చారుకేశి అంటే చక్కని
కురులు గలది అని అర్ధం. మాస్టారి సునిశితమైన సంగీత
ప్రయోగాలలో వాసికెక్కిన రాగాల రాశి చారుకేశి. దానిని
భక్తికి, విరక్తికి, అనురక్తికి,
శృంగారానికి, సందేశానికి, శోకానికి, శాస్త్రీయ సరిపాకానికి ఆసక్తిగా
వాడిన ఘనత
ఘంటసాలదే. దేవుని
మాయను వర్ణించే
భక్తిపూరిత గానంలో, పద్యంలోనూ, నేపథ్యంలోనూ హృద్యంగా
తథ్యంగా వినిపించేది
చారుకేశి. గళవేల్పు గళంలో చారుకేశి శిలలను
కరిగిస్తుంది, నయనాలను అశ్రుపూరితం చేసి గొంతులో
భక్తి పరవశమైన
భావోద్వేగాన్ని పలికిస్తుంది. నియంతయైన
ప్రభువును హెచ్చరించే సూచనలో సందేశప్రాయంగా వినిపిస్తుంది.
పరిస్థితులు ప్రతికూలమైన పడతి ఊరువదలి కారు
చీకటిలో కలసి
సాగే వేళ
శోకభరితమైన హృదయావేదనను వినిపిస్తుంది.
రాగఝరులు రుచిచూడాలని తహతహలాడే మనకు ఈసారి చంద్రమౌళి
గారు రాగశాలలోచారుకేశి
రసాన్నుంచారు. మరి ఆస్వాదిద్దామా!
అన్నిరాగాలకూ
మూలం మేళకర్త రాగాలు. వాటి సంఖ్య 72. అందులో
చెరిసగం, శుద్ధ-ప్రతిమధ్యమ స్వరాధారంగా విభజించిన
36 రాగాల కూటమి. వీటన్నిటికి మూలం 12 స్వరాలు. మేళకర్తల కర్త, ఈ 12 స్వరాల
మార్పిడి మరియు మేళనము (permutation combination) ల లబ్ధము. సప్తస్వరాలలోని రిషభ-గాంధారాలు, దైవత-నిషాదాలు
మారుతుంటే కలిగేవే ఆ రాగాలు. ఆ 'రి-గ, ద-ని'ల
లోనూ కోమల-తీవ్ర ప్రభేదాలున్నాయి గనుక, 'స్వరములు ఏడైనా రాగాలెన్నో! స్వరాల
కోమలత-తీవ్రత ఆధారంగా 7 స్వరాలలోనుండి 12 స్వరాల
సృష్టి. మూర్ఛనలోని ఆరోహణావరోహణములలో 7 స్వరాలుంటే
అది మేళకర్త రాగం లేదా జనక రాగం. మూర్చనలో 4,5,6 స్వరాలో, విభిన్నస్వరాలో
ఉండగా అది 12 స్వరశిఖరాలనుండి ప్రవహించి వేలకొలది రాగాలై, గాయనానంద
సముద్రంలో కలిసి ఒక్కటయ్యెడి ఓంకారమే. అన్ని మేళకర్తరాగాలూ సుప్రసిద్ధంకావు. ప్రసిద్ధమైనవి
కొన్నే. అందులోనూ చిత్రసంగీతంలో వినబడేవి : చక్రవాకం, ఖరహరప్రియ, చారుకేశి, శంకరాభరణం
(శుద్ధ మధ్యమ రాగాలు), పంతువరాళి, షణ్ముఖప్రియ, సింహేంద్ర
మధ్యమ, కల్యాణి (ప్రతిమధ్యమ రాగాలు). కల్యాణి రాగంలో వందలాది పాటలే ఉన్నాయి. మిగిలిన
ప్రముఖ రాగాలలోని పాటల సంఖ్య తక్కువే.
చారుకేశి రాగం
ఘంటసాలకు ఆత్మీయమైనదనే మనకు తెలుస్తుంది. ఆయన స్వరకల్పన చేసిన చిత్త్రాలలో,
"భళిభళి భళిభళి దేవ" వంటి చారుకేశి లేకున్నా ఓ పద్యమో, చివరికి
నేపథ్యంగానైనా చారుకేశి రాగం ఉంటుంది. తను ఆలపించిన భగవద్గీతలోని మూడు శ్లోకాలకు ఆ ఘనత
దక్కింది. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన అన్నిచిత్రాలలోనున్న అన్నిపాటలనూ అభ్యసించి, ఆయన చేసిన
రాగప్రయోగాలను అధ్యయనం చేయగా అదే ఒక పరిశోధనగా మారుతుంది. ఏకారణంగానో రసజ్ఞులైన ఆంధ్రులు ఈ అంశాన్ని గమనించినట్లులేదు.
ఆ బృహత్కార్యానికి నేను అశక్తుడను గనుక, పైపైన వాటిని గురించి, కరపునర్లేపనమన్నట్లు, ఇక్కడ
ముచ్చటించుకోవడమే సులభసాధ్యం.
చారుకేశి
౨౬వ మేళకర్త రాగం. "వేంకటముఖి" సంప్రదాయంలో ఈరాగం పేరు "తరంగిణి". స్వరస్థానాలు: స, ప లతోబాటు చతుశ్రుతి
రిషభం, అంతరగాంధారం, శుద్ధమధ్యమం, శుద్ధదైవతం
మరియు కైశికినిషాదం. సౌలభ్యానికొరకు పూర్వాంగం
శంకరాభరణం మరియు ఉత్తరాంగం తోడిరాగ స్వరాలు అనకోవచ్చు. సంవాది స్వరాలు: స-ప, స-మ, రి-ప, మ-ని, మ-స, ప-స సుప్రసిద్ధమైన
ఆదితాళ నిబద్ధమైన త్యాగరరాజు వారి "ఆడమోడిగలదా" చారుకేశికే లక్షణప్రదమైన కృతి.
మరొక్క ప్రసిద్ధమైన పాట చాపుతాళయుక్తమైన స్వాతిరునాళ్ రచన"కృపయా పాలయ శౌరే".
గ్రహభేద క్రియలోను ప్రసిద్ధరాగాలను పలుకే మేళమిది. చారుకేశిరాగం యొక్క మధ్యమ గ్రహంలో గౌరీమనోహరి, పంచమ గ్రహంలో
నాటకప్రియ మరియు నిషాద గ్రహంలో వాచస్పతిరాగాలు ఉద్భవిస్తాయి.
చారుకేశిరాగముయొక్క
స్వరసంచారములను, సంక్షిప్త రాగ విస్తారమును ఇక్కడ వినవచ్చు
చారుకేశిరాగంలో
ఘంటసాల పాడిన పాటలలో శుద్ధశాస్త్రీయమైన కోవకుచిందినది “సుగుణధామా రామా”. శిలను కరిగించి
అందులో నారద తుంబురుల వీణలు ఇమిడిపోగా ఆంజనేయుని గానామృతం ఆ పరుష పేటికను నీళ్ళు గావించే
సన్నివేశం. వీరాంజనేయ చిత్రంలోని “గమపదనిసరిగా (సుగుణధామా) అంటూ రెండు గాంధారాలను
దాటి పై పంచమాన్ని ఆదిలోనే సోకిన ఆయన గళంలో భక్తిరసమే ప్రవహిస్తున్నది హృదయినేత్రాలకు
సగోచరమే.
పాట:
సుగుణధామా, చిత్రం: వీరాంజనేయ
భక్తిభావ ప్రకటనకు
చారుకేశి చాలా సొగసైన రాగమని తెలుసుకొన్న ఘంటసాల “పాడనా ప్రభూ పాడనా” అంటూ దేవునికే
తనగానాన్ని అంకితం చేశారా అనే విధంగా పాడిన భావగర్భితమైన గేయమిది.
చారుకేశి స్వరాలలో
తీవ్రమైన ఆవేదనతో మునిగిన విషాదభావాన్ని పైకెత్తి చూపడం ఘంటసాల గళాభినయానికే ఎరుక! పాదపపా
పాప పాదపపదమా గాగమపమ గాగమపా గాగమపమ గమగరిస
పానిసరి....మరిమరిసని రిససస (పపద పపద సాని దానిదప)
చీకటిలో కారు చీకటిలో...... కాలమనే కడలిలో శోకమనె పడవలో ఏ దరికో... ఏ జతకో..
పాట: చీకటిలో కారు చీకటిలో, చిత్రం: మనుషులు మారాలి
ఇదే రాగాన్ని నీతిబోధకంగా పరోక్షంగా హెచ్చరించి ఒక
సందేశాన్ని ఉత్సాహకరంగా అందించడమూ, ఆ భావాలకు ఏ స్వరాలను
వాడాలో, ఏభావంతో పాడాలో అందులో మాస్టారు పటిష్టమైన నేర్పరి. "ప్రజలమాటను మీరక రాజ్యమేలు"
అనే సాకిలోని గమకప్రయోగాలు చారుకేశి రాగ సంచార జీవస్వరాలను వెదజల్లి,
"మంచితనము కలకాలం నిలిచియుండును" (మపప పపద నిదపపపప మపమగామపా)
పాట: మంచితనము; చిత్రం: బందిపోటు
ఘంటసాల
సినిమాసంగీతానికి వచ్చిన ఆ తరుణంలోనె పాడిన “ఎంతమంచిదానవోయమ్మ” అపురూపమైన అతిమందర శ్రుతిలో ఆలపించిన విలక్షణమైన గేయం. ఆరోజులలో తను పాడిన నిధాన ప్రసన్నమధుర భావగీతంలా
మనకు వినిపిస్తుంది. అక్కడక్కడ విషాదభరితమైన
ప్రాత్ర గుణస్తుతి అలనాటి చిత్రాల పద్ధతి.
పాట:
ఎంత మంచిదానవో
అదే రాగస్వరాలలో
శృంగార రసావిష్కరణం గావించే నైపుణ్యం తను స్వరకల్పనచేసి పాడించిన ఈ పాటలో మనోహరంగా స్ఫురిస్తుంది.
(పాట:
ఎవరో)
దాటుస్వరాల
విన్యాసంలో ఒక క్రొత్తరాగాన్నే వింటున్నామన్న భ్రమకలింగిచే ఈ పాటను మాస్టారు కన్నడ
భాషలోనూ (పురందరదాసు రచన) ఆలపించారు. “ససగగమామ పదదద పదపమ పనినిదాపామమగా” స్వరాలవెనుక
సాగే కరుణారన్ని కురియించేపాట ఇది.
భగవద్గీతలోని
ఐదవ అధ్యాయం సన్యాసయోగం. ఆ విరక్తి స్పర్శను కలిగించేవి చారుకేశిరాగాలే. ఒక్కరాగంలోనే
మూడు శ్లోకాలను పాడినా, విడివిడిగా ఆ వైవిధ్యత మనకు శ్రవణవేద్యమే
(భగవద్గీతా శ్లోకత్రయం)
ఊరేదిపేరేది
(రాజమకుటం/మాస్టర్ వేణు (రజనీకాంత రావు)/నాగరాజు)
(కొంత భాగం మాత్రం - ఇది రాగమాలిక)
ఈపగలురేయిగ (సిరిసంపదలు/ఆత్రేయ/మా.వేణు)
భళి భళి భళి భళి దేవ (మాయాబజార్/ఘంటసాల/పింగళి)
రాగమాలికల
కూర్పుకు చారుకేశిరాగం అతిప్రశస్తమైన సుస్చరముత్యం. “భళిభళి భళిభళి దేవా” గాక, “విన్నావ యశోదమ్మ” పాటలో రాగమాలికగానూ చారుకేశి
వినిపిస్తుంది (మాయాబజార్).
శాస్త్రీయరాగాల
ఆధారంతో స్వరకల్పనలు చేసె రసికుల మెప్పుగడించడం సులభసాధ్యం కాదు. ఒక రాగాన్ని ప్రయోగించాలి అన్న ఆలోచనకన్నా, ఏ
సన్నివేశానికి ఏస్వరాలు ఆ భావాలను కలిగిస్తాయో ఆ స్వరాలనే మాస్టారు సంయోజించి
ఉంటారా అనిపిస్తుంది. మేళకర్త రాగాలను పౌరాణిక, చారిత్రిక, జానపదీయ చిత్రాలలో మనకు
వినిపించినా, ఘంటసాల కొన్నిటిని సామాజిక చిత్రాల్లోనూ ప్రవేశబెట్టారు. అలాంటి అపురూప రాగాల్లో చారుకేశి ఒకటి. ఆ రాగాధారితమైన కొన్ని పాటలను, పద్యాలను ఈ
రోజు నెమరువేసుకోవడం ఆ మహాగాయకుని జ్ఞాపకగానవిగ్రహానికి చిన్నస్మరణార్చన.
ఈ రోజే మాస్టారు మనను వదలి వెళ్ళిన రోజు,
కాని వారి గానం అజరామరం
కృతజ్ఞతలు: వీడియో కలాలను అంతర్జాలములో పొందుపరచిన బ్యాంక్ ఆఫ్ ఘంటసాల మరియు యు ట్యూబ్ వారికి.