సునిశిత
హాస్యం, సుమనోల్లాసకరమైన లాస్యం తొణికిసలాడిన, సంగీత రసఙ్ఞులు అవశ్యం గుర్తుంచు కొనవలసిన
చిత్రం లలితా శివజ్యోతి వారి రహస్యం. సంగీత తృష్ణగల వారికి స్వరనిష్ణాతుడైన సంగీత
జలనిధి ఘంటసాల అందించిన, మల్లాది
రామకృష్ణ శాస్త్రి కలం నుండి జాలువారిన చిత్ర అంతర్నాటకం, ముగ్ధ
మనోహరమైన కూచిపూడి భాగవతుల యక్షగాన దృశ్య, శ్రవణ కావ్యం గిరిజా కల్యాణం.
తెరకెక్కించిన చక్కని కథాచిత్రానికి స్వరసమిధలు సమీకరించి, భావ భాస్వరాన్ని
ప్రజ్వలింపజేసి, రసానికొక రాగం అన్నట్టు చర్విత చర్వణమైన రాగతోరణాలతో గిరిజా
కల్యాణ మంటపాన్ని అలంకరించి, చరణాలకు ప్రాణం పోసి అద్వితీయమైన రసరాగ యజ్ఞాన్ని
చేసిన అనన్యసామాన్యుడు ఘంటసాల. ఇది గానార్ణవుడైన ఘంటసాల అధ్బుత రస సృష్టి, రాగాల
కుంభవృష్టి. ఈ గాన యఙ్ఞంలో మాస్టారితోబాటు పాలుపంచుకున్నది పి.సుశీల, లీల, కోమల,
వైదేహి, పద్మ, మల్లిక్ మరియు మాధవపెద్ది. ఈ రాగమాలికలను అధ్బుతంగా క్రోడీకరించి,
విపులంగా విశ్లేషించి రాగశాలలో రసవత్తరంగా రచించిన ఘనత చంద్ర మౌళి గారిదైతే,
అరుదైన ఈ గానఖండికను చిత్తశుద్ధితో కూడిన ధ్వనిశుద్ధితో అందరికీ శ్రవణానందకరంగా
అందించిన ఘనత శ్రీనివాస మూర్తి గారిది. ఇక ఈ వీనుల విందును రాగశాలలో
ఆస్వాదిద్దామా!
గిరిజాకల్యాణం
- కూచిపూడి నాట్యరూపకం
కూచిపూడి నృత్యం
ప్రాచీనమైన సంగీత, సాహిత్య, నాట్య సమాహార కళ. కూచిపూడికి ధనంజయుని దశరూపకంలో పేర్కొనిన
వీధినాటక లక్షణముల సంస్పర్శ గలదు. కూచిపూడి భాగవత మేళ సంప్రదాయ ప్రక్రియ వేరుగా
కనిపించినా యక్షగాన లక్షణాలు లేకపోలేదు. “యక్షగానం” కర్ణాటక సంగీతము దేశ్య సంగీతంపై
ఆధిపత్యాన్నిసాధించి, సంగీత నృత్య ప్రధానమై రూపు దాల్చిన ఒక ప్రభేదం. చంద్రపభా పురాణమనే ప్రాచీన కన్నడ గ్రంథంలో (క్రీ.శ. 1150) “యక్ష సంగీత” ప్రసక్తియున్నది.
కృష్ణ లీలావిలాస ప్రసంగాలను రాగరసవత్తరంగా, వాద్యమేళములతో పాడదగువాడు భాగవతుడు. కూచిపూడి భాగవతులు ఈ కోవకు చెందినవారు. ఆది స్తుతిపరాకు నుండి అంతిమ మంగళము వరకు క్రమంగా వివిధ రాగాలలో పాడుతూ, వచనములను గమకిస్తూ ప్రదర్శిస్తాడు సూత్రధారుడైన గానముఖపూజ్యుడు “భాగవతుడు”. సక్రమమైన శాస్త్రీయ రాగసంయోజనమే ఈ దృశ్యరూపకముల రంజకత్వ రహస్యం. పాటలు – పద్యాలనే వ్యక్తిత్వానికి రాగము దేహమై, గానానికి తోడుగా వాద్యముల నేపథ్యంతో, అర్థభావాలు జీవమై, రసమే ఆత్మముగా జేయగలిగే భావవ్యక్తిత్వ సమాధి నిర్వాహకుడే భాగవతుడు. నవరసాలూ, రసప్రభేదాలు, త్రిగుణాల హిత మిత సమ్మిశ్రణ పరిణామమే ఉత్తమ ప్రసంగముల యొక్క ప్రముఖ లక్షణం.
కథాసారం
సతీవియోగంతో
తపోనిష్ఠలోనున్న శివుని వలచిన పార్వతి ఆతని సేవలోనుండగా, తారకాసుర సంహారం
జరుగుటకు, శివపుత్ర జననం కొఱకు అతని వివాహం అవశ్యమని, ఇంద్రాదేశితుడైన మన్మథుడు
పుష్పబాణాలు వేసి శంభునికి తపోభంగము గావిస్తాడు. ఆ చర్యకు
ఉగ్రుడైన రుద్రుడు కణకణలాడే నిప్పులు
నిండిన తన మూడవ
కనురెప్పను విప్పగా ఆ కోపాగ్నిలో అసమశరుడు భస్మమై, శివానుగ్రహంతోనే పునర్జీవితుడవుతాడు. శివుడు అలనాటి తన లలనయైన
గిరిరాజసుతను (పూర్వం
దాక్షాయణి రూపంలో అగ్నిప్రవేశంచేసిన) పరిణయమాడునదే గిరిజా కల్యాణ ఇతివృత్తం.
సంగీతం - సంగతులు
జానపదీయ,
శాస్త్రీయ రూపాలలో కొన్ని గంటలు లేక
రేయంతా సాగే యక్షగాన ప్రక్రియలను సినిమాలలో కొన్ని నిమిషాలు చూపించటం ఒక సాహసం.
అలనాటి సినిమాలలో హరికథలూ,
బుఱ్ఱకథలూ, నాట్య-నాటికలు సాందర్భికంగా ఉన్నా యక్షగాన
రూపకాలు అరుదనే చెప్పవచ్చు. అందులో “రహస్యం” సినిమాలోని “గిరిజాకల్యాణ ప్రసంగం”
చలనచిత్ర గాన చరిత్రలో ఒక ప్రత్యేక
స్థానాన్ని పొంది, శుద్ధ శాస్త్రీయ సంగీతాధారితమై
రంజకత్వాన్ని,
రససిద్ధిని నిరంతరం కలుగజేస్తూఉండడం
సర్వవిదితమే. ఘంటసాల
సినిమా సంగీతదర్శక యాత్రాపథంలో
ఆద్యుజ్వలతోరణం “లవకుశ”. అంతిమ తోరణం “రహస్యం” అని మనం చెప్పుకోవచ్చును. ఈ రెండుసినిమాలనూ లలితాశివజ్యోతివారు నిర్మించడం మరియు ఉభయచిత్రాలకూ ఘంటసాల సంగీత నిర్దేశకత్వం వహించడం ఒక్కవిశేషం. ఈ రెండు
చిత్రాలకు ఘంటసాల సమకూర్చిన సంగీతం, ఆయన స్వరవిజ్ఞతకు, భావ-నాద సంస్ఫురణమునకు తార్కాణం.
శాస్త్రీయ సంగీత శివశిరోధార్యమైన
గానగంగను సామాన్యులకు కూడ రసానుభవాన్నికలిగించేలా ఇలకు దింపిన భావగాన
భగీరథుడు ఘంటసాల.
సామాన్యంగా సినిమా సంగీతంలో శుద్ధశాస్త్ర్రీయ సంగీతాన్ని వాడుట చాలా అరుదు. “త్యాగయ్య” సినిమాలో సరళంగా త్యాగరాజ కీర్తనలు అందించిన సంగీతఙ్ఞులైన నాగయ్యగారి పైనే విమర్శలొచ్చాయి. ఈ పాట ఈ రాగనిబద్ధమని చెప్పడానికి వీలులేకుండ అన్యస్వరాలు మేళవించి మాధుర్యతకు ప్రాధాన్యతనిచ్చిన పలువురు సంగీతదర్శకులు ఖ్యాతి గడించారు. ఘంటసాల చలనచిత్ర రంగంలో సంగీతప్రవేశంచేసిన రోజుల్లో శాస్త్రీయసంగీతానికి ఉన్నపరిస్థితి అది.
ఘంటసాల – శాస్త్రీయ సంగీతం
శాస్త్రీయ సంగీత
వైదుష్యముతో విజయనగర సంగీతకళాశాలలో పట్టభద్రుడై, శుద్ధ శాస్త్ర్రీయసంగీతాన్నే
అభ్యసించిన ఘంటసాల, పారంపరిక సంగీత విజ్ఞతగల నాగయ్యగారిని ఆకర్షించడం సహజమే.
ఆదిలో ఘంటసాల పూర్ణప్రమాణంలో సంగీత కఛేరీలు చేస్తుండేవారు. ఆ ధ్వనిని వినే భాగ్యం
మనకు కలగలేదు.
ఆయన చేసిన ఆకాశవాణి మరియు దూరదర్శన్ కచేరీలు ఈ నాడు మనకు అలభ్యం. పరిస్థితులవల్ల, జీవన నిర్వహణ కోసం సినిమారంగానికి
వేంచేసి, ఆయనలోని శుద్ధ శాస్త్రీయ సంగీతం పూర్ణస్థాయిలో వెలుబడ్డానికి అవకాశాలు
లేకపోయాయి.
నిర్మాతగా వున్న
స్వేచ్ఛాబలంతో భానుమతిగారు పట్టుదలతో తన అన్ని సినిమాలలోను కనీసం
ఒక్క త్యాగరాజకీర్తనైనా పాడి తన శాస్త్ర్రీయ సంగీత నైపుణ్యాన్ని
చూపారు. ఘంటసాల పాడిన శివశంకరి, మదిశారదాదేవి మందిరమే, దేవి శ్రీదేవి, రాజ మహారాజ లాంటి పాటలు
శుధ్ధ శాస్త్రీయబాణిలో కూర్చబడినను, పూర్ణప్రమాణంలో ఆయనలోని శాస్త్రీయసంగీత ప్రతిభ
వెలువడే అవకాశం రాలేదు. ఈ లోటు ఆయనకు ఎంతటి బాధను కలిగించిందో ఊహించగలము. ఆ కొరత “గిరిజాకల్యాణం”
తీర్చింది. చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళైలాంటి విజ్ఞుల మెప్పు పొందింది. రహస్యం
సినిమాకు పూర్వమే మాస్టారు తన కఛేరీలలో “గిరిజాకళ్యాణం” పాడేవారు.
గిరిజా కళ్యాణం – సంగీతం
సంపూర్ణ కర్ణాటక
శాస్త్రీయరాగాలను సలక్షణంగా, ఏ అన్యస్వర ప్రయోగాలూ మార్పులూలేక స్వరకల్పనచేసి,
బహుసంఖ్యమైన రాగాలను వాడి, పాడిన “గిరిజాకళ్యాణ” ప్రబంధం ఒక అపురూపమైన సృష్టి.
ఘంటసాల, గిరిజాకళ్యాణ గానానికి వాడిన రాగాల సంఖ్య పదునైదు. ఇన్నిరాగాలుగల
ఒక్కసంగీతభాగం చాలా అరుదనే చెప్పాలి.
యక్షగానం, వీధి నాటకం, తరంగాలు, నాటకాల్లాంటి ప్రక్రియలలో చాలా తక్కువ రాగాలే వాడేవారు. ఆ రాగాలలో ప్రముఖంగా నాట, ఆనంద భైరవి, శంకరాభరణం, కాంభోజి, ఖరహరప్రియ మరియు తోడిరాగాలను పేర్కొనవచ్చు. గిరిజాకళ్యాణంలో స్వరబద్ధమైన పదునైదు రాగాలలో ఇంచుమించు అన్నిరాగాలూ జన్యరాగాలే. రంజకత్వసాధనకు మేళకర్త రాగాలను వదలి (తనకు అతి ప్రియమైన కళ్యాణిరాగమునూ విడచి) ఘంటసాల ప్రయోగించినవన్నీ జన్యరాగాలే. అవి శంకరాభరణ జన్యములైన హంసధ్వని, అఠాణా మరియు సామ; హరికాంభోజి జన్యములైన కాంభోజి, కేదారగౌళ, శహన, మధ్యమావతి; హనుమత్తోడి జన్యమైన హిందోళం; వాచస్పతి జన్యమైన సరస్వతి; మాయామాళవగౌళ జన్యమైన సావేరి; ఖరహరప్రియ జన్యములైన రీతిగౌళ, ఆనందభైరవి; సూర్యకాంతం జన్యమైన వసంత; చలనాట జన్యమైన నాట మరియు ప్రారంభలో తనకు ప్రియమైన హంసానంది. ఈ రాగాలలో శుద్ధ – చతుశ్రుతి రిషభములూ, సాధారణ-అంతర గాంధారాలూ, శుద్ధ-ప్రతి మధ్యమాలూ, శుద్ధ-చతుశ్రుతి దైవతాలూ, కాకలి-కైశికి నిషాదాలూ మేళవించి సర్వస్వరరసపాకాన్ని కుదించి తన గళామృత స్పర్శతో అందించారు మాస్టారు.
ఈ రాగాల లక్షణాలనూ, ఆయా రాగాధారిత గీతాలనూ ప్రస్తుతించడం క్లిష్టం గనుక, గిరిజాకళ్యాణ రాగప్రయోగసూచికలో రాగాల స్థూలపరిచయాన్ని ఇక్కడ చూడగలరు.
“గిరిజా కళ్యాణం” పాఠాంతరాలు, ఇతివృత్తం
మహామహులు
మల్లాది రామకృష్ణశాస్త్రిగారు మరియు మహాగాయకుడు ఘంటసాల “గిరిజాకల్యాణానికి”
దేహప్రాణాలు. మల్లాదిగారి మాటల బంగారుపూవులకు జోడైనది ఘంటసాల గాన పరిమళం.
మల్లాదిగారు సినిమాకోసం రాసినది కాకపోయినా, లలిత కళల విలువ తెలియు సరసులు పదింబదిగ
పరవశులై అవధరించదగినదైనది. ఆ భామార్పిత వామభాగుని కల్యాణ ప్రస్తుతియైన
ఈ రాగ-భావ-తాళ యోగ వైవిధ్య భరిత నాట్యరూపకం ఏ సినిమాపాటకూ లేని ఖ్యాతి, చరిత్ర,
మెప్పులు గడించింది. మల్లాదిగారు ఉషాకల్యాణం అనే సినిమాకోసం ఈ గిరిజాకల్యాణ
ప్రబంధాన్ని రాసి,
ఆ చిత్రనిర్మాణం ఆగిపోగా జ్యోతి మాసపత్రికలో ప్రచురించబడినదని
మరొకచోట చదివినట్టు నాకు జ్ఞాపకం.
ఈ ప్రసంగ సాహిత్యానికి మూడురకాల పాఠములు కలవు. 1. జ్యోతి-ఆగష్ట్ 1963 సంచిక మరియు “కేళీ గోపాలం” పేరుతో కనిపించే నృత్యరూపక భాగమైన “ పార్వతీకళ్యాణం” 2. ఘంటసాలగారు జగద్గురు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతుల పాదసన్నిధిని హైదరబాదు నల్లకుంటలో గల శంకరమఠంలో గానంచేసినది, 3. “రహస్యం” సినిమాలోనిది. ఈ వ్యాసంలో, ఘంటసాల హైదరాబాదు శంకరమఠంలో గానంచేసిన పాఠాన్నే ఎంపికచేసి, అందులో విడిపోయిన ఖండికలను “రహస్యం”లోని వివిధగాయకులు పాడిన “గిరిజాకల్యాణం” సాహిత్యభాగాలనూ సూచించడమైనది.
1. మల్లాదిగారి కేళీ గోపాలం లోని కథా సందర్భం శ్రీకృష్ణచరిత్రాంశం. కృష్ణ పౌతృడైన అనిరుద్ధుని బాణాసుర పుత్రిక ఉషాబాల స్వాప్నిక వివాహంలో వరించింది. తన చెలికత్తె చిత్రలేఖ, శాంభవీ విద్యాబలంతో ద్వారకలో సుఖనిద్రలోనున్న అనిరుద్ధుని ఆమె, ఉషాబాలయొక్క పడకింటికి చేర్చింది. ఈ సల్లాపము తెలిసిన బాణాసురుడి కోపానికి అనిరుద్ధుడు నాగపాశబద్ధుడైనాడు. తన మనుమని మామని మాయతో మందలించనెంచి, యాదవసైన్యముతో శ్రీకృష్ణుడు భాగవత వేశాలతో శోణపురం చేరతాడు. కోటగుమ్మం కాపు ఈశ్వరుడు. ఈ భాగవతులు పార్వతీ పరమేశ్వరుల సాక్షాత్ సన్నిధిలో నాట్యాభినయనాల ప్రదర్శించినది “గిరిజాకల్యాణం”. ఇది మల్లాదిగారి రచనయొక్క ఇతివృత్తం. మల్లాది రచించిన ఈ యక్షగానం 1963లో అచ్చైనట్టు మనకు తెలుస్తుంది. అందులోని పాటల చరణములు, వచనములు, పాట శకలాలకూ వారే రాగనిర్దేశనం చేసినారు. మల్లాదిగారు తమ కృతిలో సూచించిన (స్వరప్రస్తార వివరములు లేక) రాగాలు ఇవి.
వరదాభయ లీలామయ – లేలిహాన మణివలయా (శంకరాభరణం) [గిరిజాకల్యాణం లో ఈ పాటలేదు]; ఉమామహేశ్వర ప్రసాదలబ్ధజీవన (హంసధ్వని); మిముదీవించి మీవీటనిలచి (మధ్యమావతి) (గిరిజాకల్యాణం లో ఈ పాటలేదు); రావో, లోలలోల (కాంభోజి); చెలువారు మోమున (అఠాణా); పోయిరా శిరీశ కోమలా (కేదార గౌళ); తగదిది తగదిది ..దరువు (వసంత); ఈశుని దాసుని జేతువ (రీతిగౌళ); కానిపనీ మదన (శహన); చిలుక తత్తడి రౌత (సరస్వతి); సామగ సాగమ సాధారా (హిందోళం); విరులన్ నిను పూజసేయగా (నాద నామక్రియ); కరుణన్ గిరిరాజ కన్యకన్ (కన్నడ); అంబా అని అసమశరుడు (సామ); బిడియపడి భీష్మించి (సౌరాష్ట్ర)
ఘంటసాల, మల్లాది వారి రాగసూచనలు గౌరవించి ఆయా రాగాలలోనే “గిరిజా కల్యాణానికి” స్వరకల్పన చేశారు. ఆద్యంతాలలో “ఉమామహేశ్వర ప్రసాదలబ్ధజీవన” వచనాలకు, హంసధ్వనిని విడచి నాటరాగం మరియు “బిడియపడి భీష్మించి” అను ఖండగతి పద్యాలకు సౌరాష్ట్ర రాగానికి బదులుగా మధ్యమావతిరాగం వాడిన తీరు శాస్త్రీయ సంప్రదాయాన్నివన్నెకట్టిన మార్పులే. "విరులన్ నిను పూజసేయగా" అను పద్యానికి మల్లాదిగారు సూచించిన నాదనామక్రియకు బదులుగా, రతీవిలాపసందర్భోచితముగా “సావేరి” రాగాన్ని సమకూర్చినది సమంజసమే.
2. హైదరాబాదు శంకరమఠం 1959లో వ్యవస్థించబడింది. బహుశ 1963లో ఆ ప్రాంగణానికి వేంచేసిన కంచికామకోటి పీఠాధిపతుల సన్నిధిలో ఉపవిష్టులై ఘంటసాల వేంకటేశ్వరరావుగారు సహకళాకారులైన తిరుపతి రాఘవులు, పట్రాయని సంగీతరావు (హార్మోనియం) మరియు లలిత్ ప్రసాద్ (తబలా) సహకారంతో “గిరిజా కళ్యాణ యక్షగానం” ఆలపించగా హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంవారు ధ్వనిముద్రణ చేశారు. ఇందులో మనకు స్త్రీ గళం వినిపించదు. సాంకేతిక ప్రమాదాల వల్లనో మరియే కారణంగానో ఘంటసాల గానంలో “చిలుక తత్తడిరౌత”, “ఇవె కైమోడ్పులు”, “అంబాయని అసమశరుడు”, ఈ మూడు ఖండికలు లేవు. ఆదిలోని “నతపోషణ హిత భాషణ” మల్లాదిగారి రచనలో లేదు. “ జయజయజయ నటరాజ” పల్లవిగా ఘంటసాల స్వరకల్పన చేసిన కన్నడ చిత్రం “గిరిజా కల్యాణ” మరియు “వాల్మీకి” చిత్రంలో వినిపిస్తుంది.
అందులోనూ రేడియో ప్రసారంలోని శబ్ద తరంగాలు అన్యధ్వనులతో ధ్వని ప్రకటన గుణబద్ధంగా లేదు. ఫ్రాన్స్ దేశంలో సిక్స్ సిగ్మా పరిణితునిగా పని చేస్తున్నఘంటసాల అభిమానియైన శ్రీ ఎం.ఆర్.శ్రీనివాసమూర్తిగారు, కొన్ని ధ్వనితరంగ విశ్లేషణ పరికరాల సహాయంతో ఆద్యంతంగా అన్యధ్యనులను తొలగించి ఆకాశవాణి ప్రసారం చేసిన “గిరిజా కల్యాణాన్ని” శుద్ధీకరించి ఉపకరించారు. ఆనాటి గానాన్నిశుద్ధరూపంలోసంపాదించి మీ అందరితో ఇక్కడ అందిస్తున్నది చాల ఆనందకరమైన సంగతి.
నతపోషణ-హితభాషణుడైన ఆ పరమహంసుని “హంసానంది”లో ప్రార్థిస్తూ, శివపార్వతులిర్వురినీ (నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం) ఒకే శ్లోకంలో కాళిదాసు స్తుతిస్తే, ఘంటసాల ఒకే శ్లోకాన్ని రెండు రాగాల్లో, అనగా ‘ఆనంధభైరవి’ లో ప్రారంభించి ‘నాట’ రాగంలో ముగించిన తీరు ఒక నూతన ప్రయాగం. అలాగే “అరిందమా ఉమామనా” పాడినపుడు శివస్తుతికి హంసధ్వని, అమ్మవారిస్తుతికి ఆనందభైరవి రాగాలను ఒకే పాటలో ఇమిడించడం అర్థగర్భితమైన బాణికట్టు. వివిధ దేవతలను మేలుకొలిపే ‘పరాకులలో’ నాటరాగం యొక్క షట్శృతి రిషభాన్ని ఉద్దీపించిన తీరు జాగృతికారకం. ప్రేక్షకులను ప్రస్తుతించే “అవధరించరయ్యా” ఆదితాళ నిబద్ధమైన మధ్యమావతిలో “ససరి నినిస పపని మమప రిమపని (లలిత కళల విలువ తెలియు రసికులు) మరీసనిప రిసానిపమ రిమపని (పదింపదిగ పరవశులై...)” అను సర్వలఘువిన్యాస త్రిశ్ర-చతురశ్ర-షణ్మాత్రా లయ విశేషగతి సంగీత సాహిత్యాల పొందికను సాధించిన తీరు మనోహరం. “రా..వో, రా...వో” పల్లవికి కట్టిన సాంప్రదాయిక కాంభోజి రాగ సంగతులుగాని, “లోలలోల (మంద్రం)..రాజాలలామ (తారస్థాయి)” రెండునూ కలిపినతీరు.. “చెలువారు మోమున....వయ్యారినడలా బాలా ఎక్కడికే” అని అధికారయుక్తంగా చెలులు ప్రశ్నించడానికి, “సనిరిసదా.." అఠాణ రాగ ప్రయోగం, ‘తగదిది’ దరువులో, “తగదిది తగదిది తగదిదీ” అను (నిరోధ సూచకధ్వని) సాహిత్యానికి, “తకధిమి తకఝణు, తకధిమీ” అనునది లయప్రక్రియ కాగా “ససనిద, నినిదమ, నిదమగా” వసంత రాగ స్వరసంయోజనంలో (వసంతమాసము మన్మథుకి ప్రియమేగదా) మన్మథుని సామర్థ్యమూ, ఆత్మవిశ్వాస భావాలూ అద్భుతముగా ప్రకటింపబడినవి. ఇలా మరెన్నో విశేషాలను పేర్కొనవచ్చు.
గిరిజా కల్యాణం ఆడియో మూలం: AIR
Remastered by Sri Srinivasa Murthy (France)
(Link to audio file) Remastered
(Thanks to M.R.Chandra Mowly garu for providing the audio link in the archives)
ఇది సంవాదాత్మక, సంగీత నాట్యప్రధాన నృత్యరూపకంగా “రహస్యం” చిత్రంలో కూర్చబడినది. కూచిపూడి సంప్రదాయాంశములైన సూత్రధారుని “పరాకు” రూపములోని ఇష్టదేవతాప్రార్థన, చూడ విచ్చేసిన రసికుల ప్రశంస, కథాంశ ప్రస్తుతి, ముఖ్యపాత్ర ప్రవేశం ఇవన్నీ “గిరిజాకల్యాణం” లో కనిపిస్తాయి. రహస్యం చిత్రంలోని గిరిజాకల్యాణం విడియో ఇక్కడ చూడగలరు.
(గిరిజాకళ్యాణం
– 1వ భాగం)
(Thanks to Sri Vasantha Madhava for providing the video links in You Tube)
రాగం:హంసానంది; తాళం: రూపకం | |
నతపోషణ హిత భాషణ ధృతచారుతురంగా | |
మతభేద పతిత మానవ మద సంతత భంగా | |
భావరాగ తాళయోగ భామార్పిత వామభాగ | |
అమర వినుత పాద యుగళ దేవదేవ సాంబశివ | |
జయ జయ జయ నటరాజ రజత శైలరాజా. | |
రాగం: | నాట (ఆదిశంకర కృత ఉమామహేశ్వర స్తుతి) |
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం | |
పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం | |
నగేంద్రకన్యా నవచేతనాభ్యాం | |
నమో నమశ్శంకర పార్వతిభ్యాం | |
రాగం: | హంసధ్వని తాళం: రూపకం |
అరిందమా, ఉమామనా, నగజార్ధశరీరా:సాహో పరమేశ్వరా! సాహో, పరమేశ్వరా! సాహో! | |
రాగం: | ఆనందభైరవి తాళం: రూపకం |
సుమలాలిత మలయానిల లోల పూర్ణ కుంతలా | |
పురసూధన వరవర్ణిని బాహులేయ జననీ | |
సాహో! పరమేశ్వరీ, సాహో! | |
అంబా పరాకు, దేవీ పరాకు | |
మమ్మేలు మా శారదాంబా, పరాకు (తాళం: మిశ్రగతి: తకిట+తకధిమి రాగం: నాట) | |
బహుపరాక్! బహుపరాక్! (ధిమిత దిమితక దిమితధీం.. అను కొనుగోలు)(ఈ భాగం చిత్రసంగీతంలో మాత్రమే ఉన్నది) | |
వచనం: | (నాటరాగం) ఉమామహేశ్వర ప్రసాద లబ్ధపూర్ణ జీవనా, గజాననా, |
బహుపరాక్! బహుపరాక్! బహుపరాక్! బహుపరాక్! | |
చండ భుజాదండ దోధూయమాన వైరిగణా! షడాననా! | |
బహుపరాక్! బహుపరాక్! బహుపరాక్! బహుపరాక్! | |
రాగం: | నాట తాళం: ఆది (త్రిశ్ర నడక) |
మంగళాద్రి నారసింహ బహుపరాక్! బహుపరాక్! | |
బంగరుతల్లి కనక దుర్గ బహుపరాక్! బహుపరాక్! | |
కృష్ణాతీర కూచనపూడినిలయా గోపాలదేవ, బహుపరాక్!(త్రిశ్రగతి) (ఆలాపన) | |
(కుచేలపురి..కూచెన్నపురి) కూచిపూడిగ్రామానికి చుట్టుపక్కనున్న మంగళగిరి నరసింహస్వామి, బెజవాడ కనకదుర్గ, కృష్ణాతీరంలోని కూచిపూడిగ్రామస్వామి గోపాలుడు ఈదేవుళ్ళకే ఆదిలోని ప్రార్థన. | |
రాగం: | మధ్యమావతి; తాళం: ఆది (త్రిశ్ర నడక) |
అవధరించరయ్యా, విద్యల నాదరించరయ్యా! | |
లలిత కళల విలువ తెలియు సరసులు (తకిట తకిట తకిట తకిట తకధిమ – సర్వలఘు పదముల సొగసు గమనీయం) పదింపదిగ పరవశులై... | |
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా...-2 | |
ఈశునిమ్రోల..., హిమగిరిబాల... | |
ఈశునిమ్రోల, హిమగిరిబాల కన్నెతనము ధన్యమైన గాధ | |
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా..-2 | |
కణకణలాఢే తామసాన కాముని రూపము బాపి, ఆ కోపి | |
కాకలు తీరి కను తెరచి, తను తెలిసి | |
తన లలనను పరిణయమైన ప్రబంధము | |
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా | |
లలిత కళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశులై... | |
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా... | |
వచనం: | రాగం: కాంభోజి |
పరమేశ్వరుని సేవలకై బయలువెడలిన పార్వతి దేవికి చెలిమికత్తెలు స్వాగతము పల్కిన విధంబెట్టిదనినా... | |
రాగం: | కాంభోజి; తాళం: రూపకం |
రావో! రావో! లోలలోల లోలంబాలక, రావో! | |
లోకోన్నత మహోన్నతుని తనయా, మేనాకుమారి | |
రాజసలోచన! రాజాలలామ, రావో! రావో! రావో! లోలలోల లోలంబాలక, రావో! | |
వచనం: | (రాగం: అఠాణ) అలా, వయ్యారంగా చేరవచ్చిన ఉమా బాలతో.. చెలిమికెత్తెలు, చెలిమి బలిమిని, ఆ మీనలోచని భావ మెరుంగు తీరు ఎట్టిదనినా...ఆ |
రాగం: | అఠాణ; తాళం: మిశ్రచాపు |
చెలువారు మోమున లేలేత నగవుల | |
కలహంస గమనాన కలికీ ఎక్కడికే? | చెలువారు| | |
మానస సరసిని మణిపద్మదళముల | |
రాణించు అల రాజహంస సన్నిధికే | |
(మానస సరోవరరాజహంస పద ప్రయోగంతో గమనీయమైన వేదాంత స్పర్శ) | |
వావిలి పూవుల మాలలు గైచేసి | |
వయ్యారి నడల బాలా, ఎక్కడికే?.. వయ్యారి నడల బాలా ఎక్కడికే | |
కన్నార నన్నేల కైలాస నిలయాన | |
కొలువైన అలదేవ దేవు సన్నిధికే | |
వచనం: | (రాగం: కేదార గౌళ) అప్పుడా నెచ్చెలులు మెచ్చి అవుదలలూచిన వారై... ఉమాబాలను సాగనంపేరెట్టులనగా... |
రాగం: | కేదార; తాళం: రూపకం |
పోయిరా శిరీష కోమలా! బాలాలలామ, పోయిరా: మరాళ గామిని ||పోయిరా|| | |
బెదురులేక బిడియపడక, చేరబోయి, సేవలు చేసె | |
వకుళదామమున స్వామిని వశంవరునిగా చేకొన | |
పోయిరా, అరాళ కుంతళా, ఐదువరాల; పోయిరా అరాళ కుంతలా | |
వచనం: (రాగం: వసంతం) అంత, మన్మథుండరుదెంచి పార్వతినుద్దేశించి పలుకు తెరంబెట్టిదనినా..ఆ... | |
రాగం: | వసంత; తాళం: ఆది |
తగదిది తగదిది తగదిది ధరణీధర వరసుకుమారీ, తగదిది | |
అండగా మదనుడుండగా, మన విరిశరములపదనుండగా | |
నినుబోలిన సురపావని తానై వరునరయగబోవలెనా.. ఆ..ఆ.ఆ ||తగదిది|| | |
కోరినవాడెవడైన, ఎంతటి ఘనుడైనా | |
కోలనేయనా, సరసనుకూల నేయనా | |
కనుగొనల ననమొనల గాసిజేసి నీ దాసుజేయనా ? | |
వచనం: | (రాగం: రీతిగౌళ) ఔరా; అప్పుడా ఉమాబాల పలికె ప్రతివచన మేమనగా...(రీతిగౌళ రాగాలాపనకు తోడుగా. శ్రీ సంగీతరావుగారు) |
రాగం: | రీతిగౌళ; తాళం: ఆది |
ఈశుని దాసుని చేతువా! అపసద! అపచారము కాదా.. ఆ...ఆ.. ఆ. | |
కోలల కూలెడు అలసుడు కాడు ఆది దేవుడే అతడు | |
సేవలు చేసి ప్రసన్నుని చేయ నా స్వామినన్నేలునోయి, నీసాయమే వలదోయీ! | |
ఈశుని దాసుని చేతువా! అపసద! అపచారము కాదా.. ఆ...ఆ.. ఆ | |
వచనం: | (రాగం: శహన) అని ఉమాబాల ప్రతివచనము తెలిపి వెడలిపోగా, చెలిమికత్తెలు మన్మథునితో పల్కిన విధంబెట్టిదనినా... (శహన రాగాలాపన.. ) |
రాగం: | శహన; తాళం: ఆది |
కాని పని మదనా! అది నీచేత కాని పని మదనా! | |
అహంకరింతువ హరుని జయింతువ అదినీచేతకానిపని మదనా | |
కాని పని మదనా! అది నీచేత కాని పని మదనా! | |
అహంకరింతువ హరుని జయింతువ అదినీచేతకానిపని మదనా... | |
(కాని పని...చేయకూడని పని మరియు చేతకానిపని అని రెండర్థాల ప్రయోగం) | |
చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింత? వినకపోతివా ఇంతటితో .. వినకపోతివా ఇంతటితో | |
నీ విరి శరముల పని సరి! సింగిణి పనిసరి! తేజీపని సరి! చిగిరికి నీపని సరి మదనా! (ఈ ఖండిక ఘంటసాల గానంలో లేదు. రహస్యం చిత్రగీతంలొ వినగలము) | |
వచనం: | (రాగం: సరస్వతి) హూంకరించి మన్మథుడు ముందుకు సాగిపోవ, చెలిమికత్తెలు...ఆలాపన (రాగం: సరస్వతి) |
(ఇక్కడ మనకు ఘంటసాల ఆలపించిన కేదారగౌళ రాగం వినిపిస్తుంది. ఈరాగంలోనే ఆయన “చిలుక తత్తడి రౌత, ఎందుకీ హుంకరింత” పాడియుంటారు. అది ఏకారణంవల్లనో ఆకాశవాణి ధ్వనిముద్రణంలో లేదు. ఉన్నట్టుండి హిందోళరాగంలోని “సామగ సాగమ సాధార” ఆదిశబ్దలోపంతో జోడింపబడినది గమనించవచ్చును.) | |
రాగం: | హిందోళం; తాళం: ఆది |
సామగ సాగమ సాధారా! శారద నీరద సాకారా! | |
ధీనా ధీనా ధీసారా!.. సామగ సాగమ సాధారా! | |
(సామగ=సామగానానికి; సాగమ =ఆగమములుకు ఆధారమైనవాడు. ధీసార= బుద్ధికి సారభూతుడైనవాడు) | |
ఇవె కైమోడ్పులు ఇవె సరి జోతలు వినుతులివే అరవిందోజ్వలా | |
ఇదె వకుళాంజలి మహనీయా, ఇదె హృదయాంజలి ఈశా, మహేశా! | |
సామగ సాగమ సాధారా | |
(ఇక్కడ పాట పూర్తిగా లేదు.. ఈ భాగం శంకరమఠ గానంలో విడిపోయింది, చిత్రగీతంలో పి.సుశీల పాడగా వినగలరు) | |
ఈ విధముగా ఉమాబాల స్రోత్రము చేసిన పిమ్మట: అయ్యతిరాజు పార్వతి ననుగ్రహించు నిమిత్తము, మన్మథుండు సుమశరములు వేయగా, తపోభంగము చెందిన ఈశ్వరుండు ప్రళయ రుద్రుండై తాండవము సేయ, పరమ శివుడు తన చిచ్చర కంటన్ చూచినంత, ’అంబా, అంబా!’ యని సుమశరుండు అగ్నిజ్వాలకు ఆహుతియైనంత... | |
ఆ... (హిందోళ రాగాలాపనలో ఘంటసాల వైభవించిన అకార స్వర ప్రస్తార విహార రసశాంతీకరణ పరిణామం ఎదతీగలను కదిలిస్తుంది) | |
వచనం: | (రాగం: సావేరి) నిజప్రాణేశ్వరుని గోల్పోయిన రతీదేవి గద్గద కంఠియై విలపించిన విధంబెట్టిదనినా...ఆ.. |
విరులన్ నిను పూజసేయగా విధిగా నిన్నొక గేస్తుజేయగా | |
దొరకొన్నరసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ.. | |
కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా | |
మరుడే పునరూపున వర్ధిలుగా రతి మాంగల్యము రక్షసేయవా | |
ప్రభూ, ప్రభూ ! పరిభిక్షప్రభూ | |
(గేస్తు= గృహస్తుడు); “విరులన్ నిను పూజసేయగా” చంపకమాలావృత్తం, అర్థసౌలభ్యంకొరకు ఛందోనియమాలు కొద్దిగా శిథిలమైనట్టున్నది. | |
అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో | |
జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో | |
మనమె నీ మననమై, తనువే నీ ధ్యానమై | |
నీభావన లీనమైన గిరిబాల నేలవో.. | |
శరణం భవ! శరణం భవ! శరణం భవ స్వామిన్ | |
పరిపాలయ పరిపాలయ పరిపాలయ మాం స్వామిన్ ..(ఈ శకలం ఘంటసాలగాన ఖండికలో లేదు). | |
వచనం: | (రాగం: మధ్యమావతి) |
అప్పుడా పరమేశ్వరుండు పార్వతీదేవి ప్రార్థన నాలకించి రతి మాంగల్యమ్ముననుగ్రహించి, గిరిబాలను పరిణయమాడెనంత... | |
బిడియపడి భీష్మించి పెండ్లికొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం | |
విరులచే వరునిచే కరము చేకొనచేయు జగమేలు తల్లికి జయమంగళం | |
కూచన్న పూడి భాగవతుల సేవలందు దేవదేవా, | |
శ్రీ వేణుగోపాలా, జయమంగళం..., త్రైలోక్యమందార, శుభమంగళం! | |
త్రైలోక్యమందార, శుభమంగళం. |
గిరిజా కల్యాణం రూపకంలో మాస్టారు ఉపయోగించిన రాగాల వివరాలు ఇతర ఉదాహరణలు
(“గిరిజాకల్యాణం” గురించిన
కొన్ని వివరాలను శ్రీ భమిడిపాటి రామగోపాలం గారు, “నూటపదహార్లు” అనే
సంగీత విలువల ఔన్నత్యం ఆధారంగా ఎంచిన పాటల వివరాల పుస్తకంలో రసవత్తరంగా
సమకూర్చారు. కృతజ్ఞతతో అందులోని కొన్ని అంశాలు ఇక్కడ ఉద్ధరింప బడినవి)
We
are thankful to Sri M.R.Seenivasa Murty. Here are some technical details of
what was done to remaster the master's music.There
was intermittent speed variation (especially at the cuts) and the speed was
calibrated to match C Shruti which is the constant singing pitch of Ghantasala.
There was low level noise and it was subdued, keeping the echo part. A thorough
cleaning was done for all frequencies below 100 Hz. In the C shruti 'sa' is at
261.63 Hz, so cleaning up to 100 Hz will retain even the lower 'ma' and notes
below that may be inaudible. More effort was put to fine-tune both vocal
and tabla sounds. This was enhanced both by equalization to bring more
bass (6 dB) which improves the quality. One can now listen the tabla rhythm on
lower octave too. The audio on both L and R was balanced creating a
virtual stereo. All other instruments (clarinet, harmonium) and vocal support
is left as it is.Tambura
shruti (C scale) of pa-Sa-sa and ma-Sa-Sa-sa was infused and normalised. The
audio saved at 256 kbps for better audio performance for playing it in a music
system.
Very detailed post.Glad to know the ragas used in Girijakalyanam.Thank you chandramouli garu.
రిప్లయితొలగించండిధన్యవాదాలు రాధారావు గారు.
తొలగించండిమీ అందరి అద్భుత కృషి అమోఘమండి.
రిప్లయితొలగించండిమల్లాది వారి సృష్టికి, ఘంటసాల వారి ప్రతిభ అద్వీయుతం.
ధన్యవాదాలు సారధి గారు.
తొలగించండిఈ అద్భుతమైన యక్షగానాన్ని రాగాలతో సహా సవిస్తరంగా వినిపించినందుకు ధన్యవాదాలు.ఆ నృత్యాన్నికూడా విడియో ద్వారా చూపించివుంటే ఇంకా సంతోషించివుండే వాళ్ళం.
నమస్కారం రమణ మూర్తిగారు. ఇదే వ్యాసం లో రెండు భాగాలలో వున్న వీడియో యొక్క లింకులను పొందుపరచడమైనది. గమనించ గలరు. వాటిని క్లిక్ చేస్తే మీకు వీడియోలు కనెక్ట్ అవుతాయి. వాటిని పొందుపరచినది శ్రీ వసంత మాధవ గారు. వారికి ధన్యవాదాలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఈ అద్భుతమైన యక్షగానాన్ని రాగాలతో సహా సవిస్తరంగా వినిపించినందుకు ధన్యవాదాలు.ఆ నృత్యాన్నికూడా విడియో ద్వారా చూపించివుంటే ఇంకా సంతోషించివుండే వాళ్ళం.
bahu kaala darshanm soonaa gaaroo,
రిప్లయితొలగించండి'mallaadi'- 'ghantasala' vaari adbhuta srusti 'girijaa kalyaanam'. rahasyam chitram loni ee koochipoodi yaksha gaanaam poorti paatham ichhinanduku aanandamgaa undi. raaga rahasyaalu konni idivaraku pramukha paatrikeyulu shree v a k rangarao gaaru vishadakeeranchinave. v a k vaaru saadhinchi pettina mallaadi vaari paatala sankalanam 'vin veduka' lo boledanni vishayaalunnaayi. bahushaa krushnaprema bllagulo ichhe untaanu. ledante meeku pampinchi teeraalsinde! girijaa kalyana nemaruvetalo eeyanni marachipokoodadu.
ధన్యవాదాలు వేణుగోపాల్ గారు.
తొలగించండిgirijaa kalyaanam poorti paatham icchaaru. prashansaneeyulu. raagan anukonnadi malladi vaaraite anukunnadaanikante 'adhika chakkani' pota posina ghantasaala vaariki jaya ho! ee sandarbhamgaa pramukha paatrikeyulu shree v a k rangarao gaaru shrama padi teesukochhina malladi vaari paatala sankalanam 'vin veduka' lo aayana vraasina 'girijaa kalyaana' vyakhya koodaa chadavaalsinde. krishnaprema lo icchano?ledo? lenatlaite vaari akshara nidhi meeku pampinchadam naa vidhi.
రిప్లయితొలగించండితెలియని విషయాలు చాలా తెలిశాయి. ధన్యవాదాలు
రిప్లయితొలగించండిbahu krushi salipi prachurinchinanduku dhanyavadaalu soori garuu !
రిప్లయితొలగించండిశ్రీ ఘంటశాలగారి అభిమానులైన మీ అందరి కృషి మూలంగా నా వంటి వారు ఆయాచిత వరంగా సంగతి సందర్భ వ్యాఖ్యానలతో సహా అరుదైన వైవిధ్యభరితమైన వివిధ రకాల పాటలు వినగలుగుతున్నాము. మీ అందరికి నా కౄతజ్ఞతాభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు.
తొలగించండినాలాంటి ఘంటసాల గారి భక్తులకు ఇది చాలా చాలా ఉపకరిస్తుంది. మీ లాంటి వారి ఋణం తీర్చుకోవడం కష్టమే.
రిప్లయితొలగించండిNS Prakasa Rao
Play Back Singer.
ప్రకాశరావు గారికి ధన్యవాదములు. ఋణం అన్న అంత పెద్దమాట వాడారు. ఏదో ఉడతాభక్తిగా మాస్టారి కృషిని నలుగురితో పంచుకోవాలన్న చిన్న తాపత్రయం. దీని ఘనత శ్రీయుతులు చంద్రమౌళి గారిది. మీ పరిచయం సంతోషం కలిగించింది.
తొలగించండిThis comment is from Sri T.V. Seshagiri Rao garu.
రిప్లయితొలగించండిసూర్యనారాయణగారూ,
ముందుగా మీరూ మీ మిత్రులూ కలిసి ఘంటసాల వారి కళ పట్ల చేస్తున్న సేవకు నా అభినందనలు.
గిరిజాకల్యాణం గురించిన వ్యాసం, ఇతరములు కొన్ని, నేను చాలా కాలం క్రితం చదివాను. చాలా ఆనందించాను. కాకతాళీయంగా మరల ఇప్పుడు చదవడం జరిగింది.
ఇందులో రతీవిలాపము లో రతీదేవి పద్యముల గురించిన ఒక విశేషము - నాకు తోచినది, మరి యెక్కడా విననిది - మీ దృష్టికి తేవాలని యీ ఉత్తరం వ్రాస్తున్నాను. మీ ద్వారా యిది పదిమందికీ తెలియగలదని నా నమ్మకము.
రతీవిలాపం పద్యాలు ఇవిః
విరులన్ నిను పూజ సేయగా
విధిగా నిన్నొక గేస్తు సేయగా
దొరకొన్న రసావతారు చి
చ్చఱ కంటన్ పరిమార్తువా ప్రభూ
కరుణన్ గిరిరాజకన్యకన్
సతిగా తాము పరిగ్రహింపగా
మరుడేపున రూపున వర్ధిలుగా
రతి మాంగల్యము రక్షసేయరా
1. ఛందోవిశేషం - ఇవి వియోగినీ వృత్తాలు.
అసమే ససజాగరుస్సమే
సభరాలోథగురుర్వియోగినీ
కుమారసంభవకావ్యం లో రతీవిలాపం కాళిదాసు ఇదే వృత్తంలో నడిపాడు. మల్లాది వారు అనుసరించడం వా రి ప్రతిభకు గుర్తు. తెలుగులో యతిప్రాసల నియమాలు ఉంటాయి కదా. చిత్రంగా బేసి పాదములలో రకాప్రాస పాటించారు. రెండవ పద్యంలో సరి పాదాలలో తకారప్రస.
లక్ధణంలో యతిస్థాననిర్దేశం లేదు కనుక కాబోలు దానిని అంత పట్టించుకోలేదు . అయినా చివర పాదంలో రతి....రక్ష అని యతిమైత్రి ఎలా వుండవచ్చో సూచించారు.
మరుడేపునరూపున వర్ధిలుగా - ఈ పాదంలో ఛందోభంగం అయింది. మరుడేపున వర్ధిలున్ గదా అని గాని మరుడేపున రూపునందుగా అని గాని వ్రాయవచ్చు. కాని ఏపున రూపున లో అనుప్రాస, అర్థపరిపూర్ణత , ఈ రేండింటి కొఱకు ఛందస్సు విస్మరించారు.
2. అర్థవిశేషం - మన్మథుడు వేసినవి బాణాలు. అవి పువ్వులు కాబట్టి విరులన్ పూజసేయగా అన్నారు. బాణాలతో దాడి కాదు, పూలతో పూజ. సరే, అవి యెందుకు వేశాడు, శివుడిని గృహస్తును చెయ్యడానికి. పైగా విధిగా. నిన్ను గృహస్తుని చేసే విధి నిరవహిస్తూ పూలతో పూజించిన వాడిని దహించడం న్యాయమా.
రెండవ పద్యంలో మన్మథుడు తిరిగి జీవితుడు కావాలంటే శివుడు పార్వతిని పరిగ్రహించాలి. ఆ వివాహం జరిగాక వారిద్దరి దాంపత్యంలో కాముడు తిరిగి బ్రతుకవలసిందే కదా.
--
ఇందులో కవితాచాతుర్యం గురించి యెంతైనా చెప్ప వచ్చు.
శేషగిరి
Seshagiri Rao T V
శ్రీ శేషగిరి రావు గారికి ప్రణామములు. మీరు అభిమానంతో పొందుపరచిన సమాచారం మాకే కాక, ఎందరో అభిమానులకు ఆనందం కలుగజేస్తుంది. ధన్యవాదములు.
తొలగించండిసూర్యనారాయణ వులిమిరి
శేషగిరి గారి ఛందో వివరణకు కొనసాగింపు.వియోగినీ వృత్తం రామాయణ కల్పవృక్షం లో విశ్వనాథవారు వ్రాశారు.బేసి పాదాలలో6వఅక్షరం సరిపాదాలలో 7వఅక్షరం యతి.ప్రాస నియమం ఉంది.
రిప్లయితొలగించండి