తెలుగు సినీచరిత్రలో సంగీతభేరులు మ్రోగించిన అద్భుతమైన దృశ్య కావ్యం 1959 లో విడుదలయిన శారదా వారి జయభేరి. పెండ్యాల స్వరకల్పనకు, ఘంటసాల గాన ప్రతిభకు, నాగేశ్వరరావు నటనా కౌశలానికి దర్పణం పట్టిన సంగీతఝరి జయభేరి. శాస్త్రీయ సంగీత విద్యనభ్యసించినప్పటికి, జానపదాల్లో కూడా మానవతా విలువలు ఉన్నాయని గ్రహించి, వర్ణ-వర్గ వివక్షతలను నిరసించి, అస్పృశ్యతను విరోధించి, అన్యవర్ణ స్త్రీని వివాహమాడి, సంగీత జయభేరిని దేశం నలుమూలలా మ్రోగించి, తన సంగీత ప్రతిభతో పామరులనే కాక పండితులను కూడా రంజింప చేయాలన్న రాజనర్తకి (రాజసులోచన) సవాలుకు బదులుగా విజయనగర రాజైన విజయానందుని (ఎస్.వి.ఆర్.) సముఖములో విజయానంద చంద్రిక అనే క్రొత్త రాగాన్ని సృష్టించి అందరినీ సమ్మోహన పరచిన గాయక కథానాయకుని కథను ఆత్రేయ సమకూర్చగా పి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించబడిన సంగీత దృశ్య కావ్యం జయభేరి. పలువురు ప్రముఖ సినీ కవులు - మహాకవి శ్రీశ్రీ వ్రాసిన నందుని చరితము వినుమా, మల్లాది వ్రాసిన రసికరాజ తగువారము కామా, రాగమయీ రావే, ఆరుద్ర వ్రాసిన యమునా తీరమున సంధ్యా సమయమున, ఈ చిత్రంలోని అద్భుతమైన పాటలు. ఇక మన రాగశాల లోకి అడుగిడదామా?
నవరాగరాజ రసికరాజ
గానప్రియుల గళవేల్పు అయిన ఘంటసాల మాస్టారి గొప్పతనం ఖంగుమనే కంఠశ్రీతో సమ్మిళితమై, విశిష్టమైన శాస్త్రీయ సంగీతజ్ఞానం కలిగియుండడం అంటే అతిశయోక్తికాదు. తాను కర్ణాటక సాంప్రదాయ సంగీత పట్టభద్రుడైనా, ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ వంటి సుప్రసిద్ధ హిందూస్తానీ గాయకుల సాహచర్యంవల్ల హిందూస్తానీ సంగీతపు లోతులు సైతం ఆకళింపు చేసుకున్న స్వరసవ్యసాచి. అలాగే తన స్వరఝరుల సంగతులతో మన డెందాలను భావోద్వేగపుటుయ్యాలలూగించిన అలనాటి మేటి సంగీత దర్శకులు పెండ్యాల వారు. వారి స్వరసృష్టిలో శాస్త్రీయ సంగీత పరంగా స్వరబద్ధమైన పాటలను ప్రజారంజకంగా, జనులు పాడుకొనే విధంగా చేసిన ఎన్నో ప్రయోగాలలో ఎటువంటి శాస్త్రీయ కీర్తనతోనైనా పోటీ పడగలిగి, కొత్తదనం ప్రస్ఫుటిస్తూ మన హృదయాలలో శాశ్వత స్థానం పొందగలిగిన ఒక ముఖ్యమైన పాట “జయభేరి” చిత్రం లోని “రసికరాజ తగువారము కామా” అనే రసగుళిక.
శుద్ధ శాస్త్రీయ పద్ధతిలో ఘంటసాలగారు గానంచేసిన అత్యుత్తమ కృతుల ముత్యాలహారంలో పతకాన్నిఅలంకరించిన మూడు మధ్య మణులున్నవి. ఆ మేలిమి రత్నాలు ఇవి. 1. మది శారదాదేవి మందిరమే, 2. రసికరాజ తగువారము కామా మరియు 3. శివశంకరి. విశేషమేమిటంటే ఈ మూడూ పెండ్యాల గారి స్వరసృష్టి శిఖరాలే. “మది శారదాదేవి మందిరమే” కర్ణాటక శాస్త్రీయ పద్దతిలో, కళ్యాణి రాగంలో, ఆలాపన, కృతిగాయనం, నెరవల్, కల్పనాస్వర ముక్తాయాది ప్రక్రియల క్రమాలతో పాడి, గురువును మెప్పించిన సందర్భానికి చెందినది. మరి “శివశంకరి” మాటకొస్తే, హిందూస్తానీ పద్ధతిలో త్రిస్థాయి-త్రికాల రాగ, తాన, గమక స్వర సర్వస్వాలంకృతమై, దేవతలను మెప్పించి కొండలను కరగించే కరుణారసఝరి 'శివశంకరి శివానంద లహరి'. వీటికి భిన్నంగా “రసికరాజ తగువారము కామా”, అంతవరకు సంగీత శాస్త్రంలో లేని కొత్తరాగాన్ని సృజియించి, మహారాజునూ, పండితులనూ మెప్పింప పాడిన నవ్యాకృతి కృతి. ఆ విధంగా గురువును, దేవతలను, రాజును, వెరసి సంగీత రసికులను మెప్పించే మూడు విభిన్న సన్నివేశాల పాటలకు స్వరకల్పన చేసి సుస్వరాలమాల కూర్చిన ఘనత పెండ్యాల గారిదైతే, ఆ స్వరాలు భావరసస్నాతమై నాదబ్రహ్మత్వాన్ని పొంది నిలిచేలా చిరంజీవత్వాన్నొసగిన గాంధర్వ ప్రతిభ, ఘంటసాల మాస్టారిది.
పెండ్యాల నాగేశ్వరరావుగారి నిర్వహణలో ఘంటసాల పాడినవి ఎన్నో వందల పాటలు ఒక యెత్తు, ఈ మూడు పాటలు ఒక యెత్తు. అపురూపమైన ప్రజ్ఞాపాటవంతో శాస్త్రీయ సంగీతాన్ని సినిమా పాటలలో నిలిపిన సంగీత దర్శకుడు పెండ్యాల. దీనికి జతగా, కంచు కంఠంతో గంధర్వ గానాన్ని మనకందించి ఆ మూడు పాటలను అజరామరం చేసినది ఘంటసాల. ఇప్పటికీ ఈ మూడు పాటలే సంగీతజ్ఞ రసికులకు, గాయన కుతూహలులకు, గాత్ర నిర్ధారిత పరీక్షలకు గీటురాళ్ళు.
రసికరాజ తగువారము కామా - నేపథ్యం
జయభేరి చిత్రంలోని ఈ పాటకు సందర్భం ఒక సంగీతవిద్వాంసుని ప్రతిభాపరీక్ష. కథాపరికల్పన విజయనగర సామ్రాజ్య వైభవవు కాలానికి చెందినది గనుక, కర్ణాటక శాస్రీయ సంగీతమే ప్రధానంగా ఉండాలి. అయితే, క్లిష్టమైన కీర్తనలూ, అపురూపమైన రాగాలూ, రాగం-తాన-పల్లవులూ, రాగమాలికలూ గానసభలూ, సంగీత కచేరీలకే గాని సినిమా సంగీతానికి సరిపోవు. ఎందుకంటే ప్రేక్షక శ్రోతలకు మనోరంజకత్వం, మళ్ళీమళ్ళీ విని పాడుకోవాలనే భావన కలిగినపుడు ఆ పాటలకు ఎక్కువ ప్రజాదరణ లభిస్తుంది. శాస్త్రీయ కట్టుబాటులలోనే కృతి, ఆలాపన, విస్తారం, స్వర ప్రస్తారం, తనియావర్తనం మరియు ముక్తాయం ఉండాలి. ఇవన్నీ సమకూరవలసినది ఐదారు నిమిషాల వ్యవధిలోనే! ఇంతకు ముందు ఏ సంగీతశాస్త్ర గ్రంథములలోనూ పేర్కొనని రాగమూ, ఎవరూ పాడని వైవిధ్యమూ ఉండాలి. ఇన్నిసాపేక్ష నిర్భంధములతో సృష్టించబడిన రసఫలము ఈ పాట.
సినీ సంగీతంలో చక్రవాక, కానడ రాగాలు సుపరిచితాలు. చిత్తూరు నాగయ్యగారు “భక్తపోతన (1942)” చిత్రంలో ఆలపించిన ‘పావనగుణరామా హరే’, “లవకుశ” చిత్రం కోసం ఘంటసాల స్వరకల్పన చేసి పాడిన 'జగదభిరాముడు శ్రీరాముడె', 1966 లో విడుదలైన “భక్త పోతన”లో ‘జ్యోతీభారతి’ అనే పద్యం, “వాగ్దానం” చిత్రంలో ‘శ్రీనగజాతనయం’ హరికథ ప్రారంభంలోని వినాయక స్తుతి, ఘంటసాల గానం చేసిన "భగవద్గీత"లోని ‘దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యౌవనంజరా’.. ఇవి కానడ రాగాధారములు. అలాగే, చక్రవాక రాగంలో ఘంటసాల స్వరపరచినవి పాడినవి ఎన్నో. ఉదాహరణకు: 'విధివంచితులై' (పాండవవనవాసము); 'ఏడుకొండలవాడ వేంకటారమణ' (పి.లీల, పెళ్ళిచేసిచూడు); 'నీ కొండకు నీవే రప్పించుకో' (భక్తిగీతం); 'ముక్కోటి దేవతలు' పాటలో 'నెల్లూరి సీమలో చల్లంగ శయనించు' (బావమరదళ్లు); 'సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల…' (శ్యామలా దండకం – మాహాకవికాళిదాసు); 'మధుకైటభారి శ్రీహరి ప్రక్కనుండి' (వేంకటేశ్వర ప్రభాత ప్రార్థన) మొదలైనవి. కానడ-చక్రవాక రాగాలను మేళవించడం ద్వారా సృష్టింపబడిన విభిన్న నవరాగం “విజయానంద చంద్రిక”.
విజయానంద చంద్రిక
చక్రవాక-కానడ రాగాలు మిళితమైన ఈ సుస్వర ముక్తాఫలాన్ని విజయానందచంద్రిక అన్నారు. చక్రవాకం 16వ మేళకర్తరాగంలోని ఏడుస్వరాలకు, కానడరాగంలోని (22వ మేళకర్తయైన ఖరహరప్రియ రాగ జన్యము) విభిన్నమైన ఋషభ గాంధారాలను మేళవించి, తొమ్మిది స్వరాల రాగంగా సృష్టింపబడినది విజయానంద చంద్రిక. ఊరికే తొమ్మిదిస్వరాలు కలిపితే విశేషరాగం కాదు. రాగానికి లక్షణముండాలి, ఒక ప్రత్యేకత ఉండాలి. ఆలాపనలో, స్వరాల నడకలో, పాట ప్రవహించే ధాటిలో కొత్తదనం ఉట్టి పడాలి. చక్రవాక రాగానికీ, కానడ రాగానికీ స్వరాలలో తేడా ఋషభ, గాంధారాలే. అయితే, చక్రవాక రాగంలో శుద్ధ ఋషభం (రి1) అంతర గాంధారాలు (గ3) రాగా, కానడరాగ స్వరాలలో చతుశృతి ఋషభము (రి2) మరియు సాధారణ గాంధారము (గ2) వస్తాయి. అనగా విజయానంద చంద్రికలో స,రి1,రి2,గ2,గ3,మ1,ప,ద2,ని2, ఈ తొమ్మిది స్వరాలు వస్తాయి.
అయితే, ఋషభ గాంధారాలు వేరుగానున్న ఈ రెండు రాగాలనే ఎందుకు ఎంపికచేశారు? ధైవత, నిషాదాలు వేరైన రాగాలను ఎందుకు వదలిపెట్టారు? అనగా ఈ తొమ్మిది స్వరాలలో ఒక్క తంత్రాంశమున్నది. ఋషభ గాంధార స్వరాలు మూర్చనలో ఆదిస్వరాలు. త్రిస్థాయి గానానికి వీలుగా ఉంటాయి. ఘంటసాలగారి గాత్రంలో ఈ ఋషభ గాంధార స్వరాలు మంద్ర, మధ్యమ మరియు తారాస్థాయిలో మనకు వినబడతాయి. ధైవత నిషాదాలు వేరుగానున్న రెండు రాగాలైతె తారాస్థాయికి పనికిరావు. అంటే, ధైవత నిషాదాలను మంద్ర-మధ్యమ స్థాయిలలో పలికినట్లు, తారస్థాయిలో పలకడం అసౌకర్యం గా వుంటుంది. ఈ సముచిత స్వరాన్వేషణా నైపుణ్యం ప్రశంసనీయం.
“ప్రళయపయోధిజలే”, “ముక్కోటిదేవతలు” వంటి రాగమాలికల ఆధారంగా స్వరపరచిన పాటలు ఎన్నో ఉన్నాయి. స్వరభేదమూ, అన్యస్వర ప్రయోగము గల పాటలూ ఉన్నాయి. అయితే రెండు రాగాలను ఆరోహణ-అవరోహణక్రమ పద్దతికి లోపములేక, రెండురాగాల పత్యేకతను అలాపనలో, గమకాలలో, స్వరప్రస్తారాలలో మనకు 'ఒకే రాగము' అనే అనుభూతిని కలిగించే విజయానంద చంద్రిక, 'నభూతో నభవిష్యతి' అను మాటకు తిరుగులేని తార్కాణం. ఘంటసాల పదిరోజులపాటు సతతాభ్యాసంతో ఈ పాటను సాధనచేసి పాడినారని చిత్రసీమలో ప్రాచుర్యంలోనున్న విషయము. తమిళంలో “కలైవాణన్” అనేపేరుతో విడుదలైన జయభేరి, రహస్యం చిత్రంలాగే ఆర్థికంగా విజయవంతంకాకపోయినా, సంగీతపరంగా శాశ్వత కీర్తిని సముపార్జించింది. సాహిత్య రచనలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, నాలుగుమాత్రల నడకలో త్రిశ్ర-పంచ గతులను ఇడిమి, రసిక+రాజతగు (3+5), వారము (5), కామా,(4,) అంటూ ఒక ప్రత్యేకతను తెచ్చి తకిట+తకతకిట అను మిశ్రజాతి లయాన్ని కూర్చి ఒక వైవిధ్యతను చూపించారు.
గాయన విధానం
తాను పాడబోయే రాగాన్ని సూచించే ఆరంభంలోని ఆలాపనదే ఒక విశేషం. ఆ... అని, ఆధార షడ్జమంలో మొదలిడి, వెంటనే క్రిందికి దిగి, మంద్ర ధైవతపు స్పర్శతో పైకి పాకి, మూడవ స్థాయిలోకి వెళ్ళి, కానడ స్వరారోహణ గావించి తార పంచమాన్నితాకి, అకారమాలల అవరోహణగతిలో చక్రవాకరాగాన్ని చుట్టుకొనివచ్చి ముగింపుజేసే ఆలాపన భాగం సరిగ్గా 28 సెకనులు. గంటసేపు ఆలాపనజేసే శాస్త్రీయ గాయన పరిమాణాన్ని అర నిమిషంలో అనాయాసంగా అందించడమే ఒక అద్భుత ప్రయోగం.
“రసికరాజ” పల్లవిని కానడ రాగ ఛాయల్లోనే పాడుతూ అకార విస్తారంలో కానడ రాగస్వరాల త్రిశ్రముల వక్రగతులతో చక్రవాక స్వరస్థానములను సంధించి, మళ్ళి కానడరాగ స్వరాలకు వచ్చి పల్లవిని అందుకోవడంలో రాగద్వయముల సంవహనము, ప్రత్యేక రాగదర్శన భావన కలుగజేయడమూ అనితరసాధ్యమైన సృష్టి. అనుపల్లవి లోనూ ఇదే రాగద్వయానుసంధానమూ, తత్సంబంధిత సంగతులతో కొనసాగి, చరణాశ్రయమైన స్వర ప్రస్తార, విస్తార, ముక్తాయ, ముక్తాఫలాల భాగం అమోఘం.
స్వర ప్రస్తారములను ఆదితాళము యొక్క ఎనిమిది భాగములలో, ఏ స్వరము ఏ భాగంలో వస్తుందో, విశిష్టమైన ముక్కాలు ఎడుపుతో స్వరాలు ఎంత బిగిగా సాగుతాయో గమనించడానికి రసికులకు వీలుగా ఉంటుందని, ఘంటసాల గారు పాడిన స్వరాలను తాళ-ఘాత క్రమంతో ఇక్కడ పొందుపరచడమైనది.
Thanks to Sri M.R.Chandra Mowli garu for providing video and audio files.
ఈ పాట చతురశ్ర జాతి, ఆదితాళ నిబద్ధము. మొదటిగతి (కాలం) లో ధృతము [ఘాతముతో మొదలుకొని తరువాత, చిటికెన వ్రేలు (కనిష్టిక), ఉంగరపు వ్రేలు (అనామిక), మధ్యమ వ్రేలు (మధ్యమ)] లో నాలుగక్షరాలు, తరువాత అనుధృతములో నాలుగక్షరాలతో మొత్తము 8 అక్షరకాల ప్రమాణము. రెండవ గతిలో మాత్రకు రెండక్షరముల చొప్పున 16 అక్షర కాలముతో, మూడవగతిలో ఘాతానికి నాలుగక్షరముల చొప్పున 32 అక్షర కాలముతో నడిచే ఆదితాళ క్రమం విజ్ఞులకెరుకే. అయితే ఇక్కడి విశేషము ఏమిటంటే, క్లిష్టకరమైన తాళప్రక్రియ ఉపయోగించడం. పాటలోని స్వర ప్రస్తారమంతా ముక్కాలు ఎడుపులో సాగుతుంది. అంటే మూడవగతియందు మొదటి ఘాతములోని నాలుగక్షరములలో, మూడక్షరములు వదలిన అది ముక్కాలు ఎడుపు. మిగిలిన నాలుగులో ఒకభాగము అనగా కాలుభాగముపైనే స్వరవిస్తారము మరియు, “నిన్ను తలచి” అను చరణభాగము నడుచును. ఎర్రటి అక్షరములు కానడ రాగచ్చాయలను సూచించును.
Notations
Hats off to Sri Chandramouligaru for his knowledge in Karnatac music.
రిప్లయితొలగించండిచివర్లో స్వరాలు స్పష్టం గా రాశారు. బావుంది. ఋషభ౦ అనడం కన్నా రిషభం అంటే బావుంటుంది. శంకరాభరణం లో డైలాగు గుర్తుకొస్తోంది :)
రిప్లయితొలగించండిశ్రీనివాస్
Very good explanation and information about the song
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ లేఖగురించి స్పందించిన శ్రీయుతులు నాగభైరవుగారికి మరియు అజ్ఞాతం గారికీ నా ధన్యవాదాలు. ఈనాడు మన సంగీత గాయక దర్శకులలో కనిపించని శాస్త్రీయ సంగీతాధారితమైన నవ్యప్రయోగాలే దశాబ్దాలైన నిలచియున్న ఆ పాత బంగారంలాంటి పాటల రహస్యమని నా భావన. ఘంటసాలగారి గాయనలోని ఆ విశేషాలను అర్థంచేసుకునే ప్రయత్నమే, ఘంటసాల-రాగశాల ఉద్దేశ్యం. రిషభమనే పదమే వాడుకగనుక అది బావుంటుంది అనే మాట సత్యమే. కాని సంగీత శాస్త్రాదులలో నిఘంటువులలోఋషభం అనే పదమే సాధురూపంగా మనకు కనిపిస్తుంది. ’ఋ’కారం క్రమేణంగా క్షీణించి రిషభప్రవేశమైనదేమో. శంకరాభరణం చింత్రంలో అపభ్రంశింపబడిన శబ్దం వృషభం :-)
రిప్లయితొలగించండిశాస్త్రీయ సంగీతం గురించి వివరాలు తెలియవు గానీ,
రిప్లయితొలగించండిఇష్టంగా వింటుంటాను..
మీరు చెప్పిన మూడు పాటలు చక్కని పాటలు..
అందులో ఒక పాట గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది...
అభినందనలు...
ఎస్. జానకి గారు పాడిన నీ లీల పాడేద దేవా కూడా ఇదే కోవలోనికి వస్తుందా?
సందేహం సుమండీ!
@శ్రీ
శ్రీ యుతుల అభిరుచికి అభినందనులు - అభిప్రాయానికి ధన్యవాదాలు. శాస్ర్రీయ సంగీతాన్ని ఇష్టంగా వినడం ఒక్క సదభ్యాసం మరియు సంస్కారం.మీరు ఉల్లేఖించిన పాట శాస్త్ర్రీయ సంగీతాన్ని ఆధరించినదే. అభేరి రాగంలో నిబద్ధమైన అద్భుతగాయనం.ఆపాటలోనూ గమకములు త్రికాల స్చరవరుసలూ బాగున్నాయి. రసికరాజలోని రాగద్వయప్రయోగమూ ప్రత్యేకత మీకు తెలెసినదే.
రిప్లయితొలగించండిశ్రీ గారికి ధన్యవాదాలు. చక్కని వివరణ యిచ్చిన చంద్రమౌళి గారికి ధన్యవాదాలు. ఈ అభేరి రాగాన్నేహిందుస్తానీ సంగీతంలో "భీం పలాస్" అని అంటారు.
తొలగించండి
రిప్లయితొలగించండిసంగీతజ్ఞానం అట్టే లేకపోయినా నేను అమితంగా ఇష్టపడే పాట గురించి మీ వివరణ సంపూర్ణంగా ఉంది.ఇది రెండురాగాలలో కల్పించినా రాగమాలిక కాదు .రెండిటినీ చక్కగా మిశ్రమంచేసి పెండ్యాలవారు చేసిన అద్భుతసృష్టి.మూడు కాలాల్లో,మూడు స్థాయిల్లో ఘంటసాలవారు గొప్పగా పాడేరు.మీరన్నట్లు సంగీతసారాన్ని ,రాగస్వరూపాన్ని ఆరు నిమిషాల్లో ఆవిష్కరించ గలిగారు.ఈ పాటని పరిచయం చేసినందుకు అభినందనలు.
రమణ మూర్తి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ వివరాలను విశ్లేషణగా అందిన మిత్రులు చంద్రమౌళి గారికి నమోవాకములు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅలాగే 'ప్రేమించి చూడు 'చిత్రంలో ' చల్లని రేయి ,ఎంతో చలి చలి అనే పాట, '(నాగేశ్వరరావు,రాజశ్రీ లపై)మరియు ' శ్రీకాకుళాంధ్రమహావిష్ణు 'చిత్రంలో మంగళపల్లి ,జానకి గార్లు పాడిన 'వసంతగాలికి వలపులు రేగ '' అనే పాట ఒకేరాగమనుకొంటాను.దానిపేరు,వివరాలు తెలియజేయగోరుతున్నాను.అభి నందనలతో .
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిమీరు పేర్కొన్న పాటలు "కళావతి" రాగాధారితమైనవి.ఈ రాగం హిందూస్తానీ సాంప్రదాయానికి సంబంధించింది. సగపదనిస-సనిదపగస అను ఔడవ-ఔడవ రాగం (pentatonic scale). దాక్షిణాత్యపద్ధతిలో 16వ మేళకర్త “చక్రవాకం” జన్యమైన ఈ రాగాన్ని వలజి" అంటారు. శ్రీ కృష్ణావతారం చిత్రంలో ఘంటసాల మాస్టారు సుశీలగారితో పాడిన "జగములనేలే గోపాలుడ్" చాలా ప్రజాదరణపోదింది.నమస్సులు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెలుగు సినీచరిత్రలో సంగీతభేరులు మ్రోగించిన అద్భుతమైన దృశ్య కావ్యం 1959 లో విడుదలయిన శారదా వారి జయభేరి.
రిప్లయితొలగించండి"విజయానంద చంద్రిక లో విరాజిల్లిన రసికరాజ తగు వారము కామా..."
ఈ దిగ్గజ త్రయాన్ని గురించి నేనేం చెప్పినా , సూర్యుని ముందు దివిటీ పట్టినట్టుంటుంది .....
శాస్త్రీయ సంగీతంలో నిషాణాతులు గౌరవనీయులు శ్రీయుతులు చంద్రమౌళిగారికి , అటు శాస్త్రీయ , సాంకేతిక పరిజ్ఞానం తో బాటు ఇటు సంగీత సాహిత్యాభిలాష లనే "జోడు గుర్రాల మీద స్వారీ " చేసి తన పటిమని చాటుకున్న శ్రీయుతులు సూర్యనారాయణ ఉలిమిరి గార్లు ఏ సుముహూర్తాన కలిసారో గానీ , మా అందరికి "సంగీత సాహిత్య సుధాస్వాదనం " చేస్తున్నారు .... "అటు సూర్యుడొకరైతే , ఇటు చంద్రుడొకరు " సూర్య చంద్రుల మేలి కలయకతోనే గదా సృష్టి నడపబడుతోంది మరి ! మీ ఇరువురి కృషి బహుదా శ్లాఘనీయం . మీ కు నా అభినందన , అభివందన చందనాలు .
-- - దేవులపల్లి శ్రీనివాస మూర్తి , రామవరప్పాడు (పో): విజయవాడ
ఋషభం ఉచ్చరించడంలో రిషభం అనే వినిపిస్తుంది..కృష్ణుడు,నృత్యము,వృషభము ఇలాంటివే.
రిప్లయితొలగించండి