కలహభోజనుడికి కల్యాణం జరిపించే బాధ్యత దొరికింది. శ్రీ కృష్ణుని వద్దకు వచ్చి సత్యభామ గురించి గొప్పగా చెప్పడం మొదలు పెట్టాడు. ఈ కల్యాణం లోక కల్యాణం కోసమే అని చెబుతాడు. ఈ చక్కని పద్యాన్ని శ్రీ సముద్రాల రాఘవాచార్యుల వారు వ్రాయగా, ఘంటసాల మాస్టారు స్వరబద్ధం చేసి గానం చేసారు. ఇది 1957 లో విడుదలైన వినాయక చవితి చిత్రం లోనిది.
చిత్రం: వినాయక చవితి (1957) కలం: సముద్రాల సీనియర్ స్వరం-గళం: ఘంటసాల
పౌరాణిక చిత్రాలు, వాటిలో మాస్టారు పాడిన పద్యాలు వుంటే చెవులకు ఇంపుగా వుంటుంది వినడానికి. అందులో ఘంటసాల గారి స్వీయ సంగీత దర్సకత్వంలో వారు అమితంగా ఆరాదిచే శ్రీ సముద్రాల రాఘవాచార్యుల వారి సాహిత్యం తోడైతే ఇంకా రసవత్తరంగా వుంటుంది. 1957 లో విడుదలైన వినాయక చవితి చిత్రంలో శ్రీకృష్ణుని వలచి వరించాలనుకునే సత్యభామకు "స్త్రీకి ఉండవలసిన లక్షణాలు" ఏమిటో నారద మహర్షుల వారు వివరిస్తారు. మగువకు అందంతో పాటు అణకువ, చదువుతో పాటు శీల సంపత్తి, పతిసేవ, భక్తి, వినయము, వివేకము కలిగి యుండాలని ఈ పద్యం యొక్క తాత్పర్యం.
జగదేక రంభయే అగుగాక మగువకు అణకువే మాయని అందమమ్మా
చదువులలోన శారదయైన చెలువకు శీలమే సంస్కృతి చిహ్నమమ్మ
రామ రావణ యుద్ధంలో లంకేశ్వరుడు శ్రీరాముని చేతిలో నిహతుడవుతాడు. తరువాత సీత అగ్ని పరీక్ష జరిగి, రాముడు సీతతో అయోధ్యకు తిరిగి వస్తాడు. దేవ దుందుభులు మ్రోగ, ఎంతో కన్నుల పండువగా అందరూ ఎదురు చూస్తున్న శ్రీ రామ పట్టాభిషేకం జరుగుతుంది. సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేతముగా శ్రీరామచంద్రుడు కొలువు తీరినాడు. అప్పుడు కుల గురువు వశిష్టుల వారు శ్రీరాముని ఆశీర్వదిస్తూ, రామ నామము యొక్క విశిష్టత తెలుపుతూ చెప్పిన పద్యం "సర్వ మంగళ గుణ సంపూర్నుడగు నిన్ను". దీనిని ఎంతో మధురంగా ఘంటసాల మాస్టారు ఆలపించారు. రామ నామము చీకటిని పటాపంచలు చేసే తారక నామము. అథమం పది గడపలున్న చిన్న పల్లెలో కూడా రామమందిరం వుండి తీరుతుంది. ఏది వ్రాసినా ముందు రామనామము వ్రాయనిదే వ్రాత మొదలవదు. శ్రీ రామకోటి అంత పవిత్రమైనది - అని దీని భావం. రామునిగా శోభన్ బాబు, సీతగా చంద్రకళ, వసిష్టునిగా శ్రీ నాగయ్య నటించిన ఈ చిత్రం బాపు రమణీయ దృశ్య కావ్యం.
చిత్రం: సంపూర్ణరామాయణం (1972)
కలం: పానుగంటి
సంగీతం: కె.వి.మహదేవన్
గళం: ఘంటసాల, బృందం
ఘంటసాల: సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరుడు దేవునిగాగ నరయు గాత!
రామనామము భవస్తోమభంజన దివ్య తారకనామమై తనరు గాత!
పది కొంపలునులేని పల్లెనైనను రామభజన మందిరముండు వరలు గాత!
కవులెల్ల నీ దివ్యకథ నెల్లరీతుల గొనియాడి ముక్తి గైకొండ్రు గాత!
గ్రహాల ప్రభావం మన నిత్య కర్మలపై, దైనందిన జీవితం లోని ఫలితాలపై ఉంటుందని చాలామంది నమ్మకం. మన జ్యోతిష శాస్త్రము ప్రకారం గ్రహాలు తొమ్మిది. అవి సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు. ఇందులో రాహువు, కేతువు ఛాయా గ్రహాలు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా శివ కోవెలలో నవ గ్రహాలను ఈశాన్య దిక్కున ప్రతిష్టిస్తారు. సూర్యుడు కేంద్రంగా మిగిలిన ఎనిమిది గ్రహాలను 3 x 3 వరుసలో ప్రతిష్టిస్తారు. ఈ పోస్టులో ఘంటసాల మాస్టారు నవగ్రహ పూజా మహిమ కోసం గానం చేసిన "నవగ్రహ స్తోత్రం" యొక్క ఆడియో, సాహిత్యం పొందుపరుస్తున్నాను. అయితే నిత్యం వినే స్తోత్రానికి, సినిమాలోని సాహిత్యానికి స్వల్ప వ్యత్యాసం ఉన్నది.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com