HMV కి మాస్టారిని ఆహ్వానిస్తున్న మంగపతి |
ఈ పాట రచించినది తూర్పు గోదావరిలో పుట్టిన ప్రముఖ కవి, చిత్రకారులు అయిన శ్రీ రావులపర్తి భద్రిరాజు గారు. ఈయన ప్రముఖకవి శ్రీ అడవి బాపిరాజు గారి మేనల్లుడు. భద్రిరాజు ఈయన ఎన్నో పాటలు, నాటకాలు వ్రాసారు. ఘంటసాల మాస్టారు ఈ పాటను మొదట ఆకాశవాణిలో పాడారు. అది విని ఆకర్షితులైన HMV Recording Manager మంగపతి గారు ఈ పాటకు చాల పబ్లిక్ డిమాండు వున్నదని గ్రహించి రేడియోవారి అనుమతితో రికార్డుగా విడుదలచేయ సంకల్పించారు. రేడియోలో పాడినపుడు అసలు సాహిత్యం ప్రకారం “ఏమిటో నీ జాడ” తెలియాకున్నామయ్య అని పాడారట మాస్టారు. అయితే HMV వారు రికార్డు చేసినపుడు భద్రిరాజు గారు దీనిని “ఏమిటో నీ మాయ” అని మార్చారట. అదే మనమంతా వింటున్నాము. రికార్డింగ్ ముందు జరిగిన మరొక చిన్న మార్పు ఏమిటంటే, పాట ప్రారంభంలో “ఏడుకొండలవాడా! వెంకటరమణా! గోవిందా! గోవిందా!” అని భక్తులు ఎలా అయితే తిరుమల కొండ యెక్కేటపుడు భక్తి పారవశ్యం నిండిన భావోద్వేగంతో ఎలుగెత్తి పలుకుతారో ఆ స్ఫూర్తిని ఘంటసాల మాస్టారు చేర్చమని సూచించడం వలన ఆ పాటకు మరింత జీవం పోసింది. మరి మాస్టారి ఇష్టదైవం ఆ వేంకటేశ్వరుడే కదా! ఇక్కడ ఘంటసాల పాడిన పాటలోని రెండు వైవిధ్యాలను, అంటే రేడియోలో పాడినది, HMV రికార్డింగ్ కోసం పాడినది వినగలరు.
మాస్టారి చలనచిత్రేతర గీతాల గుఱించి విపులంగా విశ్లేషించి "మన ఘంటసాల సంగీత వైభవం" అనే చక్కని పుస్తకరూపంలో అందించినవారు నల్గొండకు చెందిన శ్రీ డా.పురుషోత్తమాచార్యులు. వారికి నమోవాకాలు. ఈ గీతం గుఱించి శ్రీ పురుషోత్తమాచార్యుల వారి వివరణ ఇలా వుంది. ఈ గీతం పల్లవిలో - "స్వామి" బదులు సామి అని అనడంలో సామాన్యుల ఉచ్చారణ సౌందర్యం కనిపిస్తుంది. మెట్లెక్కి వెళ్తున్న భక్తుని ఆర్తి, ఆవేదన ఈ పాటలోని ప్రతి అక్షరంలో ద్వనిస్తుంది. "సర్వం విష్ణుమయం జగత్" అనే పురాణవాక్యాన్ని తలపిస్తూ అది సామాన్యుని నోట "ఏ చోటగాంచిన నీవుందువందురే" అనే పంక్తిని కవి వ్రాసారనిపిస్తుంది. పల్లవిని, చరణాలను రేడియోలాగ కాక, ఖచ్చితమైన సంగతులతో రూపొందించుకుని ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ పాటను ఆలపించారు. "ఈ అడవి దారిలో చేయూత నీయవా" దగ్గర ఒక మనోహరమైన ఆలాపనను సంగ్రహంగా చేర్చారు. ఏడు కొండలసామి భక్తిగీతాన్ని శుద్ధధన్యాసి రాగంలో ఘంటసాల మాస్టారు స్వరపరచారు. ఇది 22వ మేళకర్త రాగమైన ఖరహరప్రియకు జన్యరాగం.
మాస్టారు ఆకాశవాణిలో పాడిన పాట (శ్రీ నూకల ప్రభాకర్ సౌజన్యంతో)
మాస్టారు HMV రికార్డులో పాడిన పాట (శ్రీ నూకల ప్రభాకర్ సౌజన్యంతో)
సాకీ: | ఏడుకొండలవాడా! వెంకటరమణా! | ||
గోవిందా! గోవిందా! | |||
పల్లవి: | ఏడుకొండలసామీ! ఎక్కడున్నావయ్యా | ||
ఎన్ని మెట్లెక్కినా కనరావేమయ్యా | | ఏడు । | ||
అనుపల్లవి: | ఆకాశమంటూ యీ కొండ శిఖరమ్ముపై -2 | ||
మనుషులకు దూరంగా మసలుతున్నావా -2 | |||
ఏడుకొండలసామీ! ఏడుకొండలసామీ! | |||
చరణం: | ఏచోట గాంచిన నీవుందువందురే | ||
ఏమిటో నీ మాయ (జాడ) తెలియకున్నామయ్య | | ఏచోట । | ||
ఈ అడవి దారిలో చేయూతనీయవా.. ఆ… -2 | |||
నీ పాద సన్నిధికి మము జేరనీయవా -2 | | ఏడు । | ||
ఏడుకొండలసామీ! ఎక్కడున్నావయ్యా | |||
ఎన్ని మెట్లెక్కినా కనరావేమయ్యా ఆ ఆ | |||
ఏడుకొండలసామీ! ఏడుకొండలసామీ! |
ఈ వ్యాసంలో కొంతభాగం మరియు చలనచిత్రం శ్రీ డా. ఎం. పురుషోత్తమాచార్యులు (నల్గొండ) వ్రాసి ప్రచురించిన "మన ఘంటసాల సంగీతవైభవం" అనే పుస్తకం నుండి వారి అనుమతితో పొందుపరచడమైనది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే శ్రవణ ఖండికలను పొందుపరచిన ఘంటసాల గాన చరిత బ్లాగ్ మిత్రులు శ్రీ నూకల ప్రభాకర్ గారికి మనః పూర్వక కృతజ్ఞతలు.
ధన్యవాదములు/நன்றி/ നന്ദി / ধন্য়বাদ / ಧನ್ಯವಾದಗಳು/ धन्यवाद:/ આભાર/ धन्यवाद्/ ਧੰਨਵਾਦ/ ଧନ୍ୟବାଦ
రిప్లయితొలగించండి----
विक्रम कुमार
P. Vikram Kumar
Science Communicator
www.bharatiscript.com
డాక్టర్ సూర్య నారాయణ గారికి ధన్యవాదాలు. చిన్నప్పటి నుండి ఈ పాట వింటున్నాను. ఎన్నేళ్ళైనా కూడా ఇది ఆపాత మధురమే. ఈ పాట రాసింది ఎవరో ఇన్నాళ్ళుగా నాకు తెలియదు. అదృష్టవశాత్తు మీ బ్లాగ్ లో ఈ పాట రచయిత రావులపర్తి భద్రిరాజు గారి గురించి తెలిసింది. వారి గురించి తెలియజేసినందులకు మీకు మరో మారు ధన్యవాదాలు. ఘంటసాల మాస్టారి గొంతులో ఈ పాట అజారమరమయ్యింది.
రిప్లయితొలగించండి