"ప్రియాతిప్రియమైన మా అన్న గారి గురించి ఎంత వ్రాసినా తక్కువే. అసలు ఈ పుస్తకమంతా నేనొక్కదాన్నే వ్రాయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం వ్రాయొచ్చు. అటువంటిది నాలుగు ముక్కల్లో వారిని గురించి ఏం వ్రాయాలి? ఎట్టా వ్రాయాలి? ఘంటసాల గారి కంఠం ఒక పెద్ద గంట.
ఒక పెద్ద గంటను బలంగా ఒక్కసారి మోగిస్తే దాని వైబ్రేషన్ చాలా సేపు వినిపిస్తూనే ఉంటుంది. అట్టాగే ఘంటసాల గారు పాడి వదిలేసిన ఆ పాటల నాదం మన చెవుల్లో రింగుమంటూ ప్రపంచమున్నంత కాలం నిలిచే ఉంటుంది. ఘంటసాల లాగా పాడే వారు (అది కూడా ఒక మోస్తరుగా) ఎంతో మంది ఉండొచ్చు. కానీ, వారు ఘంటసాల కాలేరు, కారు. ఆయన కంఠం స్వతహాగా భగవంతుడిచ్చిన వరంగా పుట్టుకతోనే వచ్చింది. మిగిలినవన్నీ అనుకరణలే గానీ అది సహజం కాదు, తెచ్చిపెట్టుకున్నది. ఘంటసాల అంటే ఒక్కడే. అంతే, అది అంతే, వారికి వారే సాటి.
అటువంటి మహాగాయకుడితో కలిసి నేను మొట్టమొదటి తెలుగు పాట పాడటం నా అదృష్టం. అసలు నా మొట్టమొదటి యుగళగీతమే అది కావటం నా భాగ్యం. తిలక్ గారి చిత్రం “ఎం. ఎల్. ఎ”లో, పెండ్యాల గారి సంగీతంలో, ఆరుద్ర గారి రచన “నీ ఆశ అడియాస” అనే యుగళగీతం అది. ఘంటసాల గారి గళంతో గళం కలిపి నేను పాడిన ఆ నా మొదటి యుగళగీతం ఈనాటికీ అందరి హృదయాలలోనూ మారుమ్రోగుతూనే ఉంది. అది ఏడుపు పాటే కావచ్చు. ఒక బిడ్డ పుట్టినప్పుడూ, ఏడుస్తూనే పుడుతుంది గదా? తరువాత నవ్వుతుంది. అట్టాగే నా సినీ గాన జీవితం కూడా ఏడుపు పాటతోనే ప్రారంభమయింది. కానీ, నేను ఇంకా నవ్వుతూనే నా జీవితాన్ని నేపథ్యగాయనిగా వెనుకచూపు లేకుండా నడుపుకుంటూనే ఉన్నాను.
ఘంటసాల గారితో ఎన్నో మంచి మంచి యుగళగీతాలు పాడాను. మేం రికార్డింగ్స్‌లో కలుసుకున్నప్పుడు ఆయన నవ్వుతూ, నవ్విస్తూ చాలా సరదాగా ఉండేవారు, ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారు. ఒక పాట పాడాలంటే దాంట్లో ఎన్నో భావాలుంటాయి. ఆ భావాలొలికిస్తూ నవ్వుతూ ఏడుస్తూ పాడేప్పుడు అస్సలు సిగ్గు పనికి రాదు, సిగ్గు విడిచి పాడాలి. అప్పుడే ఆ భావాలు సరిగ్గా వస్తాయి అని చెప్పేవారు. రికార్డింగ్ అప్పుడు ఎంత మంది ఉన్నా, మననే చూస్తున్నా మనం పట్టించుకోరాదు. అసలక్కడ ఎవ్వరూ లేనట్టూ, మనమే ఒంటరిగా ఉన్నట్టూ భావించి పాడాలి అనేవారు. ముమ్మాటికీ అది నిజం, అక్షరాలా వారు చెప్పింది నిజం.
ఆయన సంగీతంలో కూడా నేను చాలా చిత్రాలలో పాడాను. అందులో ఒకటి “పాండవ వనవాసం”లో “ఓ వన్నెకాడ” అనే పాట చాలా హిట్టయింది. ఆ రికార్డింగ్ అప్పుడు ఆయన నేను చాలా బాగా పాడానని మెచ్చుకుంటూంటే పొంగిపోయాను. సింగర్స్ ఎంతో మంది చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. కానీ ఎవ్వరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా అంతగా రాణించలేదు. కానీ, ఘంటసాల గారు మ్యూజిక్ చేసిన ప్రతి పిక్చరూ మ్యూజికల్‌గా గ్రాండ్ సక్సెస్, అన్ని హిట్ సాంగ్సే. చిత్రాలు, పాటలు కూడా హిట్సే. ఆయన మ్యూజిక్ చేసిన ప్రతి పిక్చరూ ఏవేవీ అని మీకే తెలుసు. అవన్నీ ఏవేవీ అని ఒక్కసారి ఊహించుకుని జ్ఞాపకం చేసుకోండి. మీకే తెలుస్తుంది. ఇటు సింగర్‌గానూ అటు మ్యూజిక్ డైరెక్టర్ గానూ కూడా గ్రాండ్ సక్సెస్ అయిన వ్యక్తి ఒక్క ఘంటసాల గారే, ఆ ఘనత వారికొక్కరికే దక్కింది.
వారు మ్యూజిక్ చేసి పాడిన ప్రైవేట్ సాంగ్స్ కూడా ఎంతో హిట్స్. అందులో పుష్పవిలాపం ఎప్పుడూ నేను నా కచేరీలలో పాడుకుంటూ ఉంటాను.
ఒకసారి నేనూ, మావారు కుటుంబసమేతంగా తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం ముగించుకుని వస్తూండగా గుడి బయట ఘంటసాల గారు కనిపించారు. “ఇవ్వాళ ఉంటున్నారా?” అని వారు మా వారిని అడిగారు. “దర్శనం అయిపోయింది గదా, ఇక బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నాం” అన్నారు మా వారు. ఘంటసాల గారు మమ్మల్ని ఆ రోజు ఉండి మర్నాడు వెళ్ళమన్నారు, “ఈ రోజు సాయంకాలం గుళ్ళో స్వామివారి సన్నిధిలో స్వామికి ఎదురుగా కూర్చొని నేను భక్తి గీతాలు పాడుతున్నాను. అమ్మాయి కూడా రెండు పాటలు పాడితే బాగుంటుంది” అన్నారు. స్వామివారి ముందర పాడే సదవకాశాన్ని కలిగించినందుకు సంతోషించి ఒప్పుకుని ఉండిపోయాం. అది మా భాగ్యం. ఆ రోజు సాయంకాలం వేంకటేశ్వరస్వామి ముందర కూర్చుని ఘంటసాల గారితో కలిసి మేమిద్దరమే పాడిన “రంగుల రాట్నం” చిత్రంలోని యుగళగీతం “నడిరేయి ఏ జాములో” పాడాను. ఆ సంఘటన జీవితంలో నేను మరిచిపోను, మరువలేను.
నేనూ ఘంటసాల గారు పాడిన యుగళగీతాలు ఎన్నో హిట్స్ ఉన్నాయి. వాటిలో “నడిరేయి ఏ జాములో” అనే పాట చాలా హిట్టయింది. ఇంకొకటి “ఖైదీ బాబాయ్” అనే చిత్రంలో నేను ఒకే ఒక పాట పాడాను. ఘంటసాల గారు కూడా ఒకే ఒక పాట పాడారు. ఆ పాట “ఓరబ్బీ చెబుతాను” అనే యుగళగీతం. అది చాలా హిట్టయింది.
ఘంటసాల గారి రోజులలో కూడా కొన్ని రికార్డింగ్స్ మేమిద్దరం కలిసి పాడాము. ఆ సమయంలో ఆయన “భగవద్గీత రికార్డ్ చేస్తున్నాను, అది నేను పూర్తి చెయ్యగలనో లేదో” అంటూ బాధపడ్డారు. “అవేం మాటలూ? అట్టా అనకండి. తప్పకుండా పూర్తి చేస్తారు. మీరింకా ఎన్నో పాడాలి, మీరు బాగుండాలి.” అన్నాను. నేను చాలా బాధపడ్డాను.
ఒక విచిత్రం. ఘంటసాల గారితో నేను పాడిన మొట్టమొదటి యుగళగీతం, ఆయనతో పాడిన ఆఖరి యుగళగీతమూ కూడా పెండ్యాల గారి సంగీతమే. నేనూ ఘంటసాల గారూ పాడిన మా ఆఖరి యుగళగీతం కూడ ఏడుపే. “నాన్న అనే రెండక్షరములు” అనే పాట – ఇది పాడేప్పుడు ఆయన “రేపు నా పిల్లలు ఈ పాట పాడుకుంటారు” అన్నారు. “అయ్యొయ్యో ఏంటీ, అట్టా మాట్టాడతారు? ఊరుకోండి.” అన్నాను. నాకు చాలా ఏడుపొచ్చింది. ఆ కొద్ది రోజులలోనే మనందరినీ దుఃఖసాగరంలో ముంచేసి ఘంటసాల గారు స్వర్గస్థులైనారు.
ఘంటసాల గారు మన అందరి హృదయాలలోనూ ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వారు అమరులు….వారు అమరులు….వారు అమరులు. ఇది నా హృదయం వ్రాసింది సుమా చేతులు వ్రాయలేదు."
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి