ఎన్.టి.ఆర్. శ్రీ కృష్ణుని పాత్రకే కాకుండా ఎటువంటి పౌరాణిక పాత్రకైనా చక్కగా సరిపోతారంటే అతిశయోక్తి కాదు. భీష్ముని పాత్రలో ఎన్.టి.ఆర్. నటించిన చిత్రం "భీష్మ". ఇది 1962 లో విడుదల అయింది. కురుక్షేత్ర సంగ్రామంలో అజేయునిగ నిలిచిన కురు పితామహుడు భీష్మునిపై శ్రీ కృష్ణుడు కోపంతో చక్రం ప్రయోగించబోతాడు. అప్పుడు భీష్ముడు రథం దిగి వచ్చి శ్రీ కృష్ణుని స్తుతిస్తాడు. భాగవతం లోని "భీష్మస్తుతి" లోని పద్యాలను ఈ భీష్మ చిత్రంలో ఘంటసాల మాస్టారు అద్భుతంగా గానం చేసారు. "కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి" అనే పద్యం యొక్క దృశ్య, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ పద్యానికి మహా సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు యిచ్చిన వివరణ ఇక్కడ చూడండి.
చిత్రం: భీష్మ (1962)
మూలం: భాగవతం
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
గానం: ఘంటసాల
సీ. కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి, గగన భాగంబెల్ల గప్పి కొనగ
ఉఱికిన నోర్వక ఉదరంబులోనున్న, జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నా లావు నగుబాటు సేయక, మన్నింపుమని క్రీడి మఱల దిగువ
తే.గీ. కరికి లంఘించు సింగంబు కరణి మెఱసి,
"నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జునా"యని నాదు విశిఖ వృష్టి
తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు