమారీసాస నీసస సరిమారిసాస
కోలు కోలోయన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచిజోడు
దాదాదాదా దాద దాసాదాపామ మామమ పదసాస దదపా
బేల బేలోయన్న...బేలో ఓ రంగ కొమ్మలకు వచ్చింది ఈడు 

కోలుకోలోయన్న (గుండమ్మ కథ)

శుద్ధసావేరి

శంకరాభరణజన్యమైన ఆరభిస్వరాలలో( సరి2మ1పద2స : సని౨ద2పమ1గ౩రి2స) నిషాదం లేనిచో ఆ రాగం సామ ( సరి2మ1పద2స : సద2పమ1గ౩రి2స) నిషాద గాంధారాలను వదలిన అది శుద్ధసావేరి:  (సరి2మ1పద2స : సద2పమ1రి2స). శుద్ధసావేరి మరియు హిందుస్తానీ పద్ధతిలో బిలావల్ జన్యమైన ’దుర్గ’  రెండూ ఏకమూర్ఛన రాగాలే. ’మ’ న్యాస స్వరం ’దమ, రిపా, రిధా’ దుర్గారాగ సూచకాలు. "బృందానమిది అందరిదీ" ఇ రాగంలోనిదే అని చెప్పుకొన్నాము. ఐతే ఆరభి ’హరియే వెలయునుగా’ మరియు సామరాగాలలో  ’జయ జయ శ్రీరామ’ అన్యస్వరాలు లేక శాస్త్ర్రీయశుద్ధమైనట్టు  సినిమాపాటలలో దుర్గా/శుద్ధసావేరిలో నా పరిమితవ్యాప్తికి కనిపించలేదు.

 "పూజాఫలము"కై మాస్టారు పాడిన "నిన్నలేని అందమేదో" శుద్ధసావేరి/దుర్గా రాగాధారితమైనదే. కాని అతిశయంగా రెండు అన్యస్వరాలు ఆ పాటలో ఉండుటవలన అది "శుద్ధ"సావేరియని చెప్పడానికి వీలులేదు. "నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో " సారి పదద పదమప దసస/దసస దదప మగసరి ( సపమదప ఇక్కడ ప్రతిమధ్యమము గుర్తించగలరు). "నిదురలేచె" అన్నపదంయొక్క రెండవ సంగతిలో ప్రతిమధ్యమాని జేర్చి, సాలూరివారు నాయకునికి ఆ సందర్భంలో కలుగు విచిత్రభావాలను  అన్యస్వరప్రయోంగంద్వారా వెల్లడించారు. ఆఖరి చరణం "పసిడియంచు పైట జార  (నిసససాస నిసనిదనిసస)" లొ దుర్గ, మూర్ఛన మార్గం వదలి కైశికినిషాదాన్ని బట్టి, అన్యభావాన్ని సృష్టించడంతో, నాయకునిలోని మార్పును చూపెట్టడం మనోజ్ఞం. పాటలో "తెలియరాని రాగమేదో" అంటాడు సంగీతజ్ఞుడైన నాయకుడు. ఆ కొత్తరాగాన్ని వినిపిస్తాడు మన గాయకుడు. ఆరాగం శుద్ధసావేరి/దుర్గా రాగంలా ఉన్నా, అన్యస్వరాలైన ప్రతిమధ్యమ నిషాద స్వరాల సమ్మిశ్రంతో అది తెలియనిరాగమే ఐనదికదా!

 ఆరభి,సామ మరియు దుర్గా రాగాలనూ ఒకే వ్యాసంలో సమీకరించడానికి కారణం ఈ మూడురాగాలకు ఉన్న సామ్యమూ, సామ మరియు దుర్గారాగలలో ఘంటసాల పాడిన శుద్ధశాస్త్రీయమైన పాటలు మనకు లభ్యంలేకపోవటమూ కారణము.

 నిన్నలేని అందమేదో

పద్యం: నవమాసములువిన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (2) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (3) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎల్.ఆర్.ఈశ్వరి తో (1) గా-ఎస్.జానకి తో (4) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (20) గా-పి.సుశీల తో (46) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (11) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (78) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (29) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (1) సం-పెండ్యాల (37) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (11) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-0 ర-అనిశెట్టి ర-అనిసెట్టి ర-అనిసెట్టి-పినిసెట్టి ర-ఆత్రేయ ర-ఆదినారాయణ రావు ర-ఆరుద్ర ర-ఉషశ్రీ ర-ఎ.వేణుగోపాల్ ర-కాళిదాసు ర-కాళ్ళకూరి ర-కొసరాజు ర-కోపల్లి ర-గబ్బిట ర-గోపాలరాయ శర్మ ర-ఘంటసాల ర-చేమకూర. ర-జంపన ర-జయదేవకవి ర-జాషువా ర-జి.కృష్ణమూర్తి ర-తాండ్ర ర-తాపీ ధర్మారావు ర-తిక్కన ర-తిరుపతివెంకటకవులు ర-తోలేటి ర-దాశరథి ర-దాశరధి ర-దీక్షితార్ ర-దేవులపల్లి ర-నార్ల చిరంజీవి ర-పరశురామ్‌ ర-పాలగుమ్మి పద్మరాజు ర-పింగళి ర-బమ్మెర పోతన ర-బమ్మెఱ పోతన ర-బాబ్జీ ర-బాలాంత్రపు ర-బైరాగి ర-భాగవతం ర-భావనారాయణ ర-భుజంగరాయ శర్మ ర-మల్లాది ర-ముద్దుకృష్ణ ర-రాజశ్రీ ర-రామదాసు ర-రావులపర్తి ర-రావూరి ర-వసంతరావు ర-వారణాసి ర-విజికె చారి ర-వీటూరి ర-వేణు ర-వేములపల్లి ర-శ్రీశ్రీ ర-సదాశివ బ్రహ్మం ర-సముద్రాల జూ. ర-సముద్రాల సీ. ర-సి.నా.రె. ర-సినారె ర-సుంకర-వాసిరెడ్డి ర-సుబ్బారావు రచన-ఘంటసాల రచన-దాశరధి రచన-దేవులపల్లి రచన-పానుగంటి రచన-పింగళి రచన-బలిజేపల్లి రచన-సముద్రాల సీ.