కలం : వారణాసి సీతారామ శాస్త్రి
సంగీతం : టి.వి.రాజు
గానం : ఘంటసాల వెంకటేశ్వరరావు
వచనం : అక్కినేని నాగేశ్వరరావు
ఘంటసాల: జై! శ్రీమద్రమారమణ గోవిందో హరి!
కలడు కుచేలుండను విప్రోత్తముడొకడు | కలడు |
వారికి కల్గెను చింతగూర్చు సంతానమనంతముగా
మరి దొరకదు కబళం చిరుపాపలకు ఎంత ఘోరమకటా!
అక్కినేని: పాపం కుచేలుడు కడిపెడు పిల్లలు కన్నాడు
ఘంటసాల: కడిపెడు బిడ్డలన్ గనియు కర్మవశంబటున్ట జేసి
ఆ బుడతల పెట్టి పోతలకు పుట్టవు చారెడు నూకలైన..ఆ..
అక్కినేని: ఇలా సంసార బాధలు పడుతుండగా..ఒకనాడు ఇల్లాలు..
కుచేలుని భార్య తన భర్త దగ్గరకు చేరి
ఘంటసాల: వినుడీ! నా మొర దయగనుడీ.. | వినుడీ |
పసిపాపల గతి నేనోపగజాలను | వినుడీ |
మీ బాల్యమిత్రుడగు గోపాలునీ.. ఆ.. ఆ.. | మీ బాల్య |
గోపాలుని దరిజేరి మన గతి నెరిగింపుడు | వినుడీ |
అక్కినేని: అని పార్థించిందట. అంత కుచేలుడు తన భార్య మాటలు
విన్నవాడై ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు
శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుని చూచి ఎదురేగి
ఘంటసాల: గట్టిగ మిత్రుని కౌగిట చేర్చెనుఎట్టెడులుంటివి మిత్రమా? | గట్టిగ |
నీ సంతతి యంటయు సౌఖ్యమా?
నీ యిల్లాలనుకూలమా? ఆ.. ఆ..
అక్కినేని: అంటూ ఆ భక్త మందారుడు ప్రశ్నించాడు. తరువాత తన భార్య రుక్మిణివైపు తిరిగి
ఘంటసాల: భూసుర వర్యుడీతడు, సుబుద్ధి, మహాత్ముడనుంగు మిత్రుడు
నే చేసిన పుణ్యమూలమున చేకూరె నాకొక బాల్య మిత్రుడై
వేసట చెందెనీతడూ! | వేసట |
సుపేశ కరంబుల పాదమొత్తగా
దాసుడ నుంటి నేనిచట
దాసివి నీవును రమ్ము నెచ్చెలీ..ఆ.. ఆ..
అక్కినేని: అని పిలిచాడు. పిలిచి, ఆ కౌస్తుభరాయి తానే
కాకుండా తన భార్య చేత కూడ మిత్రుని పాదాలు వత్తిస్తూ,
ఇలా అన్నాడు.
ఘంటసాల: మిత్రమా నాకేమి యిత్తువు కానుక | మిత్రమా |
యిన్నినాళ్ళకు కళ్ళబడితివి | యిన్నినాళ్ళకు |
వెన్నెలాయెను నాదు మనసు | మిత్రమా |
ఆ.. ఆ.. ఆ..
అక్కినేని: అని అడిగాడు. అప్పుడు కుచేలుడు తన కొంగున వున్న గుప్పెడు అటుకులు తీసి సిగ్గుతో తన
మిత్రుని దోసిట్లో పోసాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానందం పొంది రుక్మిణికి ఒక్క
పలుకైనా పెట్టకుండా అన్నీ తనే తినేశాడు. అలా తినగానే కుచేలుడు దారిద్ర్యం అంతా
తీరిపోయింది. అప్పుడు కుచేలుడు మహదానందం పొంది ఆ దివ్యమూర్తి పాదాలపై పడ్డాడు.
పడ్డవాడై..
ఘంటసాల: నీ దయ తెలియగ తరమా! | నీదయ |
నీరజ నయనా, క్షీరాబ్ది శయనా | నీదయ |
అక్కినేని: ఇహ అక్కడ, కుచేలుని ఇంటినిండా ధన,ధాన్యాదులు రాశులు పోసున్నాయి. అప్పుడు కుచేలుని
భార్యా బిడ్డలందరూ ఆ భక్త వత్సలుడ్ని తలచి ఇలా ప్రార్థిస్తున్నారు.
ఘంటసాల: దీనా బాంధవా, దీనా బాంధవా
దేవా.. దీనా బాంధవా
నీ దయ కలిగెన మాపైనా.. | నీదయ |
పేదరికమ్మది తొలగే పెన్నిధులే
ఒరిగెనులే నీ దయ కలిగెనులే
దేవా దీనా బాంధవా | దేవా దీనా |
దీనా బాంధవా, దీనా బాంధవా
అక్కినేని: ఇలా ప్రార్ధిస్తూ ఉండగా, కుచేలుడు తన యింట్లో ప్రవేశించాడు.
భార్యా పుత్రుల వదనాలలో విరిసిన వెలుగును చూసి తన్మయుడైపోయాడు. ఇంకా,
ఘంటసాల: శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి.. | శ్రీహరి |
గుప్పెడు అటుకుల గొప్పగ జేసి
కురిపించెను సిరులను శౌరి..ఆ..
శ్రీమద్రమారమణ గోవిందో హరి!
కృతజ్ఞతలు: ఆడియో ఫైలు సమకూర్చిన ఘంటసాల గాన చరిత బ్లాగుకు, సాంకేతిక వివరాలు అందించిన ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగులకు, చిత్ర విశేషాలు సమకూర్చిన వికిపీడియా (తెలుగు) వారికి, యూ ట్యూబ్ వీడియో సమకూర్చిన శ్రీ ప్రణీత్ గారికి, హృదయ పూర్వక ధన్యవాదాలు.