తెలుగు చలనచిత్ర వినీలాకాశం నుండి మరొక తార రాలిపోయింది. ఆ తార జె.వి.రాఘవులు (జెట్టి వీర రాఘవులు). ఈయన ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో పెళ్ళిసందడి (1959) చిత్రంలో జిక్కీ తో కలసి 'బైఠో బైఠో పెళ్ళికొడకా, ఆల్ రైటో రైటో నా పెళ్ళికూతురా' పాట పాడారు. ఆయన 1966 లో పెళ్ళిపందిరి అనే డబ్బింగు చిత్రానికి సంగీతం అందించినా, తరువాత మాస్టారి వద్ద సహాయ సంగీత దర్శకునిగా చేరి, 1970 లో సురేష్ ప్రొడక్షన్‌స్ నిర్మించిన 'ద్రోహి' చిత్రం ద్వారా పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా ప్రస్థానం గావించారు. రాఘవులు గారు మాస్టారికి ప్రియశిష్యుడైనాడు. అతన్ని మాస్టారు "నాయనా రాఘవులూ" అని ఆప్యాయంగా పిలిచేవారట. అయితే రాఘవులుకు ఘనవిజయం లభించింది యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా అదే సంస్థ నిర్మించిన జీవన తరంగాలు చిత్రం తో. ఈ చిత్రం కోసం ఆత్రేయ
వ్రాసిన టైటిల్ సాంగ్ "ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో" మరపురాని గీతం.
టైటిల్ సాంగ్ లో ప్రతి పదంలో చిత్రకథను, సన్నివేశాలను, సంఘటలను
ప్రతిబింబిస్తూ, గుండెలు పిండే నగ్న సత్యాలను మనకు చెప్పిన ఆత్రేయ
కనిపిస్తాడు. ఇది అతనికే సాధ్యం. ఈ పాట వింటుంటే ఎవరికైనా కళ్ళు
చెమ్మగిల్లకుండా వుండవు. ముఖ్యంగా ఈ పాటలో "నీ భుజం మార్చుకోమంటుంది" అన్న సన్నివేశంలో పోలీసులను తప్పించుకోవడంకోసం కృష్ణంరాజు తెలియకుండానే తల్లి పాడెను తన భుజానికి మార్చుకోవడం నిజంగా గుండెలు పగిలే సన్నివేశం. సగటు మనిషి జీవితం దేవుడు ఆడే చదరంగం లాంటిది.
అంధులో ఎప్పుడు ఏ పావును ఎలా కదుపుతాడో ఊహించలేము. మనుషుల సంబంధ
బాంధవ్యాలను చక్కగా విశ్లేషించిన ఈ పాటను మాస్టారు అంత ఆర్తి తోనూ పాడారు. ఈ
పాటను పదినాళ్ళు గుర్తుండేలా బాణీ కట్టారు రాఘవులు. ఈ గాయక సంగీత దర్శకులు
ఇక లేరు. కాని ఆయన బాణీలు చిరస్థాయిగా వుంటాయి. వారి ఆత్మకు శాంతి కలుగు
గాక!
Thanks to Suresh Productions for providing the video
and You Tube for posting it.
చిత్రం: | జీవన తరంగాలు (1973) | ||
రచన: | ఆచార్య ఆత్రేయ | ||
గానం: | ఘంటసాల | ||
సంగీతం: | జె.వి.రాఘవులు | ||
సాకీ: | పది మాసాలు మోసావు పిల్లలను | ||
బ్రతుకంతా మోసావు బాధలను | |||
ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక | |||
వెళుతున్నావు | |||
పల్లవి: | ఈ జీవన తరంగాలలో ఆదేవుని చదరంగంలో | ||
ఎవరికి ఎవరు సొంతము? ఎంతవరకీ బంధము | | ఈ జీవన | | ||
చరణం: | కడుపు చించుకు పుట్టేదొకరు | ||
కాటికి నిన్ను మోసేదొకరు | |||
తలకు కొరివి పెట్టే దొకరు | |||
ఆపై నీతో వచ్చేదెవరు? | | ఈ జీవన | | ||
చరణం: | మమతే మనిషికి బందిఖానా | ||
భయపడి తెంచుకు పారిపోయినా | |||
తెలియని పాశం వెంటపడి | |||
ఋణం తీర్చుకోమంటుంది | |||
నీ భుజం మార్చుకోమంటుంది | | ఈ జీవన | | ||
చరణం: | తాళికట్టిన మగడు లేడని | ||
తరలించుకుపోయే మృత్యువాగదు | |||
ఈ కట్టెలు కట్టెను కాల్చక మానవు | |||
ఆ కన్నీళ్ళకు చితిమంటలారవు | |||
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు | | ఈ జీవన | |
Thanks to Wikipedia for providing the information.
నిజమండి, ఇది నాకు కూడా చాలా ఇష్టమైన పాట. ఆత్రేయ టైటిల్/ బేక్ గ్రౌండ్ సాంగ్స్ ఆణిముత్యాలు (మీనా, సంధ్య, ఇల్లాలు...).
రిప్లయితొలగించండి