2014 లో ఘంటసాల మాస్టారితో అనుబంధం గల ముగ్గురు తెలుగు తెర ప్రముఖులు ధృవతారలయారు. వారి కీర్తి ఆచంద్ర తారార్కం. వారి మధుర స్మృతులను నెమరువేసుకుంటూ 2015 లోకి అడుగు పెడదాం. ఆచార్య ఆత్రేయ అన్నట్టు - "పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు".
కదిలే కాలం ఆగదు. మనం కూడ కదులుతూ క్రొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.
అందరికీ ఘంటసాల బ్లాగు తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ వాహినీ పిక్చర్సు సంస్థాపకులు పద్మభూషణ్ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి). ఈ సంస్థ వందేమాతరం, మల్లీశ్వరి, స్వర్గసీమ, బంగారు పాప, బంగారు పంజరం వంటి చక్కని చిత్రాలు నిర్మించారు. దర్శక-నిర్మాతయైన బి.ఎన్.రెడ్డి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన తొలి దక్షిణభారతీయులు. వాహినీ సంస్థయొక్క మరొక ప్రతిష్ఠాత్మకమైన సామాజిక, రాజకీయ, వ్యంగ్య చిత్రం రంగుల రాట్నం. ఒక తల్లి (అంజలీదేవి) కడుపున పుట్టిన ఇద్దరు కొడుకులు (చంద్రమోహన్, రాంమోహన్) రాజకీయ ప్రత్యర్థులై కత్తులు దూసుకోవడం, వారిని శాంతపరచి కలిపే తాపత్రయంలో ఆ తల్లి పడే బాధను హృద్యంగా మలచిన చిత్రమిది. బి.ఎన్.రెడ్డి ఈ చిత్రం ద్వారా ఆణిముత్యాల వంటి నటులు చంద్రమోహన్, వాణిశ్రీ, విజయనిర్మల, బాలనటి భానురేఖ (హిందీ తార రేఖ) లను తెలుగు తెరకు పరిచయం చేసారు. టైటిల్ సాంగ్ ను భుజంగరాయశర్మ వ్రాసారు. సాహిత్య పరంగా ఈ పాట చెప్పుకోదగినది. దానికి ఘంటసాల, బృందం ఆలపించగా, రసాలూరు రాజేశ్వర రావు మరియు బి. (బొడ్డు) గోపాలం సంగీతం (సింధుభైరవి రాగం) సమకూర్చారు. బొడ్డు గోపాలం ఆకాశవాణి లో నేపథ్య గాయకునిగా వుండేవారు. ఆయన ఘంటసాల, సాలూరు, టి.వి.రాజు వంటి సంగీత దర్శకులతో పనిచేసారు. కెంపెరాజ్ నిర్మించిన నల దమయంతి చిత్రానికి ఈయన సంగీత దర్శకత్వం వహించారు. వీరి శ్రీమతి అలనాటి గాయని రేణుక (ఈ మూగ చూపేలా - గాలిమేడలు). రంగుల రాట్నం చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా జాతీయ పురస్కారాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంగారు నంది పురస్కారాన్ని అందుకుంది.
చిత్రం:
రంగుల రాట్నం (1967)
రచన:
భుజంగరాయ శర్మ
సంగీతం:
ఎస్.రాజేశ్వర రావు, బి. గోపాలం
గానం:
ఘంటసాల, బృందం
పల్లవి:
బృందం:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఘంటసాల:
కలిమి నిలవదు లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు -2
నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా, వాడిన బ్రతుకే పచ్చగిల్లదా
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
బృందం:
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
చరణం:
బృందం:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఘంటసాల:
ఏనుగుపైని నవాబు, పల్లకిలోని షరాబు
గుఱ్ఱము మీది జనాబు, గాడిదపైని గరీబు
నడిచే దారుల గమ్యమొక్కటే..ఏ..
బృందం:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఘంటసాల:
నడిచే దారుల గమ్యమొక్కటే, నడిపే వానికి అందరొక్కటే
బృందం:
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము -2
చరణం:
ఘంటసాల:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కోరిక ఒకటి జనించు, తీరక ఎడద దహించు
కోరనిదేదో వచ్చు, శాంతి సుఖాలను తెచ్చు
ఏది శాపమో ఏది వరమ్మో..ఓ..
బృందం:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఘంటసాల:
ఏది శాపమో ఏది వరమ్మో, తెలిసీ తెలియక అలమటించుటే
బృందం:
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము -2
చరణం:
ఘంటసాల:
త్యాగమొకరిది ఫలితమొకరిది, అమ్మప్రాణమాఇద్దరిదీ
వ్యధలూ బాధలు కష్టగాధలు, చివరికి కంచికి వెళ్ళే కధలే
బృందం:
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము -2
బ్రతుకే రంగుల రాట్నము
చరణం:
ఘంటసాల:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆగదు వలపు ఆగదు వగపు, ఆరదు జీవనమాగదు
ఎవరు కులికినా ఎవరు కుమిలినా ఆగదు కాలం ఆగదు
బృందం:
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఘంటసాల:
కలిమి నిలవదు లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు
నవ్విన కళ్ళే చెమ్మగిల్లును, వాడిన బ్రతుకే పచ్చగిల్లును
బృందం:
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము -2
చరణం:
బృందం:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఘంటసాల:
ఇరుగింటిలోన ఖేదం, పొరుగింటిలో ప్రమోదం
రాలినపువ్వుల రెండు పూచే గుత్తులు మూడూ
బృందం:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఘంటసాల:
ఒకరి కనులలో చీకటిరేయి, ఇరువురి మనసుల వెన్నెలహాయి
బృందం:
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఘంటసాల:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
బ్రతుకే రంగుల రాట్నము -2
బి.ఎన్.రెడ్డి గుఱించి మరికొన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. Thanks to Phanindrudu Vadlamani for uploading the song to You Tube.
అలనాటి తొలి తెలుగు సినీ కవులలో పింగళి నాగేంద్ర రావు పౌరాణిక, జానపద చిత్రాలలో కొంగ్రొత్త మాటలు సృష్టించారు. ఉదాహరణకు పాతాళ భైరవి లో 'ధైర్యం శాయరా', మాయా బజార్ లో 'అలమలం' (హలో), 'తసమదీయులు', 'గిల్పం', జగదేక వీరుని కథలో 'ఓ హల' (ఇదికూడ హలో లాంటిది) మొదలయినవి. అయితే పద్య సముచ్ఛయములలో కూడ వారి పదభూయిష్టత ప్రస్ఫుటిస్తుంది. 1961 లో విడులైన విజయా వారి జానపదచిత్రం 'జగదేకవీరుని కథ' లో - కథానాయకుడు ఇంద్రుని కొలువులో ప్రేమ పరీక్షలో చెప్పిన పద్యాల రచన చెప్పుకోదగినది. పింగళి వారు చక్కని పదాలను ఎన్నుకున్నారీ రచనలో. నలుగురు దిక్పాలకుల కుమార్తెలను సూచిస్తూ తనయ, కుమారి, సుత, సుపుత్రి అనే పదాలు వాడారు. అలాగే కుటుంబ భాగస్వామియైన పెనిమిటిని పతి, భర్త, ఆత్మేశుడు, జీవితేశుడు అని సూచించారు. పరకాంతను కూడ గౌరవంగా మానిని (మానవతి) అని సంబోధించారు. అలాగే భర్తను విడచి ఉండగలదా లేదా మనగలదా అనే భావాన్ని తనరు, వరలు, అలరు, చెలగు అనే పర్యాయ పదాలు వాడి వర్ణించారు. ఈ పదాలకు అర్థం ప్రకాశించు లేదా శోభిల్లు అని వస్తుంది. ఆనాటి పద్యాలు వింటూంటే వీనులకు విందుగా వుంటుంది. ఆయా పదాలను వాటి భావానికి తగినట్టుగా ఉచ్చరించే ఘంటసాల మాస్టారి స్వరసానుభూతి మనకు ఎన్నో మధురమైన అనుభూతులను, జ్ఞాపికలను మిగిల్చింది. 'తెలుగు అంటే ఇలా వుండాలి' అనిపిస్తుంది. తెలుగు చదువరులకు, శ్రోతలకు ఈ పద్యాలు అమృతతుల్యం. అలాంటి పద్యాలు చలన చిత్ర మాధ్యమంలో మళ్ళా వింటామా అనిపిస్తుంది. ఈ చిత్రం కె.వి.రెడ్డి అద్భుత సృష్టి. సంగీతం పెండ్యాల వారిది. ఇదివరలో దేశ్ రాగంలో ఘంటసాల ఈ చిత్రానికి ఆలపించిన 'ఓ! దివ్యరమణులారా' మా బ్లాగులో ప్రచురించాము. ఇపుడు చక్కని పద్యాలను ఆలకించి ఆనందించండి.
వీడియో సౌజన్యంః శ్రీ నూకల ప్రభాకర్ గారు (ఘంటసాల గానచరిత)
పక్షిరాజా చిత్ర నిర్మాణ సంస్థ 1960 లో నిర్మించిన సాంఘిక చిత్రం విమల. కథానాయిక విమల పాత్రలో సావిత్రి, జమీందారు కొడుకు గా ఎన్.టి.రామారావు నటించారు. ఈ చిత్రానికి నిర్మాణదర్శకత్వం ఎస్.ఎమ్. శ్రీరాములు. సంగీతాన్ని శ్రీరాములు గారి సోదరుడైన ఎస్.ఎమ్. సుబ్బయ్య నాయుడు సమకూర్చారు. ఈయనను చిత్రసీమలో సంగీతయ్య అని పిలిచేవారట. ఈ చిత్రం లోని మరొక చక్కని యుగళగీతం ఘంటసాల, రాధాజయలక్ష్మి పాడిన "కన్నుల బెళుకే కలువలురా". ఈ పాటను ఇదివరలో మా బ్లాగులో పోస్టు చేసాను. నిజానికి రాధ, జయలక్ష్మి గారు అక్కచెల్లెళ్ళు. వీరు శాస్త్రీయ సంగీతంలో పేరుగన్న వారు. చిత్రంలో పాడినది జయలక్ష్మి గారు. ఆవిడ తన సోదరి రాధ పేరును కలిపి రాధాజయలక్ష్మి అని చిత్రం లో వాడారు. ఇక్కడ ఈ చిత్రం లోని మరొక మధురమైన గీతం "కన్నుల్లో నీ బొమ్మ చూడు" ఆలకించి ఆనందించండి. నాయికానాయకుల అద్బుత హావభావాలు ప్రస్ఫుటించే ఈ రసవత్తరమైన శృంగార గీతాన్ని రచించినది ముద్దుకృష్ణ.
Thanks to VEGA music for posting the video clip to You Tube
చిత్రం:
విమల (1960)
రచన:
ముద్దుకృష్ణ
గానం:
ఘంటసాల, రాధా జయలక్ష్మి
సంగీతం:
ఎస్.ఎమ్. సుబ్బయ్య నాయుడు
పల్లవి:
ఘంటసాల:
కన్నుల్లో నీ బొమ్మ చూడు
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడూ..ఊ..
కన్నుల్లో నీ బొమ్మ చూడు
చరణం:
రాధాజయలక్ష్మి:
పున్నమ వెన్నెల వన్నెలలో....ఓ...ఓ.. ఆ...ఆ..ఆ..ఆ..
పున్నమ వెన్నెల వన్నెలలో, కన్నుల కట్టిన రూపముతో
నీవే మనసున తోచగా... ఆ..ఆ..
నీవే మనసున తోచగ, నను నేనే మరిచిపోదురా…
ఘంటసాల:
కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు
కన్నుల్లో నీ బొమ్మ చూడు...
చరణం:
ఘంటసాల:
కోయిల పాటల తీరులతో.. ఓ..ఓ…
కోయిల పాటల తీరులతో, సరిపోయిన రాగాలల్లుదమా
సరిపోయిన రాగాలల్లుదమా
రాధాజయలక్ష్మి:
నచ్చిన పూవు గద నేను...
నచ్చిన పూవు గద నేను, కోరి వచ్చిన తుమ్మెద నీవెరా.ఆ..ఆ
ఎన్.టి.ఆర్. నటించిన 1960 చిత్రం దేవాంతకుడు ఒక ఫాంటసీ చిత్రం. ఇందులో హీరో తన పొరుగింటి అమ్మాయి (కృష్ణ కుమారి)ని ప్రేమిస్తాడు. అది నచ్చని ఆమె తండ్రి (ఎస్.వి.ఆర్.) కోపంతో హీరోను హత్య చేయిస్తాడు. హీరోను యమభటులు నరకానికి తీసుకుని వెళతారు. హీరో తన లౌక్యంతో యముడ్ని(ఎస్.వి.ఆర్.) ఒక ఆట ఆడిస్తాడు. తనకు వేరే లోకాలు తిరగాలని వుందని, విష్ణుమూర్తిని చూడడానికి పాస్ పోర్టు ఇమ్మని యముడ్ని అడుగుతాడు. ఈ చిత్రంలో "గో గో గో గో గోంగూర" అప్పటిలో చాల పాపులర్ పాట. చాల హాస్యభరితమైన చిత్రమిది. ఈ కథనే ఎమర్జన్సీ (యమర్జన్సీ) సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్.టి.ఆర్. హీరో గా, జయప్రద హీరోయిన్ గా యమగోల చిత్రం తీసారు. దేవాంతకుడు, యమగోల చిత్రాలకు ఇతివృత్తం ఒకటే, హీరో ఒకరే. తరువాత ఇదే ఇతివృత్తం తో మరికొన్ని యమ కథలు వచ్చాయి. దేవాంతకుడు చిత్రం లో ఘంటసాల ఆలపించిన చక్కని పద్యాలలో పాసు పోర్టు మీద పద్యం ఒకటి. దేవాంతకుడు చిత్రానికి సంగీతం అశ్వత్థామ. గీత రచన ఆరుద్ర.
తెలుగువారి గుండెలను తన గాన మాధుర్యమనే ఆనందార్ణవాన్ని నింపిన రసరాగ
సింధువు మరియు స్వరరాగ నిఘంటువు మన ఘంటసాల. ఈ సర్వమంగళ గుణసంపన్న గాన గంధర్వుడు మనం ప్రతి క్షణం తలచే గళవేల్పు. అజరామరమైన బాణీలను తన వాణిలో
పూరించి, మాణిక్యవీణను పలికించి, రసరాజులను మెప్పించి 'రసికరాజ తగువారము
కామా' అని జయభేరి మ్రోగించిన అమరగాయకుడు మన ఘంటసాల మాస్టారు. ఆయన తన
పాటల్లో మనకు కర్ణపేయమైన కర్ణాటక సంగీతంతో పాటు బందోబస్తుగ ముస్తాబైన
హిందుస్తానీ పోకడలను కూడ రుచిచూపించాడు. తన విలక్షణమైన సంగీతజ్ఞతతో ఎన్నో
అద్భుతాలు చేసాడాయన. అన్యస్వరాలనుపయోగించినా పాట మాధుర్యాన్ని పెంచాడే
తప్ప తగ్గించలేదు. తెలుగు చలనచిత్ర సంగీతత్రయములో సాలూరు, పెండ్యాల,
ఘంటసాల తిరుగులేని సంగీత సామ్రాజ్య రసరాజులు. అయితే ఘంటసాల గళమివ్వడము,
స్వరపరచడము మాత్రమే కాక స్వయంగా రచనలు చేయడం గొప్ప విషయం. అటువంటి
రాగ-భావ-తాళ-మేళాలను సంఘటిటపరచిన మన ఘంటసాల జన్మదినం ఈరోజు. మన ఘంటసాల రాగశాలలో మాస్టారు పాడిన ఎన్నో రాగాల గుఱించి ఇదివరకు మిత్రులు చంద్రమౌళి గారు ముచ్చటించారు. మరి ఈ రోజు మరొక రాగం గుఱించి తెలుసుకుందామా? అయితే అడుగుపెట్టండి రాగశాల లోనికి.
సంగీత ప్రపంచపు వేలకొలది విద్వాంసులలో ఎందరో శాస్త్రవేత్తలు, మరెందరో గాయకులు, వారిలో కొందరే ఖ్యాతనాములు.ఆ కొందరిలో వ్రేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత మాత్రమే స్వరసాహిత్యసవ్యసాచులు.
ఆ కొద్దిమందిలో సంగీత మాధురినీ, సాహిత్యసంపదను తమ స్పష్టోచ్చారణతో, ఎదను
కరిగించి, కదిలించే భావరసగానవర్షణాసమర్థ యుగపురుషులు ఎందరు? త్యాగరాజస్వామి వారి భాషలో చెప్పాలంటే, 'సామ నిగమజ సుధామయ గానవిచక్షణ' మైనది ఘంటసాల
మోహన గళం. త్రిస్థాయిలో గమక సంపదల మెరుపులతో రక్తికట్టించే గళమది. అది ఇత్తడిని పుత్తడిచేసే స్పర్శమణి. ఏపాటైనా ఏపద్యమైనా ఘంటసాల గళం నుండి వెలువడితే అది రసికుల ఎదలో మెదలి
పెదవులపైన పలుకుతుంది. చిరస్మరణీయంగా నిలబడిన అలాంటి రత్నాలెన్నో!
తనకు తెలిసినశాస్త్రీయ సంగీత రహస్యాలను వ్యాసాలలో, భాషణాలలో వ్యాఖ్యానించక,
ఇది శాస్త్రీయ సంగీతం, ఇది ఇలాంటి రాగాన్ని ఆధారింపబడినది
అని ఎక్కడా చెప్పక, తన స్వరకల్పనలో, ఆలాపనలో,
పాటలలో మరియు పద్యాలలో అపురూపమైన శాస్త్రీయరాగాలని ప్రవేశబెట్టిన మహితాత్ముడు మన ఘంటసాల మాస్టారు. ఆయన ఎన్నో రాగాలకు తన గళంతో ప్రాణం పోశారు. అల్పప్రసిద్ధములైన రాగాలకి సైతం రసపుష్టిని సమకూర్చి అసాధారణంగా ఆలపించారు. తన జీవనసంధ్యాసమయంలో అధ్యాత్మికానుభూతితో
భగవద్గీతలోని సారభూతమైన అష్టోత్తరశతశ్లోకగాయనమునకు ఆయన వాడిన రాగాలు దాదాపు నలభైయైదు ఉన్నాయి. ఆ రాగాలలో ఆయనే ప్రసిద్ధపరచిన రాగాలు గాక, ఎన్నో కొత్తప్రయోగాలూ, పోకడలు మనకు వినిపిస్తాయి. త్యాగరాయ కృతులనూ, రామదాస
– అన్నమయ్య కీర్తనలనూ ఆ మార్గంలోనే పాడాలన్న ఆయన అభిలాష పూర్తిగా నెరవేరక అవన్నీ గంధర్వ సదస్సులో
వినిపించడానికే మాస్టారు నిర్ణయించుకున్నారా అనిపిస్తుంది.
గాయకజీవనారంభదశలో,
ఆయన శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తూ, ఆ వృత్తి
ఆర్థికంగా విఫలమైన ఘటన శాస్త్రీయసంగీతానికి అపారనష్టాన్ని కలిగించింది. కాని వెండితెరకు నేపథ్యగానమాధుర్యాన్ని,
తెలుగుపద్య పఠనావిధానాన్ని సమకూర్చి నిరవధికమైన కీర్తిని, లాభాన్ని చేకూర్చింది. ఘంటసాల శాస్త్రీయ సంగీతంలోనేరాణించి నిలిచి ఉంటే, కర్ణాటక
శాస్త్రీయసంగీత దేవతకు, రెండు కళ్ళుగా ఇద్దరు గాయకసార్వభౌములుండేవారు.వారు మధురమైన గళమూ, శాస్త్రీయ సంగీతవైదుష్యమూ కావ్యనాటకాది సాహిత్యప్రతిభాలబ్ధ వాగ్గేయకారత్వ సవ్యసాచిత్వమూ
సమ్మిళితమైన ఘంటసాల మరియు మంగళంపల్లి గార్లు. ఆవిధంగా శాస్త్రీయగానానికి
లభ్యంకాని ఘంటసాలస్వరనిధి, సినిమా సంగీతానికి అక్షయమైన పెన్నిధిగా నిలవడం నిజంగా విధివిలాసమే.
సప్తస్వర సంపూర్ణములైన 72
మేళకర్తరాగాలలో కొన్నివేల జన్యరాగాలు
జన్మనెత్తాయి. స్వరోత్పత్తి తంత్రాంశాన్ని ప్రత్యేకించి గమనించిన
శ్రుతులలో దీప్త, ఆయత, కరుణ, మృదు, మధ్యమములని ఐదు జాతులున్నవి. షడ్జమమునకు నాలుగు, రిషభమునకు మూడు, గాంధారమునకు రెండు, మధ్యమమునకు నాలుగు,
పంచమమునకు నాలుగు, దైవతమునకు మూడు,
నిషాదమునకు రెండు శ్రుతులుగా సప్తస్వరాలకు 22 శ్రుతులు గలవు.
ఇందులో స-మ-ప స్వరాలకు మాత్రమే
4 శ్రుతులుగనుక ఇవే ప్రధానస్వరాలు. స అను షడ్జమస్వరమే మిగిలిన
ఆరు స్వరములకు ఆధారం. వనస్పతి, మానవతి,
సేనావతి, హాటకాంబరి, వరుణప్రియ,
యాగప్రియ, నవనీతము, గవాంబోధి….ఈ పేర్లు మనం సంగీత కచేరీలలో వింటున్నామా? అవి రాగాల
పేర్లేనా? అనే అనుమానం వస్తుందేమో గాని ఈ మేళకర్తరాగాల స్వరస్వరూపం కల్యాణి, చక్రవాకం,శంకరాభరణ రాగాల్లా సామాన్య సంగీతరసికులకు
బోధపడదు. పాటలకు బాణీ కట్టే సందర్భాలలో (రాగసంయోజనావిధానం)“ప్రజలు పాడుకోవడానికి వీలుగ ఉండాలని నా తపన" అంటూ ఘంటసాలగారే ఒక సందర్భంలో
అన్నారు.సప్తస్వరాలూగల
జనకరాగాల విస్తృతవిన్యాసం ఒక వైభవమైతే, ఐదుస్వరములుగల ఔడవ-ఔడవరాగాల (ఆరోహణావరోహణంలో ఐదు స్వరాలున్న రాగాలు) ఆకర్షణ బహుజనరంజకం. ఔడవరాగాలలో రెండుస్వరాల నడుమ ఉన్న
శ్రుతుల అంతరం ఎక్కువ. అందువలన స్వరస్థానాలు నిర్దిష్టముగా పలుకడానికి
అనుకూలంగా వుంటుంది. నిర్దిష్టముగా పలికేపంచస్వరసంయోజితరాగాలు జనరంజకాలు. ఉదాహరణకు వేదమంత్ర పఠనానికి ఆధారం మూడు స్వరాలే. అవి ని-స-రి.
ఘంటసాల ఈ రహస్యాన్ని గుర్తించి చేసిన రాగప్రయోగాలు ఎన్నో పాటలలో మనకు కనిపిస్తాయి.
ఒక్కక్షణంలోనె ఉద్దేశిత రసావిష్కరణమును
చేయగల శక్తి ఆయన గాత్రానిదైతే, దానికి ఔడవరాగప్రయోగాలు అనుకూలంగా
పొసగినవి.అందులోనూ హిందోళం,
భూపాలం, శుద్ధధన్యాసి, శుద్ధసావేరి,
హంసధ్వని, రేగుప్తి, మోహన, వలజి, శివరంజని, అమృతవర్షిణి,
ఆభోగి, విజయనాగరి వంటిఔడవ రాగాలను ఆయన ఎక్కువగాఎన్నుకొన్నారు.
ఇవన్నీ ప్రఖ్యాతమైన రాగములే. అయితే అంతగా ఖ్యాతిగాంచని ఒక రాగం "గంభీర
నాట". ఇది ముప్పైయారవ మేళకర్త చలనాటరాగజన్యం. 'చల' అన్నపూర్వపదం 'కటపయాది' సూత్రనియమితమైన సంఖ్యాసూచక పద్ధతి. చలనాటకు ఆరోహణS R3 G3
M1 P D3 N3 S,అవరోహణS N3 D3 P M1 G3 R3 S. దీని నుండి వచ్చిన
ప్రముఖ జన్యరాగాలు రెండు. అవి నాట రాగం (ఆ: S R3 G3 M1 P D3 N3 S| అవ: S
N3 P M1 G3 M1 R3 S) మరియు గంభీర నాట రాగం (ఆ: S G3 M1 P N3 S| అవ: S
N3 P M1 G3 S ). గంభీర నాట (నాట్టై – తమిళం,
శుద్ధ నాట్టై) ఔడవ-ఔడవరాగం. గంభీర నాటకు
తిల్లంగ్ రాగానికి (ఆ: S G3 M1 P N3 S| అ: S N2 P M1 G3 S ) చాల దగ్గరపోలికలున్నాయి. ఆరోహణంలో రెండురాగాలకూ
అవే స్వరాలుంటాయి. అయితే తిల్లాంగ్ అవరోహణంలో గంభీరనాటలోని
కాకలి నిషాదానికి (తీవ్ర్ నిషాద్, N3, B-sharp ఫ్రీక్వెన్సీ
15/8) మారుగా కైశిక నిషాదం (కోమల్ నిషాద్ N2, B-flat ఫ్రీక్వెన్సీ
9/5)వస్తుంది. గంభీరనాట మూర్ఛనలో గాంధారంపై గ్రహబేధం చేయగా భూపాలరాగం
సృజింపబడుతుంది. ఇంకొక విశేషమేమంటే గంభీరనాటలోని శుద్ధమధ్యమాన్ని ప్రతిమధ్యమంజేస్తె అరుదెంచే రాగం
అమృతవర్షిణి. అలాగే మధ్యమాన్ని తీసి చతుశ్రుతి రిషభం వేస్తే హంసధ్వని ధ్వనిస్తుంది. ఇవన్నీ ప్రఖ్యాతమైన రాగాలే.
గంభీరనాట త్యాగరాజుల కాలంలో ప్ర్రచురణలో ఉన్నట్టు
మనకు తెలియదుగాని, ఇది ప్రముఖంగా తమిళప్రాంతంలో ఎక్కువ ప్రసిద్ధమైన రాగం.
దేవస్థానోత్సవ సంబంధిత మంగళ
సన్నివేశాలలోనాదస్వర వాదనం అనాదిగానున్న ఆచారం. నాదస్వర వాదన ప్రస్తుతిలో మల్లారి, పంచనడై, ఘనరాగపంచకం, రాగం-తానం-పల్లవి మొదలైన సాంప్రదాయిక అంశములున్నవి.శాస్త్రీయ సంగీతంలో "మల్లారి"
అనబడే అంశం నాగస్వరానికే సంబంధించిన గంభీరనాట రాగంలో ప్రస్తుతించబడుతుంది.తమిళంలో బహుప్రఖ్యాతమైన "తేవారములు"
ఈరాగంలో పాడబడతాయి. ఈ రాగంలోసంగీతత్రిమూర్తుల రచనలు మనకు కనిపించకున్నా, ఊతుక్కాడు వెంకటకవి రచన 'శ్రీ విఘ్నరాజం భజే', జయచామరాజేంద్ర
ఒడెయర్ కృతి 'శ్రీ జాలంధరమాశ్రయామి' మరియు మంగళంపల్లి మాధుర్యములొలికించు వర్ణం "అమ్మా
ఆనందదాయిని" ప్రసిద్ధిగాంచిన గంభీరనాట రచనలు. ఈ రాగంలోనిమరికొన్ని రచనలుశరణెంబె వాణి (పురందరదాసు),
జయ దేవకీకిశోర (స్వాతి తిరునాళ్), గిరిజారమణ (మైసూరు వాసుదేవాచార్) మొదలయినవి. గంభీరముగా సాగే ఈ రాగంలో స్వరాలు:షడ్జమం, అంతరగాంధారం, శుద్ధమధ్యమం, పంచమం, కాకలి నిషాదం.
ఒక గాంధారద్వయి వైవిధ్యం తప్ప, హిందూస్థాని పద్ధతిలో
“జోగ్”రాగం మన గంభీరనాట కోవకు చెందుతుంది.
ఇండోనీషియన్ సంగీతములోనూ గంభీరనాట ఛాయలు కనిపిస్తాయి. తిల్లాంగ్ రాగానికున్న అవరోహణలోని కైశికి నిషాదం గమనించకున్నచో ముందు చెప్పినట్లు
గంబీరనాట-తిల్లాంగ్ఒకేలా వినిపిస్తాయి.
గంభీర
నాటరాగంలో ఎన్నోకీర్తనలు, మాస్టారే పాడిన పాటలూ ఉన్నా,
ఈ రాగంయొక్క పరాకాష్ఠతను మాస్టారు "శ్రీ సత్యనారాయణ మహాత్మ్యము" లో
శాశ్వతీకరించారు. తనకు సహజమైన ఒకటవ శృతికి అరశృతి ఎక్కువ స్ఠాయిలో అంటె C# స్తరంలో మొదలిడి తారపంచమాన్ని అధిగమించిపైస్థాయిలోనే సాగే పాట భక్తుని మొరలను వైకుంఠపు సరిహద్దులు దాటే విధమైన సన్నివేశశుద్ధి గలది. ఈ పదాలు పాటను పరిచయంచేయవచ్చును లేక వర్ణించవచ్చునేమో కాని అనుభవమును ఇచ్చునా? గంభీరమైన ఈరాగంలో, హింసకు గురియైన భక్తుని శోకార్తవాణికి,
మాస్టారు ఎలా స్వరాలను సమకూర్చారా అన్నదే విస్మయం.గంభీరనాట మూర్ఛనలో పంచమం నుండి పై-పంచమందాక (స-గ-మ-ప-ని-స
గ-మ-ప) వచ్చుస్వరాలలోనే బాణికట్టి, భావానికి కట్టులు
విప్పి కరుణరసావిష్కరణ గావించారు.
1. శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం హే
మాధవా....మధుసూదనా...కనజాలవా...
పాట
చివరలో ఎలుగెత్తి పిలచి హే! మాధవా, (పై గాంధారం) మధుసూధనా...
(పై మధ్యమం) కనజాలవా.. అంటూతారపంచమ స్వరారోహణంతో
పరమాద్భుతమైన భావం సృష్టించి ఆ సన్నివేశానికి సెట్టింగులతో సాగని వన్నెల వెన్నలనే ఆవిష్కరించారు
మాస్టారు.
2. లవకుశ
లవకుశ
చిత్రంలో కథాప్రారంభమున వశిష్ఠ మహర్షి, శ్రీరాముని
తన వంశకర్తయైన సూర్యభగవానునికి నమస్కరించమనగ, రాముడు గంభీర గమనంతో
నడుస్తున్నట్టె, నేపథ్యంలో మనకు గంభీరనాటరాగం వినిపిస్తుంది.
(గగస, మమగ, పపమ, నినిప, సనిపమగా అను స్వరవరుసలను ఇక్కడ వినగలరు). ఈ దృశ్యఖండిక
కన్నడభాషలో విడుదలైన "లవకుశ" చిత్రానిది.
లవకుశ
(తెలుగు) లో వాల్మికి మరియు లవకుశలు పాడే మొదటి పాట, కానడరాగ
నిబద్ధమైన "జగదభిరాముడు శ్రీరాముడె". తమిళంలో లవకుశ చిత్రానికి ప్రాంతీయకారణంగా
కె.వి.మహాదేవన్ స్వరకల్పనచేశారు. ఘంటసాల బాణి, పాటల్లో,
నేపథ్యంలో వినబడినా తమిళంలో కొన్ని పాటలకు వేరుగ బాణీ కట్టడం జరిగింది.మూల స్వర మాతృక సృష్టికర్తయైన ఘంటసాల మరియు తమిళ అవతరణిక సంగీతదర్శకుడైన మహాదేవన్ వీరిరువురి మధ్యన ఏ ఆసక్తికరమైన సంప్రదింపులు జరిగియుండునో
మనకు తెలియదుగాని, తమిళ అవతరణికలో ఈ పాటను, గంభీరనాటరాగంలో సంయోజించారు. తెలుగులోని కానడరాగయుక్తమైన ఆ పాటను, తమిళంలో గంభీరనాట రాగబద్ధమైన ఈ పాటనూ ఘంటసాలే పాడినా, ఏది సందర్భోచితమో చెప్పడం సహృదయులకు పెద్ద సమస్యకాదు. కానడరాగంలో రామభక్తి
వెల్లడైతే, గంభీరనాటలో భక్తికన్న రామప్రశంసభావమే కనిపిస్తుంది.
ఏదియేమైనా, తెలుగులో లేని గంభీరనాటరాగంలో మాస్టారు పాడిన పాట
అపురూపమనే చెప్పాలి.
తమిళంలోని పాట సాహిత్యం
"తిరువళర్ నాయగన్ శ్రీరామనె,రవికుల సోమనుం జయరామనే" దీనియొక్క, అర్థమూ, చతుర్మాత్రాగతి, ఆదితాళనిబద్ధత
అన్నిటికి ఆధారం అచ్చంగా మూలపు ’జగదభి రాముడు శ్రీరాముడే’ . ఘంటసాల సంయోజించిన కానడరాగానికి
బదులుగా మహాదేవన్ గంభీరనాటరాగం మేళవించారు.
( * లవకుశలో మాస్టారు
శుద్ధ శాస్త్రీయరాగాలనే వాడారు. పై పాటలో మహాదేవన్, గంభీరనాటరాగంలోలేనిఅన్యస్వరమైన చతుశ్రుతి రిషభాన్నిరెండు చోట్ల వినియోగించారు)
ఘంటసాల
గంభీరనాటరాగంలో పాడారా, ఆ రాగన్ని వాడారా అన్న విషయంచదివిగాని వినిగాని ఎరుగను.ఘంటసాలగారుతమిళ భాషలో లవకుశ చిత్రానికి ఆలపించిన ఒక్కపాటను,
ఘంటసాల అభిమాని, సహృదయ సంగీతరసికులైన శ్రీ ఎం.ఆర్.శ్రీనివాసమూర్తిగారు నాకు పంపగా ఆ పాట స్వర-రాగం
గురించి మనసులో చిన్న అన్వేషణ ఉండిపోయింది. ఈ వ్యాసరచనకు అది మూలం. ఆయనకు నా కృతజ్ఞాతాపూర్వక
శుభాశిస్సులు.
వాల్మీకి చిత్రానికై స్వరపరచి ఘంటసాల
గానంచేసిన "శ్రీరామాయణ కావ్యకథా" రాగమాలికలోని చరణం "జానకి జాడను తెలియుదు
నేను" గంభీరనాట రాగమే. ఈ దృశ్య భాగాన్ని ఇక్కడ చూడగలరు.
చిత్రం: వాల్మీకి; పాట: శ్రీ రామాయణ కావ్య కథా
జానకి జాడలు - శ్రీ రామాయణ కావ్య కథ: (వాల్మీకి)
టి.వి.రాజు స్వరకూర్పుతో దేవకన్య చిత్రానికై
మాస్టారు పాడిన "ఈశా గిరీశా మహేశ" ప్రసిద్ధమైన పాట. రాగమాలికలో కూర్చిన ఈ
పాటకు ఎనిమిదిరాగాలు. "మోహన, కళ్యాణి, ఆరభి, షణ్ముఖప్రియ, హంసధ్వని,
హిందోళ, హంసానంది మరియు గంభీరనాట" వాడారు. ఇందులో "రామప్రతిష్టిత
సైకతలింగ" అను చరణం గంభీరనాటరాగాధారితం. ఘంటసాల ఆరంభ దశలోనే ఈ రాగాన్ని వాడుకొన్నారు.
మాయాబజార్ చిత్రంలోని "విన్నావ యశోదమ్మ" పాటకు గంభీరనాట ఆధారం. పెండ్యాల
బాణికట్టిన, శ్రీకృష్ణతులాభారంలో భామాకృష్ణుల స్వాగతనృత్యం
"కొనుమిదే కుసుమాంజలి", చిన్నారి ఓ చిలుక విన్నావ
(శ్రీ వేంకటేశ్వరమాహాత్మ్యం) గంభీరనాటరాగాధారితం. శ్రీ సితారామకళ్యాణం చిత్రంలో మాస్టారు
గానంజేసిన "జయ గోవింద మాధవ దామోదరా" రాగమాలికాగీతంలో పరశురామావతార వర్ణనాత్మకమైన
చరణం"ధరణీ నాథుల శిరముల గొట్టి"
గంభీరనాటరాగం.
గమనిక :
శుద్ధ
శాస్త్రీయ కృతులను వినకపోవడం వలన, ఈ రాగస్వరూపం మనకు పూర్తిగా అర్థంకాదు.
గంభీరనాటరాగనిబద్ధమైన ఈ మూడుకృతులనూ వినండి.
శ్రీ జయచామరాజేంద్ర
ఒడెయర్ గంభీరనాటరాగంలో రచించిన అద్భుత కృతి,శ్రీ జాలంధర మాశ్రయామ్యహం:
వీణా మరియు కీబోర్డ్ లో వినిపించినది శ్రీ ఎన్.ఎమ్.కె: (శ్రీ
జాలంధర మాశ్రయామ్యహం)
ఏ పాటైనా ఏ
రాగమైనా ’ఆహా’ అనిపించే గమకాలను, సంగతులను సృష్టించి తన గానాన్ని
శాశ్వతీకరించారు మాస్టారు. తను పుట్టింది తొంభై రెండేళ్ళ క్రితమేయైనా, ఈనాటి
తొమ్మిదేళ్ళ పిల్లలు సైతం ఘంటసాల గానాన్ని మెచ్చుకొని, నేర్చుకొని,
పాడుతున్నారంటే, ఘంటసాల కంఠశ్రీ ఈ శతాబ్దపు లలిత-భావ సంగితయాత్రకు ఘంటాపథం.
రాగశాలలో,
మాస్టారి పాటల-పద్యాల వెనుకనున్న శాస్త్ర్రీయ అంశములను, ఘంటసాల గానాన్ని,
రాగాల వరసన నెమరువెసుకొనే నా అదృష్టానికి ముఖ్యకారకులు ఇద్దరు. ఒకరు
కర్ణాటక సుప్రసిద్ధ విద్వాంసులు శతావధాని డా|| ఆర్.గణేశ్ గారు. ఆయన ప్రతి
వ్యాసాన్ని చదివి, తమ అభిప్రాయాన్ని అందిస్తూ, ప్రోత్సాహిస్తూ, నేను
జాప్యంచేసి రాయకున్న, ఇప్పుడు ఏ రాగం గురించి రాస్తున్నారు అని అడుగుతూ
ఉత్తేజపరుస్తూ ఉంటారు. శ్రీ గణేశ్ గారు అభిమానించే ఘంటసాల జయంతి, ఈరోజు,
ఆయన పుట్టిన రోజూ కావడం ఒక విశేషం. ఇక రెండవ వ్యక్తి రాగశాలకు ఆశ్రయదాత,
ఆసక్తికరంగా, అవిరామంగా ఈ బ్లాగును నడుపుతూ, నా కర్ణాటభాష-తెలుగువేషాన్ని
సహిస్తూ, నాచేత వ్రాయిస్తున్న మిత్రులు సూర్యం గారు. వీరిద్దరికీ నా
నమస్సులు. మరో రాగాశ్రయంతో మళ్ళి కలుద్దాం.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com