శ్రీశ్రీ అనువాద సినీగీతాలు గురించి డా. పైడిపాల గారు ఆంధ్రభూమి వ్యాసంలో ఈ విధంగా వ్రాసారు. "అభ్యుదయ కవిగా మహాప్రస్థాన కర్తగా లబ్ధప్రతిష్ఠులైన తర్వాతే శ్రీశ్రీ సినీరంగ ప్రవేశం చేసినట్టు చాలామందికి తెలుసు. కాని శ్రీశ్రీ సినీగేయ ప్రస్థానం అనువాద చిత్రంతో ఆరంభమయిందని, అనువాద చిత్ర రచనకు తెలుగులో శ్రీశ్రీయే ఆద్యులని తెలిసిన వాళ్లు తక్కువ. ఆ మాటకొస్తే శ్రీశ్రీ సినిమా పాటలున్న మొత్తం చిత్రాల్లో (255) నేరుగా తెలుగులో తీసిన చిత్రాల్లోని పాటల (450) కంటే అనువాద చిత్రాల్లోని పాటల సంఖ్యే (500) ఎక్కువ! తనకు సినిమా సరదా పన్నెండేళ్ల వయసులోనే వున్నట్టు శ్రీశ్రీ ‘అనంతం’ ఆత్మకథలో రాసుకొన్నారు. మహాప్రస్థాన గేయం మార్పులతో ‘కాలచక్రం’ (1940) అనే చిత్రంలో రావడంతో శ్రీశ్రీ సినీ రంగంలో వేలు పెట్టినట్టయింది. అయితే శ్రీశ్రీ ఆ కవితను తన మొదటి సినిమా పాటగా పరిగణించలేదు. ఆ కవితను సినిమాలో వినియోగించుకోవడమే తప్ప ఆ నిర్మాతతో ముందుగా మాట్లాడుకొన్న స్వల్ప పారితోషికం కూడా వారు చెల్లించలేదట! 1946లో ఆర్.యస్.జునార్కర్ నిర్మించిన ‘నీరా ఔర్ నందా’ అనే హిందీ చిత్రాన్ని 1950లో నవీనా ఫిలిమ్స్ వారు జగన్నాథ్ పర్యవేక్షణలో ‘ఆహుతి’ పేరుతో అనువదించడంతో తెలుగులో అనువాద చిత్ర నిర్మాణశకం ఆరంభమయింది. ఆహుతి చిత్రానికి మాటలు పాటలు రాసే అవకాశం శ్రీశ్రీకి లభించింది. అలా సినీ రచయితగా తన పేరు తెరకెక్కించిన తొలి చిత్రం ఆహుతియేనని, అదే తన సినీ రచనకు పునాది వేసిందని శ్రీశ్రీయే స్వయంగా రాశారు." తను వ్రాసిన "ప్రేమయే జనన మరణ లీలా/ మృత్యుపాశమే అమరబంధమా/ యువ ప్రాణుల మ్రోలా...అనే పాట గురించి శ్రీశ్రీ యిలా గుర్తు చేసుకున్నారు - "సినిమాకు నేను రాసిన పాటలన్నింటిలోనూ యిది మొట్టమొదటిది. ట్యూన్కి మాత్రమే కాక పెదవుల కదలికకు కూడా సరిపోయే విధంగా ‘నీరా ఔర్ నందా’ అనే హిందీ చిత్రానికి రాసిన డబ్బింగ్ పాట యిది... ఆహుతిలోని పాటలన్నీ బాగున్నాయంటే అందుకు సాలూరు రాజేశ్వరరావు సంగీతం గొప్పగా తోడ్పడిందని చెప్పక తప్పదు. హిందీ ఒరిజనల్లోని ట్యూన్లంటినీ అతడు పూర్తిగా మార్చి తన సొంతముద్ర వేశాడు. సినిమాకు పాటలు రాయడం చాలా మంది అజ్ఞానులనుకునేటంత సులభం కాదు. ఇక డబ్బింగ్కు రాయడమనేది మరీ కష్టంతో కూడుకున్న పని. ఉదాహరణకు ‘ప్రేమయే’ అన్న పాటనే తీసుకుందాం. హిందీలో దీని పల్లవి ‘ప్రేమ్ హై జనమ్ మరణ్ - కా ఖేల్’. ఇందులోని ఆఖరి ‘కాఖేల్’ చాలా ఇబ్బంది పెట్టింది. ‘ప్రేమయే జనన మరణ హేల’ అని రాశాను. కాని ‘లీల’ మాట మొదట్లో స్ఫురించలేదు. ఆ రాత్రి కలత నిద్రలో రాజేశ్వరరావు ట్యూను మననం చేసుకొంటూవుంటే ప్రేమయే జనన మరణలీల’ అనే పల్లవి దొరికింది. మర్నాడు పాటంతా పూర్తి చేశాను." పాటను అమర గాయకుడు ఘంటసాల మరియు లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతి గానం చేసారు. ఈ చిత్రానికి సంగీత సారధి ర'సాలూరు రాజేశ్వర రావు.
చిత్రం: | ఆహుతి (1950) | |
సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | |
గానం: | ఘంటసాల, రావు బాలసరస్వతి | |
రచన: | శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) |
ప: | ఘం: | జనన మరణలీల, ప్రేమయే |
జనన మరణ లీల | ||
మృత్యుపాశమే అమర బంధమౌ -2 | ||
యువప్రాణుల మ్రోలా..ఆ..ఆ..-2 | ||
ప్రేమయే జనన మరణ లీల -2 | ||
చ: | ఘం: | తనుసామ్రాజ్యము స్మృతియే కాదా |
తనుసామ్రాజ్యము స్మృతియే కాదా | ||
నిలచు దృఢముగా మానసగాధ -2 | ||
ఇ: | మృత్యుపాశమే | |
బా: | అమర బంధమౌ | |
మృత్యుపాశమే అమర బంధమౌ | ||
యువప్రాణుల మ్రోలా | ||
ప్రేమయే జనన మరణ లీల -2 | ||
లీలా.. |
Thanks to GVS Sastry garu for the audio clip loaded to You Tube.
Really happy to note this information pertaining to Sree Sree garu. The song is very good.
రిప్లయితొలగించండిThanks Sury garu for providing full details..To circulate more, if you permit can I post in my blog, giving your reference.