ఘంటసాల మాస్టారు అనేక సందర్భాలలో సంగీత కచేరీలు ఇచ్చారు. అయితే అందులో కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి. మాస్టారు ప్రతి కచేరిలోను తను సంగీత దర్శకత్వం వహించిన "వినాయక చవితి" చిత్రంలోని శ్లోకాలు, ముఖ్యంగా "దినకరా శుభకరా" పాటను విధిగా పాడేవారు. ఈ చిత్రానికి శ్రీ సముద్రాల రాఘవాచార్యులు గారు పాటలు, పద్యాలు వ్రాయడమే కాకుండా, దర్శకత్వం కూడ వహించారు. సాధారణంగా సినిమాలలో పాటలకు కొన్ని నిర్దిష్టతలు, పరిధులు వుంటాయి. చిత్రం నిడివిని బట్టి, పాటల సంఖ్యను బట్టి ఒక్కోసారి సంగీత దర్శకునికి తన ప్రతిభను పూర్తిగా ప్రదర్శించడానికి అవకాశం దొరకదు. అందువలన కొందరికి ఆయా సంగీత దర్శకులను కేవలం లలిత గీతాలను మాత్రమే పాడించగలరు, లేదా పాడగలరు అన్న అపోహ వుండే అవకాశముంది. ఇక్కడ మాస్టారు కలకత్తాలో ఇచ్చిన సంగీత కచేరీలో స్వరసంగతులతో సుశాస్త్రీయంగా, ఇంతకుముందు సినిమాలో వినని అదనపు చరణంతో గానం చేసిన "దినకరా శుభకరా" పాటను పొందు పరుస్తున్నాము. అయితే ఈ క్రొత్త చరణం చిత్రం యొక్క ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లో కూడా లేదు. బహుశ దీనిని ముందు కంపోజ్ చేసి, పాట లేదా చిత్రం యొక్క నిడివిని తగ్గించడానికి చిత్రంలో ఉపయోగించలేదేమో తెలియదు. ఇది వింటే మాస్టారి సంగీతజ్ఞానం, సమర్ధతలు ఎంత లోతుగా వున్నాయో తెలుస్తుంది. మాస్టారు పాడిన తీరు, వాడిన గమకాలూ, వేసిన సంగతులు అపూర్వం. ఆ గానం వింటూంటే మనసు పరవశిస్తుంది, ఏదో తెలియని అమరలోకాలలో విహరిస్తున్నట్లు వుంటుంది. బహుశా ఇదేనేమో గంధర్వ గానం అంటే.
ప్రియమిత్రులు, సంగీతజ్ఞులు అయిన శ్రీ
ఎం.ఆర్. చంద్రమౌళి గారు "ఘంటసాల-రాగశాల" అనే ఉప శీర్షికలో ఇక నుండి పాటల,
పద్యాల రాగ లక్షణాలను వివరిస్తారు. శ్రీ మౌళి గారికి శత సహస్ర నమో వాకములు.
ఈ రాగం యుక్క ప్రయోగం ఘంటసాల పాటలలో కొన్నింటికే పరిమితమైనా, అనేకమైన పద్యాలు
ఈ రాగవేషం ధరించి ఆయన కంఠశ్రీ భావనటనతో వెలువడ్డాయి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కమనీయ కావ్యఖండిక అయిన "పుష్ప విలాపం"లోని
“గాలిని గౌరవింతుము సుగంధము పూసి” అంటూ ప్రారంభమయ్యే ఉత్పలమాల గాని, "మహాకవి కాళిదాసు"
చిత్రంలోని శ్యామలా దండక భాగం “కామలీలా ధనుః సన్నిభ భ్రూలతా” గాని, "పల్నాటి యుద్ధము" లోని “పుట్టింపగలవు
నిప్పుకల కుప్పల మంట” అను బ్రహ్మనాయకుని నిర్వేద భావసూచకమైన సీస పద్యం కాని పంతువరాళికి
వరమైన దర్పణాలు. అంతేకాక ప్రత్యేకించి, భగవద్గీత ఆరంభ ధ్యాన
శ్లోకం “పార్థాయ ప్రతిబోధితాం” అను శార్దూలవిక్రీడిత వృత్తానికి ప్రథమ స్ధానాన్నిచ్చి పంతువరాళి రాగంలో స్వరపరడం, ఈ రాగంపట్ల మాస్టారికి గల మక్కువను సూచిస్తుంది.
పంతువరాళి రాగం లో స్వరపరచిన ఈ పాట, ఘంటసాల గారి శాస్త్రీయ సంగీత నైపుణ్యతకు ఒక్క నిదర్శనమైతే,
ఈ రాగంలో ఎన్నో వాగ్గేయకార్ల కృతులున్నప్పటికీ సముద్రాల రాఘవాచార్యులు వ్రాసిన ఈ గీతం అన్నిటికన్నా బహుళ ప్రజాదరణ పొంది, చిరస్మరణీయమై నిలిచిన అంశం మరొక ప్రత్యేకత. పంతువరాళి, 51వ మేళకర్త రాగము. షడ్జమం (S), శుద్ధ రిషభం (R1), అంతర గాంధారం (G3), ప్రతిమధ్యమం (M2), పంచమం (P),
శుద్ధ ధైవతం (D1), కాకలి నిషాదం (N3) అనే సప్త స్వరములు పలుకునది సంపూర్ణ రాగము. సరళంగా చెప్పాలంటే, కర్ణాటక సంగీత శిక్షణకు నేర్పే మౌలికమైన 15వ మేళకర్త రాగమైన "మాయామాళవగౌళ" రాగంలో శుద్ధ మధ్యమం బదులు ప్రతి మధ్యమం ఉపయోగిస్తే అది పంతువరాళి అవుతుంది. పంతువరాళి రాగంలోని జీవస్వరాలు: గాంధార, ధైవత, మధ్యమ పంచమములు. చలనచిత్రంలోని ఈ పాటలో బ్రహ్మ,విష్ణు,పరమేశ్వరరూపా…అన్న
చోట ఆలాపనలో, మాస్టారు, గాంధార-మధ్యమ స్వరాలకు జీవంపోసి భావవిస్తారం చేసిన విధానం,
ఆయన శాస్త్రీయ గానవైదుష్యానికి తార్కాణం. ఘంటసాలగారు సంగీత దర్శకత్వం వహించిన, 1963 లో విడుదలైన చిత్రం "వాల్మీకి"లో, నారద పాత్రధారి కీ.శే. రఘురామయ్య (ఈలపాట) గారిచే ఈ రాగంలోనే పాడించిన “హరే నారాయణ”
అన్న పాటలో “దినకరా” లోని కొన్ని ప్రత్యేక గమక ప్రయోగాల ఛాయలు కనిపిస్తాయి.
పంతువరాళి రాగాన్నే కాశిరామక్రియ లేదా కామవర్ధిని
అని కూడ పిలుస్తారు. కర్ణాటక సంగీతంలోని “నిన్నే నెర నమ్మినానురా”, “శివశివశివ యనరాదా”, “శంభోమహదేవ”, “అప్ప
రామభక్తి యెంతో గొప్పరా”, “వాడేరా దైవము మనసా” మొదలగు కృతులు పంతువరాళి రాగంలోని ప్రసిద్ధమైన
త్యాగరాజ స్వామి రచనలు. భక్తి పారవశ్యాన్ని ధ్వనించే ఈ రాగంలోని ఎన్నో కృతుల ప్రారంభిక
స్వరం, పై షడ్జమం. "నిన్నే నెర నమ్మినానురా", "శివశివశివ యనరాదా", "శంభోమహదేవ" ఈ మూడు
కృతుల ప్రారంభ స్వరము - నిషాద గమకంతో వినిపించే పై షఢ్జమం. మాస్టారు సైతం ఈ రాగ రహస్యాన్ని
గమనించి, పల్లవిని పై స్థాయి షడ్జమంతో ఆరంభించి “సనిదపా.. (దినకరా)” అంటూ స్వరపరచడం విశేషం. ఆ విధంగా నిసనిసా..(దినకరా..) అన్న ఆలాపనతో ప్రారంభమై, సనిదపా..(దినకరా), మగమపా..(శుభకరా) గమగా..(దే..వా). రిగగమ..(దీ..నా)..గరిసా..( ధారా)..రిగగ మాపాద.. (తిమిర సంహార)..అని పాట సాగుతుంది. పైన ఉదహరించిన
కీర్తనల పేర్లు మన నవతరం వినకున్నా, "దినకరా శుభకరా" గీత గానం అందరికీ కర్ణ రంజకమే.
దినకరా శుభకరా వీడియో: మూలం - రమేష్ పంచకర్ల
కలకత్తా కచేరీలో మాస్టారి పాట: మూలం - ఘంటసాల గాన చరిత
సాకీ: | దినకరా… దినకరా… హే! శుభకరా… | ||
పల్లవి: | దినకరా.. శుభకరా.. | | దినకరా | | |
దినకరా శుభకరా దేవా | |||
దీనాధారా తిమిర సంహార | |||
దినకరా శుభకరా దేవా | |||
దీనాధారా తిమిర సంహార | |||
దినకరా.. శుభకరా.. | |||
చరణం: | సకల భువన శుభ కారణ కిరణా..ఆ..ఆ.. | | సకల భువన | | |
మౌనిరాజ పరి పూజిత చరణా.. | | సకల భువన | | ||
నీరజాత ముఖ శోభన కారణ | | నీరజాత ముఖ | | ||
దినకరా.. శుభకరా.. దేవా | |||
దీనాధారా తిమిర సంహార | |||
దినకరా శుభకరా | |||
చరణం: | పతిత పావనా మంగళ దాతా | ||
పాప సంతాప లోక హితా | | పతిత పావనా | | ||
పతిత పావనా మంగళ దాతా (2) పాప సంతాప లోకహితా | |||
……(వాద్యం) | |||
పతిత పావనా మంగళ దాతా (2) పాప సంతాప లోకహితా | | పతిత పావనా | | ||
……(వాద్యం) | |||
పపా… మపదా మపా గామపా.. | |||
మమదా మమనీ దా నిదపామ పతిత పావనా.. | |||
……(వాద్యం) | |||
పపదా మమపా గగమా రిరిగా సా.రీ.గామ పతిత పావనా.. | |||
ససాస నిరిస నిసదా.. మదనిరిసదా | |||
మదనిసా నిరిసని సదపమ పగమరిగ సారిగమ పతిత పావనా.. | |||
……(వాద్యం) | |||
పాదప మదపమ గరిసని సరిగమ.. పతిత పావనా.. | |||
……(వాద్యం) | |||
సాస సాస సని సగరిరి సనిసరి | |||
సనిరిసనిద దనిససనిదపనిదప | |||
మదపమగరిసని ససాసారిగమ పతిత పావనా.. | |||
……(వాద్యం) | |||
పావనా..మంగళ దాతా పాపసంతాప లోకహితా | |||
బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర రూపా ఆ..ఆ..ఆ.. (4) | |||
బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర రూపా వివిధ వేద విజ్ఞాన నిధానా (2) | |||
వినతలోక పరిపాలక భాస్కర (2) | |||
దినకరా శుభకరా దేవా! దీనాధారా తిమిర సంహార | |||
దినకరా.. హే! దినకరా.. ప్రభూ దినకరా శుభకరా |
* * *
కృతజ్ఞతలు: ఆడియో ఫైల్సు సమకూర్చిన ఘంటసాల గాన చరిత వెబ్ సైటుకు, సాంకేతిక వివరాలు అందించిన ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగుకు, ఘంటసాల - రాగశాల వివరాలు తెలిపిన శ్రీ ఎం.ఆర్.చంద్రమౌళి (బెంగుళూరు) గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.