1961 లో కె.వి.రెడ్డి (కదిరి వెంకట రెడ్డి) దర్శకత్వంలో విజయా సంస్థ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం జగదేకవీరుని కథ. 'జగతల ప్రతాబన్' అన్న తమిళ చిత్ర కథను తెలుగుదనానికి అనుగుణంగా మార్చి, తీర్చిదిద్ది, 'ఓ హల' వంటి పింగళి పదజాలంతో కూర్చి నిర్మించిన చిత్రమిది. నలుగురు దేవకన్యలను తను వివాహం చేసుకున్నట్లు కలగన్న ఒక రాజకుమారుడు (ఎన్.టి.ఆర్.) తాను కన్న కలను నిజం చేసుకోవడం కోసం చేసిన సాహస కార్యాలను ప్రతిబింబిస్తుందీ చిత్రం. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వంలో, పింగళి నాగేంద్రరావు రచించిన అన్ని పాటలు సూపర్ హిట్స్. ఎన్.టి.ఆర్., బి.సరోజాదేవి, రేలంగి, గిరిజ, రాజనాల, సి.ఎస్.ఆర్., తదితరులు నటించిన ఈ చిత్రాన్ని "జగదేకవీరన కథె" పేరున కన్నడం లో డబ్ చేశారు. ఈ చిత్రంలో దేశ్ రాగంలో పెండ్యాల స్వరపరచిన ఓ! సఖీ, ఒహో! చెలీ అనే పాట యొక్క సంగీత, సాహిత్య, శ్రవణ వివరాలను మరియు తెలుగు, కన్నడ భాషలలో యూ ట్యూబ్ వీడియోను పొందు పరుస్తున్నాము. అయితే ముందుగా "ఘంటసాల-రాగశాల" లో అడుగు పెడదామా!
సినిమా పాటలను ఏ రాగాల ఆధారంగా సమకూర్చారనే అన్వేషణ కొంతవరకూ సఫలమైనా చాలావరకూ త్రోవ తప్పించే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే, శుద్ధ శాస్త్రీయ రాగాలను ఆధారం చేసుకుని ఎన్నో పాటలు వచ్చినా, కొన్ని పాటలను విన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాగంలోనే బాణీని కూర్చారు అని చెప్పడం కష్టమే. వాస్తవానికి పాటలో నవ్యత చూపిస్తూ, అంతకుముందు విన్న పాటకు అనుకరణ కాకుండా, ప్రజాదరణ పొందే విధంగా, తన ప్రతిభను వినియోగించి ఒక పాటకు స్వరకల్పన చేయవలసిన బాధ్యత సంగీత దర్శకునికి ఉంటుంది. ఈ నేపథ్యంతో గమనించగా, చాల మంది సంగీతదర్శకులు ప్రఖ్యాతమైన పాటలలో కొత్తదనాన్ని సాధించడానికి ఎన్నో ప్రయోగాలను చేసేవారు.
జగదేకవీరుని కథలోని మాస్టారు పాడిన “ఓ! సఖి ఓహో! చెలి” పాటను వింటే ఈనాటికీ అతి మనోహర భావం కలగడం పెండ్యాల -ఘంటసాల మహోదయుల ప్రతిభావిశేషమే. ఈ పాటకు ఆధారం దేశ్ రాగం.
దేశ్ - ఔడవ-సంపూర్ణరాగం
మూర్ఛన: ఆరోహణం: స-రి2-మ1-ప-ని3-స
అవరోహణం: స-ని2-ద2-ప-మ1-గ3-రి2-గ3-ని3-స
(అవరోహణంలో ని2 అధిక స్వరం) వాది స్వరం: పంచమం; సంవాది స్వరం: రిషభం. కాలం: రాత్రి మొదటి ప్రహరం. మ-గా-రి మీండ్ దేశ్ ప్రత్యేకత. రిమగరీ మ పనిదపా నినీనిసనిస పదప మరిరి (ఓ చెలి ఒహోసఖీ ఒహోమదీయ మోహినీ) మనసేమో నావైపు అనుచోట .....రి మ పా ని3 స ని2 ద మ ద ప, రెండునిషాదాల సొగసును గమనించగలరు. దేశ్ (ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్) మరియు తిలక్ కామోద్ (వీణా సహస్రబుద్ధి) రాగాల శాస్త్రీయగాన విధానాన్ని ఈ సూచికలపైన క్లిక్ చేసిన వినగలరు.
హిందూస్థాని పద్ధతిలోని దేశ్ రాగం రాష్ట్రీయ సమైక్యతాభావానికి పేరుగాంచిన రాగం. ఈ రాగంలో బజె సర్‌గమ్ అను అలనాటి దూరదర్శన్ గీతం ఖ్యాతిగాంచినది. రంగులరాట్నం చిత్రంలో ఘంటసాల గారు గానం చేసిన, బంకించంద్ర ఛటర్జీ రచించిన మన జాతీయ గేయం వందేమాతరం గాయన క్రమం కూడ దేశ్ రాగానికి మంచి నిదర్శనం. అలిగినవేళనె చూడాలి (గుండమ్మ కథ) ,తిరుమల తిరుపతి వేంకటేశ్వర (మహామంత్రి తిమ్మరసు) మోము జూడ వేడుకా (భక్త శబరి), అన్నీ మంచి శకునములే (శ్రీకృష్ణార్జునయుద్ధము), ఎంతదూరమూ అది ఎంతదూరము(ఏకవీర), వర్ధిల్లుమాతల్లి వర్ధిల్లవమ్మ (మాయాబజార్), మదినేలే మహారాజు నీవే (పాండవ వనవాసము) మురళీధరా హరే మోహన రూపా(భలే రాముడు) ఇవి దేశ్ రాగం పై ఆధారపడిన పాటలు. రాగమాలికగా స్వరపరచిన కొన్ని గీతాలలోనూ దేశ్ రాగం మనకు వినబడతుది. ప్రళయపయోధి జలే (భక్త జయదేవ) కీర్తనలో వసతిదశన శిఖరే..చరణం మరియు “ఎన్నాళ్ళు వేచేను ఓ రామా” అను పతాక సన్నివేశం పాటలోని చరణం “పూలు వేరైన పూజ ఒకటని నేటికి తెలిసెను ఓదేవ” (శ్రీకృష్టాంజనేయ యుద్ధము) దేశ్ రాగం. “ఓ సఖి ఓహో చలి” పాట 'దేశ్' రాగం కాదని, అది 'తిలక్ కామోద్' రాగం అనే అభిప్రాయలున్నాయి. కొంతవరకూ తిలక్ కామోద్ రాగమా అనే అనుమానమూ రాకపోదు. ఈ రెండురాగాలకు అంతగా తేడాలేదు. రేండిట్లోనూ అవే స్వరాలైనప్పటికీ, తిలక్ కామోద్ రాగంలో కాకలి నిషాద ప్రయోగం తక్కువే. తెలియని ఆనందం (మాగల్యబలం), పాడవే రాగమయి (సీతారామ కళ్యాణం) పాటలను తిలక్ కామోద్ ఆధారితమైనవి అనవచ్చు. కర్ణాటక సంగీత పద్ధతిలో ఈ రాగాలు లేకున్న, దేశ్ రాగాన్ని కేదారగౌళ రాగానికీ, తిలక్ కామోద్ రాగాన్ని నళినకాంతి రాగానికి సంగీతజ్ఞులు సమన్వయం చేస్తారు. దేశ్ రాగంలో ప్రతిమధ్యమ ప్రయోగంచేసి ఘంటసాల గారు జవాహర్ లాల్ నెహ్రూ మరణించిన తరుణంలో గానంచేసిన “లేవా ఇక లేనేలేవా” గీతం మనకు శుద్ధసారంగ్ లా వినిపిస్తుంది.
ఘంటసాలగారు దేశ్ రాగంలో మరియు తత్తుల్య రాగంలో గానంచేసిన కొన్ని పాటలు మరియు పద్యాల మచ్చు తునకలను ఇక్కడ వినగలరు.
దేశ్ రాగంలో మాస్టారి మచ్చుతునకలు
పాట
|
చిత్రం
|
సంగీతం
|
వందేమాతరం
|
రంగుల రాట్నం
|
ఎస్.రాజేశ్వరరావు, బి.గోపాలం
|
ప్రైవేట్ సాంగ్
| ||
వసతి దశన శిఖరె
|
భక్త జయదేవ
|
ఎస్.రాజేశ్వరరావు
|
అన్నీ మంచి శకునములే
|
శ్రీకృష్ణార్జున యుద్ధం
|
పెండ్యాల
|
యస్య సర్వే సమారంభాః
|
భగవద్గీత
|
ఘంటసాల
|
చిత్రం: | జగదేకవీరుని కథ (1961) | |
రచన: | పింగళి | |
సంగీతం: | పెండ్యాల | |
గానం: | ఘంటసాల | |
సాకీ: | ఓ…. దివ్య రమణులారా, నేటికి కనికరించినారా | |
కలకాదుకదా! సఖులారా! ఆ..ఆ..ఆ..ఆ.. | ||
పల్లవి: | ఓ సఖీ! ఒహో చెలీ! ఒహో మదీయమోహినీ | |
ఓ సఖీ! ఒహో చెలీ! ఒహో మదీయమోహినీ.. ఓ సఖీ! | ||
చరణం: | కలలోపల కనిపించి వలపించిన చెలులోహో..ఓ..ఓ.. | |
కలలోపల కనిపించి వలపించిన చెలులోహో | ||
కనులవిందు చేశారే...ఏ….ఏ.. | ||
కనులవిందు చేశారిక ధన్యుడనైతిని నేనహ | ||
ఓ సఖీ! ఒహో చెలీ! ఒహో మదీయమోహినీ.. ఓ సఖీ! | ||
చరణం: | నయగారము లొలికించి.. ప్రియరాగము పలికించి | |
నయగారము లొలికించి, ప్రియరాగము పలికించి | ||
హాయినొసగు ప్రియలేలే...ఏ...ఏ… | ||
హాయినొసగు ప్రియలే మరి మాయలు, సిగ్గులు ఏలనె | ||
ఓ సఖీ! ఒహో చెలీ! ఒహో మదీయమోహినీ.. ఓ సఖీ! | ||
చరణం: | కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు | |
కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు | ||
ఆటలహో తెలిసెనులే...ఏ...ఏ.. | ||
ఆటలహో తెలిసెను చెలగాటము నా కడ చెల్లునె | ||
ఓ సఖీ! ఒహో చెలీ! ఒహో మదీయ మో..హినీ |
కృతజ్ఞతలు: వీడియోనందించిన Sri Nukala Prabhakar, ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగు కొల్లూరి భాస్కర రావు గార్లకు, వికిపీడియా వారికి, నవతరంగ రివ్యూ అందించిన వలబోజు జ్యోతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
అవునండీ మౌళి గారూ, 'అలిగినవేళనే చూడాలి పాట దేశ్ అని కొందరు తిలక్ కామోద్ అని కొందరు అంటున్నారు, ఏది కరెక్ట్?' అని ఘంటసాల వారినే అడిగితే ఆయన నవ్వేశారట. మీరు 'రెండుకుటుంబాల కథ' లోని 'వేణుగాన లోలుని గణ వేయి కనులు చాలవులే' - పాటని మరిచారు. అది దేశ్ కాదంటారా?
రిప్లయితొలగించండి'వేణుగాన లోలుని గణ వేయి కనులు చాలవులే' దేశ్ రాగాధారితమే. మరువలేనిపాటను మరువగలమా ! ఆ పాట పల్లవి కేదారగౌళరాగంలోని త్యాగరాజు కృతిని జ్ఞప్తికితెస్తుంది. ఆరోహణసామ్యంగల దేశ్ రాగాన్నిమాస్టారు ఎన్నుకోవడం ఆయన ప్రతిభావిశేషం. గుర్తుచేసినందకు శ్రీ వేణుగోపాల్ గారికి నమస్సులు. ఈ వ్యాసాలలో ఒకరాగాన్ని ఆధరించిన ఘంటసాల పాడిన/స్వరపరచిన కొన్ని ముఖ్యమైన (మరియు ఆడియో వీడియోల లభ్యతవున్న) పాటలనే పస్తుతిస్తున్నాం. ఈ వ్యాసంలో పేర్కొనని దేశ్ రాగారితమైన ఎన్నో పాటలు ఉన్నాయి. ఎంతదూరమో (ఏకవీర), వర్ధిల్లుమాతల్లి వర్ధిల్లవమ్మ చిన్నారి శశిరేఖ (మాయాబజార్), తిరుమల తిరుపతి వేంకటేశ్వర (మహామంత్రి తిమ్మరసు).... అన్నిటినీ గ్రహించి సంగ్రహించడానికి అశక్తున్ని.ఐననూ మీరుపేర్కన్నట్లు రాగాలవిచారంలో ప్రఖ్యాతమైన అన్ని పాటలను పొందుపరచే ప్రయత్నం చేయగలము.
రిప్లయితొలగించండి