మాస్టారికి జన్మదిన శుభాకాంక్షలు |
“ప్రతిభా నవనవోన్మేషశాలిని” అన్నాడొక రససిద్ధాంతి. కొత్తదనాన్నిసృష్టించడం సాహిత్యానికి అన్వయించినట్టే సంగీతాది కళలకూ అన్వయిస్తుంది. శాస్త్రీయ సంగీతంలోని ఆలాపన, నెరవల్, మరియు కల్పనాస్వరాలు గాయక ప్రతిభాదర్పణాలు. సంగీత త్రిమూర్తులైన “త్యాగరాజ-ముత్తుస్వామి దీక్షిత-శ్యామ శాస్త్రి”లు తమ ప్రత్యేక ప్రతిభావిష్కరణంతోనే వాగ్గేయకారులై రాణించారు. త్యాగరాజస్వామి కొత్తరాగాలను సృష్టించే ప్రక్రియను “శత రాగ రత్నమాలికచే రంజిల్లునట హరి” అను రీతిగౌళరాగ కృతిలో వెల్లడించారు. తెలుగు సినిమా సంగీత త్రిమూర్తులనబడే “సాలూరి-పెండ్యాల-ఘంటసాల” కూడ నిరంతరం రాగాల కొత్తదనానికై కృషి చేసిన వారే. ఆ శాస్త్రీయ సంగీత త్రిమూర్తుల స్ఫూర్తి ఆత్మసంతోషమైతె, మన లలిత సంగీత త్రిమూర్తుల ధ్యేయం ప్రజాదరణ. త్యాగరాజు, వివిధ జీవిత సందర్భాలలో తన మనోభావానికి తగినట్లు రాగప్రయోగాలూ కృతిరచనలూ చేసిన అంశం ఘంటసాలకు స్పూర్తి. ఆ రాగాలకు ఆధునికతను మేళవించి తాను ప్రయోగాలు చేశానని ఆయన చేప్పేవారు. ఎవరూ వాడని రాగాలను ప్రయోగించడం, రాగాల మూర్చనలో చిన్న మార్పులు చేసి కొత్తబాణీలను సృష్టించడమే కాకుండా, నాదమాధుర్యాన్ని, భావ సౌందర్యాన్ని పెంచి, ఘంటసాల పాడిన పాటలు తరతరాలుగా ఎదలో మెదలుతూనే ఉన్నాయి. పాటలు పదిమందీ పాడుకోవటానికి వీలుగా, తేలికగా ఉండాలన్నది ఘంటసాల గుర్తించుకొన్న నియమం. దశాబ్దాలు గడచినా ఆయన ఆదర్శం ఈ నాటికీ సజీవమైయుండడం ఒక మధురమైన సత్యం. సంప్రదాయాల సంధికాలంలో లలిత సంగీత పద్ధతిని, అందులోనూ పదాక్షరాలవెనుక స్వరాలను పొదిగి, గాయన మాధుర్యం పాటల సాహిత్యాన్ని, సందేశాన్నికప్పివేయక చేసిన ఆయన ప్రయోగాలు నవవిధానాన్నే సృష్టించాయి.
ఆయన, తనసంగీతంలో చేసిన ప్రయోగాలు ఎన్నో. చారుకేశి,
రాగేశ్రీ, మధుకౌంస్ మొదలగు రాగాలను ఒక ప్రత్యేకతో ప్రవేశబెట్టినారు. కల్యాణి, మోహనం, హిందోళములవంటి
ప్రఖ్యాతమైన రాగాలకూ కొత్తదనాన్ని తొడిగించారు. భావప్రధానమే ఆయన మొదటి ఎంపిక.
తరువాత రాగ-స్వరనిర్ణయం. ఒక రాగానికి ఆధారంగా స్వరసంయోజనం చేసిన పాటలు ఒకే విధంగా వినిపించకుండా,
ఘంటసాల ఎన్నో ప్రయోగాలు చేశారు. శోక-కరుణ రసభావాలకు, హంసానంది, శుభపంతువరాళి, చక్రవాకాది
రాగాలను వాడినా, ప్రతి పాటకూ ఒక కొత్తదనం వచ్చేలాగ ఆయన చూపిన ప్రతిభ అధ్యయనార్హం. కొన్ని పాటలకు ఆధారం ఏ రాగమో తెలుసుకోవడం చాలా కష్టం.
అంత వైవిధ్యతతో ఆయన పాటలలో స్వరాల నవీన విన్యాస భావాలు పలుకుతాయి. పాటల ప్రతిస్వరాన్ని
ఆయన వ్రాసేవారట. అలా వ్రాసుకొన్న కాగితాల దాఖలా మనకు నేడు అలభ్యం. ఆయన బాణీకట్టిన పాటలవెనుకటి
స్వరావగాహన చేసి, స్వర-గమక-సంచార
నిర్ణయం చేసినగాని పాటయొక్క ఆధారమైన రాగం తెలియగలేము. అన్యస్వరమిశ్రములై తేలికగా పాడుకొనే
సామాజిక చలనచిత్రాల పాటలు స్వరాధారములే తప్ప రాగాధారములు కావు. అయితే పౌరాణిక చలనచిత్రాలకు ఘంటసాల అనుసరించినది శుద్ధ
శాస్త్రీయ సంగీతం. లవకుశ, మాయాబజార్, పార్వతీ కళ్యాణం, సతీ సుకన్య, దీపావళి, భక్త రఘునాథ్, శ్రీకృష్ణ కుచేల, మోహిని రుక్మాంగద, వాల్మీకి, శ్రీసత్యనారాయణ
మాహాత్మ్యం, పాండవ వనవాసం, పాదుక
పట్టాభిషేకం, రహస్యం, ఇలా ఎన్నో
చిత్రాలను పేర్కొనవచ్చు. ఇందులో శుద్ధశాస్త్రీయతనే మనం చూడగలం.
ఏ స్వరాలు, ఏ భావాలకు రసపుష్టి కలిగిస్తాయి అనునది ఘంటసాల ఊపిరోలోని
అంశమే. రిషభ, గాంధార, నిషాదాలు కోమలంగానూ, తీవ్రంగానూ ఏ సందర్భాలలో వాడాలి అన్న వైదుష్యం
ఆయన బాణీలకు జీవం.
ఇలాంటి ఒక వినూతన ప్రయోగంతో ఆయన స్వరపరచి పాడిన పాటకు ఒక మంచి
నిదర్శనం “పాండవ వనవాసం”లోని ’విధివంచితులై విభవము వీడి”. ఈ పాటకు ఆధారం చక్రవాకమని కొందరన్నారు, వ్రాసుకొన్నారు
కూడ. ఆ గురించి నేనూ ఎక్కువ ఆలోచించక, ఏదో కొన్నిచోట్ల చక్రవాక రాగంలోని గాంధారం తేలించి
ఒక కొత్తదనం తెచ్చారా అనుకొన్నాను. ఘంటసాల పలికిన ఈ పాటలోని ప్రతి అక్ష్కరమునకూ స్వరాలను
గుర్తించి, శోధింపగా ఆయన ప్రతిభకు స్తంభించిపోయాను. విధివంచితులై పాటకు ఆధారం చక్రవాకరాగం
కాదు. ఆ రోజులలో ఎవరూ వాడని, వాడినా ప్రఖ్యాతిగాంచని, మేళకర్తరాగం, “నాటకప్రియ”.
సాధారణంగా ఘంటసాల సోలో పాటల శృతి “ c(1) లేదా c’ (1½) ఉన్నా, ఆయన
ఈ పాటను పాడిన శృతి “ D(2 ) అంటే
1వ శృతికి చతుశ్రుతి
రిషభమంత పైనున్న స్వరం. అంత పైస్థాయి శృతిలో పాడడమెందుకు? అలా పాడినందున అక్కడి శోక,
కరుణ భావారసపరిణామాంశమూ, ఆయన గాత్రం తారాస్థాయిలోకూడ మాధుర్యాలనొలికించే సౌలభ్యమూ,
నేపథ్యంలో స్త్రీ పురుషకంఠాలు
అనుసరించే సానుకూలత ఇవన్నీ దృష్టిలోనుంచుకుని ఆయన శృతినిర్ణయం చేసియుంటారు.
పాటలో ముందుగా ద ..ని..
స.. రి.. సా స్వరాలలో ప్రారంభిక తీవ్రశబ్దధ్వనిని వింటాము. వనవాసోద్ఘోష సూచకములై, మహాత్ములకు ఒక్క దురవస్థ ఘటించనున్నదీ
అనే భావాన్ని అవి ధ్వనింపజేస్తాయి. న్యాయానికే పరాజయమా... అనే సాకీలో, పరాజయమా అనునప్పుడు,
ఆయన గాత్రం పైస్వరాలను తాకి తారమధ్యమంలో నిలిచి గమకిస్తుంది. 2 వ శృతిలో ఏపురుషస్వరమూ, పరుషంకాక, మాధుర్యం చెడక,
తారస్థాయి (third octave) మధ్యమంలో
ఉయ్యాలలూగడం అమానుషమనే చెప్పాలి. వంచనకే ధర్మము తల వంచే...నా (ఇక్కడ తలవంచే.. అనుశబ్దాలకు
సమగరిగరిసా అను గమకస్వరాల ఆందోళనలో ధర్మము వంచనకు తలవంచిన అన్యాయం ధ్వనితమైనదా అనిపిస్తుంది)
ఈ కరుణాభావానికి తోడుగా వచ్చే కోరస్ దా....పా...పద పద మప మగరిరిస స్వరాలు చేసే భావసమర్థన
గమనించాలి. నాటకప్రియరాగ స్వరాలలో
సాధారణ గాంధారాన్ని చాలాతేలికగా వాడిన మాస్టారు అద్బుతమైన పరిణామాన్ని సాధించారు. ఆ
గాంధార గమకంతో తోడిరాగ స్పర్శ వచ్చి భావం మారగలదు. చాలా సూక్ష్మదృష్టితో గాంధారాన్నిఎక్కడో
తాకినట్టే తాకి, నాటకప్రియ స్వరాలను కొన్నిచోట్ల సరిమపదనిస.. సనిదపమరిస అని వినబడునంతగా
గాంధారాన్ని తేలించారు. “అడవిపాలయేరా” పదాలు, రిరిరి రీగ రిరిస స్వరాలలో ఇమిడి , అడవిపా(రిరిరిరీ)...ల
(గాంధారం) యేరా (రిరిసా), ఆ ’ల’కు సాధారణ గాంధార స్పర్శ స్పష్టంగా వినబడి మనకు “నాటకప్రియ”
రాగ స్వరూపం తెలుస్తుంది. ఈ పాట ఒకశాస్త్రీయ సంగీతకృతిలాగ చతురశ్రజాతి ఆదితాళ నిబద్ధమై,
ధృతానుధృత సూచకమైన తాళధ్వనికూడ గమనించిన వినబడను.
చక్రవాక – నాటకప్రియ రాగాలకు తేడా, ఒక్క గాంధారస్వరమే. రెండు
రాగాలు మేళకర్త రాగాలే. రెండురాగాలకూ
శుద్ధరిషభం, శుద్ధమధ్యమం, చతుశృతిదైవతం, కైశికి నిషాధం సమాన స్వరాలు. సాధారణ గాంధారమున్నచో
(గ2) అది నాటకప్రియ. అంతరగాంధారం (గ3) పడగా, అది చక్రవాకం.
మేళకర్తరాగాలు 72. ఈ రాగాలను 12 చక్రాలలో, చక్రానికి 6 రాగాల చొప్పున
విభజింపజేశారు. నాటకప్రియ, రెండవ నేత్రచక్రంలోని నాల్గవరాగం. అంటే పదవ మేళకర్తరాగం.
దీని స్వరస్థానాలు: షడ్జమము, శుద్ధరిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి ధైవతం మరియు కైశికి నిషాదం. అంటే నాటకప్రియరాగంయొక్క
పూర్వాంగం (సరిగమ) తోడిరాగస్వరాలు. ఉత్తరాంగం (పదనిస) ఖరహరప్రియ స్వరాలు. అయితే ఇది
తోడి – ఖరహరప్రియరాగాల మిశ్రంకాదు ! స్వరస్థానాల సులభమైన అవగాహన కొరకే
అలా అంటారు. ఈ రాగానికి తనదైన ప్రత్యేక రూపముంది. ముఖ్యంగా తోడిరాగంయొక్క విశిష్టమైన
గాంధార ప్రయోగం ఇక్కడ లేదు. ఈ రాగమున గాంధార గ్రహభేదంతో ’వాచస్పతి’ రాగమూ, మధ్యమ గ్రహభేదంతో,
’చారుకేశి’ రాగమూ, నిషాధ గ్రహభేదంతో ’గౌరిమనోహరి’ రాగాలూ ఉద్భవిస్తాయి. ప్రఖ్యాతమైన
సింధుభైరవిరాగం నాటకప్రియ జన్యం. ముత్తుస్వామి దీక్షితులు అనుసరించిన ‘వెంకటముఖి’ సంప్రదాయంలో, ఈ రాగం పేరు ‘నటాభరణం’. నాటకప్రియ రాగానికి ప్రతిమధ్యమ రూపం 46వ మేళకర్త రాగమైన ‘షడ్విధమార్గిణి’. ఈ రెండురాగాలూ అపురూపమైనవి. షడ్విధమార్గిణిలో కృతులున్నా నాటకప్రియరాగంలో త్యాగరాజకీర్తన
లేదు. ఒక రాగం అపురూపమైనదంటే, ఆ రాగాన్ని విస్తరించడం, రంజకత్వాన్ని అందులో చూపడం కష్టసాధ్యమనే
చెప్పాలి. ‘హంసధ్వని’ అంటే వాతాపి గణపతింభజేహం
అనే విధంగా, నాటకప్రియరాగంలో ఏ ప్రఖ్యాత రచనలూ కనపడవు. అలా ‘విధివంచిత’ మైన ఈ నాటకప్రియరాగాన్ని
ఘంటసాల ఎలా ఎంపిక చేసుకొన్నారోగాని, ఆ రాగాధారితమైన ’విధివంచితులై’ ప్రఖ్యాతమైన పాటగా
తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయింది.
నాటకప్రియరాగంలో ఒక ధైవతం (ద) తప్ప, అన్నియూ కోమలస్వరాలే. అందుకే
ఈ రాగం కరుణ, భక్తి, శాంతరసాలకు నిలయం (ఆలవాలం). నాటకప్రియ రాగంలో అతిప్రసిద్ధమైన కీర్తనలు లేవు, ఈ రాగాన్ని పాడడమే అరుదు.
'విశ్వనాథం భజే', 'మారజననీం ఆశ్రయే' (ముత్తుస్వామి దీక్షితార్), 'ఇది సమయమురా' (మైసూరు
వాసుదేవాచార్య) ఇవి సాంప్రదాయంలో ఉన్న కృతులు. సంగీతకళానిధి మంగళంపల్లి బాలమురళికృష్ణ
చిన్నతనంలోనే 72 మేళకర్తరాగాల
కృతికర్త. “పరిపాలయ మాం” అనే నాటప్రియరాగనిబద్ధ కృతిని ఆయన రచించారు.
విధి వంచితులై: పాండవ వనవాసం
పరిపాలయ మాం:మంగళంపల్లి బాల మురళీ కృష్ణ
“విధివంచితులై” (స్వరాలను వ్రాయు శాస్త్రీయపద్ధతిని ఇక్కడ పాటించక
రాగ నిర్ధారణకై కొన్ని ముఖ్యస్వరములు ఇందు సూచింపబడినవి. ఇక్కడ రిగమదని స్వరాలను రి1(శు) గ2(సా) మ1(శు) ద2 (చ) ని2(కై) అని గ్రహించాలి. కీబోర్డ్ లో ఈ స్వరాలను పలుకింప యత్నించిన
పాటలోని “నాటకప్రియ” స్వరాల అవగాహన కలుగును. పైస్థాయి స్వరాలను, అనగా, మూడవ Octave స్వరాలు ఎర్రటిరంగులోన సూచింపబడినవి)
విధి వంచితులై: పాండవ వనవాసం
నాటకప్రియ: సరి1గ2మ1పద2ని2 సనిదపమగరి
ద ని స రి సా..... (ప్రారంభిక
వాయిద్య స్వరాలు)
నిససాససా సరిగమా....మగ గరి సనీ
న్యాయానికే పరాజయమా
పానినిని సనిదప నిససస రిమగరిగరిసా
వంచనకే ధర్మము తలవంచేనా
రీ...సా..సరి సరి నిస నిస దని దని పద పద పమగరిస (కోరస్)
సా సనిదని రీ.. దనిసా...నిదపదమ...పదనీ..దపమగరీ..మగమపామగరీ... (సన్నాయి)
సా సని నిదపమరినిసా (వాద్యబృందం)
పల్లవి:
రిరిసని సససా రిరిసని సససా మామ మామ పదినిదమామ
విధివంచితులై విభవము
వీడి అన్న మాట కోసం
రిరిసని రిరిరి రీగరిససా
అయ్యో అడవి పాలయేరా..
పదనిరిసా..నిదపమరీ..మపదనిదా.
పమగరినీ..సరీస..మదపనిదపమ..... (ప్రతి చరణానికి ముందు వినబడె నేపథ్యసంగీత స్వరాల వైవిధ్యం
గమనించాలి. ఇక్కడ స్వరవిన్యాసం ధర్మరాజు తన కోపాన్ని తనలోనే దాచుకొనే సహనం ప్రబోధించబడింది)
చరణం 1
మాపదదా సనిదప పదమపమమ మాపదనీ నిసనిసనిద నిసని దనిసగరీసస
నీ మది రగిలే
కోపానలము ఈ మహినంతా దహియించేనని
సరిసరి సనీదపమ
మదపనిదపమగ రిరీసా
మోమును దాచేవా ధర్మ రాజా||అయ్యో||
నీసానిదపాదానీ సరీసనిదనిరీ రీగామా పామగ గారిస రీసని నీదప సానిద
మ..ద..ని..సా..
(భీముని గదాదండప్రసరణవలే ఇక్కడ స్వరాల కూర్పు గమనించగలరు)
చరణం 2
మమపదా దాదా నిదపమ పదపదపమమ
సభలో చేసిన శపథము దీర
మాపదనిని నిసనిసనిద దనిసగరిససస
పాపులనదిలో......
త్రుంచెద నేనని
సరిసరి సనిదామ మదపని
నిదపమ రిగరిగరిరిసా...
బాహువు లూచేవా భీమసేనా
చరణం 3
సనిదప మగగరి గామాపాదా రిసనిద పమమగ మాపాదాని గారి మాగ పా మగరిసనిసా..
(స్వరాల నడక పలుదిక్కుల బాణవర్షం కురిసినట్లున్నది గమనించగలరు)
నీసరిసా రిసనీ నీసరిసా రిసనీ
ఆలములోన కౌరవసేన
నిసనిదపా నిదపమ పదనిరిసాసస
అమ్ములవాన ముంచెద నేనని
సరిసరి సనిదపమ మదపనిదపమగరిరిసా
ఇసుమును చల్లేవా సవ్యసాచీ ||విధి||
మపదా నిరీసా..రీసనినీ సానిదదా నీదపమా మదపనిదపమ... (స్వరాల నడక అసహాయకురాలైన పాంచాలిగతిననుసరించినట్ట్లున్నది)
చరణం 4
మాపదదానిదపమ పదపమమామ పాదనిసా నిసనిసనిద దనిసగరిరిస
ఏ యుగమందు ఏ ఇల్లాలు ఎరుగదు తల్లీ ఈ అవమానం||2||
సరిసరి స ని దపమ మదపని నిదపమ రిగరిగరిరిసా
నీ పతి సేవయే నీకు రక్ష
నీసారిసానిరీరి...నీసారిసానిసాస... (వనవాసం ఒక పవిత్రమైన సాధన
అను భావం కలిగించే వేదమంత్ర త్రైస్వర్య సమారోణంతో
పాటకు ముగింపు. ఈ ని-స-రి స్వరాలే వేదమంత్ర పఠనమునకు జీవస్వరాలు)
’విధివంచుతులై’ వంటి “నాటకప్రియ” స్వరాలే ఆధారమైన మరొక్క పాట నేనెరుగను. ఒకటిరెండు
అన్యస్వరాలు ఎక్కడో తాకి కరిగిపోయినా, విషాదభావరసనిలయమై ఘంటసాల ఆలపించిన “బొమ్మను చేసి”
(చిత్రం: దేవత సంగీతం: ఎస్.పి.కోదండపాణి) పాటలోని స్వరాలను గమనిస్తే, నాటకప్రియ స్వరాలపైనే ఆధారితమైనదని చెప్పుకోవచ్చు. నాటకప్రియరాగంలో
లేని శుద్ధదైవతం మరియు అంతరగాంధారం రెండుమూడు చోట్ల వినబడతుంది. అయితే, ఘంటసాల ఆలపించిన సాకీ “బ్రతుకంత బాధగా” స్వరశుద్ధమైన నాటకప్రియ. ఏ అన్యస్వరాలు అందు వినబడవు.
ని స ద మ రి స... (ప్రారంభిక స్వరాలు)
నిససారి నిససరిసనీ నిససారి
రిగగరిగారిసా
బ్రతుకంత బాదగా కలలోని
గాధగా....
నిససారి రిగాగగా రిగారిస
ససరిగా.మా.గరీగారిసనీ...
కన్నీటి ధారగా…
కరగిపోయే….
నిససారి సరిసరినీస.. నిససారి సరిసరినీస..
తలచేది జరుగదూ జరిగేది
తెలెయదూ
నీససా రీగారిస నీససా రీగారిస
బొమ్మను చేసీ ప్రాణము
పోసి
రీగాగ మామప మగపమ రిగరిస
ఆడేవు నీకిది వేడుకా
దాదదా పమగా పాపపా మాగారి (శుద్ధదైవతం)
గారడిజేసి గుండెలుకోసి
నిససాస సరీరీరి గగరీగారిస
(అంతరగాంధారం)
నవ్వేవు ఈవింత చాలిక...
(చరణముల మధ్యంతర వాయిద్యస్వరాల తీరు)
సా.....రీగారిస రీగారిస రీగారిస సా...సనిదనిమా...దానీమా, దానీమా,
దానిమా..నిదపమగరిసనిసారి గామపగా రీగమరీ సారిససా రీగాగరిసనిసారి సారి రీగ గామ మాప పాద దాని నిసరిసా నీదనిదమ పదని
తరువాత వచ్చే చరణాల్లోనూ రెండుచోట్ల (దీపాలు నీవె ...అనురాగమధువు
ఇక్కడ “దాదాప నీదపగ” శుద్ధదైవతం అన్యస్వరంగా వచ్చి భావాల అంతర్మథనాన్ని ఆవిష్కరిపజేయుటే
విశేషం)
(కొన్ని అన్యస్వరాలతో “నాటకప్రియ” స్వరావతారం ఎన్నో పాటలలో ఉన్నాయి.
అవన్నిటిని ఇక్కడ పేర్కొనలేదు).