అష్టవసువులలో ఒకడైన ప్రభాసుడు ("ద్యు") అనే వసువు, తోటి వసువులను ప్రేరేపించి వశిష్ట మహర్షి ఆశ్రమంలోని కామధేనువు "నందిని" ని హరించిన కారణంగా శాపగ్రస్తుడై గంగా-శంతనులకు దేవవ్రతుడుగా జన్మించి, తండ్రి మనసుపడిన దాశరాజు కుమార్తె మత్స్యగంధిని కలుసుకుని, దాశరాజు కోరిక మేర ఆజన్మ బ్రహ్మచర్యం వహిస్తానన్న భీషణ ప్రతిజ్ఞ మూలంగా భీష్ముడైనాడు. మహాభారతం లో భీష్ముడు కీలకమైన పాత్ర వహిస్తాడు. ఆయన కారణ జన్ముడు. కొడుకు చేసిన త్యాగానికి సంతసించి, పుత్రవాత్సల్యం తో శంతనుడు భీష్మునికి స్వచ్ఛంద మరణం, అంటే తను కోరినపుడే తనకు మృత్యువు సంభవించే వరమిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో తాతను గెలవలేనని తెలిసిన అర్జునుడు శ్రీకృష్ణుని సలహాపై పేడియైన శిఖండిని అడ్డు పెట్టుకుని యుద్ధానికి దిగుతాడు. ఈ శిఖండియే భీష్మునిచే తిరస్కరించబడి, భీష్ముని చంపడం వరంగా పొంది పునర్జన్మనెత్తిన కాశీరాజు కూతురు అంబ. యుద్ధంలో ఆడ వారితో యుద్ధం చేయననే నియమంతో అస్త్ర సన్యాసం చేసిన భీష్ముని గాండీవి తన శరాఘాంతంతో కూల్చి, నేలకొరిగే తాతని అంపశయ్య పై పరుండబెడతాడు. అది అశుభకాలమైన దక్షిణాయనం అవడం చేత, పుణ్యకాలమైన ఉత్తరాయణం వచ్చే వరకు భీష్ముడు నిరీక్షిస్తాడు. ఆ సమయంలో ధర్మ సూక్ష్మాలను తెలుసుకోగోరే ధర్మజుని ఆరు ప్రశ్నలకు సమాధానంగా విష్ణు సహస్ర నామాన్ని బోధిస్తాడు కురు పితామహుడు. అనంతరం శంఖ, చక్ర, గదా, పద్మ హస్తుడైన శ్రీ కృష్ణుని దర్శనంతో ఆ దేవదేవుని స్తుతించి మాఘ శుద్ధ ఏకాదశి నాడు తనువు చాలిస్తాడు భీష్ముడు. అదే భీష్మ ఏకాదశి. ఆరోజే విష్ణు సహస్రనామ జయంతి. భీష్ముని గా ఎన్.టి.ఆర్., శ్రీకృష్ణునిగా హరనాథ్ భీష్మ చిత్రంలో నటించారు.
చిత్రం: | భీష్మ (1962) | |
రచన: | ఆరుద్ర | |
సంగీతం: | ఎస్.రాజేశ్వర రావు | |
గానం: | ఘంటసాల | |
పద్యం: | దేవ దేవా జీవాత్మకా దేవ వంద్యా | |
శంఖ చక్ర గదా పద్మ చారుహస్తా | ||
వాసుదేవా త్రివిక్రమా వరదా పరమపురుషా | ||
ప్రణుతి యొనర్చెద కరుణ గనుమా ఆ..ఆ..ఆ… |