ఘంటసాల మాస్టారు సంగీతజ్ఞులు మరియు రసజ్ఞులు. ఆయన సంగీతం సమకూర్చిన చిత్రాలలో కర్ణాటక సంగీతం తో పాటు బడే గులాం ఆలీ ఖాన్ సాహచర్య శిష్యరికంలో నేర్చుకున్న హిందుస్తానీ రాగాలను కూడ తెలుగు చలన చిత్రాలకు పరిచయం చేశారు. అద్భుతమైన బాణీలు కట్టారు. ఆ మహామహుని అద్భుతస్వర సృష్టిలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎన్నో రాగాలు రాణించాయి. ఆ రాగాలను ఘంటసాల-రాగశాలలో మిత్రులు చంద్రమౌళి గారి సహృదయత వలన ఒక్కొక్కటే తెలుసుకుంటున్నాం. ఈ శీర్షిక లో ఇంతవరకు హిందోళం, పంతువరాళి, నాటక ప్రియ, మలయమారుతం, చారుకేశి, దేశ్, ఫరజు, విజయానంద చంద్రిక, సింహేంద్రమధ్యమం మరియు రాగమాలికలతో రహస్యంలోని మాస్టారి స్వీయ స్వరకల్పనలోని రాగాల మేళవింపు చవిచూశారు. ఆ మాధుర్యాన్ని కొనసాగిస్తూ మరొక రాగం ఈ రోజు రుచి చూద్దాం. ఇది ఇంకొక కరదీపిక. ఇది ఎటువంటి వెలుగునిస్తుందో చూడండి.
మధురమైన పాటలకు ఏ రాగాలు ఆధారం? అవి ప్రఖ్యాత రాగాలే. ఆ జాబితాలో ఖచ్చితంగా ఉండే పేరు అభేరి (భీమ్ పలాస్). అయితే మనం ప్రస్తుతించవలసింది 'పటదీపిక' అనగా 'పటదీప్' రాగం కదా? అది అంత పేరుగల రాగం కాదేమో. కాని, ఆ రెండురాగాలకూ తేడా ఒక్క చిన్న స్వరం. కైశికి నిషాదం (N2) వున్నట్లయితే అది అభేరి, అలాకాక కాకలి నిషాదం (N3) వుంటే అది పటదీప్. ఈ రెండురాగాలకూ మూర్ఛన ఒకటే. ని3-స-గ2-మ1-ప-ని3-స స-ని3-ద2-ప-మ1-గ2-రి2-స. హిందూస్థానీ రాగాలకూ చలనచిత్రసంగీతానికి సన్నిహితబంధం వుంది. ఎంతో మధురంగా వినిపించి అంతే శీఘ్రంగా మనస్సుకు హత్తుకుపోయే శక్తి ఆ నాదానిది. యమన్, భీమ్ పలాస్, మాల్కోన్స్, బేహాగ్, తిల్లాంగ్, భూప్ లాంటివి ప్రఖ్యాత హిందుస్తానీ రాగాలు. పటదీప్ రాగం, ఉత్సుకతను మధురమనోజ్ఞంగా వెల్లడించి వియోగవేదన భావాన్ని విస్తరించగల రాగం. ఇది కాఫి థాట్ లోని ఔడవ- సంపూర్ణరాగం. హిందూస్థాని పద్ధతిలోని ధనశ్రీ, భీమ్ పలాస్, హంసకింకిణి రాగాలకూ పటదీప్ రాగానికీ పోలికలున్నాయి. కర్ణాటక సంగీత మేళంలో గౌరిమనోహరి జన్యంగా స్వరాలను పోల్చుకోవచ్చు.
పటదీప్ రాగం కొద్దిగ
అపురూపమైన పేరనుకొన్నా, విన్నంతనే మనకు సన్నిహితమయ్యే రాగం. అంతరంగాన
దాగిన భావాలను బైటకు తెచ్చి, విప్పి చెప్పి, ఇతరలుకు నచ్చేలా ఒప్పించడానికి ఏ మనోభావం కలిగియుండాలి? ఆ రసావిష్కరణకు శాస్త్రీయమైన పేరేమోగాని, ఆ రసాన్నిఅద్భుతంగా
ప్రకటించి, ఆ భావాన్ని పండించగల శక్తియున్నరాగం పటదీప్. ఈ భావమే
ఘంటసాల గానంచేసిన కొన్ని పాటలలో మరియు పద్యాలలో మనకు హృద్గోచరమై ఆ గీతికలు మధుర జ్ఞాపికలైనాయి.
పట్రాయని సీతారామశాస్త్రి గారు
తమ వద్దనున్న విజయనగర విద్యార్థులలో ఒక గంధర్వుడున్నాడని గమనించి “శృతినాదశుద్ధముగా ఓంనమఃశివాయ” పఠనం చేయి బాబూ అంటూ, సప్తస్వరాలకు పంచాక్షరిమంత్రాన్ని ఎట్లు ఉపదేశించారో, వయొలిన్ విద్యావరేణ్యులు ద్వారం వేంకటస్వామినాయుడు
తనకు గాత్ర సంగితమే ప్రశస్తమైనదని ఏ ఉద్బోధతో మార్గదర్శనం చేశారో, హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు స్వయంగా తనకు తంబూరా ఎట్లు
బహూకరించారో, ఇవన్నీ భావి భావసంగీత సామ్రాట్టు భవితవ్యానికి
పునాదులయ్యాయి. 1974 ఫిబ్రవరి 11 న ఆచార్యఆత్రేయ తమ "గొంతులేని గోడు" అనే కవితలో "నా కవితకు
కంఠం పోయింది! నా మాటలకు మాట పడిపోయింది... తెలుగునాట నా పాటలను ప్రతినోటిమాటగ మార్చిన
గాంధర్వం గగన కుసుమమైపోయింది. ఇకనేనేం వ్రాసినా ఎవరు పాడినా ఏముంది?" అన్నారు. నాదశరీరంతో ఘంటసాల మనకు చిరంజీవి.
ఘంటసాల
తన పుష్పవిలాపము, కుంతికుమారివంటి కావ్యగాయనమునకు
అధికంగా హిందూస్థాని రాగాలనే ఎన్నుకున్నారు. పటదీప్ రాగంలో పద్యగానం చాల ప్రభావయుతం.
ప్రప్రథమంగా ఘంటసాల గళంలో ప్రదీప్తమైన పటదీప్ రాగాన్ని మనం ఒక పద్యరూపంలోనే వింటున్నాము. ఇక్కడ వినండి ఘంటసాల బాణీకట్టి పాడిన పద్య గానం "తేనెలొలికించు తెలగాణ నీదెరా".
పద్యం: తేనెలనొలికించు
సింధుభైరవి, బేహాగ్ లాంటి రాగాలు తప్ప సాధారణంగా
పౌరాణిక చలనచిత్రాలలో పద్యాలకు ఆధారం కర్ణాటక శాస్త్రీయ సంగీతమే. పటదీప్ రాగాన్ని కుదించి సమర్థంగా ఒకపద్యంలో రసావిష్కరణ చేసిన కీర్తి పెండ్యాలకే
చెల్లు. అదే "శ్రీకృష్ణతులాభారం" చరమఘట్టంలోని చంపకమాల -
"అతివరో నన్ను తూచెడు ధనాధుల నీకడలేకయున్న..." ముత్తరాజు సుబ్బారావు
రచన. ఈ పద్యగానంలో పటదీప్ రాగసౌందర్యమంతా మూర్తీభవించింది. "గమపనీ.... (అతివరో) నిదపగామపా...." స్వరాలతో అతివరో.. అన్న
ఒకపదంలోనే పటదీప్ జీవస్వరాలన్నిటినీ మాస్టారు
పట్టివేశారు. ఈ క్రమాన్ని ఆక్షప్తిక అంటారు. అనగా పాడబోవు రాగము యొక్క స్వరూపమును
సంక్షేపముగా వినువారలకు తెలియబరచుట. చివరిలోని ఆలాపన వింటుంటే మనకు ఒక అనిర్వచనీయమైన భావయానమే సంక్రమించి ఏలోకానికో తీసుకొని వెళుతుంది.
పద్యం: శ్రీకృష్ణతులాభారం
ఈ రాగంలో ఘంటసాల
పాడిన కొన్ని పాటల్లో, నాకు దొరికినవి తక్కువే. ముఖ్యమైనది,
పవిత్ర హృదయాలు చిత్రంలోని "నా మది పాడిన ఈ వేళలో" (రచన: డా.సి. నారాయణ రెడ్డి, సంగీతం: టి.చలపతి రావు). ఆ మహాగాయకుడు తన అంత్యదశలో (1971) ఈ పాటను గానంచేయడం జరిగింది. ఆరోగ్యంగా ఉన్నఉచ్ఛ్రాయలో
ఆయన గళంలో, ఆ రాగాన్ని ఎలా పలికేడో, పైన
పేర్కొన్న పద్యాలను వింటే తెలుస్తుంది. "నా మది పాడిన ఈ వేళలో" పాట సందర్భం
మనకు తెలిసినదే. సంగీతవిద్వాంసుడైన కథానాయకుడు ఇచ్చే ఒక చిన్న కచేరి (సితారవాదన: జనార్దన్).
అతి శాస్త్రీయమూగాక, మిశ్రస్వరాల మామూలు గేయమూగాక, హాయిగా సాగే రసవాహిని, "నా మది పాడిన ఈ వేళలో"
.
పాట: నామది పాడిన ఈ వేళలో
నినినిస నిదపప మపగామప గమ పనినిని నిససస నిసమగరిససా సానిదపమపగమప
నా.మది పా.డిన ఈ.వే.ళ.లో
నవ జీ.వ.న వా.హి.ని పొం..గెను..లే................................|| నామది)
గాగగ పమమా గగ రీసని రీనిని సగమపనీనిని సనిదప మపదపగా
కోయిల గొంతున
కొసరే రా.రం. కొండవాగులో కులికే రా...గం......
పానిసగగగా గరిసని రిసనీ సగసాసా నిసదాని నిసదాప మపనిదపమగమ
మీరా బ్రతుకున నిండిన రాగం రాధ మనసులో పండిన
రా..గమ్.....
గీతాంత్యంలో ఘంటసాల పాడిన స్వరాలు 'నాదిం- ధిన్నా' 'నాదిం- ధిన్నా' చతుశ్రగతిలో, రాగంలోని పకడ్ లేదా చలన్ అనబడు స్వరాల
తీరులోనే (నిసగమపమగ, మగరిస, గమపనిసదప,
మపగ, మగరిస) సాగుతాయి.
సాసాస నిసగగరిస నిసదప గామప గామప గామప .||
ప ప ప ప గగగగారిసనీనీ పనిసగా.. పనిసమా...సగమప గామప గామప ||
నినినినిని నినిదపగా.. నిదపగా ..దపగా. మగస నీ..
ఆ...
నిషాదం
పటదీప్ యొక్క రాగచ్ఛాయాస్వరం. నిషాదాన్నే దీర్ఘంగా రాగంతీసి, నీ... సనిని-
నిదద- దపప- పమగ- మమద పా-....
మమగ- మమదపా....;
మా...గగప-
మాప- గగగ-మాప -గమమమగా... మపమ -సగగగాస.... అంటే అక్కినేని స్టెప్పులకి
సరిపోయో త్రిశ్ర గతి కుదిరి నవ్య యుగళగీతం అవతరిస్తుంది. పైన పేర్కొన్న పటదీప్ స్వరాలే పూలరంగడు చిత్రానికై ఘంటసాల-సుశీల పాడిన " నీ జిలుగుపైట నీడలోన నడవనీ..,
నన్ను నడవనీ.." పల్లవి. ఘంటసాల నిషాదాన్ని నీ(స్వరాక్షరం)....అంటూ
నాలుగు కొలతల అర్ధావర్త తాళానికి పొడిగిస్తే, దానికి సంవాదిగా
శుద్ధమధ్యమంలో నీ...(ఇక్కడ పలుకే అక్షరం నీ, స్వరం మద్యమం)...అంటూ
పల్లవికి నీడలో ఒదిగినది పి.సుశీల స్వరం. పాశ్చాత్య మేళవిన్యాసానికి పటదీప్ స్వరాలను, 'సవాల్ - జవాబ్' మెరుగున
"నిదద దపప - తకిట తధిమి" అంటూ స్వరాలను నాట్యంచేయించడం స్వరకర్త సాలూరి రాజేశ్వరరావు ప్రత్యేకత.
పాట:
నీ జిలుగుపైట
ఈ రాగాన్ని మన ఖ్యాత సంగీత దర్శకులందరూ అరుదుగా వాడుకున్నారు. "దానవీరశూర
కర్ణ" లో శ్రీకృష్ణుడు కర్ణుని జన్మరహస్యం తెలిపే పద్యం,
పెండ్యాల స్వరపరచి రామకృష్ణ పాడిన" అంచితులైన బంధువులనందరిముందర
చెప్పియొప్పించెద" శుద్ధ పటదీప్ రాగ నిబద్దమే (తిరుపతివేంకటకవుల ఈపద్యాన్ని శ్రీకృష్ణరాయభారం లో సూరిబాబు స్వరకల్పనజేయగా,
రఘురామయ్య పాడారు). పటదీప్ రాగంలొ మరో మధురమైన పాట, కె.వి.మహాదేవన్
స్వరపరచిన ప్రేమ్ నగర్ చిత్రానికై పి.సుశీల పాడిన "ఎవరో రావాలి". పటదీప్ రాగనిబద్ధమైన
హిందీ చలనచిత్రాలలోని మధురమైన కొన్ని పాటలను
ఇక్కడ వినగలరు.
· ఈ రాగాన్ని తీరికగా ఆనందించడానికి శృతి శిరోడ్కర్ గానంచేసిన పటదీప్ కృతిని ఇక్కడ
వినగలరు: Hindustani Classical Patdeep: Shruti Shirodkar:
http://vimeo.com/36547976
కృతజ్ఞతలు: వికిపీడియాకు, యూ ట్యూబ్ వారికి.