ముక్తిని చూపించుము - గాంధారి గర్వభంగము నుండి ఘంటసాల గానం
ఘంటసాల నేరుగా విడుదలైన తెలుగు చిత్రాలేకాక అనేక తమిళభాషా చిత్రాలను తెలుగులోకి అనువదించిన సందర్భంలో వాటిలో తెలుగు పాటలను పాడారు. అలాంటి ఒక పౌరాణిక డబ్బింగ్ చిత్రం 1959లో ప్రభాత్ సంస్థ రాజా ఠాగూర్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "గాంధారి గర్వభంగం" ఆదిలో తెలుగు డబ్బింగ్ చిత్రాలకు పెదవులకదలికకు అనుగుణంగా వుండె పదాలను కూర్చి భావం చెడకుండా చక్కని గీతాలను వ్రాయడంలో ఆద్యుడు మహాకవి శ్రీశ్రీ. ఈ పౌరాణిక తెలుగు డబ్బింగ్ చిత్రానికి అన్ని పాటలూ శ్రీశ్రీ వ్రాసారు. అందులో "పదునాలుగు భువనమ్ములకెదురన్నది లేదులే" అనే పాట బాలభారతం చిత్రంలోని "మానవుడే మహనీయుడు" గీతానికి సమాన సందర్భపు పాట, అదిగాక "ముక్తిని చూపించుము" అనే పాటను కూడ ఘంటసాల బృందం పాడారు. అయితే పౌరాణికమైనా కూడా శ్రీశ్రీ మార్కు పాట సాహిత్యంలో కనిపిస్తుంది. ఆపాటను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
చిత్రం:
గాంధారి గర్వభంగం (డబ్బింగ్) -1959
రచన:
శ్రీశ్రీ
సంగీతం:
పామర్తి, సుధీర్ ఫడ్కే
గానం:
ఘంటసాల, బృందం
పల్లవిః
ఘంటసాలః
ముక్తిని చూపించుము, శక్తిని దీపించుము
సత్యవాక్యమెందు వీడజాలము
పాలించుము ధర్మము, స్థాపించుము న్యాయము
ఆర్యపాలకులను నీవె కావుము
ముక్తిని చూపించుము, శక్తిని దీపించుము
బృందంః
జై ఆర్యదేవతా! హే! సూర్యదేవతా! - 2
చరణంః
ఘంటసాలః
సమతా పరిపాలనా, శ్రమదీక్షా ప్రేరణ
బృందంః
సమతా పరిపాలనా, శ్రమదీక్షా ప్రేరణ
ఘంటసాలః
సారించీ వినవా మా ప్రార్థనా
గంగా వినిర్మలమౌ హృదయాలను మాకొసగి
హైమాచల ధైర్యం కలిగించుము
దుఃఖాలను మాపుమూ..ఊ..ఊ..
దుఃఖాలను మాపుమూ, సౌఖ్యాలను చూపుము
విజ్ఞానదీపాలను వెలిగించుము
పాలించుము ధర్మము, స్థాపించుము న్యాయము
ఆర్యపాలకులను నీవె కావుము
ముక్తిని చూపించుము, శక్తిని దీపించుము
బృందంః
జై ఆర్యదేవతా! హే! సూర్యదేవతా! - 2
చరణంః
ఘంటసాలః
హే! ప్రాణదాతా! జగతి విధాతా!
బృందంః
హే! ప్రాణదాతా! జగతి విధాతా!
అఖిలాండకోటి సంరక్షకా!
అడుగడుగున ఎన్ని ఆటంకాలెదురైనా
సాగే మా యాత్రా మరి యాగదు
మా సత్యం మాయదూ..ఊ..ఊ
మా సత్యం మాయదూ, మాలిన్యం చేరదు
ఈ ధర్మజ్యోతి యింక ఆరదు
పాలించుము ధర్మము, స్థాపించుము న్యాయము
ఆర్యపాలకులను నీవె కావుము
ముక్తిని చూపించుము, శక్తిని దీపించుము
బృందంః
జై ఆర్యదేవతా! హే! సూర్యదేవతా! - 2
ఘంటసాలః
ముక్తిని చూపించుమూ…...
శక్తిని దీపించుమూ….
Thanks to Sri Bollapragada Someswararao garu for the movie poster.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి