గర్భస్థశిశువైనా, డోలాగర్భంలోని పాపాయైనా, గర్భగుడిలోని దేవుడైనా అతని గానమాధురికి అందరూ పరవశులే. భామప్రీతి-ప్రేమగీతి,
శోకభావం-లోకజీవం, రక్తివాదం-భక్తినాదం ఏభావానికైనా ఆయన పలికితే ప్రాణం. “రావే నా చెలియా” అనగా ఆమె పరవశించవలసిందే, “రారా కృష్ణయ్య” అని ఆలపించగా
కృష్ణుడు నడచిరావలసిందే. ఏభావాల సృష్టికి, ఏ స్వరం, ఏ స్థాయిలో,
ఎలా పలకాలో, ఎలా పలికించాలో తెలిసిన స్వరభావరసజ్ఞుడు ఘంటసాల.
శాస్త్రీయ
సంగీతచక్రవర్తిగా ఎందరినో ఒప్పించాలా? లేక, లలిత సంగీత సార్వభౌమునిగా అందరీనీ మెప్పించాలా
అన్న ద్వంద్వం ఆయన మనోలోకంలో ఒకప్పుడు కలిగియుండవచ్చు. “పాటకు పల్లవి ప్రాణం” అంటూ
శాస్త్రీయ సంగీత పట్టభద్రుడైనా, జీవిత సమరమే ప్రధానమైన ఆ తొలిరోజుల్లో “పాడనా! ప్రభూ
పాడనా!” అంటూ ఆయన అంతరంగం నినదిస్తే, “పాడుతా తీయగా చల్లగా” అంటూ జనుల మెప్పును సంపాదించే
విధానం ఆనాటి ప్రాస్తావికం. అంత్యదశలో భగవద్గీతాగానమే ఆయన 'హంసగీత' కావడం తన అంతర్భావాలను వెల్లడిస్తుంది. అయినప్పటికీ తనకు వచ్చిన అవకాశాలలోనే
గాయకుడిగా మరియు స్వరకర్తగా ఆయన సంగీతంలో చేసిన అన్వేషణోపేతమైన గతులూ, సంగతులూ, స్వర-రస-భావ
త్రైగుణ్యనిర్ణయాధారితమై ఆయన సృజించిన అపూర్వ బాణీలు, సముచిత శాస్త్రీయరాగప్రయోగాలతో కర్ణపుటాలనుండి లోనికి దిగి, హృదయాంతరాళాలలో ఒదిగి కలకాలం నిలిచే జనప్రియత గడించిన పాటలను పాడిన ప్రతిభచే ఘంటసాల
మన భావసంగీత త్రిమూర్తులలో సర్వదా, సర్వథా ఆద్యుడే. విశేషించి సింహేంద్రమధ్యమ రాగంలో
ఘంటసాల ఆలపించిన అపురూపమైన పాటలను, పద్యాలను, శ్రవణ ఖండికలను సింహావలోకనం చేస్తూ వేమరు పర్యాయములు నెమరువేసుకోవడం ఒక రసానుభవం.
పద్యగాయన
విధాన సార్వభౌమత్వము ఆయనదే. తెనాలి రామకృష్ణకవి రాయలను శ్లాఘించిన 'మత్తేభవిక్రీడిత’ నిబద్ధమైన
ఈ పద్యాన్ని వినండి.
కలనన్ తావక (తెనాలి రామకృష్ణ)
"కలనన్ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మం
డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్ హార కుం
డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయణుంగాంచి లో
గలగంబారుతునేగె నీవయనుశంకన్ కృష్ణరాయాధిపా!!"
ఘంటసాల పద్యగానంలో కవితావాచన గాంభీర్యం, క్లిష్టమైన పదాల అర్థాలు వికసించేలా పాడిన తీరు, "నారాయణుంగాంచి" అను చోట తార స్థాయిలో గమక సంచారం ఆనాటి ఆయనలోని త్రిస్థాయి గాత్ర మాధుర్యం నేటికీ ఇతరులకు అనితరసాధ్యమే. ఆ మత్త-ఇభ-విక్రీడితాన్ని సమర్ధవంతంగా నిర్వహించింది, ఘంటసాలకు సింహేంద్రమధ్యమ రాగంపై నున్న పట్టు, ఆ రాగ సర్వస్వాన్నీ ఆకళింపు చేసుకొన్న అకార గమకవర్షం అతి హర్షణీయం. ఇది శ్లోకాంతంలో గోచరిస్తుంది. సింహాచల క్షేత్ర మహిమ చిత్రానికి ఘంటసాల పాడిన ఈ సీసపద్యం భక్తిరసభరితమైన సహృదయ హృద్య నైవేద్యం.
భక్త శిఖామణి (శ్రీ సింహాచల క్షేత్ర మహిమ)
కల్యాణి, కానడ రాగాలవలె పూర్ణ స్థాయిలో సింహేంద్రమధ్యమ రాగాన్ని గానం చేసే అవకాశాలు లేకపోయినా, ఒక సందర్భంలో ఘంటసాల ఈ రాగంలో ఒక మంచి పాటకు బాణీ కట్టి ఆలపించారు. పౌరాణిక చిత్రాలకే శాస్త్రీయ రాగాలు సరిపోతాయి అన్న అభిప్రాయాన్ని మార్చి, ఒక సామాజిక చిత్రంలో సింహేంద్రమధ్యమ రాగాన్ని శాశ్వతీకరించారు. అదే 'టైగర్ రాముడు' చిత్రం కోసం తన సంగీత సారధ్యం లోనే పాడిన పాట 'పాహి దయానిధే'. శుద్ధ శాస్త్రీయ పద్ధతిలో స్వరకల్పన జేసి పాడిన ఈ పాట సింహేంద్రమధ్యమ రాగానికి మంచి నిదర్శనం. ఈ చిత్రంలో నాయకుడు సందర్భవశమై పాప కార్యాలకు లోబడి, తుదకు పశ్చాత్తాపద్రవిత హృదయంతో దైవానికి శరణనే సమర్పణాభావం చూపించడం ఈ పాటలోని ఆంతర్యం. సింహేంద్రమధ్యమ స్వరాల ద్వారా ఆ భావాన్ని కలుగజేసే ఈ పాటను ఒక సంగీత కృతి స్థాయికి చేర్చారు మాస్టారు.
హే! దయానిధే (టైగర్ రాముడు)
కొన్ని చలనచిత్రాలు
సామాన్యశ్రేణిలో ఉన్నా, అందులోని పాటలు అసామాన్యంగా ఉంటాయి. ఈ కోవకు చెందిన డబ్బింగ్ చిత్రాలు మనకు కొన్ని మంచిపాటలను
తెచ్చిపెట్టాయి. అలాంటిదే సింహేద్రమధ్యమరాగంలో
మాస్టారు పాడిన ఈ పాట “ఓంకారమై ధ్వనించు నాదం”. తమిళంలో సినిమాపాటల గాయన విధానానికి (ఆశ్చర్యసూచకంగా
కొన్నిచోట్ల పాటను ఆపివేయడం, చతురశ్రగతి ఆదితాళంలో వైవిధ్యంకోసం పదాలను త్రిశ్రగతిలో
నాటకీయతతో ఇమిడించిడం) అనుగుణంగా, అంటే ఆ ప్రాదేశిక భాష ఉచ్చరించే తీరుకి, పెదవుల కదలికలకు పొందిక కుదిరేలా ఉన్నది మాస్టారి గానం.
సహజత్వానికి కొంచెం దూరమనిపించినా, మాస్టారు ఈరాగంలో పాడిన మరోపాట లేదు కాబట్టి ఇక్కడ వినిపించడమైనది.
పాటయొక్క రాగసంచారం, ఆకాలంనాటి చిన్నప్ప, త్యాగరాజ భాగవతార్, శీర్కాళి గోవిందరాజన్ గాయన
పద్ధతిని జ్ఞప్తికి తెచ్చినా, ఘంటసాల గానంలో భక్తి, వీర, అద్భుత రసస్పర్శ కనిపించకపోదు.
ఓంకారమై ధ్వనించు(తలవంచని వీరుడు)
తెలుగులో సింహేంద్రమధ్యమ రాగాధారితమైన సినిమా
పాటలు చాల అరుదనే చెప్పాలి. రాగమాలికలకూ శ్లోక-పద్యగాయనానికి ఈరాగం పరిణామకారిగా ఉంటుంది.
"మహాకవి కాళిదాసు" చిత్రంలో శాకుంతల నాటక సన్నివేశంలో దుష్యంతుడు (ఏ.ఎన్.ఆర్) పలికే 'పౌరవ సురక్షితాశ్రమవనము జేరి' అనే పద్యం వింటే ఈ రాగం క్షణంలో ఎలా రసానుభూతిని కలగజేయునో
స్ఫురిస్తుంది. “ఎవడువాడు” అని వీరరసం ప్రవేశించి, “అబలులైన
సపత్నికన్యాజనమ్మునిటుల” అంటూ దయ మరియు కరుణ రసాలను పలికించి, ఇరవై సెకనుల పద్యంలో భావరసావిష్కరణచేసిన ప్రతిభ ఆయనకే చెల్లు. పద్యభావం
ఇంచుమించు కుపిత దుష్యంతుని పరాక్రమయుతమైన మాటలు, ఆశ్రమ పరిసరములలో చెల్లని భీషణ ప్రతిజ్ఞకాదు.
వీరరసంలోనూ ఒక నయాన్ని సంయమనాన్ని సూచించే విధంగా పద్యగానం ఉండడం ఒక విశేషం.
పౌరవ సురక్షితా (మహాకవి కాళిదాసు)
ప్రతిజ్ఞబూనుట, వీరావేశ భావప్రకటనలాంటి సందర్భానికి సింహేంద్రమధ్యమరాగం పెట్టింది పేరు. ఉదాహరణకు “శ్రీకృష్ణరాయబారం”
చిత్రంలోని అర్జునుని ప్రతిజ్ఞసంధర్భం. ఇక్కడి సింహేంద్రమధ్యమం వీరరసప్రధానమై ఆవేశపూరితమైన
ఆలాపన. మాస్టారు ఆలపించిన ఈ ధీరవీరవిహారాన్ని వినండి.
ఆర్ణవ సప్తకంబు (శ్రీకృష్ణ రాయబారం)
“శ్రీరామాంజనేయ యుద్ధ”
అను కన్నడ చిత్రంలో ఆంజనేయుని పద్యం “ముక్తిధామ శ్రీరామన” మరియు రహస్యం చిత్రంలో స్వరకల్పనచేసి
ఆలపించిన ఉత్పలమాల “నాదు సమస్త శక్తులును” రెండూ ప్రతిజ్ఞాపద్యాలే. మొదటి పద్యం భక్తితోనిండిన ఆత్మవిశ్వాసాన్ని
ప్రకటిస్తే, రెండవది రాజసాహంకార పూరితమైయున్న భావాన్ని కలుగజేసే విధానం గాయకుని పాత్ర
గుణ సన్నివేశాంశధారణాప్రతిభ గమనీయం.
ముక్తిధామ (శ్రీ రామాంజనేయ యుద్ధ -కన్నడ)
నాదు సమస్త శక్తులును (రహస్యం)
“శ్రీకాళహస్తీశ్వరమాహాత్మ్యం”
చిత్రంలో కన్నప్పజేయు భక్తినివేదన “స్వామీ చంచలమైన చిత్తమిదే” (శార్దూలవిక్రీడిత వృత్తము),
ఒక భక్తుని సర్వ సమర్పణాభావం ఆర్ద్రతతో నిండిపొంగే స్వరాభిషేకం. ఘంటసాల గళం అత్యంత ఉత్కృష్టదశలోనున్న
రోజుల్లో వెలుబడిన ఈ పద్యం సింహేంద్రమధ్యమరాగానికి ఉత్తమ నిదర్శనం. స్వరాలు సోపానమార్గంలో
కొనసాగి “చీకాకై నశియించెన్” అన్నతారస్థాయిసంచారం, చివరిలోని అకారతరంగవాహిని, గుండెలను
కరగించే ఆ స్వరనిర్ఝరిణీ నిరాకారుడైన కాళహస్తీశ్వరుణ్ణి సాకారప్రకటన గావిస్తుంది.
స్వామీ చంచలమైన (కాళహస్తి మహత్మ్యం)
అలాగే "పాండురంగ మహాత్మ్యం" లో పాప
పశ్చాత్తాప తప్తహృదయుడైన పుండరీకుని ఆవేదన “ఏపాదసీమ” రామకృష్ణకవి విరచిత సీసపద్యగానం
శోక, కరుణారసముల ఆటపట్టు. వినగావినగా అది విలాపమా, ఆలాపనా, ఆవేదనా అనే సంవేదనలోనే మనస్సు
నిలిచి ద్రవిస్తుంది. హృదయం ద్రవించే నేపథ్యగాయనం ఆ గానానికి తగిన అద్భుత నటన అందరికి తెలిసిన సినిమాప్రక్రియ.
ఐతే ఘంటసాల గానంలో ఆ పాత్రకు నటనాస్వరూపం శ్రవ్యంగా మొదటే సృష్టించబడి,
ఆ పద్యసందర్భానికి నటించడమంటే ఘంటసాల గానరూపంలో చూపిన భావాలకు అభినంయించి చూపడమా లేక తన నటనాప్రతిభను పాత్రలోప్రవేశబెట్టి పాటకు పెదవులు కదలించడమా అనే సమస్య నటునకు
లేకపోలేదు. ఆయన గానానికి సరిజోడుగా నటించడమే నటులకు ఒక ఉత్తేజకశక్తిగా ఉండేదన్న అంశాన్ని
ప్రముఖులెందరో పేర్కొన్నారు. ఈ పద్యగానంలో పశ్చాత్తాప-శోక-కరుణారసాలు కలిగించే ఆర్ద్రత
అనుభవవేద్యమే. అది రాగస్వరాలను ఆకళింపుజేసుకొన్న ప్రతిభేకదా.
ఏ పాదసీమ (పాండురంగ మహాత్మ్యం)
ప్రసిద్ధమైన
తన భగవద్గీత గాయనంలో ఘంటసాల, రెండు శ్లోకాలను సింహేంద్రమధ్యమ రాగంలో ఆలపించారు.
(అనాదిత్వాన్...యథాప్రకాశయత్యేకః). దీనికి మునుపే ఆయన “శ్రీకృష్ణగారడి” చిత్రానికై
మూడు భగవద్గీతాశ్లోకాలను పాడారు. ఆ చిత్రం కన్నడం మరియు తెలుగు భాషలలో నిర్మించబడింది.
బహుశ సంగీత దర్శకత్వంవహించింది పెండ్యాల. ఆ మూడుశ్లోకాలలో ఒకటి “వాయుర్యమోగ్నిః వరుణః
శశాంకః” సింహేంద్రమధ్య రాగనిబద్ధమే.
అనాదిత్వాన్ (భగవద్గీత)
వాయుర్యమోగ్ని (శ్రీ కృష్ణ గారడి)
సింహేంద్రమధ్యమం
సుప్రసిద్ధ రసాత్మకమైన రాగం. 57వ మేళకర్త.
వేంకటముఖి సంప్రదాయంలో రాగనామం సుమద్యుతి. స్వరస్థానాలు: షఢ్జమ పంచమాలతో చతురశ్రుతి రిషభం, సాధారణ
గాంధారం, ప్రతిమధ్యమ, శుద్ధదైవతం
మరియు కాకలీయ నిషాదం. శ్రవణ మాత్రమున శాంత, కరుణ, భక్తి
రసాలను మనస్సున నెలకొల్పే రాగమిది. శాస్త్రీయ సంగీత పద్ధతిలో రాగం తానం పల్లవికి, రాగమాలికలకూ, విస్తృతత్వానికి
త్రిస్థాయి గానానికి మంచి అవకాశమున్న రాగం. చిన్న శ్లోకమైననూ, విళంబకాల దీర్ఘమైన కీర్తననైననూ
రాణింపజేసే రాగమిది. ఒక్క నిషాదస్వర వ్యత్యాసమాత్రాన, షణ్ముఖప్రియరాగానికి తోబుట్టువంటిది. పంచమ
స్వర గ్రహభేదక్రియలో మాయామాళవగౌళ మరియు ధైవతాన్ని గ్రహముచేయగా రసికప్రియరాగాలు వచ్చును.
ప్రసిద్ధమైన త్యాగరాజకృతి “నతజనపరిపాల ఘనా” ఈరాగంలో సమకూర్చబడినదే. “నీదు చరణములే” “రామ రామ” కృతులూ సుప్రసిద్ధమే.
మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ రాగంలో రచించిన ’మరకత సింహాసన నరసింహ’ బహు సుశ్రావ్యమైన
కృతి.
రాగమాలికల
పాటలలోనూ, రాగమాలికగా పాడిన పద్యాలలోనూ సింహేంద్రమధ్యమ రాగం
బాగా ఇమిడి ప్రత్యేక భావాలను స్ఫురించడం గమనీయం.
“చిన్నిపాపలూ కడసారి చెప్పుచుంటి “(లవకుశ), భక్తజయదేవ చిత్రంలోని ’ప్రళయపయోధిజలే’ అష్టపదియొక్క
చరణం ’తవకర కమలవరే’ ఈ రాగంలోనిదే. సీతారామకల్యాణం చిత్రంలో ఘంటసాల ఆలపించిన సీస పద్యం
"దానవకులవైరి" ఐదురాగాలో సాగి అందులో నాల్గవ పాదం సింహేంద్రమధ్యమం. గాలిపెంచల
ఆ ఒక్కపద్యాన్ని మోహన, ఖరహరప్రియి, కేదారగౌళ, సింహేంద్రమద్యమ, శ్రీ రాగాలలో
సమకూర్చారు. దీనికి సమ ఉజ్జీగా భక్తరఘునాథ్
చిత్రంలో “అదిగో జగన్నాథుడు” అనే సీసపద్యాన్ని, తన స్వీయ బాణితో మాస్టారు కెదారగౌళ, కానడ, సింహేద్రమధ్యమ, మోహన మరియు కాపి
రాగాలలో పాడినది అలనాటి రాగమాలిక పద్యవిశేషం.
సూర్యనారాయణగారు, చంద్రమౌళిగారు, చాలా బాగుంది ఈ టపా - భావసంగీత త్రిమూర్తులలో అన్నారు - వారెవ్వరు, ఎందువల్ల - మీ అభిప్రాయాలు వినాలని కుతూహలంగా వుంది.
రిప్లయితొలగించండిమద్దుకూరి చంద్రహాస్
చంద్రహాస్ గారూ, స్పందనలకు వందనం. రసజ్ఞులకు తెలిసినదే. సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల మన భావసంగీత త్రిమూర్తులని రాగశాలలోని ఒక్క వ్యాసంలో అన్నాను. అందువలన ఇక్కడ ప్రత్యేకించి పేర్కొనలెదు.
రిప్లయితొలగించండిSangeetha Mitru laaraa, Ee post chaalaa Nachiindi ! Thanks Raja gopal
రిప్లయితొలగించండిVery Glad to see your article on Great Maastaru 1 Glad that that you are identifying the Raagaas of Padyalu and Slokalu of Great "G" .T.Raja gpal
రిప్లయితొలగించండిThanks Rajagopal garu for your appreciation. Thanks for visiting our blog. Regards - Suryanarayana
తొలగించండిDear Sri Rajagopal gaaru,
రిప్లయితొలగించండిI am very glad to see the feedback from a senior person of your stature. Many thanks indeed. Regards, Chandramowly
Excellent and thanks for posting the article with the links to great padyams.
రిప్లయితొలగించండిExcellent article and thanks for posting with the links to the great padhyams.
రిప్లయితొలగించండిఎంత చక్కటి వ్యాసాన్ని అందించారు సర్. అద్భుతమైన విశ్లేషణ. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి