ద్వారకలో రేవతీ బలరాముల గారాల పట్టి శశిరేఖ పుట్టినరోజు పండుగ జరుగుతుంటుంది. ముగ్గురు తోబుట్టువులు బలరాముడు, శ్రీకృష్ణుడు, సుభద్రాదేవి అక్కడే వుంటారు. ఈ సన్నివేశానికి పింగళి నాగేంద్ర రావు వ్రాసిన పాట “శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా” అనేది. శ్రీకరులు అంటే శుభాన్ని, సంపదను ఇచ్చేవారు. ముఖ్యంగా హరిహరులకు ఈ పదం వాడతారు. శ్రీకరులు కూడ దేవతలే, ఇక్కడ శ్రీకరులు మొదలైన దేవతలు అని అర్థం. శ్రీరస్తు అనే పదం మరో పదంతో కలిపి “శ్రీరస్తు - శుభమస్తు” అని పెళ్ళి పత్రికలలో లేదా శుభకార్యాలలో ముందుగా వ్రాసే మాట. శ్రీరస్తు అంటే శ్రేయస్సు కలుగుగాక! అని అర్థం. ‘అస్తు’ అనే పదం ‘అగు గాక’ అని అర్థం. ఈ పాట గురించి శ్రీ మ్యూజికాలజిస్ట్ రాజా గారు చాలా ఆసక్తికరమైన విషయాలను ఉటంకించారు. వాటి సారాన్ని మరియు వివిధ అంతర్జాల వనరులనుండి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ ఉల్లేఖించాను. ఇక్కడ చెప్పవలసిన విషయమేమంటే శ్రీకారం, శ్రీరస్తు ఎలా శుభారంభాన్ని సూచిస్తాయో, ఈ చిత్రం శ్రీకరులు, దేవతలు శ్రీరస్తులనగా అన్న శుభగీతంతో మొదలవుతుంది. చిన్నారి శశిరేఖను ‘వర్థిల్లవమ్మ’ అని పేరంటాండ్రు ఆశీర్వదిస్తారు. ‘వర్థనం’ అంటే పెరుగుదల. పిల్లల ఎదుగుదలను మనం ‘దిన దిన ప్రవర్థమానమై’ అంటుంటాం. అలా యుక్తవయసులోకి అడుగిడుతున్న చిన్నారి శశిరేఖ ప్రవర్థనం గుఱించి ‘వర్థిల్లవమ్మ’ అనడం కవి యొక్క చక్కని ప్రయోగం.
పింగళి ప్రతిభ ఈ పాట సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. తోబుట్టువులను వర్ణిస్తూ వారి వయసుల వరుసక్రమంలో శశిరేఖ తల్లిదండ్రులైన రేవతీ బలరాములను, తరువాత పినతల్లిదండ్రులైన రుక్మిణీ శ్రీకృష్ణులను, తరువాత మేనత్త సుభద్రాదేవిని వర్ణిసారు. విశేషంగా ప్రధాన పాత్రల పరిచయంతో పాటు వారి స్వభావాలు, ప్రవృత్తులు – అడుగకనే వరములిచ్చు బలరామదేవులు, సకల సౌభాగ్యవతి రేవతీదేవి, అఖిల మహిమలు గల కృష్ణపరమాత్ములు, శ్రీ కళలు విలసిల్లు రుక్మిణీదేవి (మరి లక్ష్మీదేవి అంశ కదా), ఘనవీరమాతయగు సుభద్రాదేవి వంటి వర్ణనలు సాహిత్యపరంగా వెల్లడించి రచయిత చిత్రానికి అద్భుతమైన నాందీ ప్రస్తావన చేసారు.
పింగళి వారు నిఘంటువులో లేని కొత్త తెలుగు పదాలను పాటలలో, సంభాషణలలో చమత్కారంగా, నిరాఘాటంగా సృష్టిస్తారు. దీనికి ముందు వచ్చిన పాతాళ భైరవిలో ‘చేయరా’ ను ‘శాయరా’ (ధైర్యం శాయరా) అన్నారు. అలాగే ఈ పాటలో ‘చేయగను’ అన్న అర్థంలో ‘శాయగను’ అన్నారు. పొంగిపోవడాన్ని ‘మురియా’ అన్నారు. అంటే మురిసిపోయాడు అని. ఈ పదప్రయోగాలు సన్నివేశానికి అనుగుణంగా, సందర్భోచితంగా ప్రేక్షకశ్రోతలకు వినోదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఘంటసాల మాస్టారు ఈ పాటను దేశ్, తిలక్ కామోద్ రాగాల ఆధారంగా బాణీ కట్టగా ఎం.ఎల్.వసంతకుమారి, బృందం గానం చేశారు.
చిత్రంలోని ముఖ్యపాత్రలన్నీ ఈ పాటలో పరిచయం అయిపోతాయి. అది దర్శకుని (కె.వి. రెడ్డి గారు) ప్రతిభ. ఈ సన్నివేశం లో మనకు కనిపించేవారు గుమ్మడి (బలరాముడు), ఛాయాదేవి (రేవతీదేవి), ఎన్.టి.ఆర్. (శ్రీకృష్ణుడు), సంధ్య (రుక్మిణీదేవి), ఋష్యేంద్రమణి (సుభద్ర), బేబి సరస్వతి (చిన్నారి శశిరేఖ), మాస్టర్ ఆనంద్ (చిన్నారి అభిమన్యుడు) మొదలగువారే కాక ఉపపాత్రధారులు కూడ కనిపిస్తారు.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు. ఈ వ్యాసంపై తమ చక్కని విమర్శలనందించిన డా.కె.వి. రావు గారికి ధన్యవాదములు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి