దశావతారములు (డబ్బింగ్) చిత్రం నుండి ఘంటసాల పాడిన 'జయహే! మాధవా!.
ప్రముఖ దర్శకులు పి. పుల్లయ్య వద్ద సహాయకునిగా పనిచేసిన యు.విశ్వేశ్వరరావు "విశ్వ శాంతి" అనే ప్రతిష్టాత్మకమైన చిత్రనిర్మాణ సంస్థ స్థాపించి మొదట అనేక తెలుగు, తమిళ డబ్బింగ్ చిత్రాలు నిర్మించారు. తదుపరి కాలంలో ఆయన నిర్మించిన నేరు చిత్రాలైన "కంచుకోట", "నిలువుదోపిడి", "పెత్తందార్లు", "దేశోద్ధారకులు" ద్వారా నిర్మాతగా స్థిరపడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు "తీర్పు", "మార్పు", "నగ్న సత్యం", "హరిశ్చంద్రుడు", "కీర్తి కాంత కనకం" చిత్రాలు సంచలనం సృష్టించాయి. అందులో "నగ్న సత్యం", "హరిశ్చంద్రుడు" చిత్రాలకు ఫిలిం ఫేర్ పురస్కారాలు రాగా, "కీర్తి కాంత కనకం" చిత్రానికి దర్శకునిగా, "పెళ్ళిళ్ళ చదరంగం" చిత్రానికి స్క్రీన్ ప్లే రచయితగా నంది పురస్కారాలు లభించాయి. 1962 లో నిర్మించబడిన డబ్బింగ్ చిత్రం "దశావతారములు". ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు నాలుగు పాటలు పాడారు. వాటిలో ఒక పాట మాత్రమే దొరికింది. అది "జయహే! మాధవా". గీత రచన సముద్రాల రాఘవాచార్యులు. ఈ పాటలో సముద్రాల వారు దశావతారాలను సంక్షిప్తంగా, సులభమైన, సరళమైన పదాలతో చక్కగా వివరించారు. అంతేకాక చిత్ర నిర్మాణ సంస్థ పేరును ఆఖరి చరణంలో అద్భుతంగా కూర్చారు. సంగీతం పామర్తి. ఈ చిత్రం మార్చ్ 28, 1962 లో విడుదలయింది. ఇందులో నటీనటులు రాజకుమార్, ఉదయ్‌కుమార్,రాజశ్రీ, ఆదోని లక్ష్మి. అలభ్యమైన దృశ్యఖండికకు బదులుగా శ్రీ రాజశేక్షర్ రాజు గారు చక్కని దశావతారాల చిత్రాలను దృశ్యనేపథ్యంలో అద్భుతంగా పొందుపరచారు.
నిర్మాణం:
విశ్వశాంతి పిక్చర్సు
వారి
చిత్రం:
దశావతారములు (డబ్బింగ్) 1962
రచన:
సముద్రాల సీనియర్
సంగీతం:
పామర్తి
గానం:
ఘంటసాల
పల్లవి:
జయహే! మాధవా! -2
సాధులోక పరిపాలన దీనా-2
జయహే! మాధవా!
చరణం:
సోమకహర మీనావతారా!
మందరగిరిధర కూర్మావతారా!
ధరణీసుందర ఆదివరాహా!
ప్రహ్లాదవరద నరసింహా..ఆ..
జయహే! మాధవా!
చరణం:
మాటను దాటని బలిని మెచ్చుకుని
కోటను దాటే వామనరూపా!
పగకు పగే తగు దండనగా..ఆ..ఆ..
పగకు పగే తగు దండనగా
రాజులనణచిన భృగురామా!
చరణం:
తండ్రియాన జవదాటగ నొల్లని
ధర్మపాలనా రఘురామా.ఆ!
తండ్రియాన జవదాటగ నొల్లని
ధర్మపాలనా రఘురామా.ఆ!
ప్రేమికి, జ్ఞానికి భేదము లేదని -2
బోధించిన గోపాలబాల
చరణం:
శోకమయమ్మగు లోకములోన
శాంతిని నిలిపిన సిద్ధార్థా..ఆ.
శోకమయమ్మగు లోకములోన
శాంతిని నిలిపిన సిద్ధార్థా..
విశ్వశాంతికై స్వార్థజీవుల -2
దునిమే కల్కి అవతా..రా..
కృతజ్ఞతలు: ఈ ఆడియో-వీడియో ఖండికను యు ట్యూబ్ లో పొందుపరచిన శ్రీ రాజశేఖర్ రాజు గారికి ధన్యవాదాలు. చిత్రం వివరాలు పొందుపరచిన ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి బ్లాగు నిర్వాహకులు శ్రీ కొల్లూరు భాస్కర రావు గారికి కృతజ్ఞతలు.
Sir నమస్తే.ఇంత అరుదైన,మధురమైన పాట శ్రీ ఘంటసాల వారిది పొందుపరిచిన మీకు,శ్రీ కొల్లూరి భాస్కరరావు గారికి ధన్యవాదాలు. గ్రామదేవతలు(1968) లో వచ్చిన సినిమాలో P.లీల గారు "పాడిన కోమలా పల్లవపాణి"అనే భక్తి గీతం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను.శ్రీ భాస్కరరావు గారిని,అలాటి అభిరుచి గల చాలా మందిని సంప్రదించాను.దొరకలేదు.మీ వద్ద సమాచారం ఏదైనా ఉంటే తెలుపగలరు.ధన్యవాదాలు. రవికృష్ణ చారేపల్లి తిరుపతి.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
Sir నమస్తే.ఇంత అరుదైన,మధురమైన పాట శ్రీ ఘంటసాల వారిది పొందుపరిచిన మీకు,శ్రీ కొల్లూరి భాస్కరరావు గారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిగ్రామదేవతలు(1968) లో వచ్చిన సినిమాలో P.లీల గారు "పాడిన కోమలా పల్లవపాణి"అనే భక్తి గీతం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను.శ్రీ భాస్కరరావు గారిని,అలాటి అభిరుచి గల చాలా మందిని సంప్రదించాను.దొరకలేదు.మీ వద్ద సమాచారం ఏదైనా ఉంటే తెలుపగలరు.ధన్యవాదాలు.
రవికృష్ణ చారేపల్లి
తిరుపతి.
రవికృష్ణ గారు, మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీరు కోరిన లీల గారి పాట నా వద్ద లేదండి. క్షమించాలి.
తొలగించండి