1961 లో విడుదలైన "వాగ్దానం" చిత్రం శ్రీ ఆచార్య ఆత్రేయ గారి స్వంత చిత్రం. దర్శకులు కూడ వారే. ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా చక్కని పాటలున్నాయి. ఆత్రేయ గారు స్వయంగా రాసే సమర్ధత ఉన్నప్పటికీ తోటి రచయితలైన శ్రీశ్రీ, దాశరధి, నార్ల చిరంజీవి గార్ల చేత తన చిత్రంలో పాటలు వ్రాయించారు. ఈ చిత్రంలో శ్రీశ్రీ గారు వ్రాసిన సీతా కల్యాణ హరికథ "శ్రీనగజా తనయం" చాల ప్రసిద్ధి పొందింది. చిత్రీకరణ హీరో హీరోయిన్ లపై చేసినా కళ్ళు మూసి వింటే ఆ రఘురాముడే కనిపిస్తాడు మాస్టారి గానంలో. సినిమాలో రేలంగి గారిపై చిత్రీకరించారు ఈ పాటను. పద్మనాభం మృదంగం వాయిస్తూ, సూర్యకాంతం వయొలిన్ వాయిస్తూ కనిపిస్తారు. పద్యాలకు వరవడి దిద్దిన ఘంటసాల మాస్టారు రేలంగి పాత్రకు చక్కని మాడ్యులేషన్ చూపి హరికథను అద్భుతంగా గానం చేసారు. అయితే శ్రీశ్రీ వ్రాసిన ఈ హరికథలో ఒక పద్యం "ఫెళ్ళు మనె విల్లు గంటలు ఘల్లుమనె" అనేది కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన శివ ధనుర్భంగము" లోనిది. మరొక పద్యం "భూతలనాథుడు రాముడు" శ్రీ బమ్మెర పోతన రచించిన భాగవతం యొక్క నవమ స్కంధంలోని శ్రీరామ చరిత్రం లోనిది. ఈ చిత్రానికి సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు సమకూర్చారు. ఇక్కడ శ్రవణ, సాహిత్యాలను పొందు పరుస్తున్నాను. స్వరాలలో తప్పులుంటే రసజ్ఞులైన సంగీతజ్ఞులు సవరించగలరు.
ఆడియో ఫైలు: అంతర్జాలం నుండి
చిత్రం: వాగ్దానం (1961)
రచన: శ్రీశ్రీ, బమ్మెర పోతన, జంధ్యాల పాపయ్య శాస్త్రి
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
అభినయం: రేలంగి వెంకట్రామయ్య (హరిదాసు)
నిర్మాత-దర్శకుడు: ఆచార్య ఆత్రేయ
అతిరథులు-మహారథులు
ఆడియో ఫైలు: అంతర్జాలం నుండి
చిత్రం: వాగ్దానం (1961)
రచన: శ్రీశ్రీ, బమ్మెర పోతన, జంధ్యాల పాపయ్య శాస్త్రి
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
అభినయం: రేలంగి వెంకట్రామయ్య (హరిదాసు)
నిర్మాత-దర్శకుడు: ఆచార్య ఆత్రేయ
గానం: | శ్రీనగజా తనయం సహృదయం (2) | ||
చింతయామి సదయం త్రిజగన్మహోదయం | |||
శ్రీనగజా తనయం | |||
వచనం: | శ్రీరామ భక్తులారా, ఇది సీతా కల్యాణ సత్కథ. నలభైరోజులనుంచి చెప్పిన కధ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నా. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తోంది. నాయనా! కాస్త పాలూ మిరియాలూ, ఏవైనా | ||
శిష్యుడు: | చిత్తం, సిద్ధం | ||
వచనం: | భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరిని ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి, ఆహ్హా! | ||
అతడెవరయ్యా అంటే.. | |||
గానం: | రఘు రాముడు, రమణీయ వినీల ఘన శ్యాముడు | ||
రమణీయ వినీల ఘన శ్యాముడు.. | |||
వాడు, నెలఱేడు, సరిజోడు, మొనగాడు | |||
వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాల జాలురా (2) | |||
వాని చూచి మగవారలైన మైమరచి | |||
మరుల్కొనెడు మరోమరుడు మనోహరుడు, రఘూ రాముడూ… | |||
స్వరం: | సనిదని, సగరిగ రిగరిరి, సగరిరిగరి, సగగరి సనిదని, | ||
సగగగరి సనిదని, రిసనిద, రిసనిద, నిదపమగరి రఘురాముడు | |||
ఔను ఔను | |||
స్వరం: | సనిసా సనిస సగరిరిగరి సరిసనిసా పదనిసా | ||
సనిగరి సనిస, సనిరిస నిదని, నిదసని దపమ గా-మా-దా | |||
నినినినినినిని | |||
పస పస పస పస | |||
సపా సపా సపా తద్దిం తరికిటతక | |||
రఘు రాముడు, రమణీయ వినీల ఘన శ్యాముడు.. | |||
శభాష్, శభాష్ | |||
వచనం: | ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామ చంద్ర మూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో | ||
గానం: | ఎంత సొగసుగాడే (2) మనసింతలోనె దోచినాడే | ||
ఎంత సొగసు గాడే | |||
మోము కలువ ఱేడే, నా నోము ఫలము వీడే | |||
శ్యామలాభిరాముని చూడగ నా మది వివశమాయె నేడే | |||
ఎంత సొగసుగాడే.. | |||
వచనం: | ఇక్కడ సీతాదేవి యిలా పరవశయై యుండగా, అక్కడ స్వయంవర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి.. | ||
గానం: | అనియెనిట్లు ఓ యనఘులార, నా యనుగు పుత్రి సీత | ||
వినయాదిక సద్గుణవ్రాత, ముఖ విజిత లలిత జలజాత | |||
ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును నేడు | |||
మక్కువ మీరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడు.. ఊ.. | |||
వచనం: | అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే, సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడి పోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడ "హా! ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహా పాపము" అని అనుకొనినవాడై వెనుతిరిగి పోయాడట. తదనంతరంబున - | ||
గానం: | ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెఱుపువలె నిల్చి | ||
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి | |||
సదమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత | |||
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత | |||
తేటగీతి: | ఫెళ్ళుమనె విల్లు, గంటలు ఘల్లుమనె, గు | ||
భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనియె | |||
జానకీ దేహము.. ఒక నిమేషమ్ము నందె | |||
నయము, జయమును, భయము, విస్మయము గదురా.. ఆ..ఆ.. | |||
శ్రీమద్రమారమణ గోవిందో హరి! | |||
వచనం: | భక్తులందరు చాలా నిద్రావస్థలో ఉన్నట్లుగా వుంది. మరొక్కసారి - | ||
అందరు: | జై! శ్రీ మద్రమారమణ గోవిందో హరి... | ||
భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు అంతట | |||
కంద | భూతలనాథుఁడు రాముఁడు | ||
పద్యం: | ప్రీతుండై పెండ్లియాడె పృథుగుణమణి సం | ||
ఘాతన్ భాగ్యోపేతన్ | |||
సీతన్* | |||
భూతలనాథుఁడు రాముఁడు ప్రీతుండై పెండ్లియాడె.. | |||
శ్రీ మద్రమారమణ గోవిందో హరి |
ఎందఱో మహానుభావులు అందరికీ వందనాలు!
మఱియు శ్రీరామనవమి శుభాకాంక్షలు
అదనపు సమాచారం: కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన "ఫెళ్ళుమనె విల్లు" పద్యం గురించి శ్రీ పిస్కా సత్యనారాయణ గారిచ్చిన వివరణ ఇలా వుంది. దానిని ఈ లింకులో చూడవచ్చును.మఱియు శ్రీరామనవమి శుభాకాంక్షలు
"శ్రీరాముడు ఎక్కుపెట్టగానే శివధనుస్సు ఫెళ్ళుమని విరిగినది. ఆ వింటికి కట్టివున్న చిరుగంటలు ఘల్లుమని మ్రోగినవి. సభలో ఆసీనులైవున్న రాజకుమారులందరి గుండెలు ఆ భీకరనాదానికి గుభిల్లుమన్నాయి. ఇక, సీతాదేవి శరీరము ఝల్లుమని పులకరించిపోయింది..... ఎంత అందమైన, మనోహరమైన వర్ణన! ఈ చిన్నిపద్యములోనే అక్కడి వాతావరణాన్ని మనోజ్ఞంగా మన కనుల ముందర నిలిపినారు పాపయ్యశాస్త్రిగారు!.... ఒక్క నిమిషములోనే నయము, జయము, భయము, విస్మయము ప్రతిఫలించినాయట ఆ సభాస్థలిలో! విల్లు ఫెళ్ళుమనడానికి నయము, గంటలు ఘల్లుమనడానికి జయము, నరపతుల గుండెలు గుభిల్లుమనడానికి భయము, వైదేహి దేహము ఝల్లుమనడానికి విస్మయము ప్రతీకలు! ముందు 4 విషయములను చెప్పి, చివరి పాదములో నయము, జయము, భయము, విస్మయములను ఉటంకించి ఈ చిన్నిపద్యమును క్రమాలంకారములో తీర్చిదిద్దినారు కరుణశ్రీ! "
*పోతన వ్రాసిన ఈ కందపద్యం లో ఆఖరి లైనులో "సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్" అని వుంటుంది. అయితే ఎందుచేతో శ్రీశ్రీ గారు ఈ పదాలను ఉపయోగించలేదు.
కృతజ్ఞతలు: శ్రీ వేణూ శ్రీకాంత్ గారి నాతో నేను నా గురించి బ్లాగు నుండి, మరియు వికిసోర్స్ లో శ్రీ రాజశేఖర్ గారు సమకూర్చిన సాహిత్యం స్వల్ప సవరణలతో, మరియు శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు మరియు శ్రీ కంది శంకరయ్య గార్లు ప్రస్తావించిన విషయాలను ఈ నా "ఘంటసాల" బ్లాగులో క్రోడీకరించాను. వారు తెలిపిన విలువైన విషయాలు నలుగురితో పంచుకోవాలనిపించింది. పరోక్షంగా దోహదపడిన సంగీత, సాహిత్యాభిలాషులందరికీ నా హృధయపూర్వక ధన్యవాదాలు.
To print this page as PDF click the "Print Friendly" button below and follow the instructions.