శ్రీ చింతగుంట సుబ్బారావు
గారు 1932 ఏప్రిల్ 5 న గుంటూరులో జన్మించారు. ఆయన ఆంగ్ల సాహిత్యంలో
మాస్టర్ పట్టా పుచ్చుకున్నారు. ఆంగ్లమే కాక తెలుగు, సంస్కృతం మరియు హిందీ
భాషలలో పండితులు. చీరాల V.R.S. మరియు Y.R.N. కళాశాలలలో
ఆంగ్ల ప్రాసంగికులుగా పనిచేసారు. తెలుగులో 18, ఆంగ్లంలో 10, సంస్కృతంలో 6
మరియు హిందీలో ఒకటి గ్రంథాలు రచించారు. పలు సంస్కృత శ్లోకాలకు తెలుగు
భాష్యాలను, అన్నమాచార్య కీర్తనలను ఆంగ్ల, హిందీ భాషలలోకి అనువదించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని లలిత సంగీత విశారద బిరుదుతో సత్కరించింది.
నీ కొండకు నీవే రప్పించుకో అన్న లలితగీతం వీరు రచించిన 'అమృతవర్షిణి' అనే
పాటల సంకలనం లోనిది.ఈ పాటను మాస్టారి అనుంగు శిష్యులు, తిరుమల తిరుపతి
దేవస్థానం ఉద్యోగి అయిన శ్రీ కె.ఎస్.వీర రాఘవులు గారు 1968-69 మధ్య విజయవాడ
రేడియోలో పాడారు. ఈ పాటను ఆయన ఒక కచేరీలో పాడగా మాస్టారికి ఆ పాట నచ్చి,
ఆపాట రచయిత అయిన సుబ్బారావు గారి వివరాలు తెలుసుకుని తదుపరి పరిచయంకూడ
చేసుకున్నారట. ఒకసారి మాస్టారు అస్వస్థులైనపుడు ఈ పాటను రికార్డు
చేయిస్తానని మొక్కుకున్నారట. అలాగే స్వస్థత పొందిన తరువాత గ్రామఫోను
కంపెనీలో దీనిని రికార్డు చేసి విడుదల చేశారు. ఉద్యోగరీత్యా రచయిత,
అనారోగ్య కారణంగా మాస్టారు తిరుపతికి వెళ్ళలేని వీరిరువురి మనోభావాల
ప్రతిబింబమైన ఈ పాటను "మన ఇరువురి మొక్కుబడికి సంబంధించిన పాట యిది" అని
మాస్టారు సుబ్బారావు గారితో అన్నారట. ఈ సంఘటన జరిగిన మరునాడే మాస్టారు
నల్గొండలోని శ్రీ భక్తాంజనేయ దేవాలయంలో జరిగిన అర్చక మహాసభలకు ముఖ్య
అతిథిగా వెళ్ళడం జరిగిందట. ఆ సభలో మాస్టారు 'ఆధ్యాత్మిక తత్వం, అర్చకుల
విధి నిర్వహణ, దేవాలయ ప్రాశస్త్యం' అనే అంశాలపై సంభాషిస్తూ భక్త శ్రోతల
కోరికపై "ఇదిగో నిన్ననే రికార్డు చేసిన పాట" అని నీ కొండకు నీవే రప్పించుకో
పాటను మధురంగా గానంచేశారట.
ఘంటసాల యిష్టదైవం ఆ కొండలపై నెలకొన్న కోనేటి రాయడు. అతనే వేంకటేశ్వరుడు. ఆస్వామి పేరును తన పేరులో నిలుపుకున్న ఘంటసాల వేంకటేశ్వర రావు. ఆ ఏడుకొండలవానిపై మాస్టారు ఎన్నో భక్తి గీతాలు పాడారు. ఆ వడ్డికాసుల వాడు మనను కొండకు రప్పించి మన ఆపదమొక్కుల ముడుపులు స్వీకరించి ఆశీర్వదిస్తాడు.సి.సుబ్బారావు రచించిన నీ కొండకు నీవే రప్పించుకో అనే ఈ చక్కని భక్తి గీతాన్ని మాస్టారు చక్రవాక రాగంలో స్వరకల్పన చేసి గానం చేసారు. విని ఆనందించండి.
మూలం:
ప్రైవేట్ ఆల్బమ్
రచన:
సి. సుబ్బారావు
సంగీతం:
ఘంటసాల
గానం:
ఘంటసాల
సాకీ:
నీ కొండకు నీవే…
రప్పించుకో…ఓ..ఓ..
ఆపదమొక్కులు మా...చే యిప్పించుకో
ప:
నీకొండకు నీవే రప్పించుకో
ఆపదమొక్కులు మాచే యిప్పించుకో
ఓ తిరుపతి వేంకటేశా..ఆ..
ఓ తిరుపతి వేంకటేశ ఓ! శ్రీనివాసా
నీ విచ్చిన యీ జన్మకు విలువ కట్టుకో
నీకొండకు నీవే రప్పించుకో
ఆపదమొక్కులు మాచే యిప్పించుకో
నీకొండకు నీవే రప్పించుకో
చ:
కొండంత సంసారం మోయలేని మానవులం
ఏడు కొండల నెక్కి రమ్మంటే రాలేము
సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం
స్వర్గానికి నిచ్చెనలు వేయలేము
నీకొండకు నీవే రప్పించుకో
ఆపదమొక్కులు మాచే యిప్పించుకో
నీకొండకు నీవే రప్పించుకో
చ:
మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై
మా లోపలి దివ్యజ్యోతి మసకేసి పోతున్నది
అహంకార మణగించి మమకారం తొలగించి
చేయూత నిచ్చి మమ్ము చేరదీసుకో
నీకొండకు నీవే రప్పించుకో
ఆపదమొక్కులు మాచే యిప్పించుకో
నీకొండకు నీవే రప్పించుకో
నీకొండకు నీ...వే రప్పించుకో
కృతజ్ఞతలు: రచయిత వివరాలు శ్రీ పురుషోత్తమాచార్యులు రచించిన మన ఘంటసాల సంగీత వైభవం నుంచి గ్రహించాను.
మన గళవేల్పు ఘంటసాల తన అజరామరమైన గానాన్ని అమరులకు వినిపించడానికి గగనాంతర రోదసిలోని గంధర్వ లోకానికి పయనమైనది ఈరోజునే. ఈశ్వరుని సన్నిధిన గాన వేంకటేశ్వరుడు ఆస్థాన గాయకునిగ నిలిచాడు. మనతో గడిపిన కొన్ని దశాబ్దాలలో మాస్టారు ఎన్నెన్నో పాటలు, పద్యాలు విభిన్న రాగాలలో, వైవిధ్యమైన బాణీలతో మనకు వినిపించారు. ఆ మధుర స్మృతులు మన హృదయాలపై చెరగని ముద్ర వేసాయి. మనకు తరగని గాన సంపదగా మిగిలాయి. ఘంటసాల-రాగశాల లో ఇది వరకు వారి గళంలో జీవంపోసుకున్న పలు రాగాలు - ఆరభి-సామ-శుద్ధసావేరి, గంభీర నాట, చారుకేశి, దేశ్, నాటకప్రియ, పంతువరాళి, పటదీప్, ఫరజు, బేహాగ్, మలయమారుతం, విజయానంద చంద్రిక, షణ్ముఖప్రియ, సింహేంద్ర మధ్యమం మరియు హిందోళం (ఒకటి, రెండు భాగాలు) గురించి మిత్రులు మౌళి గారు వివరించారు. ఈ రోజు అమరగాయకుని గుర్తుచేసుకుంటూ అందరూ ఆనందించగలిగిన మరొక రాగం హంసానంది గురించి తెలుసుకుందాం.
శాస్త్రీయ
సంగీత గాయన సంప్రదాయమనేదిఘనీభవించిన సరస్సుకాదు.
నావీన్యంతో నడయాడు నదీమతల్లి. త్యాగరాజుల కాలంలో ఎలా పాడేవారో మనకు తెలియదుగాని, ఇప్పుడు మనకు లభ్యమవుతున్న ప్రాచీన ధ్వని ముద్రికలను వింటే ఆ కాలంలో ఎలా పాడేవారో
ఉహించవచ్చు. మైసూర్ వాసుదేవాచార్, బిడారం కృష్ణప్ప,బెంగళూరు నాగరత్నమ్మ, ఎస్.జి.కిట్టప్పల వంటి ఆకాలపు విద్వాంసుల గాత్రసంగీతానికీ, ఆ తరువాత వచ్చిన చెంబై వైద్యనాథ భాగవతారు, ముసిరి సుబ్రహ్మణ్యఅయ్యర్ తదితరులు పాడిన పద్దతికి తేడా ఉంది. ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి మరియు ఎమ్.ఎల్.వసంతకుమారి
గార్ల సంగీతం, సమకాలీనులైన డి.కె.పట్టమ్మాళ్ గానానికంటె వేరు.
సంగీతమనే ప్రక్రియ నిరంతర పరిష్కరణ పొందుతూ, కీర్తనల సాహిత్యభాగం
క్షీణించక, స్వర రాగ నాదాలతో సమైక్యత పొందుతూ వచ్చింది. మంగళంపల్లివారు
నలభైయేళ్ళకు మునుపే ఆ పరిష్కారాన్ని సాధించారు. లలిత సంగీతం - శాస్త్రీయసంగీతం అనే
భేదాలు లేవని, స్వర-రాగ-లయయుతమై, మనస్సును
ఆకట్టుకుని, హృదయాన్ని రంజింపజేసే గాయనమే నిజమైన సంగీతం అంటూ
బాలమురళి తమ కచేరీలలో చెప్పేవారు.సప్తస్వరాలు,
సప్తతాళాలు, ద్వావింశత్ శ్రుతులూ అప్పటికి,
ఇప్పటికి, ఎప్పటికీ అలాగే ఉంటున్న స్థాయియైన సిద్ధంతాలు.
ఏ పలుకైనా, పాటైనా, దానికి కొన్ని స్వరాలు
ఒక లయ ఉండే తీరుతాయి.శాస్త్రీయ సంగీతం పరిష్కరణ
పొందడమంటే, సాహిత్యము, స్వరము, రాగము, తాళము, లయ, రసభావాల సమాహారమై సర్వకాలాలయందు అందరినీ రంజింపజేయడమే.ముత్తుస్వామి దీక్షితులు
రచించిన "వాతాపి గణపతిం భజే" అను కీర్తనను ఎన్నో వందలకొద్ది విద్వాంసులు
పాడారు. ఘంటసాల పాడినదే ఎందుకు ఇంకా నిలిచింది? హంసధ్వని రాగంకానీ,
స-రి-గ-ప-ని స్వరాలు గానీ,ఆదితాళం నడచు క్రముము గాని మారిపోయిందా? లేదు. అదే సాహిత్యం, అదే రాగం, తాళమైనా;
అంతటి ప్రత్యేకత, వైశిష్ట్యం, జనాదరణమైన ఒక సాధారణ కృతికి సినిమా మాధ్యమంలో ఎందుకు లభించింది? సాహిత్య-స్వర-రాగ-తాళ-లయ-రస-భావాల సమాహారానికి అనుకూలమైన, ఆయనకు దేవుడిచ్చిన గాత్రసౌలభ్యం, శాస్త్రీయ సంగీతావగాహన,
కవిహృదయం మరియూ చిన్ననాటినుండి వంటబట్టిన నాట్య-హరికథ-తరంగ-కళానుభవము.
సుప్రసిద్ధ
హిందూస్థాని గాయకులు భీమ్ సేన్ జోషిగారు శాస్త్రీయ సంగీతజ్ఞులైన చలనచిత్ర నేపథ్య గాయకులను
చాలా గౌరవంగా చూసేవారు. ఆయన కచేరియున్న ఒక సభలో లతామంగేష్కర్ ఓ రాగంలో ప్రార్థనాశ్లోకం
పాడగా, ఆయన మెచ్చుకొంటూ, ఒక రాగంలోని రసస్పర్శ కలుగడానికి
తను గంటలకొద్ది విస్తరించి పాడగా, లతామంగేష్కర్ వంటి గాయని రెండు
నిమిషాల ఆ శ్లోకాలాపనలో ఆ అద్భుతపరిణామాన్ని సాధించడం ఆశ్చర్యమంటూ, ఆ పూట పాడాలని అనుకున్న ఆ రాగాన్ని"నేను పాడను, రెండు నిమిషాలలో కల్గిన ఆ మధురానుభూతి అలాగే ఉండిపోనీ" అన్నారట!. ఇది
ఘంటసాల సంగీతానికి ఎంత బాగా వర్తిస్తుందో వివరించవలసిన పనిలేదు. రెండు నిమిషాలకూ
తక్కువైన వ్వవధిలో "హంసానందిరాగం" విశ్వరూపాన్ని ధరించి విజృంభించింది ఘంటసాల
గళంలో. అది "కృష్ణప్రేమ" చిత్రం. అందులో నారదగానం. ఉన్నట్టుండి తక్షణమే, వేయివేణువులు మ్రోగినట్లు, చిన్న పాటే భక్తిభావానికి
పెన్నిధియైనట్లు, భగవంతున్ని భక్తి స్వర పాశములతో బంధించి బయటకు
రప్పించేలా పాడిన ఈ పాట, హంసానంది రాగానికి లక్షణగీతమా అనిపిస్తుంది.
వంద క్షణాలలో రెండుమార్లు ఆయన చేసిన అకార స్వరప్రస్తార విహార వైభవోపేతమైన
స్వరమాల,హంసానందీరాగదేవతకు
ఘంటసాల గళంతో తొడిగిన కంఠమాల "ఇది నీదు లీల గిరిధారి"
భానుమతి, శాంతకుమారి, జి.వి.రావ్ తదితరుల నటనతో 1943 లో విడుదలైన
"కృష్ణప్రేమ"ను మళ్ళీ 1961లో తీశారు. బాలయ్య, జమున, వరలక్షీ, రేలంగి మరియు పద్మనాభం
నటించగా, పెండ్యాల స్వరాలకూర్పుతో ఘంటసాల తన కంఠసీమ ఉఛ్రాయస్థితిలో్నున్నప్పుడు,
మధురమైన పాటలను వినిపించారు. ఘంటసాల పాడిన హిందోళరాగాన్ని నెమరువేసుకుంటూ,
ఇంతకు ముందు, ఒక సంచికలో ప్రస్తావించిన పాట
"మోహన రూపా గోపాలా" , ఈ చిత్రంలోనిదే. అప్పటికి ఆయనశ్రుతి C#, ఒకటిన్నర శ్రుతి
అని కూడా అంటారు.పాట మొదట్లో కృష్టా... అన్న ఆలాపనలోనే, హంసానంది రాగస్వరాలు వీనులదిగి, మనల్ని క్షణంలో వ్యాపించివేయడం
ఉత్ప్రేక్షకాదు. విన గమనించవలసిందే.
"క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం | స్నపయసి పయసి శమిత భవతాపం
| కేశవా దృత భృగుపతిరూపా | జయజగదీశ హరే...,
ఇది ఆ గాన ఖండిక.
క్షత్రియ రుధిరమయే (భక్త జయదేవ)
అదే చిత్రంలోని
మరొక్క పాట "ఫలియించెనుమా జీవితమే", ఇక్కడనూ హంసానంది స్వరాల ఫలమే ప్రతిఫలితం
ఫలియించెనుగా జీవితమే (భక్త జయదేవ)
హంసానంది
రాగం53వ మేళమైన గమనశ్రమ జన్యం. ’స-రి-గ-మ-ద-ని’ ; ’స-ని-ద-మ-గ-రి’ మూర్ఛనలో "శుద్ధ రిషభ" - "అంతరగాంధార"
-" ప్రతిమధ్యమ"- "చతుశ్రుతి దైవత"-" కాకలి నిషాద" స్వరములుగల
పంచమవర్జిత, ఉపాంగ, శుద్ధ షాడవరాగం. ( ఆరో:
S R1 G3 M2 D2 N3 S , అవ: S N3 D2 M2 G3 R1 S). చిన్నదైనా చిత్తాపహారిణి. పూర్వికల్యాణి రాగప్రయోగంలో
పంచమవర్జ్య ప్రయోగాలద్వారా ఆ రాగంయొక్క భాగమై హంసానంది ప్రాముఖ్యత తగ్గినా,
దాని అందమూ ఆకర్షణ అసలు తగ్గలేదు. ఘంటసాల ఆలపించిన "పార్థాయః ప్రతిబోధితాం"
శ్లోకాలాపన పూర్వికల్యాణీయైననూ, ఆయన ఒకచోట పంచమవర్జ్యంగా సంగతులను
వేయగా అది హంసానందియా అను భ్రమ కలుగకపోదు.పూర్వికళ్యాణి రాగం పాడిన పిదప, హంసానంది శోభించదు. సర్వజీవస్వరయుక్తమైన
ఈ రాగంలో శ్రీ యేసుదాస్ గాయనంలో ఖ్యాతిగాంచిన కృతి "పావనగురు పవనపురాధీశమాశ్రయే".క్షణంలో మమ్ములను భక్తి-కరుణారస వాహినిలో ముంచే
రాగం"హంసానంది". సంగీతం తెలియనివాళ్ళనూ
ఆకట్టుకొనే స్వరప్రయోగాలుగల రాగం.రాగంలోని
ప్రముఖ కృతులు:స్వాతితిరునాళ్ : "పాహి
జగజ్జనని", ముత్తయ్య భాగవతార్: "నీదు మహిమ పొగడ",
పాపనాశన్ శివన్: "శ్రీనివాస" మరియు,లలితాదాస:
"పావనగురు". హంసానందిని రాగంలో రిషభాన్ని వర్జిస్తే కలుగేది మరో ప్రఖ్యాతమైన
రాగం, "సునాదవినోదిని".
ఆకాశవాణి
ప్రసరించిన "గిరిజాకళ్యాణం"లొ నతపోషణ-హితభాషణుడైన ఆ పరమహంసుని “హంసానంది”లో
ప్రార్థించిన సంగతి, షోడశరాగమాలికావిరాజితమైన గిరిజాకళ్యాణ యక్షగానం
గురించిన వ్యాసంలో ఇదివరకే ప్రస్తావించబడింది. రాజేశ్వర స్వరవిహరంలో ఆకాశవీధిలో అన్న
పాట రాగమాలిక, (భీంపలాస్, కళంగద,
కీరవాణి, హంసానంది) అనురాగరసంతో విరహగీతాన్ని విరచించే
తూలిక! స్వీయ సంగీత దర్శకత్వంలో ఘంటసాల, సత్యనారాయణమాహాత్మ్యం
చిత్రంలోని ఆదిగీతాన్ని ఈ రాగంలోనే ఆలపించారు. (జయజయశ్రీమన్నారాయణ...). గమద గమగ,
గమదనిసనిదమగ ఇలాంటి విశేష ప్రయోగాలతో రంజిల్లె హంసానందివేదమై, అణువణువుల నాదమై విశ్వనాథ
సృష్టిలొని సాగరసంగమం మనకు మొన్ననే వినిపించింది
ఈ పద్యం
"కాళహస్తి మహాత్మ్యం" చిత్రానిది.
చేకొనవయ్య
మాంసమిదె చెల్వుగ దెచ్చితి బాస చొప్పునన్
ఆకొనియుంటివేమొ
కడుపార బిరాన భుజింపవయ్య, ఈ
లోకులు
చూడరయ్య భువిలోని క్షుదార్తుల బాధలెన్నడున్
శ్రీకర
కాళహస్తి శశి శేఖర దివ్య కృపాకరా హరా...
చేకొనవయ్య (కాళహస్తి మహాత్మ్యం)
శివాలయంలో
తిన్నడు , తను కూల్చి కాల్చిన కుందేళ్ళను స్వామికి అర్ధభాగం సమర్పణ చేసే
సన్నివేశం. హంసానంది రాగ సౌష్టవమంతా ప్రస్ఫుటంగా వడబోసుకొన్న పద్యమిది. ఘంటసాల తారస్థాయిలో
పద్యాన్ని ముగిస్తూ ఆ "హరా" పదాన్ని పలుకిన తీరు మన ఎదలో ప్రతిధ్వనించి ఒక
అపురూపమైన రసానుభూతిని కలుగజేస్తుంది. పాటకు, పాత్రధారి పెదవుల
చలనమే చాలు, ఆ భక్తిరసమొలికెంచే నటనకు పాత్రధారికన్నా గాత్రధారియైన
ఘంటసాల కంఠమే ఆ పనిచేసిపెట్టిందనవచ్చు.
ఘంటసాల
ఈ రాగంలో రెండు భగవద్గీతా శ్లోకాలను పాడారు.
మహర్షయః
సప్తపూర్వే చత్వారో మనవస్తథా
గగాగగా సాసగాగ గమదగమ మగనీగసా
మద్భావా
మానసా జాతా యేషాంలోక ఇమాః ప్రజాః
నిగాగా గామదనినీసనిద మదనిసాసాసా నిసానిగాసా
మచ్చిత్తా
మద్గతః ప్రాణాః బోధయంతః పరస్పరమ్
నిసాసా నీసనీదానీని నీసనీదా నిదామగా
కథయంతశ్చమా
నిత్యం తుష్యంతి చ రమంతి చ
మమమామా దమాగాగా గామగాగ మగాసస
మహర్షయః (భగవద్గీత)
హంసానంది రాగాధారితమైన మరికొన్ని పాటలు/పద్యాలు:
విద్యార్థులు
నవసమాజ నిర్మాతలురా" (రంగేళిరాజా)
ఓ గజేంద్రమా
(భక్త రఘునాథ్)
కంటిన్
కంటి (రహస్యం)
కమలభవుని
రాని (రెండుకుటుంబాల కథ)
హరహర హరశంభో (సతీ తులసి)
జయజయజయ నటరాజా (వాల్మీకి)
ఘంటసాల
పాడిన హంసానందిరాగాధారితమైన పాటలు వినిన పిదప ఇదే రాగంలోని శాస్త్రీయ ఈ రచనలను వింటె, మనకు ఈ రాగంపై ఒక అవగాహన, మరియొ పట్టు కుదురుతుంది.
(కలాపిని)
(ఎం.ఎస్.గోపాలకృష్ణన్ వయొలిన్)
(ఎస్. బాలచందర్ వీణ)
(జేసుదాస్ "పావన గురు")
(బాలమురళి మరియు జస్ రాజ్ జుగల్బంది)
(చెంబై వైద్యనాథ భాగవతార్ "సామగానవినోదిని")
ఘంటసాల
తన సంగీతదర్శకత్వలో ఎక్కువగా వాడిన కొన్నిరాగాలలో ఒకరాగంగురించి వచ్చే సంచికలో పరిచయం
చేసుకూందాం, సెలవు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com